శర్మ కాలక్షేపంకబుర్లు-కొడుకులు

కొడుకులు

ఈ మధ్య మా వీధిలో తొంభైయేళ్ళ పైబడిన వొకరు, కొడుకు దగ్గర కాలం చేశారు. మధ్యాహ్నం కాలం చేశారు, తెలుపవలసిన వారికి తెలిపేరు. యెంత తొందరగా వచ్చినా మరునాడు వుదయం కాని తరవాతి కార్యక్రమం మొదలుపెట్టే సావకాశం లేదు. ఈ లోగా కర్మ చేయించే వారి గురించి దర్యాప్తు చేస్తే పక్క వూరికి వచ్చినట్లు తెలిసి, అక్కడకే వెళ్ళి మాటాడు కుంటే బాగుంటుందని బయలు దేరి వెళ్ళి కలిశాము. మాటాడేము, మరునాడు వుదయం వచ్చే యేర్పాటు చేసుకున్నాము. మరునాడు బంధువులొచ్చారు, కర్మ చేయించేవారొచ్చారు, తరవాతి కార్యక్రమం మొదలయింది, శ్మశానం దగ్గర కూచుని వున్నపుడు, కబుర్లలో కర్మ చేయించేవారు, “యేమి కొడుకులో, రోజులు మారిపోయాయి, తల్లి తండ్రులకి తల కొరివి కూడా పెట్టేలా లేరు” అన్నారు. “అదేమండీ అలా అన్నారు” అన్నా. దానికి వారిలా చెప్పేరు.

“నిన్న కార్యక్రమం చేయించిన వారు పోయి నాలుగు రోజులయిందిట. భార్య పోయి చాలా రోజులయిందిట. పోయినాయన చాలా కష్టపడి, చాలా ఆస్థులు సంపాదించాడట. బతికుండగానే కొడుకులకి వీలునామా రాసి, ఆస్థులు కూడా అప్పజెప్పేసేడట..ముగ్గురు కొడుకులు. మొదటి యిద్దరు కొడుకులు, కోడళ్ళు ఇద్దరూ చూడకపోతే, చిన్న కొడుకు దగ్గర చేరేడట. చిన్న కోడలు జాగ్రత్తగానే చూసిందిట, పై పిల్ల అయినా, మామగారిని. వీలునామా రాసేటపుడు ఆస్థులన్నీ సమానంగా పంచేడట కొడుకులు ముగ్గురికీ. కాని వొక మందుల షాపు మాత్రం చిన్న కొడుకుకి యిచ్చేడట, యెక్కువగా. అప్పటికి దాని విలువ తక్కువగా వుండటం చేత యెవరూ పెద్దగా పట్టించుకోలేదట. అది తరవాత పెద్దదయి, మొన్న గొడవకి కారణమయిందట. తండ్రికి బాగోలేదని చిన్న కొడుకు చెబితే పెద్ద కొడుకులు, కోడళ్ళు, కనీసం చూడటానికి కూడా రాలేదట. ఆయన కాలం చేశారట. తరవాతి కార్యక్రమాలు చెయ్యాలంటే, ముందు మందుల షాపు విషయం తేలిస్తే కాని శవాన్ని యెత్తుతామన్నారట, పెద్ద కొడుకులు. చిన్న కొడుకు యేమి చేయాలో తోచక, కార్యక్రమం కానిద్దాము, తరవాత పెద్దలెలా చెబితేఅలా చేసుకుందామన్నా, విన లేదట వారు..పెద్దవాళ్ళు యిద్దరూ వుండగా చిన్నతను కార్యక్రమం జరిపించడానికి వెనుకంజ వేశాడట. రెండు రోజులయిందిట. తగువు తేలలెదు. శవం లేవలేదు. సాధారణంగా పల్లెలలో శవం వుండగా వంట చేయడం , భోజనం చేయడం చేయరు. వూరివారికి చికాకు వచ్చి కొడుకులికి చెప్పి చూశారట. కుదరలేదు. మూడవరోజు వూరి ప్రెసిడెంట్ శవాన్ని తీసెయ్యకపోతే, తదుపరి చర్యలు తీసుకుంటానని, శవాన్ని పంచాయితి బండిలో పడేయించి తీసుకుపోయి తగలబెట్టించి, కేసు పెట్టిస్తానని, పెద్ద కొడుకులికి కబురు పంపిస్తే, నిన్న వుదయం నేను వెళితే, సాయంత్రానికి శవాన్ని యెత్తేరు, కొడుకులు. తరవాతేమయిందో తెలియదు”. అన్నారు.

“తల్లి తండ్రులను అనాధలుగా వదిలేసి, ఓల్డేజి హోం లలో పడేసి, వారి అంత్యక్రియలకు కూడా డబ్బులు కట్టేసి, తల్లి తండ్రులకు చెప్పకుండా పెళ్ళాన్ని తీసుకుపోయినవారికంటే మేలేమో నండి” అన్నా. అందుకాయన “సరిపెట్టుకోవాలి కదండీ” అన్నారు. నేటి కొడుకులిలా వున్నారా? అందరూ యిలా వున్నారనను. రేపు యీ కొడుకులు/కోడళ్ళు కూడా తండ్రులైనపుడు వారిగతీ యింతేనా? తాత తాగిన బోలి తల వాకిట్లో వుంటుందా?

గమనిక:- ఇది యెవరిని వుద్దేశించినది కాదని మనవి.

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కొడుకులు

  1. కం. పొరబా టిరు వైపులనుం
    తరచుగ గలుగుటను జేసి తలిదండ్రులు దు
    ర్భరమగు సంకటములకుం
    గురియగు దృశ్యములు గుండె కోయు జిలేబీ

    • @

      మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
      చిక్కటి వూహతో చక్కటి పద్యం చెప్పేరు.
      ధన్యవాదాలు

  2. చాలా భాదాకరమయినది.
    “మెకాలే” ద్వారా మన దేశానికి వచ్చిన నేటి విద్యా వ్యవస్థ – - నేటి సమాజములోని ఎక్కువమందిని సంస్కారము, సాంప్రదాయ, నైతిక విలువలు లేని, కేవలం “విత్తు” సంపాదిపెట్టే విద్య – సామాజిక స్పృహను కోల్పోయే విధంగా తయారుజేసింది.
    ధన్యవాదములు.

    • @
      DSRMurtyగారు,
      స్వతంత్రం వచ్చాకా కూడా మనవారు యిటువంటి వాటిని మార్చడానికి యిష్టపడలేదు, యిప్పటికీ పడరు కూడా. కారణం జగద్విదితం. ధన్యవాదాలు.

  3. @

    మిత్రులు వెంకట్ గారు,
    నమస్కారం.
    మీరన్నట్లు, టపా చదివి వాఖ్య రాద్దామనే సమయానికి మరొక టపా వచ్చేస్తోందని కొద్ది మంది ఫోన్ లో కూడా చెప్పేరు. మీ వీలు బట్టి వ్యాఖ రాయండి. పదునాలుగురోజుల దాకా వ్యాఖ్య అనుమతించేటట్లు వుంది వర్డ్ ప్రెస్లో .మీలాటి మిత్రులు విష్లేషణాత్మకంగా రాసినపుడు, ముందు రాయబోయేవి మెరుగు పడతాయి. ఇదొక వ్యసనంగా మారి, యేరోజూ రాయకుండా వుండలేని పరిస్థితి వచ్చింది. ఇదీ బాధగానే వుంది.తప్పటంలేదు.నైతిక విలువలు అనే వలువలను యెంత విప్పుకు తిరిగితే అంత గొప్ప అనుకునే కాలం. చూస్తూ వూరుకోడం తప్పించి చేయగలది లేదు. కాని బాధ ఆగక అప్పుడపుడు, యిలా…..మీ సవివర వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ధన్యవాదాలు

    • వ్యసనాల్లోకెల్లా అతిమంచి వ్యసనం రాయకుండా వుండలేక పోవడమేగా, శర్మగారూ! మీ లాంటి వయఃపరిపాకులు ఈ వ్యసనానికి వశులవడం బ్లాగ్లోకానికి మంచిదే! రాస్తూ వుండండి!

      ధన్యవాదాలు!

      • @

        వెంకట్ గారు,
        వ్యసనం మంచిదని నేనూ అన్నా!, మొదట. తరవాత, తరవాత, ఇబ్బందికరంగా మారుతోందని…….ధన్యవాదాలు

  4. ‘హిందూ’ పేపరు చదవడం లాగా అయిపోయింది, శర్మగారూ, మీ పొస్టులకు వ్యాఖ్యలు వ్రాయడం నాకు! ‘బాగుంది’, ‘చాలా బాగుంది’ అని కాకుండా మనసుకు తోచిన నాలుగు మాటలు రాయాలనిపిస్తుంది ఒక్కొక పోస్టులోని విషయానికి, టైం దొరకదు! ఈ లోపల మరుసటి రోజు ‘ఎడిషను’ ముంగిట్లో వాలిపోతూ వుంటుంది! ముందటి పోస్టుకు రాయాలనుకున్న వ్యాఖ్య అలా వెనక్కి వెళ్ళిపోతూవుంది! ఈ పోస్టుకు అలా కాకూడదని కూర్చుని రాస్తున్నాను!

    ‘ధ్వంసం’ అనే ఒకే ఒక్క విలువ?!, విలువగా నడుస్తున్న రోజులివి! Knowledge అనే విలువతో ముడిపెట్టబడి ఈ ధ్వంసరచన సాగించబడుతూ వుంది! Mysticism ధ్వంసం చేయబడుతోంది, మర్మాలు ధ్వంసం చేయబడుతున్నాయి, innocence – అమాయకత్వం ధ్వంసం చేయబడుతోంది. ఇవి రెండూ పోగొట్టబడినప్పుడు values ఏవైతే వున్నాయో అవి వాటంతట అవే పోతాయి! అర్ధాలు విడమరిచి చెప్పలేని చాలా values కి ఈ రెండు లక్షణాలూ పునాదులవంటివి అని నేను అనుకుంటాను! నా భావన తప్పు కూడా కావచ్చు!

    కళ్ళెదురుగా ఈ degeneration చాలా చూస్తున్నాం! దీనికి ఏమిటి చెయ్యడం? అంటే, ‘ఏమీ లేదు, చూస్తూ వుండడమే!’ అన్నదొక్కటే సమాధానం అని నేననుకుంటాను. మునుపటికన్నా మనుషులు హెచ్చు జ్ఞానం (knowledge) సంపాయించుకున్న తరువాత జరుగుతున్న పనులు ఇవి కాబట్టి! ‘ఇది ఎందుకు ఇలా జరుగుతోంది?’ అన్న దానికి, దేనికి దానికి ఎవేవో సమాధానాలు చెప్పబడుతున్నాయి గాబట్టి!

    అయితే, ఇవన్నీ ఇలా జరగకుండా వుండాలంటే మనం knowledge – జ్ఞానంలో ముందుకు వెళ్ళకూడదా? అక్కడే ఆగిపోవాలా? అన్న ప్రశ్నలు వుదయిస్తే, వాటికి ‘అసలిది జ్ఞానమేనా?’ అన్న సమాధానమూ వెనువెంటనే పుడుతుంది. సరే…అదలా వుంచి బ్రతుకు పోరాటం మాటేమిటి? అన్నది ముందుకు తెస్తే, ఏ కాలానికి ఆ కాలపు బ్రతుకు పోరాటం ఎప్పుడు లేదు? అందుకోసమని innocence ని, మానవత్వాన్నీ వదులుకుని రాక్షసుల లాగా తయారుకావాలా? అన్న సమాధానమూ దొరుకుతుంది.

    ఇంకా రాయాలనుంది. కానీ, ఇక్కడితో ఆపేస్తున్నాను!

    ధన్యవాదాలు!

  5. చాలా బాగా చెప్పారు. యథో కర్మః….

    జిలేబి.

    • @
      jilebigaaru
      Very many thanks

  6. @
    జిలేబిగారు,
    జరిగినది అది. తండ్రి విలువలు నేర్పలేదేమో తెలియదు. నాణేనికి రెండవ పక్క కూడా వుంది. అందం చెడిపోతుందని పిల్లలికి పాలివ్వని తల్లులూ వున్నారు. తమకి అడ్డు అని చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టళ్ళలో పారేసిన తల్లి తండ్రులున్నారు. ధన్యవాదాలు.

  7. శర్మ గారు,

    నాణెం మరో పక్క – ఆ తండ్రి పిల్లల పెంపకం కన్నా ఆస్తుల సేకరణ మీద ధ్యానం పెట్టాడేమో అని పిస్తుంది. జీవిత విలువలు నేర్పడం కన్నా డబ్బు విలువలు (సో కాల్డ్) ఎక్కువ అని తాత తాగిన బోలి లో వాళ్లకి కనిపించ వచ్చిందేమో ! పోయిన వారంతా మంచి వారే కాబట్టి సానుభూతి వారి వైపు అనుకోవాలేమో !
    ఎవరో తెలియదు కాబట్టి వారు ఎలా తమ పిల్లల్ని పెంచారో తెలియదు. నాణెం మరో పక్క ఆలోచన అంతే అన్న మాట.

    ఇక రాబోయే తరం గురించి మాట్లాడాలంటారా ! వద్దే వద్దు !

    నో చీర్స్
    జిలేబి.

  8. HORRIBLE. WHAT KIND OF LESSON THEY ARE TEACHING TO THEIR CHILDREN. CAN THEY BEAR IF THEIR CHILDREN SHOW THE SAME NEGLIGENCE ON THEM? HOW COME THE DECEASED’S SOUL REST IN PEACE!

    • @
      ఫణీంద్రగారు
      తాత తాగిన బోలి తల వాకిట్లో వుందిగదండీ! మనకు సామెత వుంది.ధన్యవాదాలు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )