శర్మ కాలక్షేపంకబుర్లు-ఏది విద్య? ఎవరు గురువు?

ఏది విద్య? ఎవరు గురువు?

విద్యానామ నరస్య రూపమధికం ప్రఛ్ఛన్నగుప్తం ధనం
విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః
విద్యాబన్ధుజనో విదేశగమనే విద్యా పరాదేవతా
విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యావిహీన పశుః…….భర్తృహరి.

విద్య నిఘూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?……..లక్ష్మణకవి.

విద్య గూఢంగా దాచబడిన ధనం, విద్య రూపం,విద్య కీర్తి తెస్తుంది, భోగాలనూ అనుభవింపచేస్తుంది, విద్య గురువు, మార్గదర్శనం చేస్తుంది,విదేశంలో కూడా ఏమీ లేకపోయినా బతకడానికి బంధువులా ఆదుకుంటుంది, అసలు విద్య ఒక విశిష్టమైన దైవం, విద్యలాటి ధనం లేదు, మామూలు ధనమైతే దొంగలెత్తుకుపోవచ్చు, విద్యా ధనం ఎత్తుకుపోలేరు. విద్యలాటి ధనం భూమీ మీద మరొకటి లేదు.విద్యను పరిపాలకులు గుర్తిస్తారు, విద్య తెలియనివాడు మనిషా? అన్నారు లక్ష్మణ కవి, కొద్దిగా మొహమాట పడ్డారు, కాని భర్తృహరి మాత్రం ‘విద్యావిహీన పశుః’, అంటే విద్యలేనివాడు పశువు అని నిర్ద్వందంగా చెప్పేరు.

విద్యంటే భగవంతుని తెలుసుకునేదే విద్య అన్నారు, పెద్దలు. అలా భగవంతుడే అని కూచుంటే బువ్వో? ”బువ్వా కావాలి అవ్వా కావాలి” ఇదీ నానుడి. బువ్వంటే భోజనం అవ్వంటే పరదేవత. విద్యతో పరదేవతని ప్రసన్నం చేసుకోవచ్చని దానికి దారి చెప్పేరు. సరే! అసలేది విద్య?

ఆ, ఆ లు వస్తే, ఎ,బి, సి,డి లొస్తే, వడ్డీ లెక్కలు కట్టడమొస్తే, కాదు డాక్టర్, ఇంజనీర్ అయితే! ఇవేనా విద్యలు? ఇవి కాక సమాజానికి ఉపయోగపడే, మానవ జాతికి అవసరమైనవి ఎన్నో విద్యలు, వృత్తులూ ఉన్నాయి. ఏదీ చిన్నదీ కాదు, నీచమైనదీ కాదు. చేయకూడని పనులు రెండే, ఒకటి దొంగతనం, రెండు లంజతనం. ఇప్పుడు గురువులే వీటిని నేర్పుతున్నట్లు ఉంది.

అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కాగలరా? కాదు చదువు”కొన్న”వారికి నిపుణత ఎంత? ఇలా చదువు కొన్నవారు ఆ తరవాత నిపుణతలేక ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసంలాగా दॊभी का गधा न घर का न घाट का అయి పనికి రానివాళ్ళుగానో, పోరంబోకులుగానో, ఉగ్రవాదులుగానో, చివరికి రాజకీయవాదులుగా తయారవుతున్నారు. మొదటనే తల్లి తండ్రులు, గురువు గుర్తించితే ఈ సమస్యలు రావు కదా! రెండు వందల సంవత్సరాల కితం దాకా మన దేశం లో విద్యలు బాగానే ఉండేవి, ఎంత చచ్చు బడినా. అసలు విదేశీయులను ఆకర్షించినదేంటి? ఇక్కడి సుగంధ ద్రవ్యాలు కదా! ఇక్కడి చేనేత బట్టలు, మిగిలిన ఉత్పత్తులేకదా! వాటికోసం వెతుక్కుంటూ మన దగ్గర చేరి మనలోని బలహీనతను సొమ్ము చేసుకుని, చివరికి మాకు ఏమీ చేత కాదు, పనికి మాలిన వాళ్ళం, పాములు పట్టుకునేవాళ్ళం అంటే, అవుననే స్థాయికి దిగ జార్చి, మనల్ని పనికి మాలిన వారిగా తయారు చేసి, మన కళలను వృత్తుల పాడు చేసి, వారి మీద ఆధారపడేలా చేయగలిగినవారు కదా! మీకు విద్య లేదు, మేము చెప్పేదే విద్య అంటే అవునంటున్నాం. నాడు శుశ్రుతుడు వాడిన వస్తువులేగా నేడూ వాడుతున్నది, శస్త్ర చికిత్సలో, నాడే నానో టెక్నాలజీ మనవారికి తెలుసన్న సంగతి కుతుబ్ మీనార్ అనబడే విష్ణుస్థంభ నిర్మాణం లో తెలియటం లేదా! అన్నీ మనకే తెలుసని అనను, మనకీ విద్య ఉంది, ఆ విద్యను నేటి విద్యతో కలగలిపితే మేలు ఫలితాలుంటాయి కదా! కంప్యూటర్ కనుక్కున్నది పాశ్చాత్యులే కాని విరివిగా వాడకంలో కి తెచ్చి, ఈ మైల్ కనుక్కున్నదెవరు? ఇందులో భారతీయులూ ముందు వరుసలో లేరా? సాఫ్ట్ వేర్ దిగ్గజానికి నేటి అధిపతి ఎవరు? భారతీయుడు అందునా తెనుగువాడు కదా! ఇలా ఆలోచిస్తే చాలా ఉన్నాయి.

ఏ విద్యార్థికి ఎందులో అభిరుచి ఉన్నదీ గుర్తించాలి, దానిని అభివృద్ధి చేయాలి, సేవలు, వస్తువులు తయారు చేయాలి, చేసే పనిలో నిపుణత కావాలి, వస్తువులో మన్నిక కావాలి. “మానింది మందు బతికింది ఊరు” అని సామెత, అలాగా కూడు పెట్టే వృత్తిలో రాణింపుకోసం చేసే ప్రతి ప్రయత్నమూ చదువే! ఇలా తయారవాలంటే? మంచి గురువులు కావాలి.ఏం చెప్పేరు.

విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వా ద్ధన మాప్నోతి ధనా ద్ధర్మం తత స్సుఖం

విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

కవిగారేమంటారూ! విద్య నేర్చుకుంటే వినయాన్నిస్తుంది, విద్య, వినయం తో పాత్రత అర్హత (ఎలిజిబిలిటీ,కేపబిలిటీ)వస్తుంది, దానివల్ల ధనం వస్తుంది దానివలన ధర్మం చేయాలి దానితో మానవుడు ఇహ పర సుఖాలు పొంది తరించాలి

అలా విద్య ద్వారా ముక్తి అన్నారు, మరి అలా విద్యార్థిని తయారు చేసే గురువెలా ఉండాలి? ”నీవు నాతో లైంగికమైన సంబంధం పెట్టుకుంటే నీకు P.hD ఇస్తానన్నవాడా? నా బేంక్ అక్కౌంట్ లో సొమ్ము జమ చేస్తే నీకు P.hd ఇస్తానన్నవాడా గురువు?” వీళ్ళా మన గురువులు? వీళ్ళనని లాభం లేదు, ఇటువంటీ నీచులను గురువులుగా ఎంపికచేసిన నీచులను అనాలి కదా! అంతా ఇలా ఉన్నారనను, విద్యార్ధిని తీర్చిదిద్దే, మార్గ దర్శనం చేసే గురువులు కావాలని కోరుకుంటా.

స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వగ్రామే పూజ్యతే ప్రభు: !
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే !!

మూర్ఖుడు తన ఇంటిలోన గౌరవించబడతాడు, గ్రామాధికారి తన గ్రామంలోనే గౌరవించబడతాడు, రాజు తన దేశంలోనే గౌరవించబడతాడు, కాని విద్వాంసుడు మాత్రం ఏప్రాంతంలోనైనా, ఎక్కడైనా గౌరవించబడతాడు.

ఇలా సర్వత్రా పూజింపబడే గురువు కావాలి, మార్గ దర్శనానికి.

శ్రీ గురుభ్యోన్నమః

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏది విద్య? ఎవరు గురువు?

  1. మీరు మీ నీతి చంద్రికల ద్వారా మాకందరికీ గురువులు.
    మీకు గురు దిన హృదయాభినందనములు.
    మీ నీతి చంద్రికలను తస్కరించిన
    వారిని మీ బ్లాగులో చూపించి వారికి
    మీ మంచి మాటలను ప్రచారం చేస్తున్నందుకు
    ధన్యవాదాల చెంప దెబ్బలు వెయ్యండి

    • మోహన్జీ,
      నేను మీరన్న బాణీలోనే అనుకున్నా. కాదని తెలిస్తోంది. వ్యాధి ముదిరిపోయి శస్త్ర చికిత్సకు కూడా లొంగేలా లేదు. సవివరంగా సమాధానమిస్తాను. మీకో మెయిలిస్తున్నాను చూడగలరు.
      ధన్యవాదాలు.

  2. శర్మగారూ,
    అద్భుతమైన వ్యాసం. అభినందనలు. నా కిష్టమైన శ్లోకమూ పద్యాలూ ఉన్నాయి కూడా కాబట్టి మరింత నచ్చిందనటం అతిశయోక్తి. విషయమూ అది చెప్పిన తీరూ బాగున్నాయనటం నిజం. ఒకే శ్లోకపాదంలో చిన్న సవరణలు చేయండి: ” రాజసు పూజ్యతే” అని వ్రాసారు ” రాజసుపూజ్యతే” అని మార్చండి. అలాగే “నహీ ధనం” ని “నహిధనం” అని మార్చండి.

    విద్య యొసగును వినయంబు పద్యానికి మూలశ్లోకం క్రింద వ్రాస్తున్నాను. వీలైతే వ్యాసంలో చేర్చండి.
    విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
    పాత్రత్వా ద్ధన మాప్నోతి ధనా ద్ధర్మం తత స్సుఖం

    మీరు సెలవిచ్చినట్లు మొగమాటం‌పడకుండా ఉంటే లక్ష్మణకవిగారు ” విద్య నెఱుంగనివాడు మర్త్యుడే” అనకుండా ” విద్య నెఱుంగనివాడు జంతువే” అనేవాడే నేమో. మన తెలుగుకవులు మరీ పెద్దమనుషులు. మోటుదనాన్ని బొత్తిగా ఇష్టపడరు కదా.

    • మిత్రులు శ్యామలరావు గారు,
      పొరపాట్లు సరిచేశాను,పొరపాట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. భర్తృహరి విద్య లేనివాడు పశువు అన్నారు కాని నేడు విద్య బాగా నేర్చినవారే పశువులకంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఆ శ్లోకమూ ఉంది నా దగ్గర కాని టైప్ చేయడానికి బద్ధకించా, మీరిచ్చినది చేర్చాను.
      నచ్చినందుకు
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి