About kastephale

A retired telecom engineer.

శర్మ కాలక్షేపంకబుర్లు-పరిచయం

పరిచయం

పరిచయం,స్నేహం, ఆత్మీయత ఈ మూడు మాటలు మొన్న శనివారం మనవారాలిని తీసుకురావడానికి స్కూల్ కి వెళ్ళినపుడు బోర్డ్ మీద రాసుంటే చూశాను.

పరిచయమన్నది ముఖ పరిచయమే కావచ్చు లేదా మన గురించిన వివరాలూ తెలిసిన పరిచయం కావచ్చు.ముఖ పరిచయస్తులకు పేరు కూడా తెలియవలసి ఉండకాపోవచ్చు.సాధారణంగా ఈ పరిచయస్థులే ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ఎక్కడో చూశానండీ అనేవారు చాలామంది తారసపడతారు. మనకి నెట్ లో ఉండే వారంతా పరిచయస్థులే.వీరిలో కొద్ది మంది మాత్రమే స్నేహితులూ అవుతారు, మరి కొద్ది మంది మాత్రమే ఆత్మీయులూ అవుతారు. కాని సాధారణం గా మనం అందరినీ స్నేహితులనో ఆత్మీయులనో పొరబడుతుంటాం.ముఖపుస్తకం లో ఫ్రెండ్ అన్నవారంతా స్నేహితులేనా? కాదు.వీరు పరిచయస్థులు కూడా కాదు, వీరికేం పేరు పెట్టుకుంటారో నాకు తెలియదు. సాధారణంగా ఈ పరిచయస్థులే ఎక్కువమంది ఉంటారు, ఉండాలి కూడా. ఒక్కొకపుడు ఈ పరిచయాలే ప్రమాదాలు కొనితెస్తాయి కూడా. మనమో పని మీద ఒక చోటికి వెళ్ళినపుడొకరు కనపడి పలకరిస్తే ఆ తెలిసినవాడొకడున్నాడు అని ఊరుకుంటే పని మొండికి పడిపోతుంది. అటువంటపుడు వివరంగా మన పరిచయం చెప్పుకుని కావలసినది అసలువారిని అడిగితే పని కావడానికి సావకాశమూ ఉంది.

నాకు పాలకొల్లు ట్రాన్స్ ఫర్ అయినపుడు నా ఇల్లాలు మనకి ఆ ఊళ్ళో ఎవరేనా తెలిసినావరున్నారా అని ప్రశ్నించింది. దానికి నేను ఉన్నారు. అక్కడ ఊరి మధ్యలో పెద్ద ఆలయంలో ఉన్నారన్నా! ఎవరూ అంది పిచ్చి మొద్దులా! ఆయనా! క్షీరారామలింగేశ్వరుడంటారు అందరూ ఆయన్ని, అన్నా! ఇంకా అర్ధం చేసుకోలేదు! ఆయనకి మీరు తెలుసుకదా అంది. ఆ! ఆయన నాకు తెలుసు కాని, నేనే ఆయనకు తెలుసా! అని, అనుమానమన్నా. అప్పుడు నవ్వేసి నోరు మంచిదైతే ఊరు మంచిది, దానికేం లెండి అని పనిలో పడిపోయింది.

ఇక స్నేహాలన్నవి చెప్పుకోవాలంటే చాలా రకాలు. అవసర స్నేహాలు, అలవాటు స్నేహాలు,సిద్ధాంత స్నేహాలు, వైర స్నేహాలు,రైలుబండి స్నేహాలు, ఇలా రకరకాలు. ఒక ఇంట్లో అద్దెకున్నాం, ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఇంటివారితో స్నేహం అనివార్యం.అలవాటు స్నేహాలు చాలా బలవత్తరమైనవి. పేకాట, మందు,స్త్రీ పురుష సంబంధాల దగ్గర స్నేహాలు చాలా తొందరగానూ కుదిరిపోతాయి. అవి అంత తొందరగానూ విడి శత్రువులయిపోతారు కూడా. వ్యసనం దగ్గర స్నేహం బాధకే దారి తీస్తుంది, నిజానికివి స్నేహాలు కాదు, ఆ సంగతి గుర్తించం. ఇప్పుడు లోకం లో ప్రతి పని ఈ మూడిటి చుట్టూ తిరుగుతోంది.నిజానికి స్నేహం ఎలా ఉండాలి? ఇదిగో చూడండి.

అసలు స్నేహం మధ్యాహ్నపు ఎండలా ప్రారంభం కావాలి. అప్పుడు నీడ మనమీదే పడుతుంది. కాలం గడిచే కొద్దీ నీడ పొడవూ పెరుగుతుంది, అలా కాలం తో పెరిగేదే అసలు స్నేహం, మిగతావన్నీ పరిచయాలే. నిజానికి పరిచయానికి, స్నేహానికి మధ్య భేదం తెలుసుకోలేక ఇబ్బంది పడుతుంటాం.దుర్యోధనుడు, కర్ణుడు; వాలి, రావణుల మధ్య ఉన్నది, రామ,సుగ్రీవుల మధ్య ఉన్నదీ అవసర స్నేహమే. కాని రామ సుగ్రీవులు మంచి కార్యానికి ఉపయోగించుకుంటే మిగిలినవారు చెడుకు ఉపయోగించుకున్నారు. స్నేహాలు మొదలవడం గొప్ప కాదు, కొన సాగడమే గొప్ప. స్నేహం ఎవరి మధ్య కొనసాగుతుందో తెలుసా? ఇద్దరు సమానుల మధ్య. అసమానతల్లో స్నేహం నిలబడదు,ఉదాహరణ ద్రోణ,పాంచాలులే. పరిచయస్థులకంటే వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది, ఉండాలి కూడా. ఇక చివరిది ఆత్మీయులు.

అసలు అత్మీయులు అంటే ఎవరు? నిజానికి మనసుకు దగ్గరగా వచ్చినవారే ఆత్మీయులు, స్నేహితులు, పరిచయస్థులు, బంధువులు, అందరూ ఆత్మీయులు కారు, కాలెరు కూడా. జీవితం లో వీరు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వీరికి నిర్వచనం చెప్పాలంటే బాపూ, రమణలనే చెప్పుకోవచ్చు.

(చాలా కాలంగా చిత్తులో ఉన్న టపా.)

శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి…..

కొండనితవ్వి…..

ఈ మధ్య బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడటం లేదు మరీ కూపస్థ మండూకంలా బతకడమెలా? ‘అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకా’ అని, తెలిసో తెలియకో నాలుగు మాటలాడి ఒకళ్ళని తిట్టి మరొకళ్ళని భళా అని, నలుగురిలో పేరు సంపాదించాలి కదా! అందుకు పాతకాలం లోనే ‘పటం చిత్వా ఘటం భిత్వా….’ చొక్కా చింపుకునో నాలుగురోడ్ల కూడలిలో కుండ బద్దలు కొట్టో నలుగురు నోళ్ళలోనూ నానాలికదా, మనపేరని అనుకుని మా సత్తిబాబు దగ్గరకి వెళ్ళేను. మా సత్తిబాబూ సుబ్బరాజు కలిసి మాటాడుకుంటున్నారు. నేనెళ్ళేకా మా సుబ్బరాజు ’నల్లధనమంటే ఏంటీ?’ అని ఒక ప్రశ్న జనాంతికంగా వేశాడు…సాలోచనగా నా కేసి చూస్తూ……..’సత్తిబాబూ నువ్వు సుబ్బరాజు అనుమానం తీర్చవయ్యా!’ అని తప్పుకున్నా. మా సత్తిబాబిలా మొదలెట్టేడు.

నల్లధనం అంటే పన్నుకట్టని సొమ్మని అర్ధం. అదెలా పోగుపడుతుందంటే ప్రభుత్వం వలననే. నువ్వు పొలం అమ్మేవు ఎకరానికి పదిహేను లక్షలొచ్చింది, స్టాంపు డ్యూటీ ఎంత పెట్టేడు? కొన్నవాడు, మూడు లక్షలకి. నీకు మొత్తం సొమ్మిచ్చేడు. ప్రభుత్వానికి పన్ను కట్టవలసిన మిగిలిన పన్నెండు లక్షలూ, నీకు నల్లడబ్బే! కొనుక్కున్నవాడు పదిహేను లక్షలకి స్టాంపు పెట్టలేడు కారణం గూబ దిరిపోయేలా ఉంటుందా పన్ను రేటు, అందుకువాడు పెట్టడు. రేపు నువ్వు కొన్నా అంతే. పిచ్చివాడెవడేనా ఇలా మొత్తానికి స్టాంపు డ్యూటీ పెడతానన్నా సబ్ రిజిస్ట్రారు ఒప్పుకోడు. ’నువ్వొకడివి ఇలా పెడితే, అందరిచేత ఇలాగే పెట్టించమని ప్రభుత్వం నన్ను చంపుతుంది, ‘నలుగురితో నారాయణా కులంతో గోవిందా’ అనక ఇదెందుకొచ్చిన తిప్పలు, డబ్బు మిగుల్చుకోక, ఇది చెప్పినందుకు నాకు కమిషన్ ఇవ్వక’ అంటాడు. సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించిన మగాడు కనపడలేదు, ఈ రోజునాటికి. ఆఖరికి వీలునామా రిజిస్ట్రేషన్ కి కూడా డబ్బులివ్వక జరగదు, అదీ మన దేశం. ఇక దుకాణ దారు వసూలు చేసేపన్నులో అంతా ప్రభుత్వానికి చేరదు, అంటుంటే మా సుబ్బరాజు ’ఇదంతా తెలిసినదే కాని విదేశాల్లో నల్లడబ్బు గురించి చెప్పవయ్యా!’ అన్నాడు.

’అదా! కొంతమంది విదేశాల్లో వ్యాపారాలు చేసి సంపాదించినది, పన్ను ఎగవేసి అక్కడ దాచుకున్నది. ఇది నల్లడబ్బు…”
’మరయితే పెద్దపెద్దలు దాచుకున్నదో?’ అడిగాడు మా సుబ్బరాజు.
’అది దొంగడబ్బు,నిజంగానే! కమిషన్ల పేరిట సంపాదించినది. నల్లడబ్బు కాదు. అక్కడిబేంకులకి ఇది నల్లడబ్బు,దొంగడబ్బు అని తెలియదు. అది డబ్బు! చాలు వారికి జాగ్రత పెట్టడానికి, పన్నులేదు, వడ్డీ లేదు, ఎవరికి చెప్పరు.’
’ఈ మధ్య ఈ డబ్బేదో తెప్పించుతామంటున్నారు, నిన్న నాకెవరో చెప్పేరు వికి లీక్స్ ఒక లిస్ట్ ఇచ్చిందట, అందులో చాలాపెద్దలున్నారట’ ప్రశ్నించాడు మా సుబ్బరాజు.
’నువ్వేం కంగారు పడిపోకు, అదేం జరిగే పనేంకాదు.అది నల్ల డబ్బో,దొంగ డబ్బో తేలాలి కదా! దానికితోడు ఎన్ని పిల్ల సమేరీలు? దైపాక్షిక ఒప్పందాలు, ద్వైపాక్షిక పన్ను విధానం ఇవన్నీ తేలేటప్పటికి ఎంతకాలం పట్టేనో! మరో సంగతయ్యా! నక్షత్రాల దూరాన్ని కాంతి సంవత్సరాలలో చెబుతారు. అంటే కాంతి ఒక సెకన్ లో లక్ష డెభ్భయిరెండువేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. సంవత్సరంలో ఎంతదూరం ప్రయాణం చేస్తుంది? కోట్ల కిలో మీటర్ల దూరం, ఒక నక్షత్రం ఒక కాంతి సంవత్సర దూరంలో ఉందనుకుందాం! ఈ రోజు మనకి కనపడిందనుకుందాం. అంటే ఆ నక్షత్రం ఒక కాంతి సంవత్సరం కితం అలా ఉందనమాట, ఇప్పుడెలా ఉందో తెలియదు, తెలియాలంటే మరో కాంతి సంవత్సరకాలం పడుతుందిట. ఇప్పుడు మనకి తెలుస్తున్న విదేశీ బేంకుల ధనం లిస్ట్ కూడా అటువంటిదే! ఈ రోజుదికాదు. ఆ తరవాత ఆ డబ్బు ఎన్ని మార్పులు చెందిందో! ఇప్పుడక్కడ ఉందో లేదో! తెలియదు.’
’అదేంటి విదేశాలలో నల్లడబ్బు దేశానికి తెస్తామంటున్నారు కదా!నువ్వు కాదంటున్నావ’ని నిలదీశాడు మా సుబ్బరాజు.
’బలేవాడివే కాదని ఇప్పుడు మాత్రం అన్నానా? అసలక్కడ ఉన్నప్పుడు కదా తేవడానికి,దాన్ని ప్రభుత్వం నల్లడబ్బే అంటోది,దొంగడబ్బని మాత్రం అనటం లేదు..ఈ మాత్రమైనా ఎందుకు కదిలిందనుకున్నావ్! సుప్రీం కోర్టు మొట్టబట్టి, ఎవరి ప్రభుత్వం వచ్చినా అధికారం లోకి చేసేదింతే….’
’అంటే ఈ ప్రయత్నమంతా….కొండని తవ్వి ఎలకని పట్టినట్టేనా?’ అని నిరుగారిపోయాడు మా సుబ్బరాజు.
’అదీ తప్పే అది కొండని తవ్వడమే…ఎలకెప్పుడో పారిపోయింది :) అని ముక్తాయించాడు, మా సత్తిబాబు…నిజమంటారా?

(చాలా కాలంగా చిత్తులో ఉన్న టపా.)

శర్మ కాలక్షేపంకబుర్లు-(రూపం)అందం-గుణం

(రూపం)అందం-గుణం

శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా.

గీ. మనుజునకు రూపమే యాభరణము తలప.
గుణమె రూపంబునకునాభరణము కనగ.
గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ.
క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు.
భావము:- మానవునకు రూపమే ఆభరణం.ఆ రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం. 

Courtesy:SrI.Chinta RamakriShNaraavu. aandhraamrutaM.blogspot.in

(మొన్నను అవతలబ్లాగులో ఉపనయనం ఫోటో పెడితే ఉషగారు ఈ వటువు అచ్చంగా వామనుడిలా ఉన్నాడే అన్నారు. అదిగో ఆ మాట కదిలిస్తే ఈ టపా.ఇది చాలాకాలం కితం రాసినటపా,చిత్తులో ఉండిపోయింది.మొన్న రామకృష్ణారావుగారి బ్లాగ్ లో శ్లోకం కనపడితే,అప్పటికే మొదలుపెట్టినది పూర్తి చేసేనుకాని మళ్ళీ చిత్తులో పడిపోయింది.)

అందం వెంఠనే ఆకర్షిస్తుంది, గుణం నెమ్మదిమీద ఆకర్షిస్తుంది. ఈ రూపంతో పాటు గుణమూ ఉంటే అదే ఆనందం, బ్రహ్మానందం.

రూపంతో బతికేవారిలో నేడు ముఖ్యులు సినీతారలు, హీరోయిన్లు. వీరి రూపం చూసి, అంగాంగ ప్రదర్శన చూడడానికి సినిమాకి వెళుతున్నారు తప్పించి, పాముకోడు డొక్కలాటి హీరో మొహం చూసి అసలు కాదని జనాల అభిప్రాయం. నాడు రాజ్ కపూర్ అమాయకపు అందమైన ముఖం చూసి మనసుపారేసుకున్నవారెందరు? నర్గీస్ తో సహా! అలాగే మరొకరు రాజకీయనాయకులు వీరు రూపానికంటే గుణం అదే వాక్చాతుర్యం ద్వారా జనాలని ఆకట్టుకుంటారు, వీరికి రూపం తోడయితే అది సునామీ.

దేవదానవులు అమృతం కోసం సముద్రమధనం చేశారు, హాలాహలం పుడితే పరిగెట్టేరు. అమృతకలశంతో ధన్వంతరి ఉద్భవిస్తే బలంకల రాక్షసులు ఒకరి చేతినుంచి మరొకరు అందుకుంటూ పట్టుకుపోయారు, అమృత కలశం, సద్వినియోగమయ్యే సావకాశం నశించినట్లే అనుకుని శ్రీహరి మోహినీ అవతారం దాల్చారు, అక్కడ కనపడేటప్పటికి అందరూ నిలిచేరు, మోహిని దగ్గరకిపోయి అమృతం పంచమన్నారు. ఆ రూపం అందరిని వివశులను చేసింది, మాయలో పడిపోయారు.

భస్మాసురుడు వరమిచ్చిన వేలుపు తలపైనే చెయ్యిపెట్టి వరం పరీక్షిస్తానన్న వాడు. మోహిని ని చూసి మోహించాడు, తన నెత్తిమీద తనే చెయ్యిపెట్టుకుని నశించాడు.

సుందోపసుందులు లోకాలని ఏడిపించి హింసించినవారు, మోహినిని చూసి మోహించారు, నన్ను పెళ్ళి చేసుకోమంటే నన్నని పోటీ పడ్డారు. ఇద్దరూ యుద్ధం చేయండి గెలిచినవానిని వివాహం చేసుకుంటానంది. ఒకరినొకరు పొడుచుకు చచ్చారు. లోకానికి పీడ వదిలింది.

మరి మాయవటువు బలిచక్రవర్తి చేసే యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఒకరిని పలకరించాడు, మరొకరికి నమస్కారం చేశాడు, ఒకరితో వేదం చెప్పేడు, మరొకరితో శాస్త్ర చర్చ చేశాడు. సభ అంతా కలగుండు పడిపోయింది, ఆ రూపవర్ఛస్సుకి. తరవాతేం జరిగింది, బలి చక్రవర్తి ప్రాణం పోయినా మాట తప్పనని దానమిచ్చి కట్టుబడి, ఇంద్రపదవికోల్పోయాడు.

ఇలాగే ప్రవరుని అందం మాయలో పడి వరూధిని ఏమనుకుంది?

దక్షణదేశంవాడు ప్రవరుడనే నిష్ఠాగరిష్ఠ బ్రాహ్మణుడు, అందగాడు, సంసారి, సిద్ధుని కొలిచేడు. సిద్ధుడు నీకోరికేమంటే, హిమాలయాల అందాలు చూడాలని ఉందన్నాడు. సరేనని పాదలేపనం పూశారు సిద్ధుడు. హిమాలయాలకీ వెళ్ళి దిగాడు ప్రవరుడు, అందాలూ చూశాడు, అమ్మో పొద్దువాలిపోతోందని భయపడ్డాడు, ఇంటికిపోవాలనుకుంటే పాదలేపనం కరిగిపోయింది. ఇంటికిపోయే మార్గం కనపడలేదు. అక్కడ తిరుగుతుండగా వరూధిని కనపడింది.ప్రవరుని చూచిన వరూధిని ఇలా అనుకుంది.

ఎక్కడివాడొ! యక్షతనయేందు జయంతు వసంతు కంతునిన్
చక్కదనంబునన్ గెలువజాలెడు వాడు ఈ మహీసురాన్వయం
బెక్కడ ఆ తనూ విభవమెక్కడ ఏలినబంటుగా మరున్
ఢక్కగొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్.

ఎక్కడివాడో! జయంతుని, వసంతుణ్ణి మన్మధుని కూడా తోసిరాజనే అందంతో ఉన్నవాడు. అయ్యో! వీడు నన్ను చేపడితే మన్మధుని కూడా ధిక్కరించినట్లవుతుందే అని మనసులో అనుకుంటుండగా.

తన వర్గత్రయం చెప్పుకుని ఇక్కడ చిక్కడిపోయాను నాకు ఇంటికిపోయే మార్గం చెప్పవా అని అడిగాడు. అమ్మ! మా బలేగా పడ్డాడు బుట్టలో అనుకుంది వరూధిని, తను రూపానికి చిక్కుబడిపోయింది. ఏమంది

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరింప లా
గింతయకాక నీవెఱుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
కింత భ్యంబు లే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్.

ఇంతంత పెద్దకళ్ళున్నాయి, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో మాటాడాలనే కోరికతో, ఒక కారణం చూపించడం కోసం, దారడుగుతావా?వంక పెట్టుకుని ఆడవారితో మాటాడాలని కాకపోతే, నువ్వెలావచ్చేవో తెలీదా అని అడిగింది, కాదు ఎకసెక్కాలాడింది.ఆ తరవాత చాలా చర్చచేసి ప్రవరునిపై మోహంతో తమకం ఆపుకోలేక

ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప ‘హా! శ్రీహరీ’
యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ తొలగన్ ద్రోచె గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?

పద్యం కదూ అర్ధం చెప్పలేదని కోపగించద్దు, చెప్పకూడదనుకున్నా, తప్పటం లేదు. టూకీగా అందమైన చేతులతో పాలిండ్లు పొంగేలా నడ్డివిరుచుకుని ప్రవరునికి పాలింటి మొనలు తగిలేలా కౌగలించి ముద్దు పెట్టబోతే హా శ్రీ హారి అని ప్రవరుడు మొహం పక్కకి తిప్పుకుని, అమ్మో మైలపడతాననుకున్నాడనుకుంటా సున్నితంగా భుజాలు పట్టుకుని తోసేసేడట, రూపానికి దాసోహమని తమకంలో పడిపోయింది. అప్పుడు వరూధిని

ఇంతలా ఏడ్చినా ఉపకారం లేకపోయింది ప్రవరుని గుణం ముందు తన అందం తేలిపోయిందని తెలుసుకుంది, వరూధిని ఇంకా చక్కటి నాటకం కూడా ఆడింది,

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌.

ఓయి దయలేనివాడా! అలా తోసేస్తే స్త్రీలు భరించగలరా? నువ్వు అలా మోటుగా తోసేస్తే నీ గోరు ఇక్కడ గుచ్చుకుపోయింది, నొప్పితో బాధగా ఉందని కలకూజిత స్వనంతో ఏడ్చిందట. అలా ఏడిస్తే వచ్చిన కన్నీళ్ళు చనుకట్టుపై పడ్డాయన్నారు పెద్దన గారు. ఆ తరవాత ప్రవరుడు అగ్ని దేవుని వేడుకుని తన స్వస్థలానికి చేరేడు.

అలా ప్రవరుడు వదిలేసిపోయిన తరవాత, అదే ప్రవరుని రూపంలో వచ్చిన గంధర్వుని చూసి నిజంగా ప్రవరుడే తనను చూసి మోహించి తిరిగి వచ్చాడని గంధర్వునికి లొంగిపోయింది. సంభోగ సమయంలో వరూధిని కళ్ళు మూసుకోవాలనీ షరతు పెట్టేడు, మాయా ప్రవరుడు, తమకంలో ఒప్పుకుంది,వరూధిని. మాయాప్రవరుడు తన వాంఛ తీర్చుకున్నాడు. వరూధిని తన వాంఛ తీర్చుకున్నాననుకుని మోసపోయింది, తెలుసుకోనూ లేకపోయింది.నేటికి వరూధినిలా కళ్ళు మూసుకుంటున్నవారే ఎక్కువ కనపడుతున్నారు, తమకంలో.

ఇలా రూపం తాత్కాలిక ప్రయోజనం కలిగిస్తుంది, కాని గుణం దీర్ఘకాల ప్రయోజనం సమకూరుస్తుంది.గుణాన్ని ప్రేమించాలి,రూపాన్ని కాదు. కాని వీరిద్దరిలోనూ ఉండే అవగుణం మాత్రం అహంకారం.ఒకరికి రూపముందనే అహంకారం, రెండవవారికి తెలివుందనే అహంకారం తప్పవు, అవే వీరి పతనానికి హేతువులు కూడా.సాధారణం గా అందం ఉన్న చోట గుణం ఉండదు అలాగే గుణం ఉన్న చోట అందమూ ఉండదు. వరూధినికి రూపమే ఉంది గుణం లేదు,ప్రవరునికి రూపమూ, గుణమూ ఉన్నాయి. పాపం! భగవంతుడు సొట్ట బుగ్గలబ్బాయికి తలలో ఖాళీ పెట్టేడు తప్పించి, లేకపోతేనా!! సునామీ కదూ!!!

శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితం

జీవితం

వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము చెప్పకు
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ.

వఱదలో వ్యవసాయం చెయ్యకు,కరవైనా బంధువులవద్దకు పోవద్దు,ఇతరులకు రహస్యం చెప్పద్దు, పిరికివాడిని దళపతిగా చెయ్యద్దు అన్నారు బద్దెన భూపాలుడు..

వఱదలో వ్యవసాయం మొదలు పెట్టద్దంటే చేసేపని వ్యర్ధమని తెలిసి చెయ్యడం అవుతుంది. ఇది వ్యవసాయానికే కాదు జీవితంలో అన్నిటికి వర్తిస్తుంది. సమయం సందర్భం చూసుకోకుండా అనువు కాని సమయం లో పని మొదలుపెట్టి నష్టపోవడం కూడా ఇటువంటిదే. ప్రతి పని మొదలు పెట్టడానికి కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలుంటాయి, అప్పుడే మొదలు పెడితే కలసివస్తుంది .సరియైన ఋతువులో విత్తాలి,అప్పుడే మంచి పంట పండుతుంది. సరియైన వయసులో చదువు, పెళ్ళి చేసుకోవాలి,జీవితంలో నూ స్థిరపడాలి.అదును దాటిన వ్యవసాయం ఎలా ఫలించదో, కాలం గడచిన తరవాత పెళ్ళీ అలాగే ఉంటుంది.ముఫై ఏళ్ళ దాకా చదువంటే, ఆపైన ఉద్యోగమంటే, ఆ తరవాత ఉఛ్ఛదశకోసం చూపంటే, వయసు కరిగిపోతోంది, ఆ తరవాత అంటే అమ్మాయికి ముఫై ఐదు, అబ్బాయికి నలభైలలో అనుభవాలకి అవకాశమూ తక్కువ, ఏరొక చోట చాకిరేవొక చోటలాగా వారొక చోట వీరొకచోట, ముడి పడేదెలా?,పొరపాటున అప్పటికే కొన్ని అనుభవాలుంటే అవి కాల నాగుల్లా వెంటాడుతుంటాయి. ఆదరణలూ లేవు, సద్దుకుపోయే తత్వమూ అప్పటికే చచ్చిపోయి ఉంటుంది. నా మాటే చెల్లాలనే అహంకారమూ బుసలు కొడుతుంటుంది. అప్పుడు పెళ్ళి విడాకులకే దారితీసే సావకాశాలూ ఎక్కువే. ఈ పిల్లలు సంసారం అంతా ఎందుకనుకుంటే సంన్యాసం తీసుకోవచ్చు కాని, ఇందులోనే ఉండి అదును తప్పిన వ్యవసాయంలాగా ఉంటే, ఆ తరవాత ఏ పసి పాపను చూసినా అయ్యో! మనకు లేకపోయారే అనే బాధ మనసును కలుక్కుమనేలా చేస్తుంది, ఇది మగవాడికంటే స్త్రీకి చాలా బాధాకరం. స్త్రీకి తల్లి కావాలనే కోరిక చాలా బలవత్తరమైనదని గుర్తించాలి.

కరువులొ అధికమాసం అంటారు, కరువంటేనే దరిద్రం, ఏమీ లేకపోవడం, భావదారిద్ర్యమూ ఇందులోకే వస్తుందేమో చెప్పలేను. ఇటువంటి సమయంలో బంధువుల దగ్గరికి పోవద్దన్నారు. ’చెడి చెల్లెలింటికి వెళ్ళేకంటే స్నేహితుని ఇంటికి వెళ్ళమని’ సామెత. మన దరిద్రం సంగతి అక్క/చెల్లి; అన్న/తమ్మునికి, కావలసినవారికి, అత్తమామలకి, బావ మరదులకి ముందుగానే తెలుస్తుంది. ముఖ్యంగా అత్తవారింటికి అసలే పోకూడదు. వీరు మాటాడరుకాని, వారి వెనకవారు సన్న సన్నగా కోస్తారు. ’అయ్యో! అన్నయ్యా!! మాకు నాలుగు సంవత్సరాలుగా ఏదీ కలిసిరావటం లేదు, రోజు గడవటమే కష్టంగా ఉందనుకో’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇక సాయం అడగడానికి వెళ్ళినవారికి నోరు పెగలదు. మన వెనకని ’అమ్మబాబోయ్! ఆ మాత్రం భాగ్యానికే ఏం మిడిసిపడిపోయారూ, నడమంత్రపు సిరి నరం మీద కురుపూ అని ఊరికే అన్నారా! దేవుడు లేడూ!’ అని ఎగతాళీ కూడా చెయ్యచ్చు. అదే స్నేహితుని ఇంటికి వెళితే ధన సహాయం చేయలేకపోయినా నోరారా పలకరిస్తాడు, మనసారా కష్టం విని తరణోపాయం కోసం వెతుకుతాడు. కుదిరితే మనం కష్టాన్ని దాటే ఉపాయమూ చెప్పగలడు, అసలు ఇతను సరియైన మిత్రుడయి ఉంటే సుమా! సుదాముడు అదే కుచేలుడు మిత్రుడు కృష్ణుని దగ్గరకే వెళ్ళేడు, నోరు విప్పి దరిద్రం తీర్చమని అడగలేకపోయాడు, మిత్రుడే ఒక పిడికెడు ఎండిన అటుకులు తిని అనుగ్రహించాడు. ఇంకా తినబోతుంటే చిన్నతల్లి అడ్డుపడింది. అదీ స్నేహితుని యొక్క గొప్పతనం. అందుకే ఎప్పుడూ చెడి చెల్లెలింటికి వెళ్ళద్దన్న మాట మరవద్దు. స్నేహితుడు ధన సహాయం చేసి ఆదుకోలేకపోయినా మెండయినా ఆత్మ విశ్వాసం మనలో నింపగలడు, మనలని మాటలతో ఆత్మ విశ్వాసం పోగొట్టడు, ధైరం నూరిపోయగలడు.ఉల్లికుట్టు మాటలతో చంపెయ్యడు.

ఇతరులకు మర్మం చెప్పద్దనారు కవి. నిజం, ఇది జీవిత సత్యం. చెప్పద్దన్నారని ఎవరికి చెప్పుకోకపోవడం తప్పు. కట్టుకున్నవారికి, కావలసినవారికి, ఆత్మీయులకి చెప్పుకోకతప్పనివి చెప్పుకోవాలి, అప్పుడు కాని గుండె బరువు తీరదు. కాస్త పరిచయస్థులకు కూడా గుట్టు చెబుతుంటారు కొంతమంది, అది అప్పటికి బాగుండచ్చు కాని తరవాత కాలంలో మనల్ని ఇబ్బందులకు గురిచేయచ్చు. అది కూడదనే కవిగారి ఉవాచ.

పిఱికికి దళవాయితనం ఇవ్వద్దన్నారు, అంటే, పిఱికివానికి సేనా నాయకత్వం ఇవ్వద్దని. నేటికాలానికి సేనా నాయకత్వం చెప్పక్కరలెదు కాని, మన కంపెనీలు ఆఫీసులలో నిర్ణయాలు తీసుకోవలసినవారి పిఱికివారై ఉండకూడదు. ఇటువంటి వారికి నాయకత్వం కనక కట్టబెడితే, నిర్ణయాలు తీసుకోక, ఆలస్యం చేసి, తప్పు నిర్ణయాలు తీసుకుని అందరిని బాధకు గురిచేస్తారు, నట్టేట ముంచేస్తారు. ఇది మన ఇళ్ళలో కూడా అనుభవమే అందుకే,అటువంటి అవసరమే కనక వస్తే చొరవ, ధైర్యం,ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి ఉన్నవారికే నిర్ణయం తీసుకునే బాద్యత వదలిపెడితే మంచిది,పురుషాధిక్యతకిపోక, కట్టబెట్టాలని అనుకోవాలి.

శర్మ కాలక్షేపంకబుర్లు-నడమంత్రపు సిరి..

నడమంత్రపు సిరి..….

నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఒకలాగే సలుపుతాయని నానుడి. నడమంతరపు సిరి ఎప్పుడూ రాలేదు కనక దాని గురించిన అనుభవం లేదుగాని, నరం మీద కురుపు అనుభవం లోకొచ్చింది.

అదేమోగాని వీపుమీద సరిగా మెడ నుంచి ఆరంగుళాల దూరం లో సరిగా వెన్ను మీద కుడి వైపున పెసరబద్దంత బొడిపి తేలింది, మొదటి రోజు. ఆ( ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఊరుకున్నా, అశ్రద్ద కూడా చేశా. మర్నాటికి కొంచం పెరిగిందేమో తెలియదు కాని మూడవనాటికి నేనున్నానని జ్ఞాపకం చెయ్యడానికి సలుపు, పోటు మొదలెట్టింది. ఒక టేబ్లెట్ పడేశాను సలుపు,పోటు తగ్గేయి, మరచిపోయా. మర్నాడు ఉదయానికి మళ్ళీ పోటు, సలుపుతో పాటు కొంచం పెరిగింది. అమ్మో! ఇదేమో అనుకుని ఎందుకేనా మంచిదని చక్కెర ఫేక్టరీ ఉత్పత్తి ఎలా ఉందని చూస్తే, అదుపులోనే ఉందని సమాధానమొచ్చింది. మరి ఇదెందుకొచ్చిందంటే? సమాధానం లేని ప్రశ్న కదా! ఎందుకొచ్చినా వచ్చింది, పెరిగింది, ఉన్నానూ అనీ చెబుతోంది, సలుపూ,పోటూ కూడా బాగానే ఉంది, మరి నరం మీద వేసింది కదా! డాక్టర్ మందులు రాసేరు వాడుతున్నా!

అన్నీ బాగుంటే నా అంతవాడు లేడంటాం, ఇప్పుడు చిత్ర వధ ఎలావుంటుందో అనుభవం లోకొచ్చింది. కూచుంటే జేరబడ్డానికిలేదు, పడుకుంటే పక్కగా పడుకోవాలి, మరో పక్క తిరగాలంటే లేచి మళ్ళీ మరో పక్క పడుకోవాలి, దొర్లడానికి లేదు, నిద్రలో దొర్లితే అబ్బో మెలుకువ వచ్చేసి అబ్బా! బాధ, అసలు నిద్రెక్కడ? చలి తిరిగింది, నిన్నటినుంచే, దానితో దోమలూ పెరిగాయి, ఫేన్ వేసుకుంటే చలి, వేసుకోకపోతే దోమలు పీకుతున్నాయి.ఫేన్ వేసుకుని కప్పుకుందామనుకుంటే కురుపు గోల, నరకం వేరుగాలేదు. ఇదే….ఎంత సేపని కొరడా కర్రలా కూచోడం…

ఇలా ఉండగా అసోసియేషన్ వారు మీరు రెండు సార్లనుంచి మీటింగ్ లకి రాలేదు, బుధవారం మీటింగ్ రాకతప్పదు రాజమంద్రి అన్నారు. పది రోజుల కితమే ముఖ్య కార్యక్రమానికి రాజమంద్రి వెళ్ళి, ఎలాగా కదిలేం కదా అని బ్లాగిల్లు శ్రీనివాస్ గారిని కలిస్తే, అబ్బో! అదో అపూర్వ అనుభవం. వారేమో మరో ఇద్దరు స్నేహితుల్ని పిలిచి, చిన్న సభలా ఏర్పాటు చేసి నేనేదో వాగేస్తోంటే అదే మహా కావ్యంలా వినేసి తలలూపేసేరు. నిజానికి బ్లాగిల్లు శ్రీనివాస్ దంపతులిచ్చిన ఆతిథ్యం, కృష్ణుడు,రుక్మిణీదేవి, కుచేలునికిచ్చిన ఆతిథ్యం మరపుకు తెప్పించింది.అసలు ఎవరినైనా మాటాడనిస్తేనా ఒక గంట సేపు, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేసేను. ఆ తరవాత ఒక స్నేహితుడు నన్ను బస్ దగ్గర దింపేరు.

మళ్ళీ ఇప్పుడు….అనుకుంటూ, ఇంటి దగ్గర కూచుంటే వెఱ్ఱాడికి….మీదే లోక మని, మన మనసు కురుపు మీదే ఉంటుందని, కొంత మార్పు ఉంటుందని బయలుదేరేను. దగ్గరగా ఎనభైమంది చేరేరు, ఇక్కడా మంత్రివర్గం మార్పు చెందిందిట, ఉత్సాహం ఉరకలే వేసింది. కొద్ది సేపు మాటాడమన్నారు, ఆ తరవాత ఎనభై ఏళ్ళు పైబడినవారిని సన్మానించారు, ఆనందమే అయింది. భోజనానికి బయలుదేరుతుంటే ఒక మిత్రుడొచ్చి ఎన్నాళ్ళకి,ఎన్నాళ్ళకని గుచ్చి కౌగలించాడు, నేనేమో గిలగిల లాడుతూ ఏడవలేక నవ్వు మొహం పెట్టేను. ఏం అలా పెట్టేవు మొహమన్నాడు. ఏం చెప్పనురా బాబూ! నరం మీద కురుపేసింది, వీపుమీద. ‘పుండుకి పుల్ల మొగుడని’ నువ్వేమో దాన్ని కాస్తా నొక్కేసేవు, అసలే సలుపు,పోటూ తో చస్తున్నా అంటే. అయ్యో నాకు తెలియదుకదా అని దీన్ని వార్త చేసి అందరికి చెబితే అదో సంతాప సభలా యిపోయింది, ఓదార్పులతో. అలా కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేటప్పటి రాత్రయింది.

ప్రయాణానికి ఒళ్ళు చితక్కొట్టిన్నట్టయిపోయింది, అన్న వస్త్రాలకిపోతే ఉన్న వస్త్రాలు పోయేయన్నట్టు అయిందే అనుకుని,కురుపుతో’బాధగా ఉందోయ్’ అన్నా, ఇల్లాలితో, ’మీరే చెబుతారుగా నడమంత్రపు సిరి నరం మీద కురుపు ఒకలాగే బాధ పెడతాయని, అనుభవించకతప్పదు మరి’ అని వెళిపోయిందండి.
కూచోడానికి, పడుకోడానికీ బాధగానే ఉంది, కొన్ని టపాలు ఎప్పుడో రాసి వదిలేసినవాటిని కొన్నిటిని ప్రోగ్రాం చేశాను. కొద్దికాలం శలవు.
స్వస్తి.

శర్మ కాలక్షేపంకబుర్లు-పేరు పెట్టడం (నామోత్కీర్తనం)

పేరు పెట్టడం (నామోత్కీర్తనం)

అసలు పేరన్నది ఎందుకూ అని ఆలోచిస్తే ఒక వ్యక్తిని ప్రదేశాన్ని గుర్తించడానికే. ఈ పేర్లు పెట్టుకునే (పేర్లు, పద్దులు పెట్టుకోడం అంటే విమర్శ చెయ్యడమని అర్ధం ఉందిట) అలవాటు లేని కాలం లో గుర్తించడానికని ఎర్రాడు, నల్లాడు, పొట్టాడు,పొడుగాడు, కుంటాడు, బొల్లోడు, బక్కోడు, ఇలా మనుషుల రూపాల్ని బట్టి పేర్లు పెట్టుకున్నారు. ఆ తరవాతి రోజులలో ద్రోణుడు కుండనుంచి పుట్టినవాడు, ఘటోత్కచుడు కుండవంటి తలకలవాడు, ఉపరిచరవసువు ఈయనెప్పుడూ ఆకాశంలో తిరిగేవాడట అందుకు ఉపరిచరుడు అన్నారు. కృష్ణ శబ్దానికి నలుపు అని కూడ అర్ధం. భారతం లో నలుగురు కృష్ణులున్నారు. శ్రీకృష్ణుడు ఈ యనకి రాధికాపతి, నందనందనుడు, ఇలా చాలామందితో కలిపి పేర్లున్నాయి. రెండవ కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు, కురువంశ కర్త. మూడవ కృష్ణుడు అర్జునుడు, ఇతనికి కృష్ణుడనే పేరు, చిత్రం భారత యుద్ధానికి కారకురాలైన ద్రుపద రాజ పుత్రికి కూడా కృష్ణ పేరుంది, అందరూ నల్లనివారేనట, అందం నలుపులోనే ఉందేమో! మరో పేరు వృకోదరుడు అని భీమునికి పేరు, ఏంటిటా నక్కలాగా ఎంత తిన్నా ఆకలేట, కడుపు నడుముకు అంటుకుపోయి ఉంటుందట. భీకరమైన రవం చేసినవాడు కనక రావణుడు అన్నారుట. ఇలా కూడా మనుషుల్ని గుర్తించేవారు. దేవతలకి, దేవుళ్ళకీ ఇది తప్పలేదు నారాయణుడు నీరునివాసంగా కలవాడు, ఇవిగాక మరొకరితో కలిపి గుర్తించడం పార్వతీపతి, పార్వతీదేవి భర్త, సీతాపతి, సీత భర్త ఇలాగా పేళ్ళున్నాయి, పూర్వకాలంలోనూ, ఇప్పటికి మా పెల్లెలలో ఇటువంటివి చాలా చూస్తుంటాం, పల్లమ్మ గారి రామన్న. ఈ పల్లమ్మగారు కొంత ప్రఖ్యాతి ఉన్నవారు అందుతో ఈ రామన్నగారు పల్లమ్మగారి రామన్న అయ్యాడు. పాతూరి బులెంకమ్మ మొగుడని పేరు, ఈ బులెంకమ్మగారు దాత, మరి ఆయన పేరు తెలీదు. అనామకుడు అనగా గుర్తింపులేనివాడని అర్ధం, పాతూరి బులెంకమ్మ మొగుడివేంటిరా అనేవారు, పేరు చెప్పకపోతే. ఇలా చూస్తే రామానుజుడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు. అబ్బో దీనికి అంతులేదండి చెప్పుకుంటూ పోతే.

పేర్లలో చిత్రాలూ ఉన్నాయి, మీనాక్షికి చింతాకంత కళ్ళు, మన్మధరావు పాపమీయన పగలు చూస్తే రాత్రి కలలో కొస్తాడు. పేరు సుభాషిణి కదిలిస్తే నత్తిమాటలే, పేరు మితభాషిణి కదిలిస్తే గచ్చపొద, పేరు సత్యారావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. పేరు భారతి పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు,నీలవేణి కి తల ముగ్గుబుట్ట.పెళ్ళిలో పేర్లు చెప్పించడమనే ముచ్చటుండేది, ఇప్పుడు మరచారనుకోండి, ఇప్పుడు ’హబ్బీ ఇలారావోయ్’ అనే పిలుస్తున్నారు. మా మాస్టారొకాయన ’వైఫూ’ అని పిలిచేవాడు పెళ్ళాన్ని, చాలా కాలం అర్ధం కాలా, ఏమని పిలుస్తున్నట్టు, అని

ఇక ఊళ్ళని గుర్తించడానికి పల్లె,పట్నం,ఖండ్రిగ,మొగ,పర్తి,పాడు,పురం చివరగా పేర్లు ఉన్నాయి. ఇలాగే ఉత్తర,దక్షిణ,తూర్పు,పడమరలతో కలిపిన ఊర్లపేర్లూ ఉన్నాయి. మిట్ట, పల్లం తో కలిగిన పేర్లూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? గుర్తింపుకే. ఆ తరవాత కాలంలో కొన్ని కొన్ని కొత్తపేర్లు, ఎవరికీ పెట్టని, తెలియని పేర్లు పెట్టుకోవడం కూడా ఒక ఆనందమై కూచుంది. ఉష్,చన్, నన్ చివరగా కల పేర్లూ వచ్చాయి. విరోచన్ అని ఒకరు పేరెట్టుకున్నారు, పాపం ఆ పేరు ఎవరికి ఉండి ఉండదనుకుని, తీరా చూస్తే ఈ విరోచనుడన్నపేరు భారతం లో ఉంది :). మీకు వింత వింత పేర్లు కావాలనుకుంటే భారతం చదవండి, భలే పేర్లు కనపడతాయి.

కొన్ని పౌరుషనామాలు ధనుంజయుడు,సవ్యసాచి వగైరా ఈ కోవకి చెందినవే. కొన్ని చేసే వృత్తినిబట్టి వచ్చే పేర్లూ ఉన్నాయి తోప్ ఖానేవాలా వీళ్ళ పూర్వులు ఫిరంగులు తయారు చేసేవారట. ఇక చదువుల్ని బట్టి పేర్లు వేది,ద్వివేది,త్రివేది,చతుర్వేది, వేదం చదువుకున్నవాడు,రెండు వేదాలు చదువుకున్నవారు, మూడు వేదాలు చదువుకున్నవారు, నాలుగు వేదాలూ చదువుకున్నవారని. పేర్లు మిగిలాయి కాని వేదాలు పారిపోయాయి, నేటికి. ఇక కులాల తో పేర్లు అదో పెద్ద చిత్రమే, ఇది ఈ మధ్యనే మనకి బాగా చేరింది. మరి మీపేరేంటి కులం పేరుకాదా అని అడగచ్చు, కాదు, కానే కాదు, శర్మ అంటే విష్ణువు పేరు శాంతి అని అర్ధం, దీక్షితులు అంటే దీక్ష తీసుకున్నవాడు అని అర్ధం మరివి, కులనామాలెలా అయ్యాయి. శాస్త్రి శాస్రం చదువుకున్నవాడు అని అర్ధం. వీటిని కులనామాలు చేసేశారు. ఇక రావు అనేది పేరు చివర రావడం మరాఠీ సంస్కృతితో వచ్చినదనుకుంటా. కాపు అంటే రక్షకుడు, రక్షించేవాడని అర్ధం, అలాగే నాయుడు అన్నది నాయకుడికి వికృతి. ఇలా కులాల పేర్లుగా చివర తగిలించుకోడమనేది ఉత్తరాదివారి సంస్కృతి, మనది కాదు.

పుట్టని బిడ్డకి పేరు పెట్టడం గురించి దెబ్బలాడు కున్న దంపతుల్ని చూశాం కదా! అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయంలో. పుట్టిన బిడ్డకి పేరు పెట్టడంలో తిరకాసు చూదాం. ఇదివరలో చాలా మంది పిల్లలుండేవారు కనక పేర్లు పెట్టడానికి ఒక ప్రోటోకోల్ ఉండేది. మొదటి బిడ్డకి ఆయన తండ్రిపేరు,ఆడ బిడ్డకి ఆయన తల్లిపేరు. ఆతర్వాత మగ ఆడ బిడ్డలకి ఆమె తల్లితండ్రుల పేర్లు పెట్టడం ఆచారం ఉండేది. ఇప్పుడు ఆ సావకాశాలు లేవు కనక ఒక జరిగిన సంఘటన. ఒక దంపతులకి మగ బిడ్డ కలిగితే ఎవరిపేరు పెట్టాలని ఆలోచించారు, తగువెందుకని ఆమెతండ్రి, ఆయన తండ్రి పేర్లు కలిపి పెట్టేశారు.. మరో చిత్రం కూడా, ఆమె తరఫువాళ్ళంతా, ఆమె మామగారి పేరుతోనూ, ఆయన తరఫు వాళ్ళంతా ఆమె తండ్రి పేరుతోనూ పిలుస్తారు. మంచి సయోధ్య కుదిరిపోయింది. ఒక్కొక్కరి పేరు కొండవీటి చాంతాడంతా ఉంటుంది. వీరవేంకట సత్య సూర్య వరప్రసాద నరసింహ వినాయక మణికంఠ………వరాహరావు, పాపం ఈయనను తెలిసినవాళ్ళంతా ’పందిగాడు’ అనిపిలిస్తారు, దెబ్బలాటకొస్తే ’పందెగాడు’ అని సద్దేస్తారు, ఇతనికి పందాలు వేయడం బాగా అలవాటూ.

ఏపేరు పెట్టాలని దెబ్బలాడుకుని చివరికి భార్యభర్తలు ఏదో పేరు పెట్టినా చివరికి వాణ్ణి ఏదో పొట్టి పెరుతోనే పిలుస్తారు, పండూ, చిన్నా అని.

’ఏంటీ ఏర్ పోర్ట్ పేరు తగువ’న్నాడు మా సుబ్బరాజు. ’ఏముంది ముందు ఒకరి పేరు పెట్టేరు. ఆ తరవాత అధికారానికి వచ్చినవారు ఆ పేరు మార్చి మరొకరి పెరు పెట్టేరు, ఇప్పుడు మొదటివారొచ్చి మళ్ళీ పేరు మార్చారు. ఆయనెవరూ బారువాగారా ఇండియా అంటే ఇందిర అన్నాడు కదా! అన్నిటికి ఆ పేర్లే పెట్టేస్తే పోలా అనుకున్నారు వారు. అవే తగిలించారు మరీ. తగువులేక ఒక పేరు పెట్టలేమా? అని ఆలోచిస్తే ఈ తగువంతా కాలక్షేపానికి, నాదే పైచెయ్యి అని చెప్పుకోడానికి, వినోదానికి, అసలు విషయాల్ని దాటెయ్యడానికి అనిపించడం లేదా? రాజీవ్ పేరుపెట్టినా ఎన్.టి.ఆర్ పేరు పెట్టినా కేబ్,ఆటో వారు షంషాబాద్ ఏర్ పోర్టు అనే పిలుస్తారు. రాజీవ్ పేరు చెబితే ఒక రూపాయి తగ్గించడు……..రాజకీయ నాయకులే సమాజానికి సేవచేస్తున్నారా? ఇదంతా ఎందుకుగాని హైదరాబాద్ లో ఒక ఆటోవాలా గర్భిణీ స్త్రీలని ఉచితంగా హాస్పిటల్ కి చేరుస్తుంటాడు..అతను సమాజానికి నిజమైన సేవ చేస్తున్న సామాన్యులలో మాన్యుడు… అతనిపేరెట్టచ్చుగా…’ అని వెళిపోయాడు మా సత్తిబాబు…నిజమేనంటారా?