శర్మ కాలక్షేపం కబుర్లు-కార్తీక మాసం.

కార్తీక మాసం.

రేపటి నుంచి కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం తో కూడి పౌర్ణిమ వచ్చేనెల కార్తీక మాసం. దీన్ని వృశ్చిక మాసం అని కూడా అంటారు. కారణం సూర్యుడు ఈ నెలలో వృశ్చిక లగ్నంలో ఉదయిస్తాడు కనుక. ఇది శివ కేశవుల అభేదాన్ని తెలిపేమాసం. శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరినీ కొలుస్తాం. ఈ నెలంతా పండగ వాతావరణమే. చిరుచలి ప్రారంభమవుతూ వుంటుంది. ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు శుక్ల పక్షరాత్రు లందుముఖ్యంగా శుక్లపక్ష అష్టమి మొదలు బహుళపక్ష అష్టమి వరకు ఈ రెండు నెలల వెన్నెల అద్భుతంగా వుంటుంది. కార్తీక పూర్ణిమ గురించయితే చెప్పడం కష్టం అనుభవించాలి. ఈనెలలో నక్తాలు, సోమవారాలు, ఏకాదశిలు, చిలుకు/క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణిమ, అన్నీ ముఖ్యమైనవే. నెలంతా గుడిలో ఆకాశదీపం. మన ఇళ్ళ దగ్గర కార్తీక దామోదరుడిని ఆహ్వానించి పెట్టే సంధ్యా దీపం. ఎన్నని చెప్పను. ప్రయత్నం చేస్తాను. కార్తీక వన భోజనాలు మరొక సారి.

నక్తాలు:-  రోజు ఉదయం నది,చెరువు,కాలువలేదా ఇంటిలో సూర్యోదయం ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానంచేయాలి. స్నానం చేసి నిత్య కర్మ లు చేసుకుంటూ ఉపవసించి సాయంత్రం శివకేశవుల దర్శనం చేసుకుని, నక్షత్ర దర్శనం చేసుకుని కార్తీక దామోదరునికి పూజ చేసి భుజించడం. ఇది నిత్యం నెలంతా చేస్తారు కొందరు. కొన్నిరోజులు చేస్తారు కొందరు. కార్తీక సోమవారం:-బహుశః దీని గురించి ఎక్కువ
చెప్పక్కరలేదనుకుంటాను. నక్తంలాగే చేస్తారు. ఏకాదశిలు మాత్రం రోజంతా ఉపవసించి మరునాడు భోక్తకి పెట్టి భుజిస్తారు. భోక్త కుదరకపోతే మామూలుగా పూజ చేసుకుని భుజిస్తారు. చిలుకు ద్వాదశి ఈరోజు కాయతో ఉన్న ఉసిరి కొమ్మ తులసి కోటలో పెట్టి కార్తీక దామోదరుని పూజ చేస్తారు, ఉపవాసం చేస్తారు. పౌర్ణిమ ఇది చాల ప్రత్యేకమైన రోజు ఎందరో మహానుభావులు పుట్టిన రోజు. ఈరోజు ఉపవాసం చేసి మరునాడు భుజిస్తారు. శివార్చన, కార్తీక దామోదరార్చన నెలలో ఏరోజయినా చేస్తారు. ఈ నెలలో సంధ్యాదీపం ముఖ్యం. ఉపవాసం ముఖ్యం. అన్నిటికన్నా భక్తి, శ్రద్ధ ముఖ్యం.

ఇక శివాలయాలలో “నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శ్శివాయ చ శివతరాయ చ”  వినపడుతూనే వుంటుంది. అభిషేకమంత్రాలన్నిటికీ అర్ధం తెలియకపోయినా  అందులో కొన్నితెలుస్తుంటాయి. ఈ సర్వ జీవులూ ఆయనే దొంగా అయనే, వేటగాడు అయనే, సభ, సభికులూ ఆయనే. మిగిలినవి చాలా తెలియకపోయినా వింటు వుంటే అదో అలౌకికానందం కలుగుతూ వుంటుంది. అభిషేకాలు జరుగుతూనే వుంటాయి. జలం పోస్తూనే వుంటారు, శివలింగం మీద. విష్ణాలయాలు కూడా హడావుడిగానే ఉంటాయి. మన ఆంధ్ర దేశానికి మాత్రమే కలిగిన అదృష్టం పంచారామాలు, శ్రీ శైలం, జొన్నవాడ, ద్రాక్షారామ, ఎన్నని చెప్పను. మహా స్మశానం కాశి. పేరు తలుచుకున్నంత మాత్రాన పుణ్యం కలుగుతుందంటారు. కాశీలో బంగారు అన్నపూర్ణా దేవి దర్శనం ధనత్రయోదశి మొదలు దీపావళి వరకు మూడురోజులే. దర్శనానికి బారులు కిలోమీటర్ల దూరం ఉంటుందిట. గంగ గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదులు. భరత దేశంలో పుట్టడం అదృష్టం ముఖ్యంగా ఆంధ్ర దేశంలో పుట్టడం ఇంకా అదృష్టం. గోదావరీ తీరాన పుట్టడం ఇక్కడ పెరగడం, ఈనేలలో కలిసిపోబోవడం ఎన్నో జన్మల సుకృతంగా తలుస్తాను. ఒక్క మాట చెప్పుకుందాము.

నేను పుట్టిన వూరు ప,గో.జి లో.గూటాల అఖండ గోదావరి ఒడ్డున వున్నది. కార్తీక పూర్ణిమ రోజు తెల్లవారక ముందేలేచి అనుకున్న కుటుంబాలు మొత్తం అందరూ గోదావరిలో సంకల్పం చెప్పుకుని స్నానంచేసి,ఉపవాసానికి సంకల్పం చెప్పుకుని, కూడా తెచ్చుకున్న పొడి బట్టలు ధరించి,పూజా ద్రవ్యాలతో అప్పటికే సిద్ధంచేసుకున్న నావలో ఎక్కి చల్లని గాలిలో గోదావరి మీద ఎదురు ప్రయాణం నెమ్మదిగా చేస్తూవుంటే,గోదావరి నీరు పడవని నెమ్మదిగ తప తప అని శబ్దం చేస్తూ తగులుతుంటే,భగవంతుని గురించి తపించమని అంటున్నట్లుంటె, సన్నటి మంచుపొర ప్రకృతిని కప్పేస్తే అది తెల్లటి కాన్వాసు మీద భగవంతుడు గీసిన చిత్రంలా కనబడుతూఉంటే, తెల్లటి సన్న చీర కట్టిన ప్రకృతి కాంత అందాలు దాచినట్లు దర్శన మిస్తే, నెమ్మదిగా వెలుగొస్తువుంటే మంచుపొర నెమ్మదిగా కరిగిపోతూవుంటే చూడాలి,  సూర్యోదయానికి భద్రకాళీ సమేత పట్టిసం వీరభద్ర స్వామి గుడి దగ్గర బంగారు రంగులోఇసుక తిప్ప చేరి, ఇసుకలో నడచి కొండ ఎక్కి, ముందుగా వినాయకుని దర్శించి, క్షేత్రపాలకుడు కోదండరామస్వామి, సీతాదేవిలను దర్శించి, తరవాత వీరభద్ర స్వామిని దర్శించి, భద్రకాళిని దర్శించి, స్వామికి దర్శనానంతరం అభిషేకం చేసుకుని సాయంత్రం దాకా అక్కడే వుండి,మధ్యాహ్నం కొద్దిగా ఫలహారం తీసుకుని,గోధూళి వేళ మళ్ళీదర్శనం చేసుకుని, తిరిగి వెన్నెలలో గోదావరి మీద ప్రయాణం పడవమీద. చల్లటిగాలి, నిశ్శబ్ద ప్రకృతి, వెనక మహాదేవుడున్నాడన్న నమ్మకం, గోదావరిలో పిల్ల పాపలతో తక్కువలో తక్కువ పదిహేనుమంది పడవలో శివ నామ స్మరణ చేస్తూ ఒక పక్క ఇసుకతిప్ప మనకూడా  వస్తూవుంటే, మరొక పక్క గట్టుమీద చెట్లు వెనకకి ప్రయాణం చేస్తూ వుంటే చంద్రోదయంచూస్తూ ఆవెన్నెలని ఆస్వాదిస్తూ, అమృతం తాగినంత ఆనందం అనుభవిస్తూ, వెన్నెల నీటి మీద పడివెండిలా మెరుస్తుంటే,వెలుగువెన్నెలలోతడిసి ఇంటికి చేరి వుపవాసంతో నిద్ర చేసి, ఉదయం లేచి స్నానంచేసి స్వామిని అర్చించి మధ్యాహ్నంకి ఉపవాస దీక్ష బంధు మిత్రులతో మృష్టాన్న భోజనంతో పూర్తి చేస్తే అలౌకికానందం. మరొక చిన్న ముచ్చట….

పెద్దబ్బాయి వుంటున్న పల్లెటూరు, వూరి మధ్య నాలుగు ఎకరాల చెరువు, చెరువు నిండా నీరు, పక్క శివాలయం, కార్తీక పూర్ణిమ రోజు వుదయం నుంచి స్వామికి అభిషేకాలు, సాయింత్రం చంద్ర దర్శనంతో ప్రారభమవుతుంది హడావుడి. చెరువుచుట్టూర బలమైన సర్వీ కర్రలు ఎనిమిదడులఎత్తువి ఎడం ఎడంగాపాతి వాటికి వెదురు కర్రలు  అడ్డంగా అడుగు ఎత్తు మొదలుకొని పైకి వరుసగా కట్టి, వాటిమీద ప్రమిదలు పెట్టి చంద్రోదయంతొ లక్షదీపాలు వూరివారందరూకలిసి వెలిగించితే దీపాలకాంతి నీటిలో ప్రతిఫలిస్తే, చంద్ర కాంతి తోడయితే అమృతం తాగినంత ఆనందం,ఆ అందం చూడాలి వర్ణించడం నా వల్ల కాదు. తదనంతరం వూరంతా శివుని,శక్తిని దర్శించి, తమకీ జన్మ ఇచ్చినందుకు కృతఙ్ఞత తెలుపుకుంటూ, మరుజన్మలేని వరం కోరుతూ, ఇంటికి చేరుతారు. ఎంత ఆనందం, ఎంత ఐకమత్యం. చూసితీరాలి. అనుభవించాలి.

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-కార్తీక మాసం.

 1. మీ టపాలో నాలుగవ పేరా నిజంగా అద్భుతం.
  ఇలాంటి అనుభూతులు స్వంతం చేసుకున్న మీరు అదృష్టవంతులు.
  దూరంగా ఉన్న మాకా అదృష్టం లేదు. కొంతమంది దగ్గరగా ఉన్నా కూడా అనుభవించరు.

 2. రసఙ్ఞగారు,
  పోస్టు పెరిగిపోతోతోందన్న భయంతో చాలా విషయాలు చెప్పలేదు. నాగుల చవితి వదిలేసాను.శివ కేశవులకు ప్రదక్షణాలు ప్రతి ఉపవాసంతో భోక్తకి పెట్టడం మన అచారమే. నేను వదిలేసిన విషయాలు మీరు చెప్పేరు. చాలా కృతఙ్ఞతలు.

 3. అత్యద్భుతంగా వర్ణించారు! గోదావరీ అందాలని తలుచుకుంటేనే గత స్మృతులన్నీ తడుముతాయి. భోక్తకి పెట్టి భుజించడం అన్నది కేవలం ఏకాదశికి ఎక్కువగా చేస్తున్నా అసలు మనం ఉపవాసం అంటూ ఉన్నామంటే మళ్ళీ ఏదయినా తీసుకునేముందు భోక్తకి పెట్టకుండా తినకూడదు అన్నది ఆచారం. ఇంకొక ముఖ్య విషయం ఈ క్షీరాబ్ధి ద్వాదశితోనే మన చాతుర్మాస్యాలు కూడా ముగుస్తాయి. సంధ్యా దీపం, ఉపవాసం, భక్తిలతో పాటు కార్తీక మాస స్నానం కూడా ముఖ్యమయినదే! ఈ సారి నేను ఆకాశ దీపాన్ని పెట్టలేకపోతున్నా మా ఊరి శివాలయంలో నేనే పూజ చేసి మరీ వెలిగించేదానిని! హ్మ్మ్! ఒక కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి పంచారామాలు చుట్టి సంధ్యా సమయానికి ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలా మంచిదట కూడా!

 4. శర్మ గారు,
  ఎంత అద్భుతమైన దృశ్యాలు చూపించేశారండి? ఇలా ఊహల్లో మెదిలిన దృశ్యాలే ఇంత మహానందాన్ని అందిస్తూంటే చూసిన మీరు ధన్యులు. కృతజ్ఞతలు.
  వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో సాధారణంగా వ్యాఖ్య పెట్టటానికి సంకోచిస్తాను. కానీ ఈ రోజు చదివిన మీ వ్యాసం వల్ల రాయకుండా ఉండలేకపోయాను. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s