శర్మ కాలక్షేపం కబుర్లు- అన్నంవారు

అన్నంవారు.
చేబియ్యంవారు, నూకలవారు అన్నదమ్ములు ఎప్పుడు కలిసే వుంటారు.  అన్నంవారికి ఉప్పువారికి పడదు.  ఉప్పువారు  ఎవరితోనైనా  కలిసివస్తే మాత్రం  ఒప్పుకుంటారట. పప్పువారు,ఉప్పువారు మంచి స్నేహితులు ఒకరినివిడిచి ఒకరు వుండలేరు.  నేతి వారు నూని వారు అన్నదమ్ములు కాని వీరెప్పుడు కలిసివుండరు.  కందివారు, పప్పువారు,ముద్దపప్పువారికి అన్నంవారితొ  వియ్యం  వుంది.  కందికట్టువారు,ముద్దపప్పు, పప్పువారికంటే బలవంతులుట. కాని ఎవరూ గుర్తించరట అది వారి బాధ.  అన్నంవారికి అందరితోనూ వియ్యమే మరి.  వీరు ఎవరో  ఒకరిని  తెచ్చుకుని  కలుపుకోనిదే  కదలరుట.  తరవాత  వచ్చేవారు  వంకాయలవారు. వీరికి అల్లంవారు ఉప్పువారు,నూనివారు,కారంవారు స్నేహితులు.  వీరంతా కలిసి అన్నంవారి మీద దండయాత్ర చేస్తారుట.  కాని అన్నంవారితో కలిసిపోగానే వీరు వారు చెప్పినట్లే వింటారుట.  చామర్తివారిది ఒంటెత్తుగుణం.  ఎవరితోనూ కలవరు ఒక్క ఉప్పువారు,కారంవారు,అన్నంవారితో తప్పించి.  వీరికి మాత్రం నూనివారు మంచి స్నేహితులుట.  కందావారిదంతా గాలివాటు.  ఎలావీలుకుదిరితే అలా కలిసిపోతారట.  కాని కారంవారు,నూని వారు,ఉప్పువారి స్నేహం మాత్రం వదలరట.  చామకూరవారు,తోటకూరవారు, పచ్చిపులుసువారికి పప్పువారు,ఉప్పువారు ,మిరియంవారు వేరువేరుగా స్నేహితులట.  వీరు మాత్రం ఎప్పుడు కలవరట.  మామిడివారిదంతా ప్రత్యేకంట వీరికి ఉప్పువారు, కారంవారు మంచి స్నేహితులట. నూనివారు లేకపోతే వీరికి గడవదట. వీరికి అన్నంవారితో,పప్పువారితో నిత్యం నెయ్యమేనట.  ఇంగువవారు  వంకాయలవారితో, కందావారితో కలుస్తారట కాని బహుతక్కువట. వీరు ఎవరితోనైనా కలిసి అన్నంవారి దగ్గరకెళ్తారట.  ఒక్కరూ వెళితే ఎవరూ వీరిని వాసన చూడటానికి కూడా ఇష్టపడరట.  ఇంక చల్లావారిదంతా అలస్యమే ఎప్పుడూ ఆఖరికి వస్తారట.  అందరూ వెళ్ళిపోయిన తరవాత రావడం వీరి అలవాటట.  మిగిలివున్నవన్ని పట్టుకు పోతారట. శొంఠివారు,వీరు అల్లంవారి కుటుంబం వారేనట కాని వీరిని అంతా ప్రత్యేకంగా చూడటం మూలంగా వీరికి టెక్కు ఎక్కువట. వీరు వస్తే ముందు వచ్చేస్తారట. వీరికి ఉప్పువారు నేతివారు మాత్రమే స్నేహితులు. అన్నంవారితో  కలుస్తారట కాని మొహమాటం ఎక్కువట.  వీరికి ఇంగువవారికి కొన్ని పోలికలున్నాయంటారు మరి.  శొంఠివారిది వైద్యమట వీరు అందరి రోగాలు తగ్గిస్తారట. వీరందరికి, జలంవారు అగ్నిహోత్రంవారు లేకపోతే అస్సలు కుదరదట.

మన ఆంధ్రదేశంలో వున్న ఇంటిపేర్లతో చిన్న మాటవరుస. ఇందులో ఎవరినీ కించపరచాలని కాని ఎగతాళి చెయ్యాలనికాని లేని బంధుత్వాలు కల్పించి ఇబ్బంది పెట్టేనని అనుకుంటే క్షమార్హుణ్ణి.  మిరియమే మనదేశ పంట.  మిర్చి మదేశానికి వలసవచ్చి ఇక్కడ సామ్రాజ్యం విస్తరించుకుందిట.  అందుకూ మన ఇళ్ళపేర్లలో మిర్చికి స్థానం లేదు. విదేశాలవారిని ఆకర్షించినవి, మిరియం, ధనియం,లవంగాలు, దాల్చిన చెక్క,గసగసాలు వగైరా. ఇవ్వంటే అందులోనూ భారతదేశపు పంటలంటే పశ్చిమ దేశాలవారికి మక్కువ ఎక్కువ. పడిచస్తారు ఇప్పటికీ.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- అన్నంవారు

  1. ఆ మిర్చీ వారిని వదిలి పెట్టకుండా, మన రేడియో మిర్చీ వారు ఇంటి పేరు పెట్టేసుకున్నారు కదండీ!

  2. ఏమిటో ఇది తమాషాగా బాగుంది అనుకున్నాను మాష్టారూ..ఇవన్నీ ఇంటి పేర్లా? చాలా బాగా చెప్పారండీ. వారు వీరితో కలుస్తారు, వీరు వారితో కలుస్తారు అంటుంటే నిజమే కద అని అనుకుంటూ పోయాను. కొన్ని combinations ఎంతో ఇష్టమైనవి కూడా. మొత్తానికి చాలా బాగుందండీ.

వ్యాఖ్యలను మూసివేసారు.