శర్మ కాలక్షేపం కబుర్లు- బ్లాగు కష్టాలు-3

బ్లాగు కష్టాలు-3

బ్లాగు ఓపెన్ చేసి లింకేసీ దాకా చెప్పేను కదా!! రాస్తున్నాను, ఎవరు చూస్తున్నారో, చదువుతున్నారో తెలీదు. సరే రాద్దాం అని కొనసాగించాను. మొదటి కామెంటు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారిది తరవాత శ్రీఫణిబాబుగారు కామెంటేరు.  వారికి సమాధానం ఇవ్వాలికదా, కొత్త, దానికితోడు ఏదోచేస్తే ఏదో అయింది.  కామెంట్లకి జవాబులివ్వలేక బ్లాగులో ఆ విషయం చెప్పుకుని క్షమాపణ చెప్పుకున్నాను.   అందరి బ్లాగుల్లో చూస్తున్నాను  ఏవో ఏవో కనపడుతున్నాయి.  కనీసం అవసరమైనవి కూడా పెట్టుకోలేనా అనిపించింది.  ఏమేనా చేద్దామంటె కరంటుగోలొకటి,  పగలంతా ఉండదు.  రాత్రిపూట ఓపికగా కూర్చోగలది లేదు. మర్నాటి పోస్టు రాసుకోవాలికదా! చాలా కాలం వదిలేసాను.  ఒక రోజు చూస్తే సెప్టెంబరు నెల అని వచ్చింది.  సరి ఈ వేళ పోస్టు మానేసి ఇది చూద్దామని కూచున్నాను.  కష్టపడి ప్రతి చర్యకి  ప్రతిచర్య చూసుకుంటూ మొత్తానికి సాధించి విడ్గెట్స్ పెట్టేను.  ఇక మిగిలినవి చేయదలుచుకోలేదు.  అందంకాదుకదా ముఖ్యం.  నిన్న పోస్టేస్తూ  వుంటే సగం  టైటిలు వొక్కటే వచ్చింది.  మొత్తం పోస్ట్ తీసేద్దామనుకుంటే తెలియలేదు.  తరవాత కుస్తీ పట్టేననుకోండి.( చేతకాని తనం కప్పి పుచ్చుకోవడం కాదూ! అందమైన ముసుగు..)

ఒక రోజు రాత్రి నిద్ర పట్టక దొర్లుతూంటే శ్రీమతి అడిగింది, ఏమయిందీ అని.     నిద్ర పట్టలేదన్నాను.    ” బలవంతుడు పైనెత్తిన బలహీనుడు,ధనము     గోలుపడినయతడు,మ్రుచ్చిల వేచువాడు, గామాకులచిత్తుడు నిద్రలేక కుందుదురధిపా!”, భారతంలో పద్యం చెప్పింది….. ఇందులో మీ పాత్రఏంటీ అని… అమ్మో ప్రమాదం లో చిక్కుకున్నామనుకుని..ఏమీ లేదు కొద్దిగా దురద అన్నాను.  మాటాడితే నాకిద్దరమ్మలు అని డచ్చీలు కొడతారు. ఒకమ్మ పద్నాలుగేళ్ళు పెంచి మరో అమ్మకిచ్చింది. ఆ అమ్మమిమ్మలిని మరో ఆరేళ్ళు పెంచి నాకంటకట్టింది. ఏభయి ఏళ్ళనించి చూస్తున్నా మీ సంగతి నాకు తెలీదా? తల్లి పుట్టింటి గురించి మేనమాకి చెప్పినట్లు అంది. ఏమిరా ఈ వేళ ఇలా దొరికి పోయననుకుంటు వుంటె దురదన్నారు, ఎక్కడా అని పెద్ద లైటు వేసి వొళ్ళంతా చూసింది. ఎక్కడా ఏమీలేదే గోకిన సూచన లేదు. దద్దురులేదు. దానిదగ్గరకూచుని ( కంప్యూటర్) మీరేమిచేస్తున్నారో నాకు తెలీదు. అల్లపురసమిస్తాను తాగి పడుకోండి, రేపు డాక్టరు దగ్గరకెళదామంది, ఒక గ్లాసు అల్లపురసం బలవంతంగా నా గొంతులో పోసి. పడుకో మంది. సరే ఎప్పటికో నిద్ర పట్టింది.మర్నాడు ఉదయమే మనవరాలు కాలేజికి వెళ్ళిన తరవాత డాక్టర్ దగ్గరకెళ్ళేము. నా నెంబర్ నాలుగు, ఖాళీ గానే వుందారోజు నా అదృష్టం కొద్దీ.  డాక్టరుగారు నా స్నేహితుడే! చూడగానే రండి ఏమిటి సంగతి అన్నారు. నేను చెప్పేలోగా నా శ్రీమతి ఈయన కంప్యూటర్ దగ్గరకూచుని ఈ మధ్య గంటలకొద్దీ ఏమిచేస్తున్నారో తెలియదు. నిన్న రాత్రి దురదన్నారు. అల్లపు రసమిచ్చేను. వొంటి మీద గోకిన సూచనలు లేవు, గోకడంలేదు, కాని దురదంటున్నారు, ఎక్కడో చెప్పలేరట, ఇది వ్యాధి లక్షణం అనిచెప్పింది.  సరే ఇలా రండని పక్కన వున్న బెంచి మీద పడుకోమని చూసి.  దానిదగ్గరేమిటి చేస్తున్నారని అడిగేరు. ఏమీలేదండి! బ్లాగు రాస్తున్నానన్నాను.  అదా! సరే అంతేనా మరేమైన చూస్తున్నారా అన్నారు.  అబ్బే! మీరు పొరపడుతున్నారన్నాను.  నేనేమైన చిన్న కుర్రాడినా అటువంటివి చూడడానికి అన్నాను.  దానికాయన దీనికి వయసుతో సంబంధం లేదు.  నిజం చెప్పాలంటే వయసు జారి పోయిన వారే ఇటువంటివి చూస్తారన్నారు.  కారణం మీకు నేను చెప్పక్కరలేదనుకుంటాను అన్నారు. కరంటు పగలు వుండని మూలంగా రాత్రులు కూచుంటున్నాను తప్పించి అదేమీ కాదని చెప్పుకునేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది. బయటకొచ్చిన తరవాత ఏమీ లేదండి అంతా బాగానే వుంది.  అయితే ఒక చిన్న లోపం ఏమంటే ఈయనకి ఒక కొత్త వ్యాధి వచ్చింది. దానిని మాడెం అడిక్షన్ అంటారు.. దాని లక్షణాలే ఇవి. కంగారు పడద్దు. కల్ల వాపువస్తుంది తెలుసుకదా! అల్లాంటిదే ఇదీను. పట్నవాసం వాళ్ళకి కాని పల్లెటూరివాళ్ళకి ఇదిరాదు.  వైద్యం చేస్తే తగ్గుతుంది, చేయకపోయిన తగ్గుతుంది. వచ్చిన వెంటనే ఉధృతం వుంటుందికదా.  కొద్దిరోజులొదిలేయండి అన్నారు. బ్లాగు పేరేమిటి వివరాలు తీసుకున్నారు. రెండు రోజుల తరవాత రండి అని మందులు రాసిచ్చారు.

రెండు రోజుల తర్వాత మళ్ళీ డాక్టరుగారి దగ్గరకెళ్ళడానికి చీటి రాయించుకోడానికి వెళ్ళి పేరు చెప్పగానే, అతను మీరు రండి! మీరు రాగానే తీసుకొచ్చెయ్యమన్నారు డాక్టరు గారని తీసుకెళ్ళిపోయాడు. వెనకనే వెళ్ళేము. డాక్టరుగారు రండి రండి అంటూ, ఎలావున్నారన్నారు. మందులేసుకున్నాను, బాగోలేనుఅన్నాను.  డాక్టరుగారు! మీదగ్గరనుంచి ఇంటికివెళుతుంటే తేగలవాడెదురొచ్చాడు, ఇంటి మలుపులో.   బాబయ్యా! తేగలు తీసుకోరా అంటే బాబూ పళ్ళుళెవురా !తిందామంటె అన్నారు. వాడు పట్టువదలని విక్రమార్కుడిలా బుర్రగుంజు తీసుకోండన్నాడు. ఈయనని వద్దంటూవుంటె కొని తినేసారు. సాయంత్రం కి దగ్గు,రొంప జ్వరం వచ్చేసాయి అంది. సరే తగ్గిపోతుందని గబగబా రెండు ఇంజెక్షన్లు చేసి కూచోబెట్టి, శర్మగారు మీ బ్లాగు బాగుంది, నిన్న రాత్రి  కూచుని చదివేను మొత్తం అన్నారు.  మీరు కబుర్లు చెబుతారని తెలుసుగాని ఇంత బాగా చెప్పగలరని తెలీదు సుమండి, అన్నీ చదివేను బాగున్నాయన్నారు. రాయండి, అని,రాత్రులు మేలుకోకండి ఆరోగ్యం పాడవుతుంది అన్నారు. నా శ్రీమతి తో పరవాలేదమ్మా! ఈయన దురద తగ్గుతుంది అన్నారు. సరే ఇంటి కొచ్చి ఫలహారం చేసి నిద్ర పోయాను. మరునాడు ఉదయం లేచాను. రొంప జ్వరం దగ్గు, దురద అన్నీ పోయాయి. మా ఆవిడ డాక్టరు గారికి ఫొన్ చేసి చెప్పింది. డాక్టరుగారు ఈయన దురదకి కారణం తెలిసింది. ఈయన రాసినదెవరూ బాగుందనట్లులేదు. నిన్న మీరు బాగుందన్న  తరవాత ఈ రోగం  తగ్గిందన్నమాట అంది.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- బ్లాగు కష్టాలు-3

 1. @@@
  చిరంజీవి రవికి,
  ఇది పది మందికి అంటిచితే కాని తగ్గదుట. నీతర్వాత ఒక్కరే వచ్చారు. పదోవాళ్ళు తక్కువయ్యారయ్యా.!

 2. @@@
  జ్యోతిర్మయిగారికి
  ధన్యవాదాలు,గుర్తున్నావు తల్లీ! ఇది అందరికివచ్చేదేనా! నాకే వచ్చిందేమోనని భయపడ్డానమ్మా!

 3. కష్టే దురదాయాం విముక్తీ ,
  టపా లిఖితం
  లలాట లిఖితం
  కామెంట్ కర్మాణా
  దురదాయ విమోచనం
  అని దురద గీత లో
  దురదేశ్వరుడు చెప్పిన సంగతి ఇక్క గుర్తు చస్తున్నాను సుమండీ

 4. మీ బ్లాగులో మొన్న శీకాయాకు గురించి అడిగాను గుర్తున్నానా బాబాయిగారూ..మీరు పెద్దవారు మిమ్మల్ని పేరు పెట్టి పెలవలేను. అన్యదా భావించకండి. ఈ బ్లాగు పెట్టిన మొదట్లో నాకూ ఇలాగే ఉండేది. ఇప్పుడు కొంచెం సర్దుకుంది లెండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s