శర్మ కాలక్షేపం కబుర్లు-ఆశాజీవులు

ఆశాజీవులు

ఈ మధ్య చలి మూలంగా, ఒంట్లో బాగోని మూలంగా ఉదయం నడక అటకఎక్కేసింది. మా సత్తిబాబు నేనేమైపోయానో అని చూడటానికి వచ్చాడు. ఏమిటి  విశేషాలన్నాను. కరంటు
వుదయం నుంచి నిరఘాటంగా కన్ను కూడా మలపకుండా ఉంది చూసారా అన్నాడు.. ఏమిటి వింతా అని ఆశ్చర్యపోయేలోగా తెలిసిందేమంటే పక్కఊరు మంత్రిగారొచ్చారట. అబ్బ! బావుందే మంత్రిగారు వూళ్ళొ రోజూ వుంటే ఎంతబాగుంటుందీ అనుకున్నాము.మా పక్క వూరికి మాకూ ఒక లైను మీద కరంటు అందుకు మాకూ వుంది.  అసలు మంత్రిగారి రాకకి కారణం ఏమీ! అని ఆరా తీస్తే తేలిందేమంటే, పది సంవత్సరాల ఇళ్ళ పట్టాల చరిత్ర చెప్పుకొవాలి మరి. అన్ని వూళ్ళలోనూ ఇందిరమ్మ ఇళ్ళు కట్టించేరు కొద్దోగొప్పో.  కాని ఈవూళ్ళో ఏమీ కట్టలేదు, కారణం  2004 ఎన్నికల ముందు అప్పటి ఎమ్.ఎల్.ఎ గారు ఒక ప్రదేశంలో ఇళ్ళు కట్టించేందుకుగాను ఒక కార్యక్రమం చేపట్టి కొంతమందికి పట్టాలిచ్చారు, ఇంటి స్థలాలికి. ఎలక్షనులయిపోయాయి. ఆయన వోడిపోయారు. తరవాత వచ్చిన వారు అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ 2008  లో మళ్ళీ  2009 ఎలెక్షన్ల ముందు  2002  లో ఇచ్చిన వారి పట్టాలు రద్దుచేసి మళ్ళి 2008 లో పట్టాలిచ్చారు. భూమి అదే. సరే మళ్ళీ ఎలెక్షనులయిపోయాయి.  ఈసారి రెండవసారి ఎన్నికైన పార్టివారి మరొక అభ్యర్ధి ఎన్నికయ్యారు. ఈయన కూడా అదే భూమిని ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చారు. ఇళ్ళు మాత్రం ఎవరూ కట్టించలేదు. పధకం ఇందిరమ్మది కాదనుకుంటాను. అదీ సంగతి. విశేషం ఏమంటే ఈ ఎమ్.ఎల్.ఎ గారు అధికార పక్షంలో ప్రతిపక్షం తాలూకు ఎమ్.ఎల్.ఎ. వీరిమీద ఆ పార్టీ మరొకరిని ఇంచార్జిగా నియమించడంచేత ఇప్పుడు అధికార కేంద్రాలు అసలు ఎమ్.ఎల్.ఎ మరియు అధికార పక్షపార్టీ నియమించిన వ్యక్తి, ఎం.అర్.ఓ. ఇందులో అన్నీ గొడవలే. యస్.సి, యస్.టి లకి ఇవ్వలేదని వారు, బడుగు బలహీన వర్గాలవారికివ్వలేదని మరొకరు. అగ్రవర్ణ పేదలకివ్వలేదని మరొకరు ఇలా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తూనే వున్నారు. చివరికి నిన్న మంత్రిగారు కొద్ది మంది యస్.సి, యస్.టి లకి మాత్రం పట్టాలిచ్చి సమస్యని ఇంకా మురగబెట్టె వుంచారు. నిన్న రాత్రి గొడవ పడ్డారట అందుచేత ఇచ్చిన పట్టాలన్నీ మళ్ళీ రద్దు చేసారు. పాపం ఈ పట్టాలు పుచ్చుకున్నవారికి ఆశ చావలేదు. 2014  ముందు ఈ పని పూర్తి అయ్యే సూచనలు లేవు. పని పూర్తి కాదు కూడా. కారణం. కొంత మందికిస్తే మరికొంతమంది గొడవ చేస్తారు మరి. అందుకు ఎవరికీ ఇళ్ళుకట్టకుండా పట్టాలిచ్చి అవసరాన్ని బట్టి పట్టాలు రద్దు, మళ్ళీ ఇవ్వడం చేసుకుంటూ పోతే, ఈ పని మరొక పదేళ్ళు పైన కాలక్షేపం కాదూ. చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతే కాలక్షేపం చేసేందుకు మరొక పనీ వుండద్దూ. బహుశః ఈ విషయంలో మా మిత్రుల పోలసీని అధికార పక్షం వారు తీసుకున్నారో లేక అధికార పక్షపోలసీని మా మిత్రులు తీసుకున్నారో మాత్రం తెలియలేదు.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-ఆశాజీవులు

  1. హమ్మయ్య, ఫర్లేదండీ, మీకు 2014 దాక ‘electrifying’ మంత్రుల visit లు assured అన్న మాట ! మీరెంత ధన్య జీవులండీ, మా వూళ్ళో ఈ మంత్రుల రాక ఎప్పుడో మరి ?

వ్యాఖ్యలను మూసివేసారు.