శర్మ కాలక్షేపం కబుర్లు-వైరాగ్యం

వైరాగ్యం.

స్థూలంగా వైరాగ్యం అంటే ఏవిషయం మీద ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం. ఇది సంసారం కావచ్చు. డబ్బు కావచ్చు ఐహిక మైన ఏదేని కావచ్చు. సాధారణ మానవులకు ఇది కొద్దిగా అందుబాటులో లేనిదే. ఐతే మన జీవితంలో అప్పుడపుడు ఏదో ఒక వైరాగ్యం మనల్ని పలకరించి కొద్ది రోజులు సందడి చేయడం చూస్తూ వుంటాము. వీటినే పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని మనవాళ్ళు సరదాగా చెప్పేరు.
ఇందులో మూడవదైన ప్రసూతి వైరాగ్యం మనలని జీవితంలో మొదట పలకరిస్తుంది, యవ్వనంలో.  పెళ్ళి తరవాత బిడ్డలు కావాలనుకోవడం,  కలగకపోతే దేవుళ్ళకి మొక్కడం మనకి కొత్త కాదు. స్త్రీ తన ప్రాణం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ప్రసవ సమయంలో కలిగే బాధకి స్త్రీ ,పురుషులిద్దరు  తప్పు చేసినవారిలా భావించి ఇక ముందు సంసారమే చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు.  తల్లీ బిడ్డా క్షేమంగా వుంటారు.  మూడవనెల గడుస్తుంది.  బిడ్డ ఉక్కా ఉంగా అంటూ వుంటుంది.  ఆ తల్లి తండ్రులకు గాంధర్వ గానం విన్నంత ఆనందం కలుగుతుంది.  బిడ్డకి ఐదవనెల వస్తుంది తాత, అత్త  అంటూ వుంటుంది. బిడ్డ తల్లి తన భర్తకి ఫోన్ చేసి బిడ్డ నాన్న అంటున్నాడు మీరు రాలేదు, చూడలేదు అంటుంది. ఖాళీ లేక రాలేకపోయానోయ్!. డాక్టరేమన్నారు, అంటాడు.  డాక్టరుగారు, నేను బాగానే వున్నాననిఅన్నారు అంటుంది భార్య.  సరే వీలు చూసుకుని వస్తాను, లేక నువ్వొచ్చెయ్యకూడదా అంటాడు. మంచి చూసి పంపించమని మీరు అడగాలి కదా మా వాళ్ళని అంటుంది.  ఆరోజు సాయంత్రానికే పెళ్ళాం ముందు వుంటాడు.  బిడ్డని చూడటానికి వచ్చేనంటాడు.  కధ మామూలే. నిర్ణయం అటకెక్కేసింది. అందుకే మనవాళ్ళు దీన్ని ప్రసూతి వైరాగ్యం అన్నారు.

తరవాతి కాలంలో మనని పలకరించేది శ్మశాన వైరాగ్యం. నలభై వయసు దాటిన తరవాత ఏదో ఒక కారణానికి శ్మశానానికి వెళ్ళవలసి వస్తుంది. అపుడు, కొద్దికాలం జీవితం మీద ఒక రకపు విరక్తి భావం ఏర్పడుతుంది. కాలం గడిచినకొద్దీ ఇది మరుగున పడిపోతుంది. అందుకే దీన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు.
మూడవది పురాణ వైరాగ్యం. ఇది సాధారణంగా వయసు జారిన తరవాత వచ్చేదే. పురాణానికి వెళితే సాధారణంగా జీవితం నీటి బుడగలాటిదని, జీవించిఉన్నపుడె మంచి పనులు చేసి మన సంచి సద్దుకోవాలని,  చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెబుతారు.  తప్పు దారిని పడద్దు,  శేష జీవితం భగవంతుని ధ్యాన, అనుష్టానాలలో గడపమంటారు.  ఇప్పటిదాకా దేవుడున్నాడా? అనే అలోచనలో గడిపేశాము, సమయం ఎంతవుందో తెలియదు. గుళ్ళూ గోపురాలూ తిరిగొద్దామంటే శరీరం సహకరించదు.  ఎంతో కొంత కష్టపడి కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగొచ్చిన తరవాత,  ఏ కోడలో దుబారా ఖర్చు చేస్తోందని భార్య చెబుతుంది.  ఇద్దరి వైరాగ్యం గాలికి ఎగిరిపోతుంది.

ఈ మధ్య మా వీధిలో ఒకతను ఇంట్లో వాళ్ళమీద కోపగించి, చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.  వెళ్ళేటపుడు తన బీరువా తాళాలు అన్నీ పట్టుకుని మరీ వెళ్ళేడు!. ఇంట్లో వాళ్ళు అతని కోసం వెతుక్కున్నారు, అందరి బంధువుల ఇళ్ళ దగ్గరా అడిగేరు. ఎక్కడికీ రాలేదంటే, పోలీసులకి చెబితే వివరాలన్నీ విన్న యస్.ఐ నా ప్రయత్నం చేస్తాను, మీరు మీప్రయత్నం చేయండని చెబుతూ,  ఆశ్రమాలున్న వూళ్ళ పోలిస్ స్టేషన్లకి విషయం, వివరం చెప్పి సదరు వ్యక్తి ఆచూకి తెలుపమన్నాడు. ఒక గంటలో ఒక వూరినుంచి, అక్కడ, ఈ వ్యక్తి వున్నట్లు తెలిసింది. మరునాడు వుదయం వీళ్ళు, తగువుకు కారణమైనవారిని తీసుకుని పోయి అక్కడ స్వామి గారి, కోపగించిపోయిన వ్యక్తి కాళ్ళ మీద పడేసి తప్పువొప్పించారు. స్వామిగారు నాయనా! నీ తలపండింది కాని తలపు పండలేదు! తలపు పండేకా వద్దువుగాని అని చెప్పగా, ఇంటికి బలవంతం మీద తీసుకొచ్చారు. ఈయన ఇంటికి తిరిగొచ్చిన తరవాత కూడా ఆస్థిపాస్థులు పంపకాలేసేసి కాశీ పోతానని కొద్దిరోజులు, వీలునామా రాస్తానని కొద్ది రోజులు , నా దగ్గరకొచ్చి నా బుర్ర తిని తరవాత ఆ విషయమే మరిచి సంపాదనలో, సొమ్ము కూడపెట్టడం లో ములిగిపోయాడు. విచిత్రమేమంటే వైరాగ్యం కాషాయం కట్టుకున్నంతలో, ఆశ్రమాలలో చేరినంతలో రాదు. తలలు బోడులైన తలపులు బోడులా! …. రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా… కుమారీ! నిన్న నీకిచ్చిన చెక్కు, ప్రామిసరీ నోటు మీ ఆయనకిచ్చి చెక్కు బాంకులో వేసి ఈ వేళ కేష్ ని క్రెడిట్ చేయించమని బేంకులో చెప్పమని చెప్పు. ఆ నోటు పట్టుకెళ్ళి సుబ్బారావు దగ్గర రెండు లక్షలు అసలు, వడ్డీ ఇస్తాడు తెమ్మను. వీడసలే బద్దకం మనిషి. జాగ్రత్తగా లెక్కెట్టి తెమ్మని చెప్పు…… మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయికా… ఇలా సాగుతోంది మన పూజ. సంసారంలో వుండి కూడా వైరాగ్యం అవలంబించవచ్చునని తెలుసుకోరు, ఆచరించరు. అందుకే వైరాగ్యం అంటే చులకనైపోయింది.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-వైరాగ్యం

  1. హహహ బాగుందండీ మీ విశ్లేషణ కానీ నాకు మాత్రం చిన్నప్పటినుండీ పురాణ వైరాగ్యం ఎక్కువే. ఇహ స్మశాన వైరాగ్యం క్రొత్తగా రావడానికేం లేదు ఎందుకంటే మా స్కూల్ పక్కనే స్మశానం ఎన్నో విషయాలు స్వయంగా చూసి మరీ తెలుసుకున్నాను. కనుక నా విషయంలో రివర్స్ గేర్ అనమాట! మిగిలింది ఆ మూడవ వైరాగ్యమే! అన్నట్టు రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారోంకుశోజ్వలా అని వ్రాశారు ఇక్కడ క్రోధాకారాంకుశోజ్వలా అని సవరించ ప్రార్ధన!

వ్యాఖ్యలను మూసివేసారు.