లింగార్చన
శనివారం రాత్రి అన్నయ్యగారి పెద్దబ్బాయి కొడుకు, బుల్లికోడలు వూళ్ళో పిలపులకి బయలుదేరారు, సంప్రదాయబద్ధంగా. ఎవరెవరిని పిలిచిరావాలన్నదాని గురించి తాతగారిని అడగడానికి వచ్చేడు. ఫలనా ఫలానావారిని పిలవని చెబుతూ ఏమని పిలుస్తావనిఅడిగేడు మనవడిని. మా ఇంట్లో రేపు వుదయం సత్యనారాయణ వ్రతం, తదుపరి లింగార్చన, అశీర్వచనానికి, తాంబూలానికి, రాత్రి లింగార్చన తరువాత భోజనానికి అని పిలుస్తానన్నాడు. బుల్లి కోడలు ఆడవాళ్ళని పిలవడానికి కూడా వెళ్ళింది. వాళ్ళు పిలపకానికి వెళ్ళేరు. మనం మన సంస్కృతి ముందుకు సాగదేమో నేటి కాలంలో అనుకుంటున్నాము. అది తప్పు మనమూడవతరం మన నుంచి ఈ సంస్కృతీ సాంప్రదాయాలు తీసుకుంది మనం భయపడక్కరలేదన్నాను.అంతేనంటావా అన్నాడు అన్నయ్య.
దశమి ఆదివారం ఉదయమే లేచి అఖండగోదావరీ స్నానం సంకల్పం చెప్పుకుని, భార్యా భర్తలిద్దరమూ ఒక సారి స్నానం చేశాము. క్షేత్ర దర్శనం చేసినపుడు భార్యా భర్తలిద్దరూ ఒక సారి నదిలో స్నానం చేయాలట. దీనిని మనవాళ్ళు సరిగంగ స్నానం అంటారు. చలి బాధించింది కాని స్నానం చేయాలనే సంకల్పం ముందు తలవంచింది. అనారోగ్యం చేస్తుందేమోనని, వద్దని అభ్యంతరపేట్టేరు కాని వినలేదు. అనారోగ్యం భరించడానికే సిద్ధపడ్డాను తప్పించి అఖండ గోదావరీ స్నానం వదులుకోలేకపోయాను. నిత్య కార్యక్రమాలుచేసుకుని ఇంటికి చేరాము. అన్నగారి ముగ్గురు కొడుకులు కోడళ్ళు మా కోసం ఎదురు చూస్తున్నారు. ముగ్గురు దంపతులూ పెద్దవాడైన తండ్రికి బట్టలు పెట్టి ఆశీర్వచనం పొందేరు, ఈసందర్భంగా మా వదిన కాలంచేసినందుకు నేను మన్సులోనే విచారించాను. తరవాత మా దంపతులకు నూతన వస్త్ర సత్కారం చేసి అశీర్వచనం పొందేరు. ముందు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. తరవాత లింగార్చన ప్రారంభమైనది. లింగార్చనకు గాను పుట్టమట్టి తెచ్చి దానిని నీటితో తడిపి అప్పడాలపిండిలా ముద్ద చేసి దానినుంచి చిన్న చిన్న గోళీలలాగా చేసి వాటికి ఒక బియ్యపు గింజ పైన అంటించి పెడతారు. ఇలా తయారు చేసినవాటిని శివలింగా కారంలో అమిర్చి పైన ఆవరణ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ఎత్తు బల్ల మీద పెడతారు. సాధారణంగా శివాభిషేకం గుడిలో చేస్తాము. కాని లింగార్చన ఇంటిదగ్గర చేసుకోవచ్చు. ఋత్వికులు లింగార్చన మొదలుపెట్టి ప్రాణప్రతిష్ట చేసి రౌద్రికరణం తరవాత నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం స్వామికి, విభూతి, ఆవుపాలు, అవునెయ్యి, తేని, ఇక్షురసం అనగా చెరుకురసం, పంచదార,ఫలరసాలు, వట్టివేళ్ళు తడిపిన జలం,సుగంధ ద్రవ్యం, వీటితో పాటుగా శుద్ధజలం ప్రతీ అభిషేకంతరవాత చేస్తూ, చివరగా శుద్ధజలంతో అభిషేకించి, నూతన వస్త్రం సమర్పించి, స్వామికి అలంకారం చేస్తూ, అమ్మవారిని లలితా సహస్రనామాలతో కుంకుమతో పూజచేసి,స్వామికి అమ్మకు ఆరగింపు చేసి, ఇద్దరిని అలంకరించి వారు కొలువుతీరిన సభలో పాల్గొనడం, చూడటం, అనుభవించడం, జన్మకు చేసుకున్న పుణ్యంగా భావించాను. ఒక అవృత్తిలో అభిషేకం చేసాను.
పార్వతీ శంకరులు కొలువుతీరిన ఆ సభలో నాలుగువేదాలనుంచి నాలుగు పనసలు చెప్పేరు. ఆ సందర్భంగా నిరుడు జరిగిన ఒక విశేషం నిన్నచెప్పేను. ఈ సంవత్సరం అన్నయ్యగారి రెండవ కొడుకు కూతురు పన్నెండు సంవత్సరాల మనవరాలు నృత్యం చేసింది. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇదివరలో ఇచ్చివుంది. చాలా ఆనందం కలిగింది. మరొక మనవరాలు మూడవ అబ్బాయి కూతురు సంగీతం నేర్చుకుంటున్నది, ఒక పాట చాలా అద్భుతంగా పాడింది. పెద్ద మనవరాలు మంత్రపుష్పం చెప్పి, మంగళహారతి పాడింది. ఒక కవిత చెప్పేరొకరు. నేనేమీ చేయలేను కాని కబుర్లు చెప్పగలను కదా, అదిచేస్తున్నాను. స్వామివారు కొలువు చాలించేసరికి రాత్రి ఏడు గంటలు దాటింది. అప్పుడు నిన్న సాయంత్రం పిలిచిన వారంతా భోజనానికి రాగా పంక్తులుగా విస్తర్లు వేసి, వడ్డన కార్యక్రం నలుగురు యువకులు ముగ్గురు యువతులు నిర్వహించారు. వంటకు వంట బ్రాహ్మణుని పెట్టేరు, నలభీమపాకం తో వూరివారు, బంధుమిత్రులతో మృష్టాన భోజనం తాంబూల చర్వణంతో ,ఋత్వికులకు , ఘన సత్కారంతోకార్య క్రమం సంపూర్తి అయినది.
అప్పుడు రాత్రికి రాత్రి రెండవ అబ్బాయి వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళేడు భార్య పిల్లలతో, వెళుతుండగా అప్పుడడిగాను, నా అనుమానం. అబ్బయీ! చాలా చాలా సంతోషం కలిగింది ఈకార్యక్రమంలో పాల్గొన్నందుకు, కాని ఇంత కష్టం ,ఖర్చుతో ఇది ఎందుకు చేస్తున్నారుఅన్నాను. బాబయ్యా! ఇది అమ్మ కోరిక. ఆమె బతికివుండగా ఇది చేయలేకపోయాము. ఆమె గతించిన తరవాత ఇప్పటికి ఇది ఐదవసారి చేయడం. కష్టం, ఖర్చు అనుకోటం లేదన్నాడు. నేను నా వెకిలితనం బయట పెట్టుకున్నందుకు సిగ్గు పడ్డాను.
@@@
అమ్మాయ్! రసఙ్ఞా!
చాలా సంతోషంగా వుంది.
ఎంతో అద్భుతమయిన భావన కలుగుతోంది! మీరివన్నీ ఇలా చెప్తుంటే ఆ రోజు కార్యక్రమాలన్నీ నా కళ్ళ ముందు కదులుతున్నాయి! నేను కూడా ఇక్కడ ఏమీ దొరకని దేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను కాని కార్తీక బహుళ ఏకాదశి నాడు చేసుకున్నాను. సంతోషం చాలా ఆనందంగా ఉంది!
@@@
బుజ్జికి
భగవదారాధన చేయడం, ఆదృష్టి కలిగివుండటం పూర్వ జన్మసుకృతం. అలాగే కొన సాగిద్దాం.
Babayya, we are immensely happy to read your article on ‘Lingarchana’. Let us continue this programme with God’s grace. Bujji.