శర్మ కాలక్షేపం కబుర్లు-మార్గశిర మాసం

మార్గశిరమాసం.

రెండు రోజులలో మార్గశిరమాసం అనగా మృగశిరా నక్షత్రం తో కూడిన పూర్ణిమ కలది, కనక మార్గ శిరమాసం ప్రవేశిస్తోంది. దీనినే మార్గశీర్షమాసం అని కూడా అంటారు.చలి ప్రారంభంఅయ్యేకాలం. హరికి ఇష్టమైన మాసం. హరిపదం చేరడానికి మొదటగా చెప్పే మాసమనికూడా అంటారు. అనగా ఉపాసనకాలంలో ఉత్తమమైనదిగా చెబుతారు. శ్రీకృష్ణభగవానుడు గీతలో ఉత్తమమైనవి అనగా, “పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము,మాసములలో మార్గశిరమాసము, వేదములలో సామవేదము నేనే” అని చెబుతాడు. హరిని సేవించడం ఈ మాసం ముఖ్య లక్షణం.

సాధరణం గా పల్లెలలో నెల పట్టడం అంటారు. అది ఈనెలలోనే జరుగుతుంది. నెల పట్టడం, సూర్యుడు ధనూరాశిలో ప్రవేశం చేసే రోజును ధనుస్సంక్రమణ పుణ్యకాలంగా చెబుతారు. ఆ రోజునే నెలపట్టేరోజు అంటారు. సరిగా ఆ రోజుకు నెలరోజుల తరువాత మకర సంక్రమణం రోజు వస్తుంది. ఈ మకర సంక్రమణాన్నే మనం పెద్దపండుగ లేక పెద్దల పండుగ గా పిలుస్తాము, ఇది పుష్య మాసంలో వస్తుంది.. ఈ పండుగ వొకటె తారీకుల ప్రకారం వస్తుంది, కారణం ఇది సూర్య మానం ప్రకారంగా వచ్చే పండుగ కనుక. మిగిలిన అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకారంగా చేసుకోవడం మన అలవాటు. మన ప్రాంతంలో చాంద్రమానం పాటిస్తాము. దీనికి కారణం చెప్పలేను. తెలియదుకూడా. సాధరణంగా ఈ సంక్రమణం జనవరి పద్నాలుగో తారీకున వస్తుంది కాని అప్పుడప్పుడిది పదిహేనుకు జరుగుతుంది. ఈ సంవత్సరం ధనుస్సంక్రమణం డిశంబరు పదిహేను, మకర సంక్రమణం జనవరి పదిహేనున వచ్చేయి. మార్గశిర మాసం మొదటి రోజు మొదలు విష్ణాలయాలు సందడిగా వుంటాయి. గోదాదేవి విష్ణువును
ఈనెలలో రోజుకొక పాసురంతో సేవించుకుంటుంది, ధనుస్సంక్రమణం తో ప్రారంభించి. ఆ అవకాశం పురస్కరించుకుని మనం కూడా శ్రీ హరిని చేరడానికి గోదాదేవి చెప్పిన పాసురాలను రోజుకొకటి చొప్పున నెలంతా పారాయణ చేస్తాము. ధనుస్సంక్రమణం రోజు వుదయమే సమారాధన వుండేది. నేను ఒక సారి మాత్రమే పాల్గొన్నట్లు గుర్తు. ఆ రోజు సూర్యోదయానికి ముందే సమారాధన జరిగిపోవాలి… వివరాలు గుర్తులేవు.

చిన్న తనంలో చదువుకునేరోజులలో బడి గుడి తప్పించి మరొకటి తెలియదు. ఈ నెలలో ఉదయమే లేచి సూర్యోదయాత్పూర్వం అఖండ గోదావరిలో స్నానంచేసి విభూతి పెండి కట్లు పెట్టుకుని మా వూరిలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి పరుగుపెట్టేవాళ్ళం. శివ కేశవులకు భేదం లేదనే విషయం చిన్నప్పటి నుంచి ఉండేది. ఉదయం స్వామి బాలభోగం చేసి ప్రసాదంగా సుండలు అనగా పొగిచిన శనగలుకాని, ఒక్కొక రోజు దద్ధోజనం, మరొక రోజు చక్కెర పొంగలి ప్రసాదం పెట్టేవారు. ఏడు గంటలకి ప్రసాదం తినేసి దేవునికి దణ్ణంపెట్టేసుకుని, చదువుకోడానికి వెళ్ళేవాళ్ళం. పరీక్షలు దగ్గరపడే కాలం కనక ఈ అలవాటు ముందుకు కొనసాగి తెల్లవారుగట్ల లేవడం, చదువుకోవడం అలవాటయింది. ఈ నెలలో గుడిలో కాలక్షేప మండపం దగ్గరవున్న పొగడ, పారిజాతం వృక్షాలు పూచేవి. వృక్షాలన్నానెందుకంటే అవి చాలా పెద్దవి వయసున్నవి కనక. పొగడ పూలు రాలినవి పోగుచేసుకుని జేబులో పోసుకుని వాసన పీలుస్తూవుంటే మత్తు కలిగినట్లు వుండేది.. పారిజాతాలు చాలా సుకుమారాలు, కొద్ది సమయానికే వాడిపోయేవి. పోగుచేసిన ఎక్కువ సేపు వుండేవి కావు. కాని బలే సువాసన వుండేది. ఇప్పుడు పొగడ, పారిజాతాలే కనపడటంలేదు. గుడిలో కాలక్షేప మండపాలని ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం ఊరి పెద్దలంతా అక్కడికి చేరేవారు. కాలక్షేప మండపాలుఅని వీటిని ఎత్తుగా విశాలంగా నిర్మించేవారు. ఉత్తిరోజులలో కాలక్షేపానికి ఉపయోగపడినా కళ్యాణాలకి బాగా ఉపయోగపడేవి, అసలు కాలక్షేప మండపాల ఉపయోగమే కనపడటం లేదు. ఆరోజులలో సాయంత్రం పూట ఒకరు భారతమో, భాగవతమో, రామాయణమో తెచ్చి చదవగా మిగిలిన పెద్దలంతా కాలక్షేప మండపంలొ కూచుని విని సాయంత్రం దైవదర్శనం గోధూళివేళ చేసుకుని ఇంటికి చేరేవారు. ఇప్పుడా అలవాట్లూ పోయాయి, మండపాలు బాగుచేయక చాలా చోట్ల కూలిపోయాయి. కాలంతో పాటు మార్పులు తప్పవుకదా!

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-మార్గశిర మాసం

 1. @@@
  చి.రవికి,
  నాకు చాలా చాలా ఆనందంగా వుంది. నేను నీచేత తెలుగులో రాయించడానికి ప్రయత్నించి సఫలమైనందుకు. నేనూ నీలాగే పరాయి భాషపట్టుకుని చాలాకాలం వేళ్ళాడిన వాడినే. ప్రస్తుతం నా మాట, రాతలలో సాధ్యమైనంత వరకు పర భాషాపదాల్ని వాడను. గుర్తించివుంటావు. దీనిని కొన సాగించు. నేను రెండవ టపా కోసం పండగ ముందుకు ఉంచుకున్న సమాచారం చెప్పేశావు. నేను ప్రస్తుతానికి మార్గశిరం గురించి మాత్రమే చెప్పేను. మార్గశిరం పుష్యం కలిసిపోతాయి. అదీ సంగతి. మరోటపాలో. ధన్యవాదాలు

 2. ముఖ్యంగా చెప్పాలంటే, పిల్లలకి శెలవులు ఇచ్హే సమయం. ఆల్లుళ్ళూ, కూతుళ్ళు, మనవలు, సరె-కొడుకులు, కోడళ్ళు తప్పదు కద…పగటి వేషగాళ్ళూ, హరిదాసు కీర్తనలు, ఆవు పెదకొసమ్ వెదకాలి, కళ్ళాపు చల్లాలి, ముగ్గులు, ముగ్గుల పొటీలు, ఆవు పిడకలు, భొగి మంటలు, నిత్యమ్ తిరుప్పావై, మన గుడిలో గోదా కల్యాణమ్, పల్లకి వూరెరిగింపు, ఇవ్వన్ని కలిసి చేసే పనులు. బావున్ది బాబయ్యా,,, ముఖ్యంగా, వూరంతా తిప్పావ్.
  ..ravi

 3. @@@
  శ్రీవాసుకిగారు,
  ధన్యవాదాలు.
  @@@
  అబ్బాయ్!
  ఇంకాకొన్ని మరిచిపోయా! బాగా గుర్తుచేసావు.
  @@@
  అమ్మాయ్!
  నేనుకొన్ని కొన్ని మరిచిపోయాను. మరో టపాకి నన్ను తయారు చేసారు.

 4. ధనుర్మాసం నాకెంతో ఇష్టమయిన మాసం. ప్రొద్దున్నే గోదా దేవి పాసురాలతో తిరుప్పావై, పోటా పోటీగా ఇళ్ళ ముందు పెట్టుకునే ముగ్గులు, మధ్యాహ్నం చక్కగా కీర్తనలు చేసుకుంటూ వచ్చే హరిదాసు, సాయంకాలం మా ఊరిలో ఆడపిల్లలందరం కలిసి పెట్టుకునే గొబ్బిళ్ళు ఈ నెలంతా మాకసలు తీరికే దొరకదు. ప్రొద్దున్నే ఆవుపేడ కోసం ఆవు కన్నా ముందే నిద్ర లేచి మరీ కూర్చోవడం. ఆహా ఒక అందమయిన, ఆహ్లాదకరమయిన అనుభూతి.

వ్యాఖ్యలను మూసివేసారు.