శర్మ కాలక్షేపం కబుర్లు -అమెరికా పౌరుడు బుజ్జిపండు

అమెరికా పౌరుడు బుజ్జి పండు

శర్కరి గారి బ్లాగులో బుజ్జి పండుకి తల్లి చెప్పిన తెలుగు కధ చదివిన తరవాత రాయాలనిపించిది. జ్యొతిర్మయిగారికి కృతఙ్ఞతలు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తీరాన వున్న నార్త్ కరోలినా రాష్ట్రంలో ఒక పట్టణంలో ఐదవ అంతస్థులోని ఒక ఫ్లాట్లో అమెరికా పౌరుడు బుజ్జి పండుగారికి భారతీయ/అమెరికా పౌరురాలైన తల్లి తెలుగు కథ, అనగా భారతీయ సంస్కృతిని కధ రూపంలో చెప్పడానికి, ఆరాట పడుతోంది, కష్టపడుతోంది, ఇష్టంగా. రాజుగారి ఏడుగురు కొడుకులూ వేట, చేపలు పట్టడం కూడా చేపలవేట అంటారని.  మేతకి తిండికి మధ్య తేడా చెప్పడానికి. పాపం ఆ దేశభాషలో జంతువుతినడానికి, మనిషి తినడానికి ఒకటే మాట మరి. ఆ తల్లి బుజ్జి పండుకి అమెరికా సంస్కృతితో పాటు భారత సంస్కృతికూడా తెలియాలని, తన భాష మరిచిపోకూడదని  ఆరాటం. హర్షించతగినదే, కాదు తల్లి ప్రయత్నం చాలా గొప్పది. తన మూలాలని మరిచిపోకుండా వుండటానికి చేసే ప్రయత్నం. ఆ తల్లికి తెలుసు తన భారతీయ మూలాలు. వాటిలో వున్న స్వాంతన, గొప్పతనం. బతుకులో డబ్బు ఎంత అవసరమో భారత జీవన విధాన పరిచయం కూడా అంత అవసరమని తలచిందా తల్లి. అందుకే బుజ్జి పండుకి తెలుగు కథ చెప్పింది,చెబుతుంది ఇక ముందు కూడా!! వాడి అనుమానాలు తీర్చుతూ. ఆ తల్లి ప్రయత్నం సఫలమవుతుందని నా నమ్మకం. కాదు ధృడ విశ్వాసం. కంటా కింటే అనే ఒక ఆఫ్రికా దేశీయుడు బలవంతంగా, బానిసగా, అమెరికా దేశం తీసుకు రాబడతాడు, అతను కొద్ది మాటలు తన తరవాత తరం వారికి చేరవేయ గలుగుతాడు. ఆ మాటలు ఆధారంగా అతని జన్మస్థలాన్ని అతని తరవాత ఏడవతరం వాడు పన్నెండు సంవత్సరాలు కష్టపడి, చాలా రికార్డులుచూసి గుర్తుపడతాడు. ఆదేశం వెళతాడు. ఆవూరు వెళ్తాడు. ఈ సందర్భంగా ఆఫ్రొ అమెరికన్ అలెక్స్ హాలీ వ్రాసిన “రూట్స్” అనే పుస్తకాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మీరందరూ ఆ పుస్తకం చదివి వుంటారు. బానిసలను తయారు చేసిన దేశం అది. బానిసత్వం నిర్మూలించామని గొప్ప చెప్పుకుంటున్న దేశం. నేడు అన్నిదేశాలనించి తెలివైనవాళ్ళని అవకాశాలు అన్నపేరుతో ఎత్తుకుపోతున్న దేశం. పౌరసత్వం పేరుతో తనలో కలిపేసుకుంటున్న దేశం. అన్ని ఇజాలూ చచ్చిపోయాయి, చాలా తక్కువ కాలం లోనే. కాని ఇన్నివేల సంవత్సరాలయి,ఇన్ని ఆటు పోట్లకి తట్టుకుని నిలిచి వున్నది, ప్రపంచ ప్రజలకి భవిషత్తు భారత జీవన విధానం లో మాత్రమే సాధ్యం, అనే విషయాని ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచంలో తెలివైన వాళ్ళందరిని అమెరికా దేశం తీసుకుపోయి తమ దేశ పౌరులను చేసుకుంటూ వుంది. భారత దేశం చాలా మందిని ఇక్కడ సావకాశాలివ్వక, పంపేస్తోది, వదిలించుకుంటూ వుంది, వదలుకుంది. ఎవరేనా గొప్పవారని బయట దేశాలు గుర్తిస్తే ఆయన మావాడే అని జబ్బలు చరుచుకుని చెబుతుంది.

భారత దేశంలో తెలుగు రాష్ట్రం లో ఒక మారుమూల పల్లెలో ఒక తల్లి తన బిడ్డకి తనకి వచ్చిన ఇంగ్లీషు అక్షరాలు చెబుతోంది. ఈమెది బతుకు సమరం, బిడ్డ నేటి పోటీ ప్రపంచంలో బతకడానికి తయారు చేసే ఆరాటం. ఐతే ఇది కూటికి సంబంధించిన సమరం. అక్కడ సమరం భావానికి సంబంధించినది, ఇది భాగ్యానికి సంబంధించినది.. ఇద్దరి బాధలలో తేడా వున్నా ఆరాట, పోరాటాలు మాత్రం ఇద్దరికీ ఒకటే.     “గివ్ మి గుడ్ మదర్స్ ఆండ్ ఇ విల్ గివ్ యు ఎ గుడ్ నేషన్” అంటాడు నెపోలియన్.  ఇటువంటి తల్లులున్నదేశాలు ఎందుకు బాగోవు?

అమెరికా పౌరుడు బుజ్జి పండుగారికి భరత దేశంలో ఏమైనా తేడా వస్తే అమెరికా ప్రభుత్వం కలగచేసుకుంటుంది. అవసరమనుకుంటే ఆ తల్లి మీద కూడా చర్య తీసుకోడానికి వెనకాడదు. స్వతంత్ర భారత దేశంలోని తల్లికి, బిడ్డకి కావలసినంత స్వేఛ్ఛ, కాని అన్నివిధాల రక్షణే కరువు, ఈదేశంలో వున్నా పరాయిదేశములో వున్నా!, భారత ప్రభుత్వం తరఫునుంచి!. ఇదీ భారత ప్రభుత్వ గొప్పతనం.  ఏంటో నా మన్సులో ఆవేదన సరిగా చెప్పలేకపోయాననుకుంటా!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు -అమెరికా పౌరుడు బుజ్జిపండు

  1. @
    జ్యోతిర్మయి,
    నేను మొదట రాశా. దానిమీద జిలేబిగారు బుజ్జి పండు చదువు మొదలెట్టారు.
    ధన్యవాదాలు.

  2. బాబాయి గారూ..బుజ్జిపండు చెప్పిన కథ గురించి మీరు కూడా వ్రాశారా! ఇప్పుడే చూస్తున్నాను. నవంబర్ లో థాంక్స్ గివింగ్ టైం లో ఓ వారం బ్లాగులు చూడలేదు, అప్పుడు మిస్ అయ్యంటాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.