శర్మ కాలక్షేపం కబుర్లు- సొల్లు కబుర్లు

చొల్లు కబుర్లు

ఉదయం నడక లేదుకదా! సత్తిబాబుని కలవడం కుదరటం లేదు. పాపం సత్తిబాబే నన్ను చూడటానికొచ్చాడు. పంతులుగారు ఏటి సంగతులన్నాడు. ఎక్కడికీ కదలటం లేదు సత్తిబాబూ!  మొన్న నొక రోజు మాత్రం లింగార్చనకని ఊరెళ్ళాను.  ఎక్కడికీ కదలలేకపోతున్నానయ్యా అన్నాను. పోన్లెండి ఈ చలికాలం బయట తిరిగి అరోగ్యం పాడు చేసుకోకండి. నేనే వచ్చి చూసిపోతుంటానన్నాడు. విశేషాలేమైనా చెప్పు అన్నాను. మొన్ననోపాలి ఎవురోగాని మీరేటొ రాస్తనారని అన్నారు ఏటదీ!  అన్నాడు.  ఏం చెప్పాలో అర్ధం కాలేదు, చెప్పాలికదా సమాధానం, ప్రశ్నకి.  అది అతనికి అర్దం కావాలి, అబద్దం కాకూడదు, అబద్ధం  చెబుతున్నామేమో అనే అనుమానం రాకూడదు. కొద్ది సేపు వూరుకున్నాను. సత్తిబాబూ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాటిని ఏమంటారన్నాను. అతను వెంటనే ఊసుపోక కబుర్లన్నాడు. ఇంకా అన్నాను. కాలక్షేపం కబుర్లు, ఊకదంపుడు కబుర్లు, కబుర్లు కాకరకాయలు, సుత్తి కబుర్లు, సొల్లు కబుర్లు అన్నాడు. నేనేమో సొల్లు కబుర్లంటాను మీరేమో చొల్లు కబుర్లంటారు. ఏది నిజం అన్నాడు. రెండూ నిజమే, చొల్లు కబుర్లన్నా, సొల్లు కబుర్లన్నా ఒకటే అర్ధంబాబూ అన్నా!. నిజంగా అవే రాస్తున్నానన్నాను. ఎందుకండి. ఎవరు సదువుతారండి అన్నాడు. నాకేదో పెద్ద తెలిసినట్లు, అందరూ చదువుతారు, చాలా దూర దేశాలలో వున్న తెలుగువాళ్ళకి, మరొక తెలుగు వాళ్ళు కనపడరు మాట్లాడదామంటె, ముఖ్యంగా వాళ్ళు ఇవి చదువుకుని ఇక్కడ వున్నట్లు మన్తో మాట్లాడ్తున్నట్లు భావించుకుంటారన్నాను. ఎటకారమాడతన్నారన్నాడు. కాదయ్యా నిజమే చెబుతున్నా! అన్నాను. మన పాత కాలపోళ్ళు ఏంజేసీ వోరన్నాడు. నిన్ననే చెప్పేను మళ్ళీ చెబుతాను, వాళ్ళకి ఖాళి సమయం తక్కువగా వుండేది. ఆహార సంపాదన, పచనంచేయడంలో కాలం గడిచిపోయేది, స్త్రీ పురుషులకి. సాయంత్రం గుడిలో కాలక్షేప మండపం దగ్గర చేరి రామాయణ,భారత, భాగవతాల్లో ఒక ఘట్టం చదివించుకుని వినేవారు. ఇప్పుడో పని తక్కువ ఖాళీ ఎక్కువ. ఆనాడు ఇన్ని ప్రచార సాధనాలు లేవు. కరంటులేదు. రేడియోనే లేదు. ఈ వేళపేపరు రేపు వచ్చేది టపాలో. ఊళ్ళో పేపరు చదివేవాళ్ళు, ఒకళ్ళో ఇద్దరో వుండేవారు. మరి నేడో కావలసినన్ని సాధనాలు. రేడియోని నేను, నా పదో యేట విన్నాను. అప్పుడు వినోద సాధనాలు హరి కధ,బుర్ర కధ, పురాణం రోజూ,తరవాత రోజుల్లో తోలుబొమ్మలాట, నాటకాలు,రాత్రి పది నుంచి తెల్లవారుగట్ల నాలుగు గంటలదాకా సాగేవి. తరవాత సినిమా వచ్చి ఆ పై అన్నిటిని ముంచేసింది. మనం రోజుకి మూడాటలు సినిమా చూసేవాళ్ళం కాదా!పని కట్టుకుని పట్నం పోయి. తెల్లవారుగట్ల ఏ నాలుగు గంటలకో కొంపకి చేరే వాళ్ళం గుర్తులేదా! ఆ తరవాత టి.వి వచ్చింది. ఇల్లు కదలక్కరలేకుండా కావలసినంత వినోదం పడక గదిలోకే వచ్చేసింది. కాలు బయట పెట్టే అవసరం పోయింది. మనుషుల్లో సిగ్గు పోయింది. దేహాభిమానం పోయింది. తరవాత ఇంటర్నెట్టొచ్చింది. అబ్బో దీనితో చెప్పక్కరలేదు. రెండంచుల పదునైన కత్తి. ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. నేనిలా అంటుండగా మా శ్రీమతి టీ తెచ్చింది. ఏటి చెల్లెమ్మా అన్నాడు. ఏం లేదన్నాయ్యా అంది! దానికి సత్తిబాబు బావగారేదో రాస్తన్నారంటే పలకరించిపోదామని…. అన్నాడు. అదేలే దీని దగ్గర కూచుని గంటలు గడిపేస్తున్నారు. రామాయణం, భారతం, భాగవతం చదివేవారు, ఒకో ఘట్టం, మేము పని చేసుకుంటూ వుంటే, మా వెనకనే తిరుగుతూ వర్ణించి చెప్పేవారు. అది పోయింది, మాటలేదు, పలుకులేదు, కరంటువాడి పుణ్యమా, అని,  ఆ ఎనిమిది గంటలూ మిగతా పనులు చేస్తున్నారు! నేనేమీ అనటం లేదు. ఎందుకంటే మనం వద్దంటే అదిమరికొంచం పెరిగిపోతుంది. పుణ్యంలేదు, పురుషార్ధంలేదు.  ఇది పట్నవాసపు వాళ్ళ వ్యాసంగం.  వూరుకుంటే కొద్దికాలానికి మొహం మొత్తి మానేస్తారంది.  అదెలా అన్నాడు! మీ బావగారి సంగతి నాకు తెలీదా! ఒకప్పుడు వారంకి, పని కట్టుకుని పట్నం పోయి మూడు సినిమాలు చూసొచ్చి, పగలంతా పడుకుని నిద్ర పోయేవారు.  ఇప్పుడో సినిమా అంటే అంతెత్తున లేస్తున్నారు. ఈయన సినిమా చూసి నలభయి ఏళ్ళయింది తెలుసా అంది. ఇదీ అంతే. కొంచం ఓపికపట్టాలంది.  ఆవిడ గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలా అనిపించింది.  నేను ఆలోచనలో పడ్డాను.  “అతిపరిచయాదవఙ్ఞతా” అన్నారు పెద్దలు.  నిజమా!  చేస్తున్నది పొరపాటా? ఏమో కాలమే చెప్పాలి.

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- సొల్లు కబుర్లు

  • @మహేష్ నాయుడు గారు,
   స్వాగతం. బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలో రాసినది, ఇప్పుడు చదివి కామెంట్ పెట్టినందుకు సంతసం.
   ధన్యవాదాలు.

 1. @
  హేమా మురళిగారు
  ధన్యవాదాలు
  @
  జిలేబిగారు,
  ధన్యవాదాలు.
  @
  బులుసు సుబ్రహ్మణ్యంగాఉ,
  ధన్యవాదాలు.
  @
  చి.రవి.
  ధన్యవాదాలు. నీవు మొదలుపెట్టవచ్చును.

 2. బాబయ్యా, నీకు ఎప్పుడు కుదరదు అనుకున్తె అప్పుడు చెప్పు. nee సలహలు స్వీకరించి నేను ఆ లెగసీ ని కొనసాగిస్తాను. నాకు తెలిసిన నాలుగు ముక్కలు కూడా చెప్పే అవకాశం వస్తుంది.

 3. అలవాట్లు మానవచ్చు. వ్యసనం ఓ పట్టాన వదల లేము.ఇదో వ్యసనం. ఎవరికీ హాని కలిగించనిది. అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నలు వస్తాయి. మన సంతృప్తికి, మన ఆనందానికి, కాలక్షేపానికి మనం వ్రాసుకు పోవడమే. ఓ పదిమంది చదివినా సంతోషమే, ఎవరూ చదవక పోయినా మనకేమి నష్టం లేదు. కొనసాగించండి మరో ఆలోచన లేకుండా . …. దహా (దరహాసం)

 4. “అతిపరిచయాదవఙ్ఞతా”-

  శర్మ గారు, డైలీ బ్లాగ్గింగ్ వల్ల వచ్చు వైరాగ్యం ఇది. దీనిని బ్లాగ్ కాలములో ఒక ఫేస్ లో వచ్చు డైలీ వైరాగ్యం అందురు. కాన మీరు చింత పడవలదు. దీనికి పైనను ఇంకా వెరైటీ ఐన వైరాగ్యములు కాలము తెలుపును. ఓపిక పట్టి ముందుకు సాగుడు. ! ఆల ది బెష్టు ! జిలేబి కి ఇదెలా తెలుసంటారా ? ! — పురాణీ దేవి యువతిహి !

  చీర్స్
  జిలేబి.

 5. ayyo ala anukokandi…meeru ala anukuni maaneste ela andi. memandaramu emaipovali. mee posts chaduvutunte ma amma , nannagarito matladutunnate untundi. please maneyyakandi.

వ్యాఖ్యలను మూసివేసారు.