శర్మ కాలక్షేపం కబుర్లు-పెళ్ళిలో ఎదురు సన్నాహం.

పెళ్ళి ఎదురు సన్నాహం.

మొన్ననొక రోజు ఒక పెళ్ళిలో జరిగిన ఎదురు సన్నాహం లో జరిగిన విషయం గురించి ఒకరు సందేహం అడిగితే చెప్పేను. అది పోస్టుగా ఇద్దామని ….

పెళ్ళిలో ఎదురు సన్నాహం, ఎదుర్కోలు, తోటల్లో దిగటం ఇల్లా రక రకాల పేర్లతో ఈ ఎదురు సన్నాహం అనబడేది ప్రస్తుత కాలంలో వ్యవహరింపబడుతోంది. నిజానికి ఇది స్వాగత సన్నాహం ఎదురుసన్నాహంకాదు, ఎదురువెళ్ళే సన్నాహం. ఎదురువెళ్ళి స్వాగతం చెప్పేందుకు ఆడపెళ్ళివారి ప్రయత్నం. ఎదురువెళ్ళే సన్నాహం/ప్రయత్నం కాస్తా ఎదురు సన్నాహం అయి కూచుంది.  పాత రోజులలో వివాహాలు సాధారణంగా దగ్గర దగ్గర వూరి వారి మధ్య జరిగేవి. ఈ నాటిలాగా అమ్మాయి న్యూయార్కులోనూ అబ్బాయి అడిలైడులోనూ ఉండే వారుకాదు. ఆనాటి ప్రయాణ సాధనం రెండెడ్ల బండి. పగలు తప్పించి రాత్రి ప్రయాణం స్త్రీలు, పిల్లలతో చేసేవారు కాదు. మన సంప్రదాయంలో పెళ్ళికూతురింటికి పెళ్ళికొడుకు వివాహానికి వెళతాడు. నేటికీ కొన్ని కులాలలో అనగా రాజరిక కులాలలో పెళ్ళికుమార్తె పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళి పెళ్ళి చేసుకుని వస్తూంది.

మనం చెప్పుకునేది మగపెళ్ళివారు ఆడపెళ్ళివారింటికి వెళ్ళే సందర్భం. మగ పెళ్ళివారికి స్వాగతం పలకడానికి ఆడపెళ్ళి వారు, బంధు మిత్ర సపరివారంగా వారి వూరి చివరికి మేళ తాళాలతో  వచ్చి మొగపెళ్ళివారికి స్వాగతం చెప్పి వారిని దగ్గరలోని తోటలో దింపి, సేద తీరడానికి, వారికి బెల్లం పానకం ఇచ్చేవారు. కోనసీమలో తోటలెక్కువ కనక అక్కడ తాత్కాలిక విడిది చేయాడాన్ని తోటలో దిగడం అనికూడా నేటికీ వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వివాహాలు వేసవికాలంలో జరుగుతాయి. మగపెళ్ళివారు ఇంటి దగ్గరనుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి బడలి వుంటారు కనక, వారికి ఉత్సాహం, తక్షణ శక్తి ఇవ్వడానికి బెల్లం పానకం ఇచ్చేవారు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఇరుపక్షాల వారూ వారి వారి బంధువులను ఇరుపక్కలా పరిచయాలు చేసుకునేవారు. ఆ సందర్భంలోనే సెంటురాయడం, గంధం పూయడం వగైరాలు చోటు చేసుకున్నాయి. తరవాత తరవాత మగపెళ్ళివారు కూడా ఆడపెళ్ళివారికి పానకం ఇచ్చే సంప్రదాయం ఏర్పడింది,గౌరవసూచకంగా.  ఈ సందర్భంగా రెండు బిందిలలో పానకం తెచ్చేవారు ఆడపెళ్ళివారు. అవి కొత్త బిందెలు ఇత్తడి బిందెలయి వుండేవి.  కాలంతో పాటు మార్పులొచ్చి ఇత్తడి బిందెల స్థానాన్ని స్టీలు బిందెలు, కలిగినవారు వెండి బిందెలు తేవడం వాడుకగా మారింది. ఈ బిందెలు ఆ కార్యక్రమం తరవాత  ఆడపడుచుకు ఇచ్చేవారు.  ఆ తరవాత మేళ తాళాలతో వారిని తీసుకువచ్చి విడిదిలో దింపేవారు. ఇక్కడితో మొదటి ఘట్టం స్వాగతం ముగిసేది.

నేటికాలంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇన్ డోర్ లో. తంతులు మామూలేకాని ఇప్పుడు ఇరుపక్షాలవారూ ఒకరిగొప్ప మరివొకరికి, ప్రదర్శనకి ఇది వుపయోగిస్తూవుంది.

ప్రకటనలు