శర్మ కాలక్షేపం కబుర్లు- శివలింగ ప్రతిష్ట

శివలింగ ప్రతిష్ట

విశాఖ జిల్లాలో అనకాపల్లి దగ్గర అదొక పల్లెటూరు. అందరూ శ్రామికులే. ఊరిపక్కగా ఒక ఏరు. దానిపక్క కొద్ది దూరంలో ఒక గృహస్తు ఇల్లుకట్టుకుంటూ వుంటే ఒక రోజు కలిపిన సిమెంటు మిగిలిపోతే కుర్రాడు దగ్గరగా పోగుచేసి పైన మూత పెట్టి వెళ్ళేడు.  మరుసటి రోజు ఆపైన వరసగా పని చేయకపోవడంతో ఎవరూ దానికేసి చూడలేదు.  నాలుగు రోజుల తరవాత సిమెంటు మీద కప్పినది ఎగిరిపోవడంతో ఉదయమే స్నానానికి వచ్చిన ఒకరికి ఆ సిమెంటు కుప్ప శివలింగంలా కనపడితే నీళ్ళు పోసాడు.  ఇది మరి కాస్త బిగిసిపోయింది.  మరి రెండురోజులుకి పనిలో కొచ్చినకుర్రాడికి అక్కడ సిమెంటు కుప్ప బదులు శివలింగం కనపడింది పూజలందుకుంటూ.  ఏం చేయలో తోచక అది అక్కడే వదిలేసి మరొక చోట సిమెంటు కలుపుకున్నాడు.  స్నానం చేసిన ఆడమొగ అందరూ ఒక చెంబుడు నీళ్ళు శివలింగం మీద పోసిపోవడం అలవాటయింది.  ఒక రోజు ఒకతను తను వెళుతున్న పని సానుకూలంగా కావాలని స్వామికి మొక్కి ఆయనపై నమ్మకముంచి వెళ్ళేడు. పని జరిగింది. నమ్మకం పెరిగింది.  అతను ఆ శివలింగానికి చుట్టూ నాలుగు పిల్లరులేసి ఒక ఆఛ్ఛాదన కల్పించాడు. ఒక గుడి తయారయింది.  రెండేళ్ళు గడిచింది. వూరివారికి స్వామిమీద నమ్మకం పెరిగింది. ఇక్కడొక శివలింగం పెట్టుకుంటే అనే అలోచన వచ్చింది.  వూళ్ళో రిటయిర్ద్ మాస్టార్ని శివలింగం తెప్పించమన్నారు.  అదీ అలాగ ఆ విషయం నా దగ్గరకొచ్చింది.  అది మా చిన్న కోడలు పుట్టింటి వారి ఊరు, ఆమాస్టారు మా వియ్యంకుడు.

ఏంచేయాలో తెలీదు. శివలింగం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అన్నిటికీ ఆయనే వున్నాడని, ఆయనకే ఒక నమస్కారం పెట్టి నెట్టడవిలో పడ్డాను.  చాలా చాలా చూసాను.  ఏదీ కుదరలేదు.  ఒక చోట ఉందికాని అదెక్కడుందో చూస్తే, అడ్రసు అమెరికాలో కనపడింది.  ఆ! ఇది కుదరదని మళ్ళీ మొదలెట్టేను.  బెంగుళూరులో ఒక కంపెనీ దొరికితే మెయిలిచ్చేను. అతను వెంటనే స్పందించి కొలతలిస్తే తయారు చేయిస్తానన్నాడు.  కాలం ,కొలత లేని వాడికి నేను కొలతలివ్వాలా/ సరే ప్రయత్నం చేసాను.  అది కంపెనీ ఆతనికి అర్ధంకాలేదు. చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.  ఇంత వోపికగా అతను నాతో వ్యవహరించడం నాకు ఆనందం వేసింది. ఇది పని కాదని ఒక ఫొటొ పంపి ఇలా వుండాలి నాకు కొలతలు తెలియవు, ఎంతవుతుందో చెప్పు పంపుతాను, నాకు మాత్రం లింగం కావాలన్నాను.  అతను లెక్కలేసుకుని ఇంతవుతుందని చెప్పేడు. సరే వూరువాళ్ళకి చెప్పేను. వాళ్ళు మాట్లాడలేదు. కంపెనీ అతను ఆ ఖర్చులో సగం తను పెట్టుకుంటానన్నాడని చెప్పేను. మిగిలినది కొరియరు ఖర్చులు నేను పెట్టుకుంటానని చెప్పేను.  ఊరివాళ్ళు మాట్లాడలేదు.  కంపెనీ అతను ఏమయ్యా మాట్లాడవన్నాడు.  నేనిరుక్కుపోయాను.శివ లింగం నేనే కొనుక్కుని దాచుకునీది కాదుకదా మరి.!  మొత్తం మీద మాకు వద్దని చెప్పేరు.  ఏంచేయాలో తెలియక అదే కంపెనీ అతనికి చెప్పేను.  ఊరుకున్నాము. ఆరు నెలలు గడిచాయి.  ఒక రోజు మళ్ళీ లింగం కావాలన్నారు.  ఇదేమిటీ! ఇదివరకు ఊరకే ఇస్తాము పెట్టుకోమమంటే వద్దన్నారనుకుని మళ్ళీ పాత ఉత్తరాలు వెతికి మళ్ళీ కంపెనీ అతనికి గుర్తుచేసి నాకు లింగం కావాలి. డబ్బులెంతో చెప్పు,నీకు మిగతా విషయాలతో సంబంధం లేదన్నాను.  దానికతను, తను పాత మాట మీద నిలబడుతున్నాను, మీరు ఇంతపంపండి అన్నాడు.  నాదో కోరిక అన్నాడు. చెప్పమన్నాను.  లింగం ప్రతిష్ట చేసిన ఫోటోలు కావాలన్నాడు.  తప్పనిసరిగా పంపుతానన్నాను.  దాతగా నీపేరు రాయిస్తానన్నాను.  వద్దు ఒక అఙ్ఞాత భక్తుడని రాయించమన్నాడు.  సరే నన్నాను. డబ్బు ఆరోజే పంపేను.  కొద్ది రోజుల తరవాతడిగితే ఆగ్రాలో చేయిస్తున్నాను.  అవగానే చెబుతానన్నాడు.  ఆశ్వయుజంలో మొదలయిందిది. కార్తీకం లో అయ్యేలా చూడమన్నాను.  పన్నెండవతారీకున లింగం ఆగ్రా నుంచి బయలుదేరింది.  ఇరయిఐదవతేదీ కాని చేరదన్నాడు, కొరియరు వాడు.  అయ్యో ! కార్తీకం వెళ్ళిపోతోందే అనుకున్నాము. స్వామి కరుణవుంటే జరగనిదేముంది.  లింగార్చన చేసుకుని వచ్చిన మరునాడే లింగం విశాఖ వచ్చిందని, తెచ్చుకోడానికి వూరి వారు వెళ్ళినట్లు చెప్పేరు.

రెండవసారికి లింగంకి దాతలు పెరిగారు, పోటీ వచ్చేసింది.  పూర్వం ఇస్తామన్నవాళ్ళు వెనక్కి తగ్గలేదు.  విచిత్రం ఏమంటే వ్యాపారస్థుడు నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించినందుకు చాలా అనందంగా వుంది, నిజానికి అతను తను చెప్పిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలిసింది.  కాని అతను నేను ఎక్కువైన డబ్బు ఇస్తానన్నా తీసుకోనన్నాడు. . ఒకాయన అదేపనిగా అడిగితే నంది కొనివ్వవయ్యా అన్నారట వూరివారు.  ఆ తరవాత అతను కనపడలేదు.  మరొకరు నంది పట్టుకొచ్చేసి ఇచ్చివెళ్ళిపోయారట. ఎవరికి ఏది ప్రాప్తమో ఎవరు చెప్పగలరు. నేను ఇందులో పాలుపంచుకునే సావకాశం పరమేశ్వరుడు ఇచ్చినందుకు ఆయనకు కృతఙ్ఞత చెప్పడం తప్పించి చేసేదిలేదు.
మొత్తానికి కార్తీక సోమవారం,ఏకాదశినాడు విశాఖ నుంచి స్వామి పల్లెలో ప్రవేశించారు. మరి మిగిలింది కార్తీక బహుళ త్రయోదశి, ఆరోజు స్వామి వారిని పల్లెప్రజలు నిలబెట్టుకున్నారిలా! ఫోటోలు చూడండి. ఫోటోలు బెంగుళూరు పంపేను. చాలా సంతోషిస్తూ మెయిలు పంపేడు.  మంత్రాలు లేవు పూజలుతెలియవు. కాని తెలిసినది మనసు నిండుగా స్వామి ఉన్నాడన్న నమ్మకం, భక్తి. ఎక్కడొ రాజస్థాన్లో ఒక కొండలో ఉన్న రాయి శిల్పి ఉలిదెబ్బలకి శివుడుగా మారి ఒక ఏటివొడ్డున పల్లెలో నిలబడి ఊరివారిని రక్షిస్తూ పూజలందుకుంటున్నాడు.ఈ సంవత్సరం కార్తీక మాసం నిస్సారంగా జరిగిపోతోందనుకున్నాను. కాని ఎంత అందంగా స్వామి ఈ సంవత్సరం కార్తీక మాసం జరిపేరో చూడండి.  అదీ ఆయన చేసే చిత్రం.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- శివలింగ ప్రతిష్ట

 1. బాగుందండీ, రాబోవు కాలం లో ఇది ఆ క్షేత్రానికి స్థలపురాణం అవుతున్దనుకుంటాను. మీరు వారివారి పేర్లతో సహా ఇది రాసి వుండవలె, రాబోవు కాలానికి ఇది ఒక ‘ప్రదీపిక’ గా వుండి వుండును

  చీర్స్
  జిలేబి.

 2. @
  అమ్మాయ్ రసఙ్ఞా!
  నువ్వు చెప్పింది నిజం. దేనికీ మనం కర్తలం కాదు. అయన చెప్పినట్లు చేసేవాళ్ళమే.

 3. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు అంటారు! ఆయనకి కావలసింది ఆయనకి కావలసిన వారి చేతులమీదుగా అన్నీ ఆయనే చేయించుకుంటాడు! హర హర మహాదేవ శంభో శంకర! కార్తీక మాసంలో ఒక లింగ ప్రతిష్ఠ. ఆహా ఎంతో ఆనందంగా ఉంది!

వ్యాఖ్యలను మూసివేసారు.