శర్మ కాలక్షేపం కబుర్లు-బ్లాగురోగం కు(ము) దిరిందా?

బ్లాగురోగం కు(ము)దిరిందా?.

ఏనిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ………ఏంటీ పాటలు పాడుతున్నారనుకుంటున్నారా? పాత రోజుల్లో వాన రాకడ ప్రాణపోకడా చెప్పలేమనేవారు. ఇప్పుడు వాన రాకడ కొద్దిగా చెప్పగలుగుతున్నారు. కాని కరంటు రాకడా మనిషిపోకడా చెప్పలేకున్నారు.

ఈ మధ్య బ్లాగు పోస్టు రాసుకోడానికి అన్నీ అడ్డంకులు, అవాంతరాలు వచ్చేస్తున్నాయి. ఏమీ చేయగలది లేనప్పుడు రామనామాన్ని తలుచుకోవడం ఉత్తమం అని పెద్దలు చెప్పేరు. ఆకటి వేళల అలపైన వేళల………… ఓపినంత హరినామమేదిక్కు మరిలేదు.  ప్రస్తుతం అదే చేస్తున్నాను.

ఉదయం ఆరు గంటలకి కరంటు తీసేస్తాడు. పది గంటలకిస్తాడు. ఈ లోగా ఉదయ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటె పదికి కంప్యూటర్ దగ్గర కూచోవచ్చు. కాని ఇంటిలో ఏదో వొక పని, లేదా బజారు పని ఉంటాయి కదా! చేసుకోక తప్పదు. ఒకవేళ తరవాత చేస్తానంటే ఆవిడేమనుకుంటుందో అని వొక చిన్న తెలుగు అనుమానం. అంచేత ఉదయం కుదరదు. పాపం మా కరంటు వాడు టైము బాగాచూసుకుంటాడు. పన్నెండు గంటలకి కట్టేస్తాడు. మరి సాయంత్రం నాలుగు గంటలకిస్తాడు. కాని నాలుగు గంటలకి కాలేజికి వెళ్ళి మనవరాలిని తీసుకురావాలి. తీసుకొచ్చిన తరవాత పోనీ  కంప్యూటర్ దగ్గర కూచునేటప్పటికి మనవరాలు దాని పనులు పూర్తి చేసుకుని పుస్తకాలుచ్చుకుని నాదగ్గర కొచ్చేసి, దానికి బడిలో చెప్పినవన్నీ నాకు నేర్పిస్తుంది. ఇంగ్లీషు రైమ్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. దాన్ని కాస్త ఏమార్చి కంప్యూటర్ దగ్గర కూచుందా మనుకుంటే మనవరాలు వదలటం లేదు. రైమ్స్ అయిపోతే టీ.వి దగ్గర ఉయ్యాలలో నేను కూచుంటే నావడిలో రిమోట్ పట్టుకుని తను కూచుని తనకు కావలసిన పిల్లల చానల్ తిప్పి నన్ను కూడా చూసేదాకా వదలదు. లేదా తెలుగు పద్యాలు నేర్చుకుంటుంది. ఇదీ అనందమేకదా! ఒక వేళ నువ్వు చూడమ్మా అని నెమ్మదిగా వస్తే వెనకాలే వచ్చేసి కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఈ మధ్య వొకసారి అలా జరిగిన సందర్భంగా సిస్టం హేంగ్ అయిపోయింది. ఇలా అస్తమానం హేంగ్ అయిపోతే ఎలా అని అబ్బాయి అంటాడేమోనని ఒక బెదురు. ఈలోగా ఆరున్నర అవుతుంది. అబ్బాయి వస్తే వాడికి కాసేపు సిస్టం పని ఉంటుంది. అంచేత కుదరదు. ఆ తరవాత సాయంత్ర కార్యక్రమాలు పూర్తి చేసుకునేటప్పటికి ఏడున్నర.  పల్లెటూరి వాళ్ళంకదా ఏడున్నర ఎనిమిది మధ్య భోజనం పూర్తి అయితే ఎనిమిదికి గరికిపాటి వారొస్తారు. ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా చాగంటివారు. వీరిని కాదనగలమా! గురువుగారిని కాదనటమా! జరగని పని. ఆ తరవాత నిద్రా దేవి వస్తుంది. ఈ మధ్య కార్తీక మాసం పుణ్యమాని తెల్లవారుగట్ల మూడున్నరకే లేస్తున్నాము. కాలకృత్యాలు తీర్చుకుని కంప్యూటర్ దగ్గర కూచుంటే భగవత్కృప ఎలాఉంటుందో తెలియదు. ఇది నిన్నటి దాకా పరిస్థితి ఇప్పుడు కరంటు పగలు ఎనిమిది నుంచి పన్నెండు తరవాత రెండు నుంచి రాత్రి ఆరు గంటలదాకా ఇంతే సంగతులు. ఒకవేళ కరంటుంటే నెట్ గోవిందా. సహవాస దోషం అనండి లేదా మనమేమి తక్కువ తిన్నామనుకుని బి.యస్.న్.ల్ వారు పాపం నెట్ గొవిందా కొట్టించారు రెండు రోజులనుంచి. ఏమండి ఏమిటి విశేషమంటే కేబుల్ పోయిందండి బాగు చేస్తున్నాము. మరదేంటి కొంతమందివి పనిచేస్తున్నయంటే మీది పోయిన దాన్లోవుంది అన్నారు. ఇది సంగతి. అందుచేత  బ్లాగు రోగం చప్పగా కుదిరిందా/ముదిరిందా?. మెయిళ్ళు చూడటానికి కూడా కుదరటంలేదు.ఏపని చేయాలన్నా దేశకాలాల పరిస్థితులు కలిసిరావాలన్నారు పెద్దలు,ఇదేకాబోలు..మా పల్లెలో బ్లాగు గురించి తెలిసినవారెవరో తెలియదు. ప్రస్తుతానికి పరిస్థితులు కుదుట పడేవరకూ………అంచేత…………….జనగణమన…………

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-బ్లాగురోగం కు(ము) దిరిందా?

 1. అమ్మాయ్! జ్యోతిర్మయి
  e లా అలవాటయిపోయి కష్టంగా వుంది. పరిస్థితులకి వదిలేస్తే మన ప్రత్యేకత లేదు మరి.

 2. కరెంటుండే మంచి రోజులొస్తయిలెండి బాబాయి గారూ..ఈ లోగా అన్నీ కాగితం మీద రాసి పెట్టుకోండి. వీలయినప్పుడు కంప్యూటర్లోకి ఎక్కించవచ్చు.

 3. @
  జిలేబిగారు
  మనం బుర్ర తిండానికి సిద్ధమే కాని, అందుకు జనం దొరకటం లేదుగా! అందుకే e లాగా దేశం మీద పడింది. కాని విధి అనుకూలించటం లేదు

 4. ఈ బ్లాగులు, టపాలు, అందుకే మనకు మంచిగా అచ్చి రావు శర్మ గారు. శుభ్రం గా వీధరుగు పై కూర్చుని నాలుగు మంది జనాలని కూర్చోబెట్టుకుని కాలక్షేపం ఖబురులు లాగించడం ఉత్తమం! కరెంటు లేక పోయినా బాధేమీ లేదు. మన టపా పడిందా లేదా అని చూడవలసిన పనీ లేదు.

  చీర్స్
  జిలేబి..

వ్యాఖ్యలను మూసివేసారు.