శర్మ కాలక్షేపం కబుర్లు- సత్యం బ్రూయాత్

సత్యం బ్రూయాత్.

ఒకరోజు నా స్నేహితుడు ఫోన్ చేసి ఒకసారి రాగలరా అన్నాడు. వస్తున్నా అన్నాను. నా శ్రీ మతి అడిగింది. ఏమిటి సంగతి ఈ మధ్య మీ మిత్రుడు పిలిచిన వెంటనే పరిగెడుతున్నారు, ఇదివరకు పిలిచిన చాలా సేపటికి కాని వెళ్ళేవారుకాదు, ఏమిటి విషయం అంది. నిజం చెప్పమన్నావా అన్నా! అయ్యో నిజం చెప్పమనేకదా అడుగుతున్నది, అంటే చెప్పేను. ఇక్కడ కరంటు వుండటం లేదుకదా, అక్కడకెళితే కరంటు వుంటుంది జనరేటరు మీద, ఎంచక్కా అతని పని చేసిపెట్టి బ్లాగులు చూసుకోవచ్చన్నా! నిజం చెప్పేసాను. అయ్యో! కరంటు వాడు ఇక్కడ ఛీ! పొమ్మన్నా మీరు దాన్ని వదలలేకున్నారన్న మాట అంది. అందుకు ఉన్న విషయం చెబుతున్నాను, అన్నాను. అందుకావిడ మీకిప్పటిలో ఈ వ్యసనం తగ్గేలా లేదే, మరొక సంగతి, లేటు వయసులో ఘాటు ప్రేమలా వుంది. నేను చెప్పగలదొక్కటే, ఆరోగ్యం జాగ్రత్త, అంది. వెంటనే ఎగిరి వెళ్ళిపోయాను.

మా మిత్రుడు తన మేనేజరు సమక్షంలో, నాకో పని అప్పచెప్పి, ఇవి కాస్త రుజువు చూడమన్నాడు. ఏమవీ! అని చూస్తే ఒక కంపెనీ నుంచి ఇతని కంపెనీలకి వచ్చిన సొమ్ము తాలూకు వివరాలు. అందులో వచ్చిన సొమ్ములు బేంకులో జమ అయినవా ఏకౌంటులో చూడటం ఒకటి, జమ అయిన సొమ్ము బేంకు నుంచి తీసినారా, తీస్తే ఎకౌంటులో జమ పడిందా లేదా చూడమన్నాడు. అవి దగ్గరగా పది సంవత్సరాలవి వుండచ్చు. బేంకు స్టేటుమేంట్లు ఎకౌంటు పుస్తకాలు మా మేనేజరు చూపిస్తారు, మీకూడా వుంటారు, చూడమన్నాడు. సరే నిజంగా చూస్తే ఒక రోజులో తేలిపోయే పనే. మేనేజరుగారు ఆ యజమాని దగ్గర చిన్నప్పటినుండి పని చేస్తున్నవాడు. ఇద్దరూ మిత్రులే. ఒకరిని విడిచి మరి వొకరు ఉండలేరు. ఈ సొమ్ములు బేంకు నుంచి తీయడం వేయడం లాంటి పనులు అన్నీ ఈ మేనేజరు గారే చూస్తాడు. స్నేహితుని దగ్గరనుంచి బయటకొచ్చిన తరవాత మేనేజరుగారు, తనకు ఈ రోజు  వేరుగా పని ఉన్నదికనక రేపు చూదామన్నాడు. మరునాడు వెళ్ళేను. మేనేజరుగారు కష్టపడి పాత పుస్తకాలన్నీ తీయించి అక్కడ పెట్టించేడు. బేంకు స్టేటుమెంట్లు అక్కడే వున్నాయి. తారీకుల వారిగా చూసుకుంటూ వెళితే ఒక గంట లేదా రెండు గంటలలో ఆ పని పూర్తి కావచ్చనుకున్నాను. పని మొదలుపెట్టేము. అనుకున్నట్లుగానే అయిపోయింది. కాని రెండు పద్దులలో తెచ్చిన,పెద్ద మొత్తాల సొమ్ము జమ కాలేదు. ఎక్కడో పొరపాటు జరిగివుంటుంది, రేపు చూదామన్నాడు మేనేజరు గారు. సరే మరునాడెళ్ళేను. ఎన్ని సార్లు తిరగేసినా, బోర్లా వేసినా, ఆ రెండు పద్దులు తాలూకు సొమ్ము బేంకు నుంచి తెచ్చింది, జమ కనపడటం లేదు. రేపు చూదామన్నాడు. అలాగ వారం రోజులు చూసాము. దొరకలేదు. నేను మాత్రం కంప్యూటర్ మీద నా బ్లాగులు చూసుకుంటూ వుండేవాడిని. ఈ విషయం నా స్నేహితునికి ఇప్పుడే చెప్పద్దని మేనేజరు గారన్నాడు సరే వూరుకున్నాను. మరొక వారం గడిచింది, ఏమండి మేనేజరుగారు ఈ విషయం ఏమిచేసారు, మీ యజమానికి నేను సమాధానం చెప్పలికదా అన్నాను. మేనేజరుగారు మాట్లాడలేదు, చెప్పద్దన్నట్లుగా సంఙ్ఞ చేసాడు….. నాకేమిచేయాలో బోధ పడలేదు. ఒక రోజు అలోచించాను. మరుసటి రోజు మేనేజరు గారితో మాట్లాడి విషయం గురించిన నిజం, మీరు మీ యజమానికి చెప్పండి, నేను చెపితే మీకూ అతనికి కూడా అందంగా వుండకపోవచ్చన్నాను. సరే అన్నాడు. కాని చెప్పలేదనుకుంటాను. నా స్నేహితుడు మళ్ళీ ఫోన్ చేసి ఎకౌంట్లు చూసారా! ఏమయిందని అడిగాడు. అప్పుడు,అన్నీ సరిపోయినాయి కాని, ఫలానా ఫలానా తారికులలో బేంకునుంచి తెచ్చిన రెండు పెద్ద మొత్తాలు ఎకౌంటులో జమ పడని విషయం, వారం రోజులు వెతికిన విషయం, పొరపాటెక్కడ జరిగిందో తెలియని విషయం, నిజం చెప్పక తప్పలేదు. చెప్పేసాను. మీ మేనేజరు గారు ఈ  విషయం  మీ దృష్టికి తెస్తానన్నాడని వూరుకున్నానని చెప్పేను. దానికతను, మా మేనేజరు మీద, ఈ విషయం మీద, అనుమానమొచ్చే మిమ్మలిని చూడమన్నాను. జరిగింది చెప్పేరుకదా!. మిగిలిన విషయం నేను చూసుకుంటానన్నాడు. మరేమి జరిగిందో తెలియదుకాని, మేనేజరు గారు నామీద కోపం మాత్రం పెంచుకున్నాడు. అదెలా తెలిసిందంటే ఒక రోజు స్నేహితుని కోసం ఫోన్ చేస్తే అదొకలా మాట్లాడేడు. సత్యం చెప్పి నిష్టురం తెచ్చుకున్నట్లయింది. నాకీవిషయంలో, శాస్త్రకారుడు చెప్పిన సత్యం బ్రూయత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయత్ సత్యమప్రియం అమలు చేయడమెలాగో తెలియలేదు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- సత్యం బ్రూయాత్

 1. హహహ బాగుంది! లేటు వయసులో ఘాటు ప్రేమ ఈ పదం బాగుందండి! చాలా సార్లు విన్నాను కానీ ఎందుకో? ఏమో! ఇప్పుడు బాగా నచ్చింది!

 2. భలే భలే
  ఇంతకి ఇక్కడ వచ్చే చిక్కేమంటే
  సత్యం (ఉనది ఉన్నట్లు) చెపితే అది ఎవరికీ ప్రియం గా ఉండదు,
  ప్రియంగా మాట్లాడితే అది సత్యం అవ్వదు.
  మౌనగా ఉండటం అనే మధ్యే మార్గం కి కుడా ఇలాంటి సందర్భాలలో అవకాసం ఉండదు.
  యదార్థ వాడి లోక విరోధి అని ఊరకే అన్నారా?
  బ్లాగిల బ్లాగోతం (non వ్యసనం) పుణ్యమా అని సత్యం చెప్పటం
  శ్రేయస్కరమే
  ఎంచేతంటే అంత్య నిష్టూరం కన్నా అది నిష్టూరమే మేలు కదా !!
  nice post
  ఇక ప్రియం బ్రూయాత్ ని పక్కన పెట్టి సత్యం బ్రూయాత్ ని follow అయిపోవటమే సరైన దారి
  ?!

వ్యాఖ్యలను మూసివేసారు.