శర్మ కాలక్షేపం కబుర్లు- స్నేహితులు

స్నేహితులు.
మా సత్తిబాబొచ్చాడు. కూచుంటూ ఏటో నండి స్నేహాలు అన్నాడు. ఏమైందన్నా! అదెందుకులెండి, స్నేహాలగురించి నాలుగు మంచి మాటలు చెప్పండి అన్నాడు. అయితేవిను, పురాణకాలపు స్నేహాల గురించిచెబుతానని ఇలా చెప్పేను.

రామాయణంలో స్నేహితులు మూడు జంటలు.1. రామ, సుగ్రీవులు,2. రావణ, వాలి,         3. రామ, విభీషణులు. విభీషణుడిని స్నేహితునిగా పరిగణించే ముందు శరణాగతి పొందినవానిగా తలచేడు రాముడు. భారతంలో ద్రోణ,ద్రుపదులు,  కర్ణ, దుర్యోధనులు. భాగవతంలో శ్రీ కృష్ణ, కుచేలురు, వీరిగురించి వేరేగా చెప్పుకోవాలి మరి.

రామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు. ఇద్దరికీ సంధానకర్త హనుమ, సుగ్రీవుని మంత్రి. ఇద్దరూ ఒకలాంటి కష్టంలో వున్నవారే. సుగ్రీవుడు రాముని బలపరాక్రమాలమీద సంశయపడి పరీక్షలు పెట్టినా ఒప్పుకుని నమ్మకం కలిగిస్తాడు. ఉపకారం చేస్తానని మాట ఇచ్చి నిలుపుకుంటాడు. అలాగే సుగ్రీవుడు కూడా సహయం చేసి మాట నిలుపుకుంటాడు. ఇది ఆదర్శ స్నేహం.

రావణ, వాలి ఇద్దరూ కాముకులే. బలపరాక్రమాలున్నవాళ్ళే. ఇద్దరూ మహా భక్తులే. వాలి రావణుని వోడించినపుడు రావణుడు వాలితో సంధి చేసుకుని మిత్రుడవుతాడు.  ఆ సంధి షరతులు కూడా చాలా ఏహ్యంగా వుంటాయి. ఎవరు ఏ పర స్త్రీని అనుభవించినా రెండవవారికి సమర్పించడం ఒక షరతు. ఇది షరతులమీద నడిచే స్నేహం. అందుకే ఇద్దరూ కూలిపోయారు, కావలసిన వాళ్ళ సహాయంతో, పరులచేత.

రామ, విభీషణులు. విభీషణునితో స్నేహం రాముడు కోరలేదు. విభీషణుడు ముందు శరణాగతి పొందేడు. తరవాత స్నేహితుడై రాముని చేత అప్పటికప్పుడు లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు. రాముడు దీనిని నిలబెడతాడు. విభీషణుడు రామునికి చేయగల సహాయం చేస్తాడు. ఇది కూడా మంచి స్నేహమే. కారణం అన్నగారనే అభిమానంతో తప్పుని సమర్ధించడు విభీషణుడు.

ద్రోణ, ద్రుపదులు, ద్రోణుడు పేద బ్రాహ్మణుడు, ద్రుపదుడు మహరాజ కుమారుడు. ఇద్దరూ గురుకులంలో సహాధ్యాయులు. చదువు పూర్తయి ఎవరికి వారు విడిపోయారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ద్రోణుడికి అశ్వద్ధామ కలిగేడు. ద్రుపదుని వద్దకు సహాయం కోరి వెళతాడు ద్రోణుడు. ద్రోణుడు మహరాజును చూసి, తమ సఖ్యం గుర్తు చేసి, సహాయం కోరతాడు. పాంచాలభూపతి, ద్రోణునికి కనీసం గోవును కూడా ఇవ్వలేదు సరికదా, పేదవాడికి ధనవంతునితో స్నేహమా! పేద బ్రాహ్మణుడికి మహారాజుతో స్నేహమా అని హేళన, చులకన చేసి అవమానించాడు. ద్రోణుడు అతనిని జయించే శిష్యుడిని తయారు చేసాడు. ద్రోణుడు పగ తీర్చుకోవడానికి అర్జునుని ఉపయోగించుకుని, ద్రుపదుణ్ణి అర్జునినిచే బంధింప చేసి హేళన చేసి వదిలేసాడు. ద్రుపదుడు ద్రోణుని వధించే కొడుకుకోసం యఙ్ఞం చేసి, కొడుకుతో పాటుగా కూతురిని కూడా యఙ్జము ద్వారా సాధించాడు. ఈ స్నేహితులు ఒకరినొకరు సాధించుకోడానికి తమ స్నేహం ఉపయోగించుకున్నారు. ద్రుపదుడు గర్విష్ఠిగా            ప్రవర్తించి,చెడ్డపేరు తెచ్చుకున్నాడు.   తరువాత పాండవులకు మామగారయ్యాడు, అది వేరు సంగతి.

దుర్యోధన, కర్ణులు. కర్ణుడు దుర్యోధనుని ఆకర్షించడానికి అస్త్రవిద్యా ప్రదర్శనకు రాలేదు. వీరునిగా తన విద్య ప్రదర్శించాలనుకున్నాడు. దేశకాల పరిస్థితులను బట్టి అడ్డం వచ్చింది. ఈ సావకాశాన్ని దుర్యోధనుడు ఉపయోగించుకుని అతనిని అంగ రాజ్యానికి అభిషేకం చేసి అతని పరువు కాపాడి, అతనికి సంఘంలో ఒక స్థానం ఏర్పాటు చేసాడు. ఇది కూడా దూరాలోచన, దురాలోచనతోనే. పాండవులను ఎదిరించగల సత్తా తనకు, తన తమ్ముళ్ళకు లేదని దుర్యోధనునునికి తెలుసు. అందుచేత పాండవులనెదిరించేవాడిని చేరదీసాడు. ఇది అవసరము. ఈ స్నేహం లో యజమాని సేవక సంబంధమే ఎక్కువగా కనపడుతుంది. స్నేహితుల సంబంధం తక్కువ కనపడుతుంది. అవసరమైన స్నేహితుడు కనక దుర్యోధనుడు ఎప్పుడూ కర్ణుని పల్లెత్తు మాట అనడు. కర్ణుడు ఎప్పుడూ దుర్యోధనిని మాట జవదాటలేదు. దుర్యోధనుని మనసెరిగి పాడు పనులకు దోహదం చేసాడు, కాని మంచి మిత్రునిగా మంచి సలహా ఏనాడూ ఇవ్వలేదు.. ఈ స్నేహం లో యజమాని సేవక సంబంధం, అవసరం కనపడతాయి. ఒక రకంగా ఇద్దరూ అవకాశవాదులే.

ఇక ఆఖరువారు శ్రీకృష్ణ, కుచేలురు. కుచేలుడు పేద బ్రాహ్మణుడైనా  శ్రీకృష్ణుడు తన చెలికాడయినా ఎప్పుడూ సహాయం కోరలేదు. భార్య లేమిని భరించలేక శ్రీకృష్ణుని సాయం అడగమని చెప్పి పంపుతూ చిరిగిపోయిన అంగవస్త్రం మూల కొద్దిగా ఎండిపోయిన అటుకులు మూటకట్టిపంపుతుంది. ఈయన వెళ్తూ నాదగ్గర ఏమీలేదు, భటులు పోనివ్వమంటే ఇవ్వడానికి అని బాధపడతాడు. అక్కడికెళ్ళిన తరవాత ఎవరూ ఈయనను అడ్డుపెట్టరు. తిన్నగా శ్రీకృష్ణుని మందిరానికి వెళ్తాడు. దూరం నుంచే చూసిన శ్రీకృష్ణుడు, తల్పం దిగి గబగబా వచ్చి మిత్రుడిని ఆలింగనం చేసుకుని తన తల్పం మీద కూచోపెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిపై జల్లుకుని, కుచేలునికి గంధం పూసి అర్ఘ్య, పాద్యాలిచ్చి, రుక్మిణీ దేవి వింజామర వీస్తుండగా, తను కుచేలుడు గురువు గారి ఇంటి దగ్గర చదువుకున్న రోజులు తలచుకుని, ఒక రోజు వర్షంలో ఒక రాత్రి అడవిలో వొంటరిగా గడిపిన సంఘటన గుర్తుచేసి, మరునాడుదయం గురువుగారు వెతుకుతూ వచ్చి వాళ్ళను కనుక్కోవడం అన్నీ గుర్తుచేసుకుని, నాకోసం ఏమైనా తెచ్చావా అని, ఇవ్వడానికి  సిగ్గిపడుతున్న కుచేలుని చిరిగిన గావంచా ముడి విప్పి ఒక పిడికెడు అటుకులు తిని మరొక పిడికెడు తినబోతుండగా రుక్మిణీ దేవి ఆపుచేసింది. ఇప్పటికి అనుగ్రహించినది చాలని. ఆగిపోయాడు పరమాత్మ.  రాత్రి నిద్రించి ఉదయ కార్య క్రమాల తరువాత, శ్రీ కృష్ణుడు సాదరంగ వీడ్కోలు పలుకగా, ఏమీ అడుగలేకపోయినందుకు విచారించి వచ్చేడు. కాని పరమాత్మకి తెలుసు కనుక కుచేలునికి, అడగకనే సకలైశ్వర్యాలు అనుగ్రహించాడు. ఇది స్నేహానికి పరాకాష్ఠ.

8 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- స్నేహితులు

 1. @
  తెలుగుభావాలు,
  నా బ్లాగులోకి వచ్చి పోస్ట్ చూసి కామెంటు పెట్టినందుకు సంతసం. శ్యామల రావుగారు మంచి ప్రశ్న వేసారు. నేను సమాధానం చెప్పలేకపోయా! ఈ విషయం బ్ర.శ్రీ. చాగంటి వారు చెప్పగా విన్నదే. మీరు ప్రమాణం కూడా చూపుతున్నారు. సంతసం. మీ బ్లాగు నేను చూస్తున్నా.

 2. @
  హేమ మురళిగారు,
  ధన్యవాదాలు. రాసే ముందు భారతంలో మూడూ చెప్పి వూరుకుందామని మొదలెట్టెను. తరవాత రామాయణంవి చేర్చాను. గుహుని చేర్చాలనుకున్నా కాని పరాకు పడ్డాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అయ్యో ఇంతా ఐన తరవాత అసలు స్నేహం గురించి చెప్పక పోవడం తప్పని కుచేలోపాఖ్యానం చేర్చాను. ఇదీ అసలు కధ. పోస్టు పెరిగిపోతోందేమో నన్న భయం.

 3. @
  అమ్మాయ్! జ్యోతిర్మయి,
  ధన్యవాదాలు. రామాయణ, భారత,భాగవతాలు మన జీవనాడులు. వాటినుంచి మనం మన జీవితానికి సంబంధించి ఎన్ని తెలుసుకో గలిగితే అంత మనకే మంచిది. మీ ప్రయత్నం,తపన చూస్తున్నాను.

 4. @
  తాడిగడప శ్యామల రావుగారు.
  ధన్యవాదాలు. వాలి రావణుల గురించి బ్రహ్మశ్రీ చాగంటివారి ఉపన్యాసములనుంచి తీసుకున్నది. ఈ విషయంవారు నిన్నటి విశాఖ ఉపన్యాసంలో కూడా ప్రస్తావించారు. వాల్మీకంలో లేదనే మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను.

 5. *రామ సుగ్రీవులది అవసర స్నేహం. సుగ్రీవుని బధ్ధకాన్ని వదలగొట్టటానికి రాముడు, “నీ అన్నను చంపిన బాణం ఇంకా నా దగ్గరే ఉంది” అంటాడు.
  *వాలి రావణుల స్నేహం గురించి వాల్మీకంలో ఉన్నదా? నాకు తెలియదు.
  *విభీషణుడు రాముని స్నేహితుడిగా కన్న భక్తునిగానే ప్రసిధ్ధుడు.
  *ద్రోణ ద్రుపదులది కేవల బాల్య స్నేహం. దాన్ని ద్రుపదుడే చెడగొట్టుకుని పెద్ద కథకు కారకుడైనాడు.
  *కర్ణ దుర్యోధనులది కపట స్నేహం. దుర్యోధనునుడికి కర్ణుడొక సాధనం. కర్ణుడికి దుర్యోధనునుడొక అవకాశం -అర్జునుని సాధించటానికి.
  *శ్రీకృష్ణ కుచేలులది నిజమైన ఉత్తమ స్నేహం. బాల్య స్నేహపు మాధుర్యాన్ని శ్రీకృష్ణుడి సాంఘికస్థాయిగాని కుచేలుని లేమిగాని అడ్డుకోలేదు.
  చాలా మంచి వ్యాసం అందించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s