శర్మ కాలక్షేపం కబుర్లు- స్వస్తి.

స్వస్తి

మా సత్తిబాబు వస్తే కూచోమన్నా. పంతులుగారు ఏమిటి  కబుర్లు అన్నాడు. నాకేమి కబుర్లు తెలుస్తాయి, పదిమందిలో తిరిగేవాడివి నువు చెప్పాలన్నా! ఏమీలేవండీ అన్నాడు. నేను స్వస్తి అన్నా! ఏమిటి నన్ను వెళ్ళిపోమంటున్నారా అన్నాడు. అసలు సంగతి మీరు అస్తమానం అందరినీ, బెదిరించేస్తున్నారట కబుర్లు చెప్పనని, మీరు లేక పోతే ప్రపంచం లేదా ఏదో పెద్దాయన చెబుతున్నాడు కదా విందామనుకుంటే ఇదేంటీ! అని కడిగేసాడు. కాదయ్యా! బాబూ నేను,నీ బాషలో, నీకు స్వస్తి చెప్పడంలేదు. బ్లాగుకీ స్వస్తి చెప్పడంలేదు, అని సర్ది  చెప్పి, స్వస్తి అని ఎందుకంటాము విశేషం చెప్పమని అమెరికా నుంచి , గడుగ్గాయి మనవరాలడిగిందయ్యా!, చెప్పకపోతే ఎలా అన్నా!. అదా సంగతీ ఏమిటో అనుకున్నా  సుమండీ, సరే చెప్పండి అని అనుమతిచ్చాడు. ప్రతి పనికి ముందుగా విఘ్నరాజుని పూజిస్తాము. చివరగా స్వస్తి చెబుతాము. స్వస్తి అంటే శుభము. అంటే పని పూర్తి చేసి దాని ఫలితం సర్వులకూ చెందాలని కోరుతాము.మొదలుపెట్టేటపుడు ఫలానా, ఫలానా, ఫలానా రోజున, సకుటుంబంగా చతుర్విధ పురుషార్ధ ఫలసిద్ధి కొరకు చేస్తున్నా అనిచెపుతాం. దీన్ని సంకల్పం అంటాము. చివరికి పూజ పూర్తి అయిన తరవాత ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ధార పోస్తాం. ఏమిటి తేడా.  ఫలితం మనది కాదు పరమేశ్వరుడిది. అంటే సమాజానిది. మనం కూడా అందులో వారమే. ఆ సందర్భంలో చెప్పేవే ఈ శ్లోకాలు.ఇవి శాంతి మంత్రాలంటాం. మొదటి రెండూ ఎక్కువగా చెప్పి ఆపేస్తారు. ఇంకా వున్నాయి.ఈ రెండు శ్లోకాల తరవాత మరొకపాఠంలో కొన్ని చెబుతారు. వాటిని మంగళ వాక్యాలంటారు. కాని విషయం చెబుతా. పంచభూతాలు శాంతిగా వుండాలి, భూమిపైవున్న సర్వజీవులూ కుశలంగా వుండాలి, ఇది స్థూలంగా, వాటిని వ్యాఖ్య చేయగల పటిమ నాకు లేదు. కనుక చెప్పటం లేదు.

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం,
న్యాయేన మార్గేణ మహిం మహీశాం,
గో బ్రాహ్మణభ్య శ్శుభమస్తు నిత్యం,
లోకా సమస్తా సుఖినో భవంతు.

అంటే, పరిపాలకులు, ప్రజలను, న్యాయమార్గంలో పరిపాలించాలనీ, రాజుకి తద్వారా ప్రజకెల్లపుడు శుభం జరగాలనీ, గో బ్రహ్మణులకెప్పుడూ శుభం జరగాలనీ, ప్రపంచంలో వున్న సర్వ ప్రాణులూ సుఖముగా వుండాలని, మనం ఏకార్యాన్ని నిర్వహించినా చివరగా చెప్పేది ఈ మంత్రం. దీనితో పాటుగా

కాలే వర్షతు పర్జన్య
పృధివీ సస్యశాలినీ,
దేశోహం క్షోభరహితం,
బ్రాహ్మణా సంతు నిర్భయా!

అని కూడా చెబుతాము. దీని అర్ధం సకాలంలో వర్షాలు పడాలని, భూమి అంతా సస్య శ్యామలంగా పాడి, పంటలతో వర్ధిల్లాలని, దేశప్రజలంతా సంక్షోభాలు లేకుండా వుండాలని, బ్రాహ్మణులు నిర్భయంగా బతకాలనీ దీని అర్ధం. నీకో అనుమానం అప్పుడే వచ్చింది నాకు తెలుసు. చెబుతున్నా విను. పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణులు కారని శాస్త్రం చెబుతోంది. మరి బ్రాహ్మణులెవరయ్యా అంటే వేదం చదువుకున్నవారు, దానిని అనుసరించి బతికేవారు,సత్వ గుణ ప్రధానులే బ్రాహ్మణులు. పుట్టుకతో బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణత్వం సాధించుకోవాలి. తెలిసింది కదా! ఇప్పుడునీ అనుమానం తీరిందా! ఈ మాటలు నేను చెప్పినవి కాదు నాయనా శాస్త్రమే చిప్పింది మరి. మనం చూడలేక ఈ తగువులు.

మన సంస్కృతి గొప్పతనం చూసావా! సత్వ గుణ ప్రధానులంతా, అనగా బలహీనులంతా, నిర్భయంగా బతకాలన్నారు. మనమే కాక లోకంలోవున్న సర్వ జనులూ సుఖంగా వుండాలని కోరుకుంటారు. ఇది మరే సంస్కృతిలోనూ లేదయ్యా అన్నా. ప్రతి కార్యక్రమానికీ ఆఖరున మంగళ గౌరికి అనగా శక్తిస్వరూపిణికి మంగళహారతి ఇస్తాము. అలాగే గోవింద నామ స్మరణకూడా చేస్తాము, కాని….

నేటి కాలం లో స్వస్తి చెప్పేరంటే పని మానేసారని చెబుతున్నారు. మంగళం పాడేశారు, గోవిందకొట్టించారు అన్నవి అన్నీ వ్యతిరేకార్ధంలో వాడుతున్నారు. మనకిప్పుడు రెండు భాషలేవచ్చు. ఒకటి సినిమా భాష, రెండవది రాజకీయ భాష ఇప్పుడు దేశమంతా ఈ రెంటి చుట్టూ తిరుగుతోంది, ఇదో కొసవెర్రి….. సినిమా కి శుభం కార్డు పడటం ఇటువంటిదే.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- స్వస్తి.

  1. @
    అమ్మాయ్! జ్యోతిర్మయి
    ధన్యవాదాలు. మీరు నా బ్లాగు చూస్తూ నన్ను ఉత్సాహపరస్తున్నందుకు కృతఙ్ఞతలు.

  2. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ , స్వస్తినః పూషా విశ్వవేదాహ
    స్వస్తినః తార్ష్యో అరిష్టనేమిహి స్వస్తినో బృహస్పతిహ్ దదాతు!

వ్యాఖ్యలను మూసివేసారు.