శర్మ కాలక్షేపం కబుర్లు-మొహమాటం.

  మొహమాటం.

రెండవ శనివారం మనవరాలికి శలవు. ఉదయం ఎనిమిదికి కరంటు తీసేడు. పదికి ఇచ్చేశాడు. ఏమి నాభాగ్యం! అనుకునేలోగా మళ్ళీ తీసేసాడు. మళ్ళీ ఇచ్చాడు.  మళ్ళి కరంటురాగానే మనవరాలొచ్చి తాతా రైమ్స్ పెట్టవా అంది. సరే పెట్టేను. నా శ్రీమతి వచ్చి తాత పనిచేసుకుంటున్నారు. నువ్వొచ్చెయ్యి ఇవతలికి అంది. దానిని రైమ్స్ , విననీ, చూడనీ, నా పని తరవాత చేసుకోవచ్చు, అన్నా, మొహమాటపడ్డా .మీరు పిల్లలిని బాగా గారం చేస్తున్నారు. ఇది మచిదికాదంది. చూడవోయ్! నువ్వు ఇద్దరు తాతలనీ ఎరగవు, మామ్మ, అమ్మమ్మలని ఎరగవు, నేనుకూడా అంతే! పిల్లల అదృష్టం కొద్దీ మనం బతికున్నాము. వాళ్ళానందమే మనకి ఆనందం. మనది వాలిపోయిన పొద్దు. వాళ్ళది ఉదయించే పొద్దు. ఈ ఆనందం వాళ్ళకి మిగిల్చి మనమూ పొందుదామన్నాను. నిజమే నేను కాదనను కాని మీ పని అడ్డుతుందేమో అని… అంది. ఈలోగా రెండు వీధుల అవతలవున్న దూరపుబంధువుల కుర్రాడొచ్చి మామయ్యా, అమ్మ కొత్త గేస్ బండ తెమ్మంది మిమ్మలిని అడిగి అన్నాడు. నాకీ విషయాలు తెలియవు, మీ అత్తని పిలస్తాననే లోగా నా శ్రీమతి వచ్చి, గేస్ మాదీ అయిపోతే, బుక్ చేయమని మీ మామయ్యకి చెప్పేను మరిచిపోయినట్లున్నారు. అంది. వాడు వెళ్ళిపోయాడు. అదేమిటోయ్! మొన్ననేగా కొత్త బండ వచ్చింది అన్నా! మీ చె.. ల్లి…  లు ఇదివరకో సారి ఇలాగే పట్టుకెళ్ళి వారం తరవాత సగం ఖాళీ బండ పంపింది గుర్తులేదా అంది. మనకేం గేస్ వూరికే రాదుగా! నిజమే నాకు గుర్తులేదు. ఈ లోగా వుప్పువాడొచ్చాడు. నాలుగు కుంచాల వుప్పుపోయించుకుని మీ చెల్లెలు దగ్గరకెళ్ళి చిల్లు బింది వుంది అడిగిపట్రండి అంది. రేపు ఇచ్చేద్దామనిచెప్పమంది. సరే వెళ్ళి అడిగేను. అయ్యో అన్నయ్యా! చాలా రోజులతరవాతొచ్చావు. కాఫీ ఇద్దామంటె గేస్ లేదు అంది. పరవాలేదు. బిందె ఇమ్మనమన్నా! అన్నయ్యా బిందె పక్కింటి కామేశ్వరమ్మగారు పట్టుకెళ్ళింది మొన్న, తేలేదంది. వచ్చి చెప్పేను. ఆ తెలిసిందా మీ…. చె…ల్లి..లు ఘనకార్యం అని సాగతీసింది. పక్కింటి కామేశ్వరమ్మగారు పదిహేను రోజులయి ఊళ్ళో లేదు. నిజంగానే లేదేమో బింది అన్నా! ఒకపని చేయండి! వాళ్ళ ఇంటి వెనక వీధికివెళ్ళి వాళ్ళ ఇంటికేసి బుర్రెత్తి చూడండి, బింది బోర్లించి కనపడుతుంది, సన్ షేడ్ మీద అంది. ఓరినాయనో! ఇదేం పత్తేదారీరా అనుకుంటూ,  సరే ఇదేదో చూదామని వెళ్ళి చూస్తే, నిజమే బింది బోర్లించి ఉంది. తిరిగొచ్చా! ఏం! అంది. నిజమే అన్నా! మనం ఏవస్తువు, డబ్బు గురించి ఎప్పుడూ ఎవరిదగ్గరకీ వెళ్ళిన గుర్తులేదు. నేను కాపరానికొచ్చిన కొత్తలో మీరు చెప్పేరు, ఇలా నడవాలి కుటుంబం అని. నేను దాన్ని అనుసరిస్తున్నా. చిల్లు బింది ఇవ్వడానికి బాధ పడిపోయింది, మనం గేస్ బండ ఎందుకివ్వాలి. అందుకే మిమ్మలిని చిల్లుబింది తెమ్మని పంపింది. అర్ధమయిందా ఆవిడ గుణం అంది…….నా ఇల్లాలు చదువుకోలేదుకాని, చదువుకుని వుంటే గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త అవునేమో అని నా అనుమానం.

భోజనం తరవాత కునుకొచ్చింది. మళ్ళి కరంటు రాత్రి ఆరు గంటలకిచ్చాడు. ఈలోగా ఉయ్యాలలో కూచుని వుంటే మరొక సంఘటన గుర్తుకొచ్చింది, ఉద్యోగపు రోజులుది. ఇరవై ఏళ్ళక్రితం, ఒక వూళ్ళో ఇద్దరు ఆఫీసర్లుంటే ఒకటే కారిచ్చి, కొట్టుకుచావమనేవారు, ఇద్దరూ వాడుకోండని, డిపార్టుమెంటువారు.. ..సాధారణంగా ఈ కారు రూరల్ ఆఫిసర్ దగ్గరుండేది. నేను అటువంటి పరిస్తితిలో వున్నపుడు, ఎప్పుడు కారు కావాలని నా కొలీగుని అడగలేదు. నాకు అర్బన్ పేరుకాని పదిహేనుకిలోమీటర్ల దూరం సెక్షన్ వుండేది. ఒక సారి అవసరం కలిగి కారడిగేను. లేదన్నాడు. అదేమిటి నువ్వుండగా కార్ లేకపోవడం ఏమిటన్నా! నేను వెళ్ళకపోతే కారెళ్ళకూడదా. మీకు కారు కావాలంటే ఒక రోజు ముందుచెప్పాలి. మా ఆవిడ, కారు పుట్టింటికి వేసుకెళ్ళింది. మూడు రోజుల తరవాత వస్తుంది. కారు లేదన్నాడు. సరే నా పని స్కూటర్ మీదెళ్ళి పూర్తి చేసుకున్నా మామూలుగా. నెలాఖరున లాగ్ బుక్ కాపీ తెచ్చి డ్రయివరు నన్ను సంతకం పెట్టమన్నాడు. ఈలోగా నా కొలీగ్ పిలిచి డ్రయివర్ని తొందరగా పంపండి, మీరు సంతకం పెట్టి పంపండి అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చి సంతకం పెట్టనన్నా! ఏమన్నాడు. మీ ఆవిడ పుట్టింటి కెళ్ళినప్పుడు వివరాలు రాయలేదు, అందుకు అన్నా! ఆయనన్నాడు, ఓరి పిచ్చివాడా! అన్నీ రాయరు,అందుకే నువ్వల్లా వున్నావు, నువ్వు సంతకం పెట్టకపోతే మరేమీ బాధలేదు పంపించెయ్యి డ్రయివర్ని అన్నాడు.అక్కడ మొహమాట పడలేదు….ఒక శనివారం సాయంత్రం నాలుగు గంటవేళ హడావుడిగా వచ్చి ఓ పాతికవేలు కావాలి వారం లో ఇచ్చేస్తానన్నాడు. అంత నా దగ్గర, ఇంటిలో వుండవన్నా! సరే చెక్కివ్వండి నేను తంటాలు పడతానన్నాడు. బేంక్ కిఫోన్ చేస్తే స్నేహితుడయిన మేనేజరుగారు పలికి మీకేమి సాయం చెయ్యగలను, ఏమీ మీ అవసరం అన్నాడు. చెప్పేను. అందరూ వెళ్ళిపోయారు. నేనూ   వెళ్ళిపోదామనుకుంటున్నాను. మీరు ఒక మనిషిని పంపండి, చీటి ఇవ్వండి, దాని మీద ౨౫ అని అంకె వేయండి. మీ అంకెలు నాకు గుర్తే. ఇదెందుకంటే వచ్చే అతను మీ మనిషి అని నేను గుర్తుపట్టడానికేసుమా అన్నాడు. పంపేను. డబ్బు తెచ్చేడు. ఇతని కిచ్చేను. సోమవారం ఉదయం చెక్కు పంపేసాను, మేనేజరుగారికి. మా కొలీగ్ వారం లేదు, నెల, మూడు నెలలకి కూడా  డబ్బులివ్వలేదు. ఒక రోజు ఫోన్ చేసి అడిగీతే, మీకు డబ్బులు కావాలంటే గుర్తుచేసి పట్టుకెళ్ళాలండి అన్నాడు. నాకు మతి పోయింది. ఈలోగా మా ఆఫిసు గుమాస్తా ఇది చూసి, మీకో విషయం తెలుసా అనాడు. ఏంటన్నా. ఈయనకి ఊరునిండా చేబదుళ్ళేసార్! మొత్తం పది లక్షలుంటుంది, ఈపట్టుకెళ్ళిన సొమ్ము సంవత్సరంలోగా ఇవ్వడు. ఈ సొమ్మంతా బావమరిది చేత మూడు రూపాయల వడ్డీకి తిప్పిస్తాడు. మన ఆఫీసులో మనమిద్దరం తప్పించి అందరూ అతని కాతాదారులే. మా గుమాస్తా గారు చెప్పినట్లు సంవత్సరం తరవాత ఇచ్చేడు. ఇటువంటి వాళ్ళుంటారా అన్నా, అందుకు మాగుమాస్తా గారు ఇటువంటివాళ్ళే వున్నారండి అన్నాడు.

దేశంలో అందరూ ఇంతే అని నాఅభిప్రాయం కాదుగాని నాకు అటువంటివారే ఎక్కువగా తగిలేరు, జీవితంలో, మొహమాటానికిపోతే……

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-మొహమాటం.

 1. @
  అమ్మాయ్!
  అస్సలు మొహమాటం లేకుండా బాగా చెప్పేవు. మోమోటమి, మోమోటపడు,అసలు పదాలు. ముఖము+ఓటపడు=మోమోటపడు. ధన్యవాదాలు.

 2. @
  అమ్మాయ్! జ్యోతిర్మయీ!
  బుజ్జిగాడి చదువు బాధ్యత మొహమాటంతో వొప్పుకున్నానని జిలేబిగారే చెప్పేరు. నేను మొహమాట పడేదిలేదు. సలహా చెప్పేను. అంతే. ధన్యవాదాలు.

 3. @
  జిలేబిగారు,
  తెగని సమస్యలకి పరిష్కారం వెతకాలంటే, ఒక కమిటీ వేస్తే అది రిపోర్టిస్తే అప్పటి పరిస్థితులను బట్టి అమలుచేయడమా కాదా అని నిర్ణయించచ్చునంటున్నారు ప్రభుత్వం వారు. యధా రాజా తధా ప్రజా.

  టెరంస్ ఆఫ్ రిఫరెన్స్.
  ౧.బుజ్జి పండుకు నేర్పవలసిన భాష దాని స్వరూప స్వభావాలు నిర్ణయించడం.
  ౨. నేర్పబోవు భాష గ్రాంధికమా, వ్యవహారికమా, గ్రామీణమా.
  ౩.గద్యమా. పద్యమా.
  రిపోర్ట్ పది రోజుల్లో చేరేలా కమిటీ వేయండి సార్.ఇలా అన్నానని నన్ను అందులో దూర్చెయ్యదు.
  ధన్యవాదాలు.

 4. ఈ మొహమాటం ఉంది చూసారూ దానికి మొఖమాటం చాలా ఎక్కువ. మనసులో ఉన్నది మాటల్లో చెప్పకపోవడమే మొఖమాటం. అంటే మొఖంలో (face is the index of mind అన్నారు కదా అలా) కనిపించే భావాలకి, మాటకి (ఇది ఏదో తప్పక అయిష్టంగా చేసేది) పొంతన లేకపోవడమే మొఖమాటం లేదా మొహమాటం అని రసజ్ఞ ఉవాచ.

 5. బాబాయి గారూ, జిలేబి గారు మొహమాటం లేకుండా బుజ్జిగాడి చదువు బాధ్యతను మీమీదకు పంపిస్తున్నారు. మీరస్సలు మొహమాట పడకండి.

 6. శర్మ గారి కాలక్షేపం ఖబుర్లు కదా అని మొహమాటానికి పోయి ఈ టపా చదివాను సుమీ !
  మోహ మాటాని కి పోయి జ్యోతిర్ ‘మాయీ’ వారి బుజ్జి పండు చదువు తల కి ఎత్తుకున్నాను – కథని ఏమైనా కొంత లాగించండి మహానుభావులారా , బులుసు గారితో చేరి

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s