శర్మ కాలక్షేపం కబుర్లు-కంగారు.

కంగారు.
నా చిన్నప్పుడు అనగా  అరవైసంవత్సరాలకితం ఇప్పుడున్నంతగా సమాచారవ్యవస్థ లేదు. వార్త తెలియాలంటే రోజులు పట్టేది. తొందరగా వార్త తెలియాలంటే వెళ్ళిరావడమే ఉత్తమం.సామాన్యుడి సమాచార సాధనం కానీ కార్డు. అప్పుడు ఫోన్లు లేవు.పల్లెలయితే మరీ ఘోరంగా ఉండేది. అత్యవసర సమాచార సాధనంటెలిగ్రాము. పల్లెలో టెలిగ్రామొచ్చిందంటే ముందు ఏడుపులే వినపడేవి. టెలిగ్రాం వస్తే ఏడవడం ఎందుకూ! ఇప్పటి మాటిది.అసలు టెలిగ్రాములే లేవనుకోండి ఇప్పుడు. అప్పుడు అత్యవసర వార్త ప్రాణానికి సంబంధించినదే. వార్త కూడా తెలిసే వుండేది. ఏమని మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియేట్లీ.ఇచ్చేవారు కూడా అవతల వ్యక్తి పోయినా సీరియస్ అనే ఇచ్చేవారు. మరీ భయపడకుండా వుండేందుకు.తరవాత ఫోన్లొచ్చాయి కాని సామాన్యునికి అందుబాటులోకి రావడానికి చాలా సమయమే పట్టింది. ఫోన్ కోసం పెట్టుకుంటే ఎప్పుడొస్తుందో తెలియదు. ఇదీ ఆనాటి పరిస్థితి.ప్రజలకి పబ్లిక్ కాల్ ఆఫీసులుండేవి. అవేగతి. సమాచార విప్లవం వచ్చిన తరవాత పరిస్థితులలో చాలా మార్పొచ్చింది. 1980  ప్రాంతం లో నాకు ఇంటి దగ్గర యస్.టి.డి వున్న ఫోన్ వుండేది. ఉపయోగం మాత్రం నాకు లేదు. కారణం నా బంధువులెవరికీ అప్పటికి ఫోన్లే లేవు. ఇప్పుడు లేండు ఫోన్లు, సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్లు ఎన్ని, ఎన్ని, సమాచారం క్షణాలమీద తెలుస్తోంది, కాని కంగారు మాత్రం పెరిగింది. మనుషులు దగ్గరకావడం కంటే దూరం ఎక్కువైపోతూ వుంది. సమాచార వ్యవస్థ పెరిగిన కొద్దీ మనసులు దూరమైపోతున్నాయనుకుంటున్నాను. దీనితో పాటు ఆరోజులలో ప్రయాణ సాధనం బస్సు, ఒకరు ఇద్దరైతే సైకిలు. బాగా కలిగిన మహరాజులకే కార్లుండేవి. పల్లెలలో కార్లు అన్న సమస్యేలేదు. కొన్ని గ్రామాలకయితే నీటి మీద మాత్రమే ప్రయాణం సాధ్యం. నేను పుట్టిన వూరికి ఆరోజులలో గోదావరి మీద మాత్రమే ప్రయాణం సాధ్యం.మా ఊరికి ఎర్ర బస్సు మొదటగా వచ్చిన రోజున యూరీగగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళేడు..

నేను నరసాపురంలో ఉద్యోగం చేస్తున్న రోజులు, ఆఫీసు కింద, పై అంతస్థులో నేను నివాసం ఉండేవాడిని. ఒక రోజు వుదయం పదిన్నర ప్రాంతంలో నా శ్రీమతి ఆఫీసులోకి ఏడుస్తూ వచ్చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ నా అఫీసులోకి రాలేదు, ఏడుస్తూ వచ్చింది మరి. ఆవిడ ఏడవటం చూసి నాకు కంగారొచ్చి, గబగబ లేచి పొదివి పట్టుకుని సముదాయించి ఏమయిందన్నా! ఏడుస్తూ చెప్పింది, తన తండ్రికి బాగోలేదని, తన అన్నగారు  ఇంటికి ఫోన్ చేసి చెప్పేడని, రమ్మనమన్నాడని. నాకు కంగారొచ్చింది. సరే నడు వెళ్దామని అంటే, స్టాఫ్ లో ఒకరు కారు రమ్మని చెప్పేరు. పావుగంటలో కారొచ్చింది. పిల్లలు బయట కెళ్ళేరు. వాళ్ళు వచ్చిన తరవాత విషయం చెప్పమని మేము బయలుదేరేము. ఈ లోగా మళ్ళీ మా బావమరిదికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి ఎలా వున్నాడురా మామయ్యా! అన్నా. బాగానేవున్నాడు, మీరు రండి అన్నాడు. వాడెంత సేపు చెప్పినా బాగున్నాడు మీరు రండి అనడం లో అనుమానం పెరిగిందేకాని తగ్గలేదు. నాకయితేవాడి మాటమీద నమ్మకం లేక పోయింది, ఆమెకయితే చెప్పేదేలేదు.. ఆదుర్దాతోనే బయలుదేరి వెళ్ళేము. వేసవికాలం మేనెల ఎండ మండిపోతూ వుంది. కారు మా మామగారి ఇల్లున్న వీధి మలుపు తిరిగేదాకా కంగారు ఏమిచూడాల్సి వస్తుందోనని. అమ్మయ్య కంగారేమీ కనపడలేదు. గుండె చిక్కబట్టుకుని వెళ్ళేము. బాగా జ్వరంగా వుంది. వైద్యమైతే ఏదో చేయిస్తున్నారు. ఆయనని చూస్తే నాకు భయమేసింది. వెంటనే కారెక్కించి పట్టణానికి తీసుకెళ్ళి, వీళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గరకెళితే, అతను చూసి వైద్యం చేస్తే,  రెండు, మూడు గంటలకి తెరిపిన పడి టెంపరేచర్ తగ్గింది. బతుకు జీవుడా! అని ఇల్లాలిని వాళ్ళ నాన్న దగ్గరొదిలేసి నేను రాత్రికి ఇంటికెళ్ళి పై ఆఫిసరుతో మాట్లాడి, ఈ పరిస్థితులలో వూరొదిలిపోయాను, మీకు చెప్పలేక పోయానన్నా! దానికాయన, మీరెక్కడొ పాత కాలంలో వున్నారు, రోజుల తరబడి చెప్పకుండా పోయిన వారు చాలా మంది వున్నారు. కంగారులేదుకదా, ఇప్పుడూ అని సముదాయించారు.

ఇప్పుడు వయసు పెరిగింది, సౌకర్యాలూ పెరిగాయి, కంగారూ పెరిగింది, అదే ఉత్కంఠ.దీని మూలంగా టెన్షన్.మొన్న నొక రోజు మనవడు హైదరబాదు నుంచి మాట్లాడుతూ తాతా జ్వరం వచ్చిందన్నాడు. డాక్టర్ దగ్గరకెళ్ళేను. ఇప్పుడు బాగుంది అన్నాడు.మూడవరోజు పెద్దబ్బాయి ఫోన్ చేసి మనవడికి జ్వరం తగ్గలేదని ఇంటికొచ్చేడని చెప్పేడు. డాక్టర్ దగ్గరకెళ్ళేము,జ్వరం ఉంది రెండు రోజుల్లో తగ్గుతుందని డాక్టర్ చెప్పేరు అన్నాడు.అప్పటి నుంచి నాకు కంగారు పట్టుకుంది. ఎలా వున్నాడని గంటకోసారి ఫోన్ చేస్తూవుంటె, ఇల్లాలు ఎందుకంత కంగారు, వాడు బాగునే వున్నాడు, జ్వరం తగ్గుతుంది. తల్లి తండ్రులు చెప్పేరు. మీరెందుకు కంగారుపడతారంది. నిజమే కదూ సద్దుకున్నా! మెయిళ్ళొచ్చాకా పరిస్థితి ఇంకా కంగారు పెడుతోంది. రోజూ మెయిలిచ్చేవారు ఎందుకివ్వలేదూ. కంగారు. ఏదో తెలియని భయం. ప్రేమ వున్న చోట అనుమానం,భయం, ఆత్రుత వగైరాలన్నీ కలిసి దాడిచేసి మనిషిని భయపెడతాయనుకుంటాను.నిజంగా ఇదేజరిగిందీ వేళ. అమెరికాలో వున్న మనవరాలున్న చోట రిక్టర్ స్కేల్ మీద 6.8  గా భూకంపం వచ్చిందిట. తాతా బాగానే వున్నాను అని మెయిలిచ్చింది. అక్కడినుంచి చూడండి నా బాధ. మూడు మెయిళ్ళిచ్చా! ఎలా వున్నావు, బాగుంటావు, బాగున్నావు అని.  ఈ విషయంలో నా ఇల్లాలు మంచి మాట చెబుతుంది. ఎందుకు కంగారు పడతారు, సెల్ ఫోన్ పలకకపోడానికి చాలా కారణాలుండచ్చు, వాళ్ళు బాత్ రూంలో వుండచ్చు మీరు ఫోన్ చేసే టయిముకి, లేదా ప్రయాణం లో బండి మీదుండచ్చు, మరెవరితోనయినా మాట్లాడుతూ వుండచ్చు, నిద్ర పోతూ వుండచ్చు. ఇవ్వన్నీ మీరే చెబుతారుకదా అందరికీ, ఒక గంట ఆలస్యంగా మెయిల్ పెడితే కంగారు పడిపోతే ఎలా అంటుంది. నిజమే కాని ఇవే మాటలు నేను ఆమెకు చెప్పిన సందర్భాలున్నాయి….. ఇదండి కంగారు సంగతి….

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-కంగారు.

 1. @
  అమ్మాయ్! జ్యోతిర్మయీ!
  ఆ రోజులే బాగున్నాయి తల్లీ! ఏమో ఏమయిందో అనే ఆత్రుత
  సమాచార వ్యవస్థ పెరిగిన దగ్గరనుంచి మరీ పెరిగిందమ్మా !

 2. రెండు సార్లూ ఫోన్ తీయకపోతే కంగారు పడి పోతూ ఉంటాం. అంతకు ముందు ఫోన్లు లేని కాలంలో ఎలా ఉండేవాళ్ళమో..ఆలోచిస్తే ఇప్పటి కంగారుకి కొంచెం నవ్వు కూడా వస్తుంది.

 3. @
  అమ్మాయ్ రసఙ్ఞా
  ధన్యవాదాలు. మూడు సార్లు మెయిలిచ్చింది, బాగున్ననుమొర్రో అని, ఆత్రుత నిలబడనివ్వదూ. కవిని కదా వినపడి చావదు, ఫోన్లో మాట్లాడలేదు మరి.

 4. ప్రేమ వున్న చోట అనుమానం,భయం, ఆత్రుత వగైరాలన్నీ కలిసి దాడిచేసి మనిషిని భయపెడతాయనుకుంటాను ఇది వాస్తవం. మీ మనవరాలు క్షేమంగా ఉంది. తాతని కంగారు పడద్దని చెప్తోంది! మీతో బోలెడు కబుర్లు చెప్పాలిట అక్కడకి వచ్చాక. మిమ్మల్ని నిశ్చింతగా ఉండమని చెప్పమంది. నేను ఎప్పుడు బయటకి వెళ్ళినా గంటలో వస్తానని అనుకోకుండా ట్రాఫిక్కులో ఇరుక్కుపోతే మరో అయిదు నిమిషాలకే అమ్మ ఫోన్ చేసేసి ఏమిటీ ఇంకా రాలేదు? క్షేమమేనా అని అడుగుతుంది. అందుకని నేనెప్పుడు పని మీద బయటకి వెళ్ళినా ఒక రెండు గంటలు ఎక్కువ వేసి చెప్తా. త్వరగా వస్తే ఎందుకు వచ్చేశావు అని అడగరు కదా! కంగారు కూడా ఉండదు!

 5. హలో హలో , వినబడుతోందా, నేను మెయిలు పంపించా చూసారా ? ఆ ఆ హలో హలో చా, లైన్ కట్ అయిపోయిందే !

  ఆ వైపు,

  ఏదో మెయిలు వచ్చిందా వచ్చిందా అంటున్నాడు వాడు, ఎం మైలబ్బా ?

  మల్లె ఫోన్ చేసి,

  హలో హలో ఇప్పుడు మీరేనా ఫోన్ చేసింది ??????

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s