శర్మ కాలక్షేపం కబుర్లు-పిలవని పేరంటం

పిలవని పేరంటం.

మా సత్తిబాబొచ్చాడు. ఈలోగా నా ఇల్లాలు,మీరు కబుర్లలో పడితే నా మాట చెవినేసుకోరు, పెద్దమ్మాయి, అల్లుడు రేపు వుదయం గౌతమికి వస్తున్నారు. చిన్న బాబుని పొద్దుట వెళ్ళి వాళ్ళని తీసుకు రమ్మని పురమాయించేను అంది. సరే అన్నా! మా సత్తిబాబు, ఏటి అమ్మాయి పండగముందొచ్చేస్తన్నాది, పండగకి రాదా, అల్లుడు గారు పిలకుండానే వచ్చేస్తనారా! అన్నాడు.అవును. అమ్మాయి పండగకి రాను అప్పటికి తన కూతురు, అల్లుడు, మనవరాలు తనింటికొస్తారట, ఈలోగా మమ్మల్ని చూసిపోదామని వస్తున్నా అని చెప్పేరన్నా! అల్లుడుగారు మంచివాడే పిలవకుండా వస్తున్నారన్నాడు. ఈ పిలుపులు పట్టింపులు పెళ్ళయిన కొత్తలోనే తరవాత వుండవు, అతను కూడా ఈ ఇంటి సభ్యుడేగా అన్నా! అల్లుడు పిలుపులు పట్టింపులమీద ఏదో కత వుంది చెప్పండి అన్నాడు. అదా చాలా పెద్దది క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా! ఇది నిజంగా సందర్భంకాదు. అడిగావుకనక చెబుతున్నా అన్నా.

సతీదేవి దక్ష ప్రజాపతి తపస్సు చేస్తే, కూతురుగా పుట్టమని కోరితే పరదేవత అతనికి దాక్షాయణిగా జన్మించింది. శంకరుని వివాహమాడింది. ఒకనొక సభలో దక్షప్రజాపతి వచ్చినపుడు గౌరవసూచకంగా అందరూ లేచినిలబడతారు. శంకరుడు లేచి నిలబడలేదు. దక్షుడు కోపించి అల్లుడు తనను అవమానించాడని నిరీశ్వరయాగం మొదలు పెట్టేడు. అందరికి ఆహ్వానాలెళ్ళిపోయాయి, దేవతలంతా విమానాలమీద దక్ష యఙ్ఞానికి వెళుతున్నారు. దాక్షాయణి శివుణ్ణి  యఙ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శంకరుడు, పిలవని పేరంటానికి వద్దని, అవమానం జరుగుతుందని చెప్పేడు. దాక్షయణి వెళతానంది, శంకరుడు ప్రమధ గణాలని తోడిచ్చిపంపేడు. అసలు కిటుకు ఇక్కడే వుంది. వద్దని చెప్పినపుడు అమ్మ శంకరునితో ఏమంటుందంటే! గురువుల ఇంటికి,పుట్టింటికి, తన దేశాన్ని పరిపాలించే రాజు ఇంటికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళచ్చు, మిగిలిన చోట్లకి నిషిద్ధం. అమ్మ అడగడం లో అందముంది. అమ్మ వుద్దేశ్యం వేరు. తన భర్త,ఈశ్వరుడు అయినవారికి స్థానంలేని యఙ్ఞం జరగడం ఇష్టం లేదు. దానిని ఆపగలవారులేకపోయారు. ఆపగలవారొక్కరే  కాని ఆయన పట్టించుకోటంలేదు. ఎలా పట్టించుకునేలా చెయ్యడం, అదీ అమ్మ ఆలోచన. శివుడు రుద్రుడయితే పట్టించుకుంటాడు. శివుణ్ణి రుద్రుని చేయగలది అమ్మ మాత్రమే. అందుకే వెళ్ళింది.అవమానపడింది. ఈ అవమానం తనకి కాదు, శివునిదిగానే తలచింది మొదటినుంచీ, అదే నిరీశ్వర యాగం. అగ్నిలో భస్మరాశిగా మారిపోయింది. వార్త తెలిసిన శివుడు రుద్రుడయ్యాడు. జటా జూటం పెరికాడు. నేలపడిన జటనుంచి వీరభద్రుడు జన్మించాడు. శివుని ఆఙ్ఞ పనుపున దక్ష యఙ్ఞ వినాశనికి వీరభద్రుడు వెళ్ళి, నిరీశ్వరయాగానికొచ్చిన దేవతలందరిని చితక కొట్టేడు.దక్షుని తల తరిగాడు. ఆ సందర్భంగా తగిలిన దెబ్బకే సూర్యుడికి పళ్ళు వూడి పోయాయి! అందుకే ఆయనకి ఈరోజుకీ పరమాన్నమే ఆరగింపు. తరవాత ప్రార్ధింపబడిన శంకరుడు అనుగ్రహించి దక్షునికి మేకతల అమర్చే ఏర్పాటుచేసి, శంకరుడు శాంతించి యఙ్ఞాన్ని పరిపూర్తి చేయించాడు.

ఇదిటూకీగా చెప్పబడినది.వీరభద్రుడు తిరిగివస్తూ పట్టసం అనే ఆయుధాన్ని జారవిడుచుకున్న చోటే నేటి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వెలసిన పట్టిసీమ. పరదేవత,  పిలవకపోయినా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళవచ్చనే విషయం లోకంలో తెలియచేయాడానికి, నిరీశ్వర యాగం చేయబూనడం తప్పు, ఆతప్పు చేసేవారు తండ్రయినా దండించవలసినదేననే సంగతి తెలియచేయడానికి, శివుని నిందించిన వారు బతకరని చెప్పడానికే అమ్మ యఙ్ఞానికి వెళ్ళింది. ఇది రహస్యం. మనం అర్ధం చేసుకోవాలి.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-పిలవని పేరంటం

  1. సరిగ్గా రెండు రోజుల క్రితమే ఇదే విషయం గురించి నేను మా తాతగారూ మాట్లాడుకున్నాం ఉత్తరాలలో! మన అనుకున్నప్పుడు పిలుపు కోసం ఎదురు చూడవలసిన పని లేదు అలా చూసాము అంటే మనం వాళ్ళని మన వాళ్ళగా భావించటం లేదని నా అభిప్రాయం!

వ్యాఖ్యలను మూసివేసారు.