శర్మ కాలక్షేపం కబుర్లు- పెళ్ళిళ్ళ సంత

పెళ్ళిళ్ళ సంత.

మొన్న నొక అమ్మాయిని పెళ్ళిచేసుకోడానికి ఒప్పించిన దగ్గరనుంచి, నాకు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఒక రోజు పెళ్ళి కి వొప్పించిన అమ్మాయి తల్లి తండ్రులొచ్చేరు. బాబయ్యా! మొన్న నువ్వు చెప్పేకా  పిల్ల  వొప్పుకుంది.  ఒక  సంబంధం  చూసాము. కాని మాకే నచ్చలేదు, వాళ్ళ  గొంతెమ్మ కోరికలు  చూసి. వాళ్ళకి  పిల్ల కంటే  ముందు,  సొమ్ము మీద  ఎక్కువ అపేక్ష కనపడింది, అందుకే  కాదనుకున్నాము. .ప్రతి ఆదివారం పక్కనున్న పట్నంలో పెళ్ళిళ్ళ సంత  జరుగుతుంది, అక్కడకెళదాము అంది. మామయ్యగారూ  ఆదివారం కారేసుకొస్తాను మీరు, అత్తయ్యగారు, నేను, మీ అమ్మాయి కలిసి వెళదాము.  మీకు ఏరకమైన ఇబ్బంది లేకుండా  చూసే  బాద్యత  నాది.  మీరు తప్పకుండా  రావాలన్నాడు. అయ్యో ఇదేంటయ్యా! కూరల సంత, సరుకుల సంత, పశువుల సంత  ఎరుగుదును, కాని పెళ్ళిళ్ళ సంత తెలియదే అన్నా.  బాబయ్యా, పెళ్ళిళ్ళ సంత అంటే మేరేజి బ్యూరో, నీకు ఇంగ్లీషులో చెబితే తెలియదని ఇలా చెప్పేరు. ,ఇప్పుడు వీధికి మూడు మేరేజి బ్యూరోలున్నాయి.  ఆఖరికి పత్రికలవాళ్ళు కూడా  గెట్ టుగెదర్లు  కులాలవారీగా ఏర్పాటుచేస్తున్నారు, అంది.  పాత కాలంలో బతకలేని వాళ్ళు  పెళ్ళిళ్ళ పేరయ్యలుగా  తిరిగి పెళ్ళిళ్ళు చేయించి బతికేవారు.  ఇప్పుడు  బతకుతెరువుగా  పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు.  సరే మీ పిన్నిని అడుగు ఏంఅంటుందో అన్నా. అందుకు నా ఇల్లాలు, దానికేం వెళదాం.  మీరు ఉదయాని కొచ్చెయ్యండి.  నేను వంట చేసి  కేరేజిలో సద్దుతాను, నువ్వేం ప్రయత్నం చెయ్యకే అమ్మాయ్ అంది.  ఆదివారమొచ్చారు.  అందరం  శకునం  చూసుకుని  మరే బయలుదేరాము.  అక్కడికెళ్ళేటప్పటికి  నిజంగానే సంతలా వుంది.  ఒకటే జనం.  ఒక పెద్ద హాలులో టేబుళ్ళేసి  అక్కడెవరో  కూచుని  ఏదో చేస్తున్నారు,  ఆహూతులు  కూచోడానికి కుర్చీలేసారు.. మామయ్యా, మీరు అత్తయ్య  ఇక్కడే  కుర్చిలలో  కూచోండి.  మేంవెళ్ళి అక్కడ,  రిజిస్ట్రేషన్ ఫీజు  వగైరాకట్టి,  మనకు  కావలసినవి  చేసుకొస్తా మని  వెళ్ళేరు.

ఈలోగా మాకు, మాలాగే వచ్చిన మరొకాయన కనబడ్డాడు. మీరెవరంటే  మీరెవరనుకుని, ఎవరం  ఎ0దుకొచ్చామో చెప్పుకున్నాము.  ఆయన  మొగపిల్ల వాడికి  పెళ్ళి సంబంధం  కోసం తిరుగుతున్నాడట.  రెండేళ్ళనుంచి తిరుగుతున్నా,  సంబంధం కుదరలెదన్నాడు.  అదేమన్నా.  అబ్బాయి స్వంతంగా ఫేక్టరీ నడుపుతున్నాడు. వంద మందికి వుపాధి చూపిస్తున్నాడు.  నాకు కట్న కానుకలొద్దు.  ఇంటిని  నిర్వహించుకునేపిల్ల,  ఉన్నవాటిని చూసుకోగల పిల్ల, సంసారం లో కలిసిపోయేపిల్ల,  చదువుకున్నది చాలు అంటున్నా,  పిల్లకి, పిల్లవాడికి నచ్చుబాటయితే చాలు.  బాగానే  వుందిగా  మరి  ఇంతకాలం  ఎందుకు పట్టిందన్నా. అమ్మాయిల  తల్లి తండ్రులు  వుద్యోగస్తుడయి వుండాలంటున్నారు.  వ్యాపారం కుదరదట.  గవర్నమెంటు వుద్యోగి ఐతే చాలట.  ఏడవాలో నవ్వాలో తెలియటం లేదు.  ఒక సంబంధం వచ్చింది.  అన్నీ నచ్చేయి,  కాని పిల్ల తల్లికి  పెళ్ళికొడుకు నచ్చలేదట. మరో సంబంధంవాళ్ళు  జాతకం నచ్చలేదన్నారు.  మనకి జాతకాలు చూసే పెళ్ళి చేసేరా! కుల గోత్రాలు  చూసి పిల్ల  కనుముక్కు తీరు చూసి  ఈ పిల్ల మనబ్బాయికి బాగుంటుందని పెద్దవాళ్ళు చెబితే, మనం లాంఛనంగా వెళ్ళి, చూసొచ్చి బుర్రూపితే పెళ్ళి చేసేవారు.  మనం బాగోలేమూ,  అని ఆయన  బాధ వెలికక్కేడు.  మనకాలంలో ఈ పిచ్చిలు లేకపొయాయి. ఏమో కాలం మారిపోయిందన్నాడు.  ఈలోగా అమ్మాయి  వచ్చి  రిజిష్ట్రేషన్ చేయించాము. ఇప్పుడు సంత మొదలవుతుందంది.  నెమ్మదిగా  పదకొండయింది.  ఒకాయన  పెద్ద పుస్తకం పుచ్చుకుని  స్టేజి మిదకొచ్చి  అందరికి అభివాదం చేసి ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నది, ఎన్ని పెళ్ళిళ్ళు కుదిర్చినది చెప్పి కార్యక్రమం లోకి దిగేడు.

అబ్బాయి వయసు ముఫై, అమెరికాలో వున్నాడు. సాఫ్టు వేర్ ఇంజనీరు.  ఇక్కడ తల్లి తండ్రులున్నారు. కట్నం అక్కరలేదు.  లాంఛనాలతో పెళ్ళిచేస్తే చాలు. ఘనంగా చెయ్యాలి పెళ్ళి. చెన్నైలో  కాని  హైదరాబాదులో  కాని  హోటల్  బుక్ చేసి  అక్కడచెయ్యాలి. ఎక్కడన్నది తరవాత చెబుతారు. అమ్మాయి  కూడా  సాఫ్టువేర్  వుద్యోగం  చేస్తూవుండాలి,  పెళ్ళయిన తరవాత  అమెరికా రావాలి.  అమ్మాయికి తల్లి, తండ్రి అన్నా, తమ్ములుండాలి.  ఇందుకు తూగేవారు  కౌన్టర్నెంబర్ మూడులో  రిజిస్టర్ చేయించుకోండి.  మధ్యాహ్నం ఇంటర్యూలుంటాయన్నాడు.  ఒక ఆరుగురు లేచారు.  మావాడులేవలెదు.  ఏమన్నా! అన్నీ బాగున్నాయి  కాని  పిల్లకి  అన్నదములను ఎక్కడనుంచితేను, నాకొకతేకదా పిల్ల, అన్నాడు. సరే ఇలా చెప్పుకుంటూ  వెళ్ళేడు,  స్టేజిమీద  పెద్దమనిషి.. వీళ్ళది  కూడా  చెప్పేడు.  ఎవరో నలుగురు  రిజిస్ట్రేషన్  చేయించారు.

మద్యాహ్నం  ఇంటర్యూకి  నలుగురం  నాలుగు  దిక్కులకి వెళ్ళేము,  తెచ్చుకున్న కేరేజి కారులోకూచుని  తినేసి.  ఎక్కడికెళ్ళినా, ఈవేళ విషయం చెప్పమన్నవారొకరు,  అదేమిటి మీరు చెప్పిన  విషయాలు చూసుకోవాలి,  అలాగే  మేము  చెప్పినవి  మీరు  కూడా చూసుకోవాలి  కదా అన్నా!  కాదు  విషయం  ఇప్పుడే తేలిపోవాలన్నారు. . పిల్ల వుద్యోగం మానెయాలన్నవారొకరు,  తల్లి తండ్రులకి  ఒకతే కూతురు  కనక  వాళ్ళ  బాధ్యత లేదన్నవారొకరు,  మరొకరు పిల్ల,  పిల్లాడికంటే  ఎక్కువ  చదువుకుంది  కుదరదన్నారు.. కొంతమంది  వీరికి  కొంతమంది వారికి నచ్చలేదు. ఒకటి మాత్రం  కొంచం  దగ్గరగా వచ్చిందికాని  పెళ్ళికొడుకు  కావాలంటున్న  ఎత్తుకన్నా మూడంగుళాలు ఎత్తు ఈ పిల్ల తక్కువుంది.  వాళ్ళు ఠాట్!  కుదరదన్నారు.  సరే సాయంత్రమైనది.  ఏడుపుమొఖాలేసుకుని ఊసురోమంటూ  తిరిగొచ్చాము.

పదిహేను రోజుల తరవాత మళ్ళీ వచ్చారు భార్య భర్త.  నేను చెప్పేసేను.   నాయనా! పరిస్థితులు మా చేయి దాటిపోయి వున్నాయి. సంబంధం మీరే నిర్ణయం చేసుకోండి అన్నా! అందుకు అమ్మాయి, బాబయ్యా  మా  వూరిపక్కనున్న  ఊరిలో  ఒక సంబంధం తెలిసింది, చూసివద్దామని వెళ్ళేము.  మాకు అన్ని విధాలా నచ్చింది.  అబ్బాయి  ఇక్కడె వుంటాడు. వ్యవసాయం  చేసుకుంటున్నాడు.  చదువుకున్నాడు.  ఆస్థిపాస్థులు, ఇల్లువాకిలి వున్నాయి. అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు వున్నారు.  ఇతనికి  కూడా  మంచి  వాటాయే వస్తుంది. కట్న కానుకలొద్దన్నారు.  మాకున్నది  పిల్లలకే  అని  చెప్పేము.  వాళ్ళు,  పెళ్ళి తరవాత మమ్మలిని  కూడా  పిల్లతో  వచ్చెయ్యమన్నారు.  మేము ప్రస్తుతానికి రాము,  తరవాత రోజుల్లో వస్తామని చెప్పేము.  అమ్మాయి  వుద్యోగం  చేసుకోడానికి  అభ్యంతరంలేదు.  కొద్ది దూరంలో  వుద్యోగం  చేసుకుంటుంది.  ఇతను  ఇక్కడ,  అక్కడ  సరి  చూసుకుంటానని చెప్పేడు.  సంబంధం కుదిరింది.  పిల్ల మా కళ్ళముందు వుంటుంది.  వాళ్ళిద్దరికి భాగ్యానికి లోటులెదు.  పిల్ల, పిల్లాడు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.  నువ్వు  మా పిల్ల  పెళ్ళిగురించి  చాలా శ్రద్ధ తీసుకున్నావు.  నీకీమాట  మేమిద్దరం  స్వయంగా వచ్చి చెప్పాలని వచ్చామన్నారు. బాగుందమ్మా! పిల్లలికి  కొన్ని నచ్చక , మనకి కొన్ని నచ్చక, గొంతెమ్మ కోరికలతో వుంటే పెళ్ళిళ్ళుకావు.  మూడంగుళాల ఎత్తు తక్కువని పెళ్ళి మానుకున్న వాడు తెలివయినవాడా. మీ పిన్ని నాకంటే పొట్టి, మాకేంతక్కువయింది.  ఒకరికి చూడటానికి నచ్చడం కాదు, మనకు నచ్చాలి. మన మనసుకు నచ్చాలి. బాహ్య సౌందర్యం రేపే పోవచ్చు, కాని అంతర్ సౌందర్యం అలా కాదే.   మనసులు కలిసి సుఖంగా వున్న దాంట్లో బతికి, పది మందికి వుపకారం చెయ్యడం కంటే అందం, ఆనందం ఏముందమ్మా అన్నా!  పెళ్ళికెళ్ళాలి మరి.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు- పెళ్ళిళ్ళ సంత

 1. @
  భాస్కర రామిరెడ్డిగారు,
  నా బ్లాగుకు మొదటిసారి వచ్చినందుకు స్వాగతం. ఇది చిన్న, చిన్న మార్పులతో జరిగింది.

 2. @
  అమ్మాయ్ రసఙ్ఞా
  జరుగుతున్నది అదే. సరుకుల్ని కొనుక్కునేచోటును తెలుగులో సంత అనే అంటారు మరి. కట్నం వద్దు కాని ఘనంగా లాంఛనాలు జరపండి అంటే లేకిగా లేదూ?

 3. @
  అమ్మాయ్ జ్యోతిర్మయి
  కావలసిన విషయాలొదిలేసి అక్కరలేని వాటికి బాహ్య ఆడంబరాలకి పోతూ వున్నారనేనమ్మా బాధ.
  ధన్యవాదాలు

 4. మంచి పేరు పెట్టారు తాతగారూ. అమ్ముడవ్వాలనుకున్న మగవాళ్ళకి ఈ పేరు సరిగ్గా ఉంటుంది! ఆడవాళ్ళు వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నట్టు వీళ్ళని కొనుక్కుని తెచ్చుకోవటమే!

 5. ఏమి చోద్యము! వ్యవసాయము చేయు మానవుని ఉద్యోగం చేయు మానవి పెళ్లి యాడుటయా ! ఇదేమి విడ్డూరము! పెళ్లి సంత వాళ్ళు వెంటనే కార్య రంగం లో కి దిగి ఇటువంటి వాటిని అరికట్టవలె. లేకున్నచో మీ నౌకరీ గోవిందా! గోవిందా!

  ఈ కాలం లో అన్నీ కొత్త ప్రొఫెషన్ అయిపోయాయి. బతక లేని బడి పంతులన్నారు ఆ కాలం లో. ఈ కాలం లో బతక నేర్చినవాడు విద్యా సంస్థ వాడు. సంస్థా పరం గా అన్ని తల కిందు లవుతున్నాయి. కాల మహిమ శర్మ గారు, ఎం చేద్దాం ! అంతా విష్ణుమాయ.

 6. చివరి మాటలు ఎంత చక్కగా చెప్పేరు సార్… మ్యారేజ్ బ్యూరో కి పెట్టిన పేరు సూపర్ ఉందండీ.. ద.హా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s