శర్మ కాలక్షేపం కబుర్లు-జల్లెడ అడ్డంపెట్టి ఊకతో కొట్టేడు.

జల్లెడ అడ్డంపెట్టి ఊక పుచ్చుకు కొట్టేడు.

మా సత్తిబాబొచ్చాడు. వస్తూనే పంతులుగారు ఎగతీస్తే బ్రహ్మహత్య, దిగతీస్తే గోహత్య అని, తిట్టబోతే అక్క కూతురు కొట్టబోతే చూలాలు, …గారికి కోపం వచ్చి పెళ్ళాన్ని జల్లెడ అడ్డంపెట్టి ఊకపుచ్చుకు కొట్టేడంటారు. వీటి సంగతి చెప్పమన్నాడు.పెద్దపనే పెట్టేవు విను అన్నా!

తిట్టబోతే అక్క కూతురు, కొట్టాబోతే చూలాలు. ఇందులో అక్కకూతురే పెళ్ళాము మరి. అక్క కూతురిని తిట్టడానికి లేదు. పోనీ కొడదామనుకుంటే చూలాలు ఎలా కొడతాడు. పని జరగదు. ఆలోచన మాత్రం ఉంది. కొట్టకపోడానికి ఆలోచన చేస్తాడు, కారణాలు వెతుక్కుని మానేస్తాడు. తరవాత ఎగతీస్తె బ్రహ్మహత్య, దిగతీస్తే గోహత్య. ఒక రాజుగారు తనకోటలో వుండగా ఆయన మీద పరాయి రాజు దండయాత్ర చేసాడు. రాజు గారికి కోటలో పటాలంలేదు. బుర్ర ఉపయోగించి దేశం లో వేదపండితులను, నిరాయుధులను, ఆవుల మీద ఎక్కించి యుద్ధ రంగానికి పంపేడు. అవతలి సైనికులు విల్లు ఎక్కుపెట్టి కొట్టబోతే పైకి బాణం వేస్తే వేదపండితుడు చస్తాడు. కిందకి వదిలితే గోవు చస్తుంది. పాత కాలం రోజుల్లో కనక, ధర్మ సంకటంలో పడి వాళ్ళు పారిపోయారు. కోటలో రాజు బతికి పోయాడు. ఇక్కడ ఆలోచన ఆచరణ ఉన్నాయి కాని అనుకున్న పని జరగలేదు…… గారి తల్లికి కోడలు మీద కోపం వచ్చి కొడుక్కి చెప్పింది. తల్లిని సంతోషపెట్టాలి, అలాగే పెళ్ళానికి బాధ కలగ కూడదు.అప్పుడు…..గారు కోపం తెచ్చుకుని జల్లెడ అడ్డం పెట్టుకుని ఊకపుచ్చుకుని కొట్టేడు.  అసలు ఊకతో కొడితే దెబ్బ తగలదు. దానికితోడు జల్లెడ అడ్డం పెట్టేడు. అంటె ఊక పాయ కూడా పెళ్ళాం మీద పడదు. ఇక్కడ అలోచన, ఆచరణ, ఉన్నాయి కాని ఫలితమేలేదు. కాదు అక్కరలేదు. తల్లికి పెళ్ళాన్ని దండిస్తున్నట్లుగా చూపేనాటకం. ఇదయ్యా సంగతి అన్నా!.బాగా చెప్పేరు నేనో కత చెప్పనా అన్నాడు. దానికేం చెప్పు అన్నా. మా సత్తిబాబిలా చెప్పేడు.

అనగనగా ఒక రాజు, ఆరాజుకి దగ్గరగా ౩౦౦ మంది అధికార, అనధికార సభ్యులు. మంత్రులు, అధికారులు, వగైరా వగైరా వున్నారు. ఇందులో ఒక మంత్రి పితూరి లేవతీస్తునాడని రాజుకి అనుమానం వచ్చింది. మంత్రిని లొంగతీయాలి ఎలా? దండనాయకుణ్ణి పిలిచి, మన దేశంలో అవినీతి పెరిగిపోయినట్లుగా అనుమానమొచ్చింది. తగు చర్య తీసుకుని చెప్పమన్నాడు. దండనాయకుడు వ్యాపారులమీద పడి దస్త్రాలు తెచ్చి చూస్తే అందులో ఎవరెవరికి ఎంతంత లంచంగా, సొమ్మిచ్చినది వైన వైనాలుగా వున్నట్లు పొక్కింది. గోలగొలైపోయింది. పితూరి లెగతీద్దామనుకున్న మంత్రి ఇందులో చిక్కుకుపోయాడు. తనవాళ్ళని అందరిని పిలిచి ఇది గోరం, ఆపు చేయించమని రాజు గారికి చెప్పించేడు. కుదరలేదు. అప్పుడు మీరు చెప్పినట్లు మేము వింటాము ఇయ్యన్ని తీయించేయండి. లేదా పితూరి లెగతీస్తామన్నాడు. ఇంకో సంగతి కూడా చెప్పేడు. వాడెవడో, వాడి పుస్తకాల్లో మా పేర్లు రాసుకుని డబ్బులిచ్చేనంటే కుదురుద్దా. సాచ్చికాలక్కరలేదా. కోర్ట్ కెల్తే కేసు నిలబడద్దా, మీ వోదనతో. అంచేత ఎనక్కి తీసుకోమన్నాడు. రాజు గారికి కావలసిన పనయిపోయింది. దండనాయకుడు తెచ్చిన దస్త్రాలలో ఈళ్ళ పేర్లున్నాయా, ఎందుకున్నాయి, ఎలా వున్నాయి చూసి చెప్పమని సెగెట్రీ కి చెప్పేరు రాజుగారు. సరి అక్కడితో ముందు గొడవాగింది. సెగెట్రీ చూడాలి, ఈలోపట ఎన్ని కాగితాలుంటాయో, ఎన్ని ఎగిరి పోతాయో ఎవురికెరుక. సెగెట్రీ చూసి చెప్పేటప్పటికి ఎంతకాలం పడద్దో. ఎవురి కెరిక, అన్నాడు.

కత బాగానే వుందిగాని, ఇందులో నాయకుడివి నువ్వేలా వున్నావన్నా! వామ్మో పంతులుగారు నేను కాదండీ అన్నాడు. ఇది మూడో సామెతకి సరిపోలేదా అన్నాడు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-జల్లెడ అడ్డంపెట్టి ఊకతో కొట్టేడు.

  1. @
    అమ్మాయ్!సుభా!
    సామెత తెలుగునాట స్పష్టంగా అందరికి తెలుసు. ఒకరిని కించపరచినట్లుగా వుంటుందేమోనని ఖాళీ వదిలేసా. నీ సందేహమ్ తీరినందుకు ధన్యవాదాలు

  2. ఏం లేదు తాత గారూ —— గారికి కోపం వచ్చి అన్న చోట ఆ ఖాళీలో ఏమిటబ్బా అని అనుకుని అడగాలా వద్దా అనే సంశయంతో వదిలేసాను. ఇప్పుడు నా సందేహం తీరిపోయింది. అంతే తాతగారూ. ఇంకేం లేదు.

  3. తాత గారూ ఆఖరున ట్విస్ట్ అదిరింది…అంతా బానే ఉంది కానీ…?? వద్దులెండి, ఏమీ లేదు.

వ్యాఖ్యలను మూసివేసారు.