శర్మ కాలక్షేపం కబుర్లు-తెనుగునేర్పిన తల్లులు

తెనుగు నేర్పిన తల్లులు.

ఈరచన నాదికాదు. చదవండి

“దాపరికం ఎందుకూ?
గ్రంధాలు చదివే నేను తెలుగు భాష తెలుసుకున్నాను.
స్త్రీలనాశ్రయించిన్ని నేర్చుకున్నా న్నేను తెనుగు భాష.
ప్రయోగ విఙ్ఞానం కూడ స్త్రీలవల్లనే అలవడింది నాకు.
జరిగిందేమంటే?
మొత్తం మీద,అప్పటిదాకా,నేను చదువుకున్నది పద్య వాఙ్ఞయమూ, రచిస్తున్నది వచన వాఙ్ఞయమున్ను.
రెండింటికీ లంగరందలేదు.
అందుకోసం,తప్పని సరిగా,నేను జనుల సంభాషణలు వినవలసి వచ్చింది.
అందులోనూ స్త్రీల సంభాషణ వినవలసి వచ్చింది.
పురుషుల భాష అయినా, ఇప్పటిలాగా ఇంగ్లీషు మొదలైన పరభాషలతో సంకరం అయి,పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు.
అయినా,పురుషుల భాషలో కంటే,స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను పట్టివేసే జాతీయతా కనపడింది నాకు.
వారి మాటల పొందికా,వారి హావ భావ ప్రదర్శనాచాతుర్యమూ తెనుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి.
ఈ విశేషం కనబడగానే స్త్రీల గోష్ఠి జరిగేచోట నేను పొంచి వుండడం ప్రారంభించాను. అది నెల కిరవై రోజులు మా ఇంటోనే సమకూరేది.
ఏమంటే?
మా నాయనగారు, మధ్యాహ్నం భోజనం కాగానే మహేంద్రవాడో, రామవరమో వెళ్ళేవారు, నియతంగా.
భోజనాలయి, యిళ్ళు సద్దుకోడం కూడా అయాక, తటవర్తి సుబ్బమ్మ( భీమరాజుగారి భార్య)గారూ, మైలవరపు జోగమ్మగారూ,బుద్ధవరపు సీతమ్మగారూ మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు.
వారి దృష్టిలో, అదీ కాలక్షేపం కోసం లోకాభిరామాయణం విడెయ్యడం; కాని నా దృష్టిలోరసమహితమైన సాహిత్య గోష్టి.
ఆ నలుగురిలోనూ మళ్ళీ ధోరణి భేదించేది, స్పష్టంగా.
బుద్ధవరపు సీతమ్మగారు ఛలోక్తులు విసిరేవారు.
మైలవరపు జోగమ్మగారు శ్లేషలు కురిపించేవారు.
మా అమ్మగారు సామెతలూ పలుకుబళ్ళూ విరజిమ్మేవారు.
తటవర్తి సుబ్బమ్మగారు నిండుకుండలాగా నిశ్చలంగా మాట్టాడేవారు.
నవరసాలూ చిప్పిల్లేవి ఆ గోష్ఠిలో.
సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేది, అప్పుడక్కడ.
కాళిదాసు నాలుకమీద బీజాక్షరాలు రాసిందట కాళికాదేవి.
నా చెవిలో మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు.
ఇవాళ నేను రాస్తున్న భాష వారనుగ్రహించినదాన్లో సహస్రాశమైనా కాదు, ఇంతా చేస్తే.
ఇలాగ,నేను,వారేకాదు నలుగురు స్త్రీలెక్కడ మాట్టడుకుంటున్నా వింటూ వుండేవాణ్ణి.
అయితే రచన ప్రారంభించినప్పణ్ణుంచీ మాత్రమే కాదు నాకు,యీ అలవాటు.
నా చిన్నతనంలో, మా అమ్మగారెవరింటి కయినా పెత్తనాలకు వెడితే,ఆమె చంకన మా చెల్లెలూ, చెయ్యి పట్టుకుని నేనూ సిద్ధం.
ఆ పసితనంలో కూడా, నాగస్వరం విన్న కోడెతాచులాగ వారి సంభాషణ వింటూ తెలియకుండానే పరవశుణ్ణయేవాణ్ణి,నేను.
అప్రయత్నంగా ప్రారంభమైన అయిన ఆ అలవాటూ, తెలియకుండానే అలవడిన ఆ పారవశ్యమూ రచన ప్రారంభించాటప్పటికి వరప్రసాదాలయినాయి, నాకు.
ఇక్కడ మరొకసంగతి కూడా చెప్పాలి, అవశ్యమున్ను.
బుద్ధవరపు సీతమ్మగారి ఇంటో కలుసుకునేవారు ఆ స్త్రీలు, అప్పుడప్పుడు.
దొడ్డిదారిని వచ్చి శ్రీ దాట్ల దివాకరరాజుగారి భార్య బుచ్చివెంకయ్యమ్మ (?) గారున్నూ కలిసేవారాగోష్ఠిలో.
పొడుగుకు తగిన నిండైన విగ్రహమూ, పాదాల మీద జీరాడుతూ చారల తాబొందూ,చేతులకు కంకణాలూ,పోచీలు,మురుగులూ,చెవులకు జూకాలూ, కరిణిపువ్వులూ- వీటితో, క్షత్రియ సామాన్య స్త్రీగా కాదు- మహారాణీ లాగ కనబడేవారామె, నాకు.
పెద్దాపురం రాజవంశానికి చెందిన కొంకుదురు శ్రీ వత్సవాయవారి ఆడబడుచు ఆమె.
ఆమె మాట కూడా రాణుల ధోరణిలోనే వుండేది.
వారి ఏకపుత్రులు సూర్యనారాయణరాజుగారి కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా, వాత్సల్యం గుమ్మరిస్తూ
నన్ను దగ్గరకూచోబెట్టుకుని ” ఆరగించడి బాబూ” అనేవారామె, పూచుట్టరేకులు పళ్ళెంలో వుంచి.
ఇంతకీ,-
జాతీయమైన తెనుగు భాష కావాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి, మరో దారి లేదు.
నాకు రాచ మర్యాద లేమయినా తెలుసునంటే, అవి, ఆ చిన్నతనాన ఆ దివాకరరాజుగారిఇంటో  గ్రహించినవే.
రాజరాజు నాటకంలో, రత్నాంగి పాత్ర చిత్రించేటప్పుడు ఆ బుచ్చివెంకయ్యమ్మగారి మూర్తిమంతమే ప్రత్యక్షాదర్శం, నాకు.”

పై, తెనుగు భాషకు సంబంధించి రాసినది నా అభిమాన రచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “అనుభవాలు -ఙ్ఞాపకాలూను”నుంచి ఎత్తి రాయబడినది. రాతలో దోషములన్నీ, నావే, రచయితవి కావని విన్నపం. దోషాలుంటే తెలియచేయగలరు. మూలం చూసి సరి చేస్తాను. శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి  గారు మా వూరికి మూడు కిలో మీటర్ల దూరంలో వున్న ” పొలమూరు” అనే గ్రామములో జన్మించారు. వారి గురించి నేను చెప్పబోవడం హాస్యాస్పదము.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-తెనుగునేర్పిన తల్లులు

 1. ఇవ్వాళే “ఏ-క్ఖ-డా లంగరందలేదు” కథ చదివాను. అటు పిమ్మట ఆ కథపై ఎవరన్నా ఆన్లైన్ లో తమ అభిప్రాయాలు రాసారేమో చూదామని శోధించగా, మీ టపా ఎదురయింది. మొత్తానికి “లంగరందలేదు” అన్న పదమే శ్రీపాద వారి సొత్తా ఏమి … అటు తిరిగీ, ఇటు తిరిగీ వారి వద్దకే చేరుకుంటున్నాను 😉

  • @సౌమ్యగారు,
   శ్రీపాద వారినో చూపు చూస్తున్నట్లుంది మీరు. ఆయన పడికట్టు మాటలు ఆయన దగ్గరకే తీసుకెళతాయి కదా. మీకు నా బ్లాగే సెర్చ్ లో కనపడటం గొప్ప విషయమే, ఆనందం.
   నెనరుంచండి.

 2. @
  తాడిగడప శ్యామలరావుగారు,
  ధన్యవాదాలు.ఇప్పటికీ సంభాషణా చాతుర్యం స్త్రీల సొత్తంటే ఆశ్చర్యం లేదు. ఒక చిన్న సంఘటన చెబుతా. ఒక అమ్మాయి బ్లాగు, ఒక చిత్రం ప్రదర్శించి, ఒక కవిత రాసింది. ఒక అబ్బాయి ఒక కామెంటు పెడుతూ. కవిత మీదేకాని, బొమ్మ ఎక్కడకొట్టుకొచ్చేరని సరదాగా అడిగేరు. దానికి మరొక అమ్మాయి, ఏమండీ, కొట్టుకొచ్చిన బొమ్మలంటే మీకిష్టమేగా అంది. ఎంత చక్కటి సంభాషణా చాతుర్యం. సునిసిత హాస్యం అందులో దొర్లింది చూడండి.

 3. మంచి విషయాలు కలబోసారు. నా పసితనంలో మా అమ్మగారితో పాటు నేనూ పేరంటాలకి వెళ్ళేవాడిని. నాక్కూడా వాయినం ఇవ్వండని దెబ్బలాడేవాడిని కూడా.

  మా ఇంటి ముందు వసారాలో కూర్చుని మా అమ్మగారు, మా బామ్మగారు యింకా కొందరూ మధ్యాహ్నవేళల్లో గంటా రెండుగంటలపాటు కబుర్ల సెషన్ వేసేవారు. వాటిల్లో తరచుగా నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ, యే కుశలవులయుధ్ధమో, గంగాగౌరీసంవాదమో, ధర్మాంగదపాటో, సుభద్రసారో యేదో ఒకటి అంద పేద్ద పాటనీ సునాయాసంగా యెక్కడా తడుముకోకుండా పాడేసే వాళ్ళు. కొంచెం గ్రాంధికంగానే ఉండే ఆపాటలన్నీ నిరక్షరాస్యలైనా వాళ్ళకి క్షుణ్ణంగా అర్థం తెలుసు!

  రోజులెంత మారిపోయాయి!

  ఈ రోజుల్లో పాట అంటే సినిమా పాటే. అందులోనే, నారాయణమూర్తీ తండ్రీ – యీ రోజుల్లో కొన్ని పాటలకి యేమన్నా సాహిత్యం ఉందా అని? అసలు కొన్నింటిలో నైతే అవాచ్యాలే నిండా.

  చిన్నచిన్న శిశవులచేత యీ పాటలు టీవీ ప్రోగ్రాముల్లో పాడించి అందరూ ఒకటే మురిసిపోతూ ఉండటం. అంతంత పచ్చి శృంగారం యేమి పాడుతున్నామో తెలియని పిల్లలు పాడేస్తుంటే – ఇంకా – భావయుక్తంగా పాడాలమ్మా అంటూ టీవీలో పెద్దల సలహాలు. హతవిధీ.

  అప్పటిలో ఆడాళ్ళకి – అదీ చదువు రాని వాళ్ళకి – వచ్చినంత తెలుగు, యీ రోజుల్లో డిగ్రీలు పుచ్చుకున్నా వాళ్ళకి యెంతమాత్రం లేదు గాక లేదు. హా!

 4. @
  వెంకట్.బి.రావు గార్కి,
  పొరపాటు నాదే. అందుకే ముందే చెప్పుకున్నా. పొరపాటు సరి చేశాను.చూడగలరు.నా బ్లాగుకు వచ్చినందుకు ధన్యవాదాలు.

 5. మంచి పోస్ట్ శర్మగారూ! ఇందులో విషయాన్ని గుఱించి ప్రత్యేకంగా చెప్పాలిసింది యేమీ లేదు!

  పోతే, ‘రారాజు’ నాటకం కాదనుకుంటానది, శ్రీపాద గారిది ‘రాజరాజు’ నాటకం…అప్పటిలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది కూడా!

  క్రిందనుంచి నాలుగో లైను చివరన ఒక typo …ఇంట్లో అయివుండాలి!

  మంచి సంగతుల్ని వెతికిపట్టుకుని పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s