శర్మ కాలక్షేపంకబుర్లు-మూడోకాలు ముచ్చట.

మూడోకాలు ముచ్చట.

రెండు రోజులుగా  మోటార్ సైకిల్  పాడవటం మూలంగా ఇంట్లోనే వుంటున్నా,ఎక్కడకీ కదలకుండా,..కరంటులేదు, బయటికివెళ్ళేందుకు  వాహనంలేదు.  బజారు మాకు దగ్గరగా, రెండు కి.మీ ల దూరం.  ఈ లోగా అత్తా,  కోడలు  ఏదో వస్తువు  లేకపోయిందని  కాబోలు అనుకుంటూ వుండగా,  ఏమన్నా.  ఫలాన వస్తువు కావలసి వుంది,  లేకపోయిందన్నారు. నేను వెళ్ళి, బజారు నుంచి తెస్తానన్నా.  బండిలేదు కదా, వద్దన్నారు. నడిచి వెళ్ళొస్తానని బయలుదేరా.

బయటకి వస్తూ వుంటే, నా ఇల్లాలు కూడా వచ్చి గేటు దగ్గర నిలబడింది. నేను వెళ్ళొస్తానని బయలుదేరా.  నాలుగడుగులేసివుంటా, తూలానో, పడ్డానో,  పడబోయానో,  పడిపోయానో తెలీదు.  నా సహచరి, గబుక్కున వచ్చి చెయ్యిపట్టుకు లేవదీసి, పట్టుకుని నిలిపింది. వద్దంటూ వుంటే బయలుదేరారు. ఎందుకంత కంగారని గునిసింది.  నేను కవిని కదా.  కొన్ని వినపడ్డాయి.  కొన్ని వినపడలేదు.  లోపలికి తీసుకొచ్చేసింది.  వచ్చి కాసేపు కూచున్నా. మళ్ళీ బయలుదేరుతున్నానన్నా. వద్దంది. వినలేదు. సరే, అలా అయితే కర్రపుచ్చుకు వెళ్ళమంది.  ఉదయం నడకకి వెళ్ళేటపుడు కర్ర పుచ్చుకు వెళ్ళడం అలవాటే.  ఇలా బజారుకి కర్ర పుచ్చుకు వెళ్ళడం మాత్రం కొత్తే.  కర్ర అంటే, మా పల్లెలలో, రైతుల దగ్గర పెద్ద కర్ర ,అంటే ఆరడుగుల కర్ర వుంటుంది. నడకకి ఉపయోగపడదు. నాకు ఉదయం నడకకి కాను, రెండు కర్రలు వెదురుతో తయారు చేసుకున్నా, ఖాళీగావున్న స్థలంలో పెంచిన వెదురు పొద నుంచి….. అందులో ఒకటి నా చేతికిచ్చింది.  పుచ్చుకు బయలుదేరా.

మలుపుతిరిగానో  లేదో  ఎవరో  ఎదురుపడ్డారు.  నడిచెళుతున్నారేం, ప్రశ్న.  బండి పాడయింది,  బజారు పని వుంది అందుకన్నా.  కర్రపుచ్చుకు బయలుదేరారేంటీ? మరో ప్రశ్న. తూలుతానేమోనని అనుమానమన్నా. సరే వెళ్ళిరండని శలవిచ్చాడు.  కొంత దూరమెళ్ళేటప్పటికి  మరొకరు నిలేశారు. సరే, కధ మామూలే. ప్రశ్న, జవాబులూనూ. మరికొంత దూరమెళ్ళేసరికి మరొకరు నిలబెట్టి,  మళ్ళీ అంతా అయిన తరవాత అప్పుడే కర్ర పట్టుకోవలసి వచ్చిందా  అని  అశ్చర్యం ప్రకటించి,  మీ వయసెంత అన్నారు. అయ్యో! ఈవేళకి నేను బజారుకి చేరేలా లేదే అనుకుంటూ జవాబిచ్చి, బయటపడ్డా.  ఈలోగా నేనేమయ్యానోనని మా చిన్న కోడలు కంగారు పడి ఫోన్ చేసింది.  మామయ్యగారూ! ఎక్కడున్నారు, ఎలా వున్నారు.  అమ్మా! బాగానే వున్నాను.  కర్రపుచ్చుకు బయలుదేరినందుకు సంజాయిషీలు యిచ్చుకుంటూ బజారుకొచ్చా, అన్నా.  సరే పని చూసుకుని వచ్చేయమన్నారు అత్తయ్య గారంది.  సరేననన్నా. ఈలోగా మా పక్కింటబ్బాయి కనపడి తాతా నడిచొచ్చావా! మూడో కాలొచ్చిందే!  నాకు చెబితే నేను నీ పని చేయకపోదునా, అన్నాడు.  ఇక ముందురోజుల్లో ఆ ముచ్చటా తీరుతుందిరా  నాయనా అని,  వస్తువేదో తీసుకున్నా.  నా కర్రతో ప్రయాణం చూసి, కొట్టతను, ఫోన్ చేస్తే నేనే పంపేవాణ్ణి కదా,  వస్తువన్నాడు.  మేడంగారు ఎప్పుడేనా ఇలా అవసరం పడితే ఫోన్ చేస్తారు,  సరుకు నేను కుర్రాడిచేత పంపిస్తాను కదా, అన్నాడు. అయ్యో! నాకు తోచలేదయ్యా! అని బయలుదేరుతుంటే మా కాలనీ అతను కనపడి, నడిచి వచ్చారా అని విచారించి, నేను ఇంటికెళుతున్నా రండని, బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గరొదిలేసాడు. కర్రతో నా బజారు ప్రయాణానుభవానికి నా ఇల్లాలు ముసి ముసి నవ్వులు నవ్వింది.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మూడోకాలు ముచ్చట.

 1. మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటంటారు ! మీరు ఒక కాలం ముందు వెళ్లి పోయారు! అందుకే అలా అన్నాను. !

  చీర్స్
  జిలేబి.

 2. శర్మ గారు,

  మీరు మరీ సామాన్యులు కారు సుమండీ!

  ఒక రైలు జీవితం తిరగేసారు !

  చీర్స్

  జిలేబి.

 3. @
  జిలేబిగారూ,
  నేను మీకిచ్చిన మాట తప్పలేదు.నాలుగు కాళ్ళంటే మళ్ళీ బాల్యం. మాటతప్పిందయితే కాళ్ళ సమస్యలేదింక.

 4. మాష్టారు,

  మళ్ళీ మీరు నాలుగు కాళ్ళ మేటర్ కొచ్చారు! నిన్న మీరు ఇచ్చిన వాక్కు హుళిక్కి అయిపొయింది!
  సత్యం భ్రూయాత్!……

  చీర్స్
  జిలేబి.

 5. @

  జిలేబి గారు,
  అమ్మో మూడో కాలు మొబైల్ కాకపోతే, ఎంత ప్రమాదం. నలుగుకాళ్ళైతే సమస్యలు లేవు మరి

 6. @
  మాల.పి.కుమార్ గారికి,
  మీరు ఇచ్చినపేరు నేను తప్పుగా రాస్తున్నానేమో అనేది, నా మొదటి దిగులు. పేరు కొత్తగా కనపడింది, ఎక్కడ ఎప్పుడు వినలేదు. కలిపిరాయడంమూలంగా వచ్చిన చిక్కు. అలాగైనా తప్పు రాసాకదా! మీరు నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.

 7. @
  మలప్ కుమార్ గారు.
  … మీ పేరు తప్పుగా రాసానేమోననే సందేహం, నా మనసులో వుంది. తప్పయితే క్షమార్హుడిని. నాబ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.