శర్మ కాలక్షేపంకబుర్లు-వాళ్ళిద్దరూ ఒకటే

వాళ్ళిద్దరూ ఒకటే

పంతులుగారూ! మీ స్నేహితుడు మావోడిని పీకేడంట. ఏటి సంగతి అన్నాడు, మా సత్తి బాబు వస్తూనే. మా వోడో తింగరోడు. ఏటి చేస్తాడో తెలీదు. నిజంగా మీవోడు గనక బరిస్తన్నాడు. మరొకడయితే యీపాటికి  మెడ పట్టి  గెంటేసేవోడే, అన్నాడు. అసలేమిటి వీళ్ళిద్దరి మధ్య ఏమిటి సంబంధం అన్నా. ఇదీ అని చెప్పలేనండి.  యజమాని, పనోడా,  మిత్రులా, బంధువులా?.  బంధువులు కారు,  యజమాని పనోడూ కాదు, మీవోడొదిలెయ్యడు,  యీడు అక్కడనుంచి పోడు.  ఈళ్ళిద్దరూ  చిన్నప్పటి నుంచి  కలిసి పెరిగేరు,  ఒకణ్ణొదిలి మరొకడుండలేడు, అంతే, అంటూ, ఏటయిందన్నాడు.

నిన్న హాస్పటల్ దగ్గరనుంచి మిత్రుడు దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది కనబడ్డారు. వాతావరణం కొద్దిగా వేడిగా వున్నట్లు కనపడింది.  బయట  కుర్రాడు  కనపడి  మీరొస్తే వెంటనే లోపలికి  పంపించెయ్యమన్నారు, లోపలికి వెళ్ళండి అన్నాడు.  ఎవరున్నారు  లోపలన్నా, బాబుగారు, సుబ్బయ్యా ఉన్నారన్నాడు.  తలుపుతోసుకుని లోపలకెళ్ళేసరికి,  నా మిత్రుడు సుబ్బయ్యతో, “ఒరేయ్! నీకు లక్ష సార్లు చెప్పేను, ఆ కాగితాలు ఆడిటర్ కి పంపు, నీకుతెలియకపోతే తెలియదని చెప్పు, నేను ఏర్పాటు చేసుకుంటానని.  ఇంతకీ కాగితాలు ఆడిటర్ కి పంపేవా” అన్నాడు.  సుబ్బయ్య  పంపేనని ఒక సారి, పంపలేదని ఒక సారి, నంగి నంగిగా సమాధానం చెప్పేడు.  “నువ్వీ కాగితాలు ఆడిటర్ కి  పంపిఉంటే  ఈ లక్ష రూపాయల నష్టం వచ్చేది కాదు.  ఎలారా! నీతో చచ్చిపోవడం” అంటూ, ఉద్రేకంతో ఊగిపోతూ, సుబ్బయ్య చెంపమీద ఒక లెంపకాయ కొట్టేడు.  ఆ  విసురుకి  సుబ్బయ్య కళ్ళ జోడు  కింద పడి ముక్కలయింది.  వాతావరణం ఇలా మారడంతో,  అందునా సుబ్బయ్యపై చెయ్యి చేసుకోడం సహించలేని నేను నెమ్మదిగా బయటి కొచ్చేసాను.  కొద్దిసేపు పోయాకా లోపలికి రమ్మన్నారని కబురొస్తే మళ్ళీ వెళ్ళేను. నా మిత్రుడు తమాయించుకుని, మామూలు స్వరంతో మీరు బయటకు వెళ్ళిపోవడం గమనించాను.నేను చేసిన పనికి మీ నిరసన అలా తెలియచేసేరని గమనించాను. నేను విసిగిపోయి ఈ పని చేసాను అన్నాడు. నేను ఇక ఆగలేక, ఒక్క మాటచెబుతా! పొరపాటో, తప్పో జరిగి ఉండచ్చు, కాదనను, కాని, మీరు ఇలా చెయ్యి చేసుకోడం మాత్రం నాకు నచ్చలేదని చెప్పేను. సుబ్బయ్య నిర్వికారంగా కూచుని వున్నాడు. ఈ మాటకి నా మిత్రుడు, నిజంసార్! ఏవిషయం లోనూ నాకు నిజంచెప్పకపోతే ఎలా సార్, నేనెలా చావను, అన్నాడు. ఈలోగా ఫోన్ మోగింది.  ఫోన్ ఎత్తి మాట్లాడుతూ నా స్నేహితుడు, ఏరా సినిమా హాల్ దగ్గర మొదటి ఆటకి ఏర్పాట్లు చూసి వచ్చేనని కదా చెప్పేవు, హాల్ నుంచి మేనేజరు బుకింగ్ తాళాలో అని అరుస్తున్నాడు, కొత్త బొమ్మేసాము, జనం బుకింగ్ తీయలేదని గోల చేస్తునారట, ఏంటిది అన్నాడు.  నేనెళ్ళాలి అన్నాడు సుబ్బయ్య.  మేనేజరు బుకింగ్ తాళాలు కావాలి,  నీదగ్గరున్నాయని చెబుతునాడు,  నువ్వేమో  నాతో ఇందాకా తాళాలన్ని అక్కడ ఇచ్చేసి వచ్చాను,  అన్నావు,  అంటూ, చూడండి, ఇంతకు ముందు తాళాలు హాల్ లో ఇచ్చేసి వచ్చేనని చెప్పి,  ఇప్పుడు నేను వెళ్ళాలంటున్నాడు,  ఎలాగండి, వీడితో ఎలా చావనండి అన్నాడు.  నాకేం చెప్పాలో తెలియలేదు.  తాళాలు పంపే ఏర్పాటు చూసి, ఈ ఫైల్లో కాగితాలు చూసి వీడు చేసిన నిరవాకం ఏంటో చూసి, ఏం చెయ్యాలో కొద్దిగా చూడండి, తరవాత  మొన్న మనం కమిటీ వేసాము కదా, వాళ్ళు గొడవ పడుతున్నారట, వచ్చారు, బయట వున్నారు, చూసారు కదా, విషయం కనుక్కుని సద్దగలిగితే సద్దెయ్యండి, లేకపోతే రేపటికి వాయిదా వెయ్యండి, నేను అత్యవసర పని మీద వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతూ, ఒక్క నిమిషం ఆగి,సుబ్బయ్య దగ్గరకొచ్చి, “ఒరేయ్, నిన్ను కొట్టేనురా, ఉద్రేకంలో, అబద్దం చెప్పేవని కొట్టేను, నీకంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. నన్ను క్షమించు” అని సుబ్బయ్యని కావలించుకుని, మేనేజర్ని పిలిచి సుబ్బయ్యని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి, కళ్ళు పరీక్ష చేయించి, కొత్త కళ్ళ జోడు వేయించమని చెప్పి వెళ్ళిపోయాడు.

నా స్నేహితుడెళ్ళిపోయాకా, ఏమయ్యా! సుబ్బయ్యా ఎందుకిలా చెసేవు, ఎందుకు దెబ్బ తిన్నావు, కొడితే మాటడక వూరుకున్నావు, ఇదేంటన్నా. పంతులుగారూ, వాడులేని నేనులేను, నేనులేని వాడులేడు, అలా జరిగిపోయింది, అని చాలా నిర్వికారంగా చెప్పేడు. మేమిద్దరం వొకటే, మా మధ్య ఇది పెద్ద విషయం కాదు, మీరే చూసారుకదా, అన్నాడు. నేను నోరెళ్ళబెట్టాను, అర్ధంకాక.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వాళ్ళిద్దరూ ఒకటే

 1. @
  వెంకట్.బి.రావుగారికి,
  మీ ఉత్తరం చూసాను. మీ కామెంటుకి నా మొదటి మాట, ఆనందం, పరమానందం, ఐయితే మరు క్షణం భయమేసింది. కధక చక్రవర్తి శ్రీ శ్రీపాద వారితో పోలిచేటప్పటికి. నేను రాసేది మా ప్రాంతపు వాడుక భాష. ప్రతివారూ మాటాడేదానిని శ్రద్ధగా విని దానిని అనుసరించడం మూలంగా ఇది జరిగిందేమో చెప్పలేను. మరొక సంగతి, నా అభిమాన రచయితలిద్దరు. ఒకరు శ్రీపాద, రెండవవారు రావి శాస్త్రి. వీరి రచనలు నేను విశేషంగా చదివేను, దాని ఫలితమేనా కావచ్చు. మరొక సారి, మీ అభిమాన వర్షంలో తడిసి ముద్దయ్యానని సవినయంగా తెలుపుకుంటున్నా.అబ్బూరి వారిపేరు శ్రీపాదవారు ప్రస్తావించగా చదివినదే. పుస్తకం నేను చదవలేదు. మా పల్లెలలో మాకా సౌకర్యాలు లేవు.

 2. శర్మ గారూ!

  ఆలోచించే అన్నా నా మాట! నేను అంత తొందరగా దేనినీ ఒప్పుకోను! మీ writings లో (ఈ మాటను తెలుగులో చెప్పాలంటే ‘వ్రాతలు’ అనాలి. ఎందుకో ఈ మాట భావాన్ని పూర్తిగా వ్యక్తం చేసేట్లుగా కనపడదు నాకు. ఈ ‘వ్రాతలు’ లేదా ‘రాతలు’ అనే మాటను negative గానే ఎక్కువగా వాడామేమో మనం అనిపిస్తుంది. ఉదా. ఏం రాతలివి? … ఈ రాతలిక చాలించి… ఇత్యాదిగా..) కావలసిన రెండు ముఖ్య లక్షణాలూ ఉన్నాయి. అవి ease, content. ఈ రెండు లక్షణాలూ ఉన్న ‘వ్రాతలకి’ ఒక value వస్తుంది. అది literary value, సాహిత్య విలువ. అంతకు ముందు పోస్టులు చూడలేదుగాని, శ్రీపాద వారి పోస్టు తరువాత మీ పోస్టు లన్నిటికీ ఈ సాహిత్య విలువ అనబడేది వుందని నేననుకుంటాను. మీలో ఎప్పటినుంచో వుండి వుంటుందిది, కానీ ఏకారణం చేతనో express అవలేదు, మీరు
  పెన్ను పేపరు మీద పెట్టలేదు.

  పోనీ, మీరన్నారు గాబట్టి, ఒక మాటనుకుందాం! నా పోలికను ప్రస్తుతానికి శ్రీపాద వారికి చెందిన పోస్టుకీ మీ ఈ పోస్టుకీ మాత్రమే పరిమితం చేస్తాను. ఈ పోలిక ముందుముందు పెరిగి, మంచి feeling వున్న పోస్టులతో మీ బ్లాగ్ నిండి, పేరు తెచ్చుకోవాలని నా ఆకాంక్ష. వ్రాతలలో human feeling అనేది చాలా rare commodity అయిపోయింది.

  అబ్బూరి వరదరాజేశ్వర రావుగారి ‘కవన కుతూహలం’ చదివారా? చదివే వుంటారనుకుంటాను. మీ ఈ పోస్టు నాకు ఆ పుస్తకాన్ని జ్ఞప్తికి తెచ్చింది.

  శుభాకాంక్షలతోనూ, నమస్కారాలతోనూ,
  వెంకట్.బి.రావు.

 3. @

  వెంకట్.బి.రావు గారికి,
  నమస్సుమాంజలి,

  అబ్బో! ఆనందం, పరమానందం. చాలా పెద్దవారితో నన్నుపోల్చేసి ఆనందంలో ముంచేసారు. కాని అంతకాదేమో, ఒక సారి ఆలోచించరూ. ధన్యవాదాలు.

 4. @
  మిత్రులు తాడిగడప శ్యామల రావు గారికి, నమస్కారం.
  జీవితం నుంచే అనుభవాలొస్తాయి. సంఘటనలని, సంఘటిత పరచుకున్నా, తప్పించి నేనేమీ కొత్తగా చెప్పలా. మీ అభిమానానికి కృతఙ్ఞుడను.

 5. @
  మిత్రులు మాధవరావుగారికి, నమస్కారం.
  ఏం చెప్పాలో తెలియని స్థితిలో పెట్టేసారు, నన్ను. మీ అభిమానం నా మీద కురిపించినందుకు కృతఙ్ఞుడను.
  మిత్రుడు
  శర్మ

 6. శర్మగారూ!

  మూణ్ణాళ్ళ క్రిందట, శ్రీపాద వారి ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ లోంచి extract చేసి post చేసిన ఆ post కీ ఇప్పటి ఈ మీ post కీ విషయంలోగానీ, చెప్పిన పధ్ధతిలో గానీ, ఎందులోనూ పెద్దగా తేడా ఏమీ లేదు. మీకు మీవైన ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ వున్నాయి, వ్రాయగలిగిన శైలీ పట్టుబడింది. చాలారోజుల తరువాత తెలుగులో ఒక మంచి బ్లాగు కనబడిందనుకుంటున్నాను! ఈ quality ఇలాగే maintain అవుతుందనీ ఆశిస్తున్నాను!
  నమస్కారాలతో,
  వెంకట్.బి.రావు

 7. శర్మగారూ, చాలా మంది చక్కగా వ్రాయగలరు.
  కాని కొద్దిమందే హాయిగా చదివించగలరు నిజంగా.
  భాషలో ప్రాణనాడి యెక్కడున్నదయ్యా అంటే శృతిసుభగత్వంలోనే. అది సాధించటం కష్టం.
  అలా సాధించిన వారు చెప్పేవి ప్రత్యక్షంలోనైనా అచ్చులోనైనా అమృతప్రాయంగానే ఉంటాయి.
  అందుకే మీరు వ్రాసింది హాయిగా చదువుతున్నాను
  మంచి తెలుగును బతికిస్తున్నారు. చాలా కృతజ్ఞుడను.

 8. శ్రీ భాస్కరశర్మ గారికి, నమస్కారములు.

  నా బ్లాగ్ ద్వారా మీ మొదటి పరిచయం అయింది. ఇప్పుడే మీరు వ్రాసిన కబుర్లు అన్నింటినీ చదివాను. అందులో `పెళ్లిళ్ల సంత; జల్లెడ …..కొట్టేడు; మరపు, మరణం; మూడోకాలు ముచ్చట; స్వానుభమైతే…ఒంటబట్టదు; వాళ్ళిద్దరూ ఒకటే నాకు బాగా నచ్చాయి. చక్కటి పదాల ఎన్నిక; చెప్పటంలో ఒరవడి; గోదావరి మాండలీకము; అన్నిటికన్నా ముఖ్యమైనది : మంచి సందేశము మీ రచనలలో కనిపించాయి.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s