శర్మ కాలక్షేపంకబుర్లు-ఊతపదాలు

ఊతపదాలు.

మామేనల్లుడొకడు కొద్దికాలం, అమెరికాలో వుండొచ్చాడు, నన్ను చూడ్డానికొచ్చి మాటకోసారి యా! అనడం మొదలెట్టాడు. ఇదేమిరా మాటాడితే యా! అంటున్నావు, ఇది నీ అలవాటా లేక అక్కడంతా అలాగే అంటారా అన్నా! ఏదోలే మామయ్యా అన్నాడు కాని నిజం చెప్పకుండా దాటేసాడు. మా చెల్లెలూ, నా ఇల్లాలూ ఇద్దరూ జమిలిగా, మేనమామ పోలికలొచ్చాయ్! అని తప్పించుకున్నారు. ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు తిరిగి నామీదే ఈ అపనింద పడేటప్పటికి, ఎరక్కపోయి అడిగేనురా అనుకుని కుర్చీలో చేరాబడ్డా.

ఊత పదాలు బలే విచిత్రం గా ఉంటాయి. పల్లెలొ ఊతపదాలన్ని కొద్దిగా అశ్లీలంగానే ఉంటాయి. యీ మాటాడేవారు, అది అశ్లీలం అనికూడా గుర్తించ లేనంతగా సంభాషణలో కలిసిపోతాయి. మచ్చుకి, నీయమ్మ, నీయక్క అన్నది కొంతమంది ఊతపదం, దీనమ్మ, దీని సిగతరగ, మరికొన్ని. ఆయ్! ఈ ఊతపదం గోదావరి జిల్లాలలో బహు ప్రాచుర్యం. మాటకి రెండు సార్లేనా యీ ఊతపదం వాడతారు. అబ్బో!చాల్లే కూడా కొన్ని చోట్ల చాలా వాడుకగా ఊతపదం. మాటాడేవారికి యీ ఊతపదం లేకపోతే మాట జరగదు, ముందుకెళ్ళలేరు. ముందుకెళ్ళలేరంటే గుర్తుకొచ్చింది, మన ఆంధ్రదేశంలో ఒక నాయకుని ఊతపదం ఆవిధంగా ముందుకుపోదాం. క్షమించాలి, ఇది సరదాకి చెప్పేదేకాని ఒకరిని ఆక్షేపించే ఉద్దేశ్యం ఎంత మాత్రము కాదు. మరొక నాయకుని ఊతపదం, అక్కలాఅరా,తమ్ములారా, అన్నలారా, చెల్లెలారా, కాని చివరికి మిగిలింది బొక్కలే. మరొక నాయకుని ఊతపదం తమ్ముడూ. పాపం ఈయన తమ్ముళ్ళ వల్లే మోసపోయాడు, చివరికి.

ఇలా చెపుకుపోతే చాలా ఉన్నాయి కాని, చిన్నపుడు నీతి చంద్రికలో అనవుడు,నావుడు అనే రెండు మాటలు చాలా తరచుగా కనపడ్డాయి. మా క్లాసులో ఒకరిద్దరికి దీనిమీద అనుమానమొచ్చి మాస్టార్ని అడిగితే వాళ్ళిద్దరూ అన్నదమ్ములురా దద్దమ్మల్లారా! అన్నారు. మరొకడు, ఐతే మాస్టారూ వాళ్ళిద్దరూ మరెక్కడా కధలో కనబడలేదన్నాడు. అందుకు మాస్టారు వెధవల్లారా! అనవుడు, నావుడు అన్నవి ఊతపదాల్లాకనపడతాయిరా. అని అర్ధం చెప్పేరు, అని చెప్పగా, అనేటప్పటికి అని. తెలుగు భాషలో పరభాషాపదాలు లేకుండా ఈ రోజు మాటాడేవారు లేరు, అయ్యో! ఇదొక వూతపదం మరి. మా అమెరికా మనవరాలు అయ్యో! అన్న వూతపదం లేకుండా మాటాడదు. ఛా! ఇది మరొకటి,ఇదిఅనేవారు విషయం తో సంబంధం లేకుండా దీన్ని వాడేస్తారు,ఒక్కొకపుడు సమస్య కూడా తెచ్చిపెడుతుంది..

కొన్ని నినాదాలు ఊతపదాల స్థాయికి దిగజారిపోయాయి. ప్రపంచకార్మికులారా ఏకంకండి. ఇలా నినాదం ఇచ్చినవారు, చీలికలు,వాలికలు, పీలికలుగా విడిపోయారు. ప్రపంచ కార్మికులూ ఏకంకాలేదు. మరొకటి చట్టం తనపని తాను చేసుకుపోతుంది. పాపం , ఇదొక ఊతపదం, అలా మొదట అన్న ఆయనకి చట్టం చుట్టం కాలా. కాని ఇది మాత్రం ఊతపదంలా మిగిలిపోయింది.

ఇంతమంది ఊతపదాలు చెప్పేరుకదా మరి మీఊతపదం ఏమండీ అంటే. అది రహస్యం చెప్పుకోండి…మరి.

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఊతపదాలు

  1. @

    మాగంటి వంశీ మోహన్ గారికి,
    మీరు నా బ్లాగుకు వచ్చినందులకు ధన్యవాదాలు.చక్కటి కధ చదివించినందుకు మరొక సారి ధన్యవాదాలు.
    ఎక్కువ కోపం వస్తే కొంతమంది మాటాడలేరు. అలాగే ఊతపదాలు లేకపోతే కొంతమందికి మాట సాగదు.

  2. ఊతపదాలు లేకపోతే మాట్లాడేదానికి ఊతం ఎక్కడ? అవి లేకపోతే చాలామంది మూగబోతారు…..:)

    మీ పోష్టులో “అనవుడు – నావుడు” పదాలు చూసి సరస్వతీపుత్రులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కథ గుర్తుకొచ్చింది…ఆ కథ వివరాలు ఇక్కడ…

    http://janatenugu.blogspot.com/2011/11/blog-post_1543.html

    భవదీయుడు
    మాగంటి వంశీ

  3. బాగుందండీ ఊతపదాల గురించిన మీ టపా..
    మాటకి ముందు “తెల్సా..” అంటూ మొదలెట్టడం నా అలవాటు. చాలా మంది ఫ్రెండ్స్.. “ఉహూ.. తెలీదు.. నువ్వింకా చెప్పందే!” అని ఏడిపిస్తుంటారు.. 😀

  4. శర్మగారూ,
    “మరేంటంటే”, “ఇందాకల” మీ టపా చదివినంతసేపూ ఏదో చెబదామనుకున్నానండీ. తీరా రాద్దామనుకునే వేళకి, “అదేంటో”, అది గుర్తురావడం లేదు మరి.
    “అదే మరి”, మీరు ముసలాళ్ళైపోయారండీ అంటే ఎంతకీ వినిపించుకోరు అంటోందండి మా ఆవిడ.
    “మరేంచేస్తాం” ఉంటానండి.

  5. @
    జ్యోతిగారు!
    నమస్కారం. మీరిదివరలో ఒక సారి నా బ్లాగుకు వచ్చినట్లు గుర్తు. కవిని ( కనపడదు, వినపడదు,)నిజమేచెబుతున్నా!. ఎదురుగా వున్న వాళ్ళపేర్లే గుర్తుండవు.స్వాగతం, పునః స్వాగతం. ఎవరి ఊతపదం వారికి తెలుస్తుంది. మరొకరి ఊతపదం పట్టుకోడమేగొప్ప మరి. ధన్యవాదాలు.

  6. @
    బోనగిరిగారు మరియు డి.యెస్.ఆర్. మూర్తిగారు
    పసిడిగలవాని పృష్టంబు పుండైన వసుధలోన వార్తకెక్కు, అదీ సంగతి..ధన్యవాదాలు.

  7. @
    అమ్మాయ్ సుభా
    సాధారణంగా వ్యర్ధపదాల్ని,తరచుగా వాడేవాటిని ఊతపదాలంటాం.నా ఊతపదం కనుక్కోవాలంటే అన్ని పోస్టులూ చదవాల్సిందేమరి. ధన్యవాదాలు.

  8. “అయ్యో!” కేవలం ఊతపదాల మీద ఇంత పెద్ద టపా వ్రాయాలా తాతగారూ! “మంచోరే!” “బాగా చెప్పారు!” “నాయాల్ది” “అమ్మనీయమ్మా” ఏవో నాకు తెలిసిన మరి కొద్ది పదాలను జతచేర్చానండి “ఆయ్!”

  9. బాబాయ్ గారూ..అక్త్చువల్లీ చాలా రోజులయింది బ్లాగులు తీరిగ్గా చూసి..పండగ సెలవలు కదండీ. చుట్టాలూ..ప్రయాణాలు.
    అక్త్చువల్లీ జనవరి వస్తేగానే తీరుబడి ఉండేలా లేదండీ..అన్నీ మిస్ అయిపోతున్నాను.

  10. నాకు తెలిసిన ఒక తాత గారు ఉన్నారు తాత గారూ.. ఆయన తరచుగా “అదే మరి” అన్న పదాన్ని ఎక్కువగా వాడేవారు..అసలా మాట లేకుండా ఆయన మాట్లాడే మాటల్ని ఊహించలేము.అంతలా వాడేవారు..నేనూ సరదాగా ఆయన్ని అనుకరిస్తూ ఉంటాను.అది సరే తాత గారూ, మీ ఊతపదం ఏమన్నా దొరుకుతుందేమో అనుకుని 3 సార్లు చదివా టపా.. కానీ అస్సలు దొరకలేదు.ఎంత జాగ్రత్తగా రాసేరో :):)

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి