శర్మ కాలక్షేపంకబుర్లు-పిచ్చి !

పిచ్చి

ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది లోక రీతి.  వెర్రి వెయ్యి విధాలన్నారు, పెద్దలు. ఒక సినీకవి ప్రేమా పిచ్చీ వొకటే అన్నారు.

ముదురొంకాయలకి, ముదురు బెండకాయలకి ప్రేమ, పెళ్ళిపిచ్చి. కొంతమందికి  తిండి పిచ్చి, మరికొందరికి  బండి పిచ్చి,  మార్కెట్ లోకి  కొత్త బండి  వస్తే చాలు, కొనేస్తారు.  పెదవులపిచ్చి కొందరిదైతే,  పదవులపిచ్చి మరికొందరిది. అబ్బాయిలకి  అమ్మాయిల పిచ్చి, అమ్మాయిలకి అబ్బాయిలపిచ్చి.  చిన్నపుడు అమ్మ పిచ్చి,  తరవాత ఆటపిచ్చి,  తరవాత ప్రేమపిచ్చి, పెళ్ళిపిచ్చి, తరవాత డబ్బు, బిడ్డపిచ్చి.  ముసలితనంలో  భక్తి పిచ్చి.  సినిమాలపిచ్చి అబ్బో! చెప్పకరలేదు.  నేనూ సినిమాల పిచ్చివాణ్ణే.  చిన్నపుడు  రాజమండ్రి పోయి ఉదయం నుంచి రాత్రి దాకా నాలుగు సినిమాలు చూసిన వాడినే.  ముఫైఏళ్ళయిందేమో సినమా చూసి, ఇప్పుడు.  సినిమాల పిచ్చి వాళ్ళు,  కొత్త సినిమా వస్తే  మొదటి రోజు ,మొదటి ఆట చూడకుండా వుండలేరు.  అదే అభిమాన హీరో అయితే, ముందురోజునుంచి హాల్ దగ్గరే మకాం. మా స్నేహితుడొకడు రాత్రి గోదావరి ఎక్కి ,ఉదయం హైదరాబాదులో దిగి మళ్ళి పది గంటలకి ఫ్లైట్లో రాజమంద్రి చేరతాడు.  పని ఏమిరా అంటె,  ఏమో చెప్పలేం.  బట్టలు ఫేషన్ల పిచ్చితో ఇప్పుడు అర్ధ నగ్నంగానే తిరుగుతున్నారు.  కొంతమందికి  డిగ్రీలపిచ్చి,  ఎన్ని డిగ్రీలున్నా మళ్ళీ దేనికో చదువుతూనే వుంటారు. సాహిత్యం, సంగీతం వారికి సభలపిచ్చి, సన్మానాల పిచ్చి..బంధు ప్రీతివారికి పెద్ద చిక్కొచ్చే పిచ్చి, చెప్పా పెట్టకుండా వచ్చి వారం రోజులు తిష్ట వెసుకు కూచుంటారు. పోనీ పనేమైన ఉందా అంటే, మిమ్మలిని చూద్దామని వచ్చేమంటారు. చాలా నిజాయితీగల ఆఫీసరుగా పేరాయనకి, కాని పొగడ్తల పిచ్చి ,ఆయనకి. మామూలుగా అయన దగ్గరకాని పని, పొగడ్తలకి అయిపోతుంది.

రాజకీయ నాయకులకి ప్రచారపిచ్చి, టీ.వీ,పేపర్లలో కనపడే పిచ్చి. డబ్బు పిచ్చి వారికి మరేదీ కనపడదు, డబ్బుతప్పించి. ప్రతీది డబ్బు పరంగానే చూస్తారు. మాటల పిచ్చివాళ్ళు పట్టుకుంటే వదిలి పెట్టరు.  ఆటల, పాటల పిచ్చి వాళ్ళకి అదే లోకం, చెవుల్లో పెట్టుకు తిరుగుతూ వుంటారు, మాట వినిపించుకోకుండా. మావాడొకడు ఏ పనికైన పదిమందిని సలహా అడుగుతాడు, అదోపిచ్చి.  సలహాల రావులు  అడక్కపోయినా ఉచిత సలహాలు పారేస్తూ వుంటారు.  వంశ చరిత్ర, గౌరవం చెప్పుకునేపిచ్చి కొందరిది.  బిడ్డలు లేని తల్లికి బిడ్డపిచ్చి.  ఎన్ని ప్లాస్టిక్ చేయించుకున్నా ఉన్న రూపు మారదు, కాని అందం పిచ్చి వాళ్ళకి అదే లోకం. వెర్రి వాడికి బుడ్డమీదే లోకం అని సామెత.

కొంత మందికి బ్లాగుల పిచ్చి, కొందరిది కామెంట్లపిచ్చి. ప్రతి నిమిషం మెయిల్ చూసుకునే పిచ్చి వారు కొందరు.  నేటికాలంలో నెట్ పిచ్చి వాళ్ళు పెరిగిపోయారు.  వీరికి అన్న ,పానాలన్నీ నెట్ దగ్గరే.  నెట్ పని చేయక పోతే, వీరి బుర్ర పనిచేయదు. వాస్తు పిచ్చి వారు బాగున్న ఇల్లు పడగొట్టి మళ్ళీ మళ్ళీ కట్టిస్తూ వుంటారు.
విలేఖరులది వార్తల పిచ్చి. రేసులు, లాటరీల వారికి అదొక స్వర్గమే!, డబ్బులు పోతున్నా. సురాపానం, మత్తు మందులు వాడే వారిది పిచ్చి వాళ్ళ స్వర్గం. కాపీటూ సి.యెమ్. కాపీ టు పి.యెమ్ అనే వారిది కంప్లైంట్ల పిచ్చి, చిన్న విషయంలో కూడా.

బ్లాగు   23.09.2011 నాడు ప్రారంభించాను. 31.12.2011 నాటికి నూరు రోజుల పండుగ, ఇది 99  వ పోస్టు. 100 వ పోస్టు పండగ చేసుకోవద్దా! ఇదో పిచ్చి, సినిమానూరురోజుల పండగలాగా.

ఇన్ని, ఇంతమంది పిచ్చి, చెప్పేరుకదా మీ పిచ్చేమిటంటె, ఏం చెప్పను. కనుక్కోండి మరి.

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పిచ్చి !

    • రసజ్ఞా!
      మాయాబజారులో ఎప్పుడో చెప్పాడు సి. ఎస్. ఆర్…. ఈ మనవరాళ్లకెప్పుడూ తాతలతోటి చెలగాటం అని. 1-3 తరాల వారధి ఇప్పడిది కాదు. సమిష్ఠికుటుంబాలలోని సౌభాగ్యం. ఇప్పుడు మా మనవరాలిని చూడాలంటే VIDలో చూడడమే. “ఇకపోతే” అదేం చెబుతోందో వాళ్ళమ్మనీ నాన్ననీ బతిమాలుకోవాలి తర్జుమా చెయ్యమని.

వ్యాఖ్యలను మూసివేసారు.