శర్మ కాలక్షేపంకబుర్లు-ఉసురు

ఉసురు

పల్లె గొల్లు మంది, ఒక్క సారి…. బీట్లో కెళ్ళిన పెద్దరెడ్డిగారి ట్రాక్టర్ తొట్టి తిరగబడి బస్తాలమీదున్న కూలీలు అరుగురు, బస్తాలు మీదపడి పోయారట. ఊళ్ళో దావానలంలా వ్యాపించిందీ వార్త. వీధి అరుగుమీద ప్రైవేట్లు చెప్పుకు బతికే శాస్త్రిగారు, యీవార్త విన్నాడు. వివరాలు కనుక్కుంటే, “చాకలి మాసరమ్మ ఇంట్లో అద్దెకుంటున్న జంట, మొగుడూ పెళ్ళాలిద్దరూ పోయారు. మరో నలుగురు పోయారు” చెప్పేడు సోమిరెడ్డి. ’ “పాపం వాళ్ళ నాలుగేళ్ళ కుర్రాడు మాత్రం మాసరమ్మ దగ్గరుండి, బతికిపోయాడు” అన్నాడు, సోమిరెడ్డి.

రెండు రోజుల తరవాత, చాకలి మాసరమ్మ మాసిన బట్టలకొచ్చి, శాస్త్రిగారి భార్య సీతతో “యీ కుర్రోడు తల్లీ తండ్రీ పోయారు. యీడు నాదగ్గరుండిపోయాడు, యీడికింకెవరూలేరు. యేం సెయ్యాలో పాలుపోటం లేదంది” మాసరమ్మ. “కులపోళ్ళు పట్టించుకోలేదు” అనికూడా చెప్పింది. ” నాకే బతుకు కష్టంగా వుంది, యీ కుర్రోణ్ణి పెంచగలనా?.” అంది మాసరమ్మ, సీతమ్మగారితో. ఈ మాటలు విన్న సీత, శాస్త్రిగారు ఒకసారే ” నువ్వీ కుర్రాణ్ణి ఇక్కడవదిలెయ్యి. వాడి మంచి చెడ్డలు మేము చూస్తామన్నారు.”అలా సుబ్బయ్య, శాస్త్రి గారి పంచన చేరాడు.

శాస్త్రి గారు వాడిని బడికి తీసుకుపోయి చదువులో పెట్టేరు. పిల్లలు లేని ఆ దంపతులు సుబ్బయ్యనే దేవుడిచ్చిన కొడుకనుకున్నారు. వాడూ ఇంట్లో కుర్రాడిలా పెరుగుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సుబ్బయ్య ప్రతి క్లాసులో డింకీలు కొడుతూ చదువు సాగించాడు. పదో తరగతి కొచ్చేటప్పటికి, పద్దెనిమిదేళ్ళు వచ్చాయి. పదో తరగతి డింకీ కొట్టిన రోజు, సుబ్బయ్య, మాస్టారు దగ్గరకొచ్చి “నాకు చదువు రాదండి వ్యవసాయం చేస్తానన్నాడు” దానికి శాస్త్రి గారు “సరే” అని, తన నాలుగెకరాల వ్యవసాయం సుబ్బయ్యకి వప్పచెప్పేరు. పెట్టుబడి శాస్త్రి గారిది ,సుబ్బయ్య అదృష్టం ఏమో గాని వాడు చేసిన వ్యవసాయం బాగా కలిసొచ్చింది. మాస్టారు పెట్టుబడులు వగైరాలు, ఆదాయం లెక్క చూసి తనకి రావలసిన మక్తా తీసుకుంటూ మిగిలిన సొమ్ము సుబ్బయ్య పేర బేంకులో వెయ్యడం మొదలేట్టేరు. ఇలా సంవత్సరం తరవాత సంవత్సరం సుబ్బయ్య డబ్బు పెరుగుతూ వచ్చింది. నాలుగేళ్ళలో మాస్టారికి తెలియని రోగం పట్టుకుంది. డాక్టర్ల చుట్టు తిరుగుతున్నారు. ఆయన దగ్గర సొమ్మయిపోతూ వచ్చింది. ఒక సమయంలో నగలు కూడా అమ్మెయ్య వలసివచ్చింది, వైద్యానికి. ఒక రోజు మాస్టారు వీధి అరుగు మీద కుర్చీలో కూచుని, ప్రాణం వదిలేసారు. ఇప్పుడు ఇంటికి పెత్తనం సుబ్బయ్యకి వచ్చేసింది,సీతమ్మగారు అన్నీ సుబ్బయ్యకే వప్ప చెప్పగా.
రోజులు గడిచాయి, వూళ్ళో సత్తిరెడ్డి, సుబ్బయ్యకి పిల్లనివ్వడానికొస్తే సీతమ్మ గారు, పెళ్ళి ఘనంగా చేసి,కొడుకు , కోడలు, కొత్త దంపతులు వుండడానికిగాను , తమ ఇంటిలో, పక్క వాటా ఖాళీ చేసి సుబ్బయ్య దంపతులను ప్రవేశపెట్టింది. భోజన భాజనాలన్నీ సీతమ్మ గారే నడపడం మూలంగా సమస్య రాలేదు. ఎప్పుడేనా నీచు కూర కావలంటె కోడలికి పుట్టింటి వారు పంపేవారు. రోజులు గడిచాయి. వూళ్ళో పంచాయితీ యెలక్షను లొచ్చాయి. ఒక పార్టీ సుబ్బయ్య అనే సుబ్బిరెడ్డిగారిని తమ అభ్యర్ధిగా నిలబెట్టింది. అదృష్టం కలిసొచ్చి సుబ్బిరెడ్డిగారు ప్రెసిడెంటయి పోయాడు. శాస్త్రిగారు పోయిన దగ్గరనుంచి సీతమ్మ గారు లెక్కా, డొక్కా అంతా సుబ్బిరెడ్డికే వప్పచెప్పడం మూలంగా, ఆమె దగ్గర సొమ్మేలేకపోయింది.

సుబ్బిరెడ్డి ప్రెసిడెంటయిన దగ్గరనుంచి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళతో,ఇల్లు సరిపోవటం లేదంటే,మరో ఇంటికి మారతానన్నాడు సుబ్బిరెడ్డి. అలాగే మరో పెద్ద ఇంటికి మారిపోయాడు. సీతమ్మగారు ఇక్కడె వుండిపోయింది. సుబ్బిరెడ్డి కాని, అతని భార్య కాని సీతమ్మగారిని రమ్మనలేదు, తీసుకెళ్ళలేదు. సీతమ్మ పాతంట్లోనూ, సుబ్బిరెడ్డి దంపతులు కొత్తింటిలోనూ వుంటూ వచ్చారు. కొద్ది రోజులు సీతమ్మగారు వంట చేసి సుబ్బిరెడ్డి దంపతులికి పంపేది. రోజులు గడిచాయి, సీతమ్మగారి చప్పిడి కూరలు సుబ్బిరెడ్డి పెళ్ళానికి, సుబ్బిరెడ్డికీ కూడా నచ్చడం మానేసాయి. నెమ్మదిగా సుబ్బిరెడ్డి పెళ్ళాం వంట ప్రారంభించి, సీతమ్మ గారిని పంపవద్దని చెప్పేశారు. కొత్తింటికి వెళ్ళిన దగ్గరనుంచి సుబ్బిరెడ్డి, సీతమ్మ గారిని పన్నెత్తి పలకరించలేదు, కన్నెత్తి చూడలేదు. కొడుకు ప్రయోజకుడయ్యాడు కనక ఖాళీ వుండటం లేదని సీతమ్మ సరి పెట్టుకుంది. రోజులు నడుస్తున్నాయి. కొత్తింటికెళ్ళిన కొత్తలో సుబ్బిరెడ్డి కొద్దినెలలు సీతమ్మ గారికి సరుకులు పంపేవాడు. తరవాత తరవాత నెమ్మదిగా మానేసాడు. పస్తులుండే పరిస్థితి వచ్చేసింది, సీతమ్మ గారికి. సుబ్బిరెడ్డికోసం వెళితే దొరికేవాడు కాదు. ఒక వేళ దొరికినా కొద్దిగా సొమ్మిచ్చి పంపేసేవాడు. పాపం సీతమ్మ అన్నీవుండి అనాధ అయి పోయింది. పరిస్థితి చూసిన వూరి పెద్దలు కొంతమంది సుబ్బిరెడ్డిని “కులం వాడివి కాకపోయినా,నిన్ను శాస్త్రి, సీతమ్మలు కొడుకువనుకుని పెంచారు, నువు పెంచిన తల్లిని చూడక పోవడం బాగోలేదు” అని చెప్పేరు. దానికి సుబ్బిరెడ్డి” నేనక్కడపెరిగేను. చాకిరీ చేశాను. ముద్దపెట్టేరు. నా సొమ్ము నేను తెచ్చుకొచ్చేసాను” అని వూరివారికి చెప్పడంతో ఎవరూ మాటాడలేకపోయారు. సీతమ్మ గారు కూటికి మొహంవాచి,నెమ్మదిగా రెండిళ్ళలొ పాచి పని చేసి పొట్టనింపుకోవడం మొదలెట్టింది.కొంత కాలానికి ఇల్లు అమ్మేసి, అందులో అద్దెకు వుండడం ప్రారంభించింది. ఇది చూసిన వూరివారు ” సీతమ్మ గారి పొలం మీద సొమ్మయినా ఆమెకు ఇమ్మని చెప్పేరు” దీనికి సుబ్బిరెడ్డి ” మాస్టారుకి జబ్బు చేసినపుడు, నేను డబ్బు పెట్టి వైద్యం చేయించాను. ఆ ఖర్చుకింద పొలం స్వాదీనం చేసుకున్నా” అన్నాడు. వూరివారు నోరెత్తలేదు. సీతమ్మ గారు మాటాడలేదు. పెంచిన ప్రేమ చంపుకోలేక ఒకవేళ వెళ్ళినా సుబ్బిరెడ్డి దర్శనమే అయ్యేది కాదు, సీతమ్మగారికి. రోజులు నడుస్తున్నయ్. సుబ్బిరెడ్డి సమితి ప్రెసిడెంటయ్యాడు. హడావుడే, హడావుడి. వోపిక తగ్గిన సీతమ్మగారు పాచి పని కూడా చేయలేని స్థితి వచ్చేసింది. ఆ పరిస్థితులలోకూడా ఆమె సుబ్బిరెడ్డిని పల్లెత్తు మాటనలేదు. ఎవరేనా సీతమ్మగారితో” సుబ్బిరెడ్డిని నిలదీసి అడగండి. మీపొలం సొమ్ము మీరు పుచ్చుకోండి”అన్నా, సీతమ్మ గారు పలికేదికాదు. ఒకవేళ యెవరేనా మరీ బలవంత పెడితే ” పోనీయమ్మా! కుర్రాడు. వృద్దిలోకి రావలసినవాడు. వాడి ఖర్చులేమున్నాయో. నా పొట్టకేమిలే. యీ వేళ లేక రేపు రాలిపోతా” అనేది కాని సుబ్బి రెడ్డిని యెవరూ మాట అననిచ్చేది కాదు. ఒక పూట తిని , ఒకపూట తినక సీతమ్మ చిక్కి శల్యమైంది. కూటికి ముఖం వాచిన సీతమ్మ వొకరోజు శివైక్యం చెందింది. వూరివారు గొడవ చేయగా సీతమ్మగారి శవాన్ని, దహనం మాత్రం చేయించాడు, సుబ్బిరెడ్డి. ఇప్పుడు సుబ్బిరెడ్డికి బెరుకు తీరిపోయింది. సమితి ప్రెసిడెంటుగా విందులు, వినోదాలు, పెళ్ళాం మెడలో బంగారపు హారాలు. సుబ్బిరెడ్డి పని వేలేస్తే కోలు దిగబడేలా వుంది.

మళ్ళీ యెన్నికలొచ్చాయి. రాత్రి పగలనక ప్రచారం చేశాడు. యెన్నికల ముందు రోజు ప్రచారానికి వెళ్ళి వస్తూ స్నేహితుని దగ్గర కొద్దిగా మందు పుచ్చుకుని, అర్ధ రాత్రి తిరిగొస్తుండగా జీపు తిరగబడి సుబ్బిరెడ్డి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. లేవలేడు, తిరగలెడు, యెలక్షను లో వోడిపోయాడు. సొమ్ము ధారాళంగా ఖర్చుపడటం, వైద్య ఖర్చులతో సుబ్బిరెడ్డి తేరుకోలెక పోయాడు. పొలం అమ్మేశాడు. పెళ్ళాం మెడలో నగలమ్మేశాడు. ఆఖరికి ఇల్లు కూడా లేక పోయింది. మళ్ళీ సుబ్బిరెడ్డి పెళ్ళాంతో సహా వీధిన పడ్డాడు.ఊరి ప్రజలు సీతమ్మగారి ఉసురు తగిలిందన్నారు…….

ప్రకటనలు

27 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉసురు

 1. @
  సర్వశ్రీ వెంకట్.బి.రావు గారు/మౌళి గారు,

  జీవితం నుండి కధలు పుడతాయి. కొన్ని మార్పులు చేర్పులతో యీ కధ నిజంగా జరిగింది. వెంకట్ గారు చెప్పినట్లుగా ఏబది సంవత్సరాల కధని ఏబది లైన్లలోకి తేవడంలో ఇబ్బంది మూలంగా కొంత కధనంలో తేడా చూపవలసి వచ్చింది. నిజ జీవితంలో ఆ కొడుకు తల్లిని కొట్టేడు కూడా. నిజంగా సుబ్బిరెడ్డి పూర్తిగా తల్లిని వదిలెయ్యలేదు, చావకుండా, బతక కుండా చేసి, ఆవిడ పాచి పని చేసుకు బతికే స్థాయికి నెట్టేశాడు. అతని పలుకుబడి మూలంగా ఆమె ఏమీ చేయలేని స్థితికి వచ్చేసింది.నిజ జీవితం లో ఆమె శాపనార్ధాలు పెట్టింది కూడా. ఆఖరికి, అతని గుమ్మం ముందు అనాధలా చనిపోయింది. ప్రజలు అంతకు ముందూ మాట్లాడలేదు, ఆమె చనిపోయాకా కూడా మాట్లాడలేదు. సుబ్బిరెడ్డి లొంగుబాటుకు వచ్చిన తరవాత మాట్లాడేరు. ఇది నిజంగా జరిగినది. కధనం కోసం మార్పు చెయ్యాల్సి వచ్చింది.

  నా కధ, కధనం మీద, మంచి చర్చ చేసినందుకు ధన్యవాదాలు.

  • శర్మ గారు

   మీరు చెప్పిన ప్రజలు, పైన కొందరు చదువరులు అనుకొంతున్నట్లు గా సుబ్బి రెడ్డి కి సీతమ్మ ఉసురు అనేది నిజమే అయితే, మరి సీతమ్మ గారికి ఎవరి ఉసురు తగిలిందంటారు 🙂

   అందుకే రచయిత తనకు తెలిసిన కోణం లోనే వ్రాసారు అని ముందుగా అభిప్రాయపడ్డాను.

   ఇదే సమస్య ను నేను వ్రాస్తున్న దత్తత గురించిన సిరీస్ లో వ్రాయదలిచాను ఇప్పటికే, మీ ఈ కధ ఒక ఉదాహరణ కాగలదేమో ,ధన్యవాదములు

   http://teepi-guruthulu.blogspot.com/2011/12/1.html

   • @
    మౌళిగారు,

    ఎప్పుడూ జనసామాన్యం ఏదో వొక వ్యాఖ్య చేస్తుంది. సాధారణంగా ప్రజలు అనుకునే మాట అదే. ఇక మీరు వొక కొత్త మాట అన్నారు. సీతమ్మ గారికి ఎవరి ఉసురు తగిలిందని, దీనినే మన పెద్దలు చేసుకున్న కర్మ, లేదా పూర్వ జన్మ కర్మ ఫలితం అన్నారు. మీకు నా కధ వొక వుదాహరణకి పనికొస్తోందంటే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లుగా భావిస్తాను,నేను దత్తుడినే అనగా ఇవ్వబడిన వాడినే. నా అనుభవాలు మీకు వుపయోగపడతాయేమో! ధన్యవాదాలు.

   • సీతమ్మ ది ఖర్మ , ఆ బిడ్డది ఉసురు అవదు కదండీ .

    మీరు ఇవ్వబడ్డ దత్తుడు. కాని ఇప్పటి వారు పూర్తి గా వేరండీ. ఆ బిడ్డల మనోభావాలు మీ కర్ధం అవుతాయో లేదో అని నాకు కూడా ఒకింత ఉత్సుకత గా ఉంది .

   • @
    మౌళిగారు,
    నమస్కారం
    మీరు చెప్పింది నిజమే. కాని లోక వ్యవహారం అలా వుంటుంది. ధన్యవాదాలు.

 2. ఏ కథనైనా, నవలనైనా చదివేటప్పుడు, నేను ఒకటాలోచిస్తాను, శర్మ గారూ! అదేమిటంటే, వున్న పరిస్థితులలో ఒక character సహజంగానే అలా behave చేస్తుందా, లేకపోతే కథకోసం అలా behave చేస్తోందా? అని. సుబ్బయ్య behavior లో నాకెందుకో ఈ రెండవది ఎక్కువగా కనిపిస్తోందనిపించింది. I may be wrong too!

  చాలా drama వుందీ కథలో! heavily polarized గా, కథలో మంచి, చెడ్డ అన్న భాగాలని స్పష్టంగా identify చేయ్యడానికి వీలుగా కనిపిస్తుంది కథ! నలభై-యాభై ఏళ్ళ కథని, నలభై-యాభై లైన్లలో చెప్పాల్సొచ్చినప్పుడు ఈ polarization సంభవించడం తప్పదేమో కూడా!

  ఒకటనుకుంటాను! మంచి చెడ్డ లను స్పష్టంగా గుర్తించ గలగటానికి వీలయ్యేంత రీతిలో నిజంలో మనుషుల behavior వుండదు. చెడ్డవాడుకూడా తనలోని చెడుని ప్రపంచానికి glaring గా ప్రదర్శితమయ్యేలా behave చెయ్యడు. చేస్తే అతడు లౌక్యుడు కాడు. సుబ్బయ్య లౌక్యుడు. జనం ఎదురుపడి తల్లికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, అలా తన wickedness తన నోటినుంచే బహిర్గతమయేలా సమాధానం చెబుతాడని నేననుకోను.

  లోకంలో అన్యాయం ఎక్కడ జరిగినా అది బహిరంగంగా, అందరూ గుర్తించి చూసేటందుకు వీలుగా జరగదు. చూసినా గుర్తించడానికి వీల్లేని విధంగానూ, గుర్తించినా ఇది అన్యాయమేనా? అనే సందేహంలో పడేసేదిలాగానూ జరుగుతుందని నేననుకుంటాను. అప్పుడు, సీతమ్మగారు అన్ని కష్టాలు పడుతున్నా, వాటన్నిటికీ సుబ్బయ్య చెడ్డతనమే కారణం అని జనంలో ఒక అనుమానం, కొంతమందిలో నమ్మకం అయి వున్నా, పైకంతా సజావుగానే వుంటుంది.

  అయితే, సుబ్బయ్యకు కాళ్ళు చచ్చు పడిపోయి, ఆస్తంతా పోయి, ఏమీ లేని స్థితికి చేరుకున్నాక మాత్రం, సుబ్బయ్య సీతమ్మగారికి చేసిన అన్యాయం నిర్ధారణ అయిపోయినట్లై. సీతమ్మగారి ఉసురే తగిలుంటుండని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటారు!

  ఇలా వుంటుందనుకుంటాను శర్మగారూ కథ!

  • /. లోకంలో అన్యాయం ఎక్కడ జరిగినా అది బహిరంగంగా, అందరూ గుర్తించి చూసేటందుకు వీలుగా జరగదు. చూసినా గుర్తించడానికి వీల్లేని విధంగానూ, గుర్తించినా ఇది అన్యాయమేనా? అనే సందేహంలో పడేసేదిలాగానూ జరుగుతుందని నేననుకుంటాను/

   చాల చక్కగా చెప్పారు వెంకట్ గారు. రెండో మాట లేదు. కాని మీరు చెప్పిన దారిలోనే చుస్తే , చెప్పుకొంటున్నారన్న ప్రజలు కూడా ఆ తానులోని ముక్కలే కదా. లేని వాటిని చెప్పుకోడానికే కొరత ఉండదు. ఇక ఉన్న లోపాలని చెప్పుకోటానికి ఎంత సేపు. బహుసా అందుకే కధ లో కూడా ప్రజల అభిప్రాయానికి పెద్దగా లెక్క ఉండదు

   @ఒక character సహజంగానే అలా behave చేస్తుందా, లేకపోతే కథకోసం అలా behave చేస్తోందా? అని

   కధ చెప్పే వ్యక్తి తన కోణం లో నుండి చెప్పెపుడు, అంతా తను చూసినట్లు గా, ముందు నుండి తెలిసిన విషయమే లా చెప్పడం మామూలే. అంత సులువు గా సాగి పోవడం మీ సందేహానికి ఒక కారణం అయితే, సమాజం లో ఆ కొడుకు ఒక్కడే చెడ్డవాడు గా చెప్పబడిన కారెక్టర్ కాబట్టి, కధ కోసం బిహేవ్ చేస్తోందా అని మీకు అనిపించింది 🙂

   కాని కధ లో అందరి స్వభావాలకి ప్రాముఖ్యత లేదు కదా !

 3. మాష్టారు,

  >>>ఈ వ్యాసంగం జీవితకార్యక్రమాలకి ఇబ్బంది కలిగించేలా వుంది. సుముహూర్తం కోసం చూస్తున్నా! చాప చుట్టేస్తా. ధన్యవాదాలు.

  వందకే ఈ వైరాగ్యం వస్తే ఎలా ! కాస్త రీ లేక్స్ అయ్యి శత సహస్ర కి వ్రాయాలి మీరు.!

  మచ్చుకకి మా బులుసు వారిని చూడండి, టెంపరరీ గా బ్లాగు బెడ్డుని కట్టి బెట్టి, కామెంట్ల కబడ్డీలు ఆడుకుంటున్నారు ! అదీ రియల్ లక్స్! రీ లేక్స్! ఫాలో మార్చ్ ఫాస్ట్ !

  చీర్స్
  జిలేబి.

  • ఈ వ్యాసంగం జీవితకార్యక్రమాలకి ఇబ్బంది కలిగించేలా వుంది. సుముహూర్తం కోసం చూస్తున్నా! చాప చుట్టేస్తా. ధన్యవాదాలు.

 4. 100వ టపాతో హృదయాన్ని కాస్త భారంగా చేసారు.
  100 టపాలు పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తాతగారూ..ఇంకా ఇలానే ఎన్నో చక్కని, చిక్కని కబుర్లు చెప్పాలని కోరుకుంటూ….

 5. ట్రాక్టర్ కర్త

  సీతమ్మ కర్మ

  జీపు క్రియ !

  కర్త కర్మ క్రియ లేనిదే జీవితం ‘శత’ మాణం కాదనుకుంటాను.

  “వంద” నం!!!

  శతమానం ఇదేనా ? కాకుంటే మరోసారి కూడా చెప్పటానికి అభ్యంతరం ఏమీ లేదు !

  చీర్స్
  జిలేబి.

 6. తెలుగులో ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా’
  సంస్కృతంలో ‘అత్యుత్కృటైః పాపపుణ్యైః ఇహైవ ఫలముచ్యతే’
  ఇంగ్లీషులో ‘You reap what you sow’
  హిందీ అంత బాగా రాదండీ!
  విషయమేమిటంటే ఇటువంటి ప్రవర్తనని అన్నిచోట్లా తప్పు పడుతూనే ఉంటారు.
  కాని సాధారణంగా జనంలో అలా కృతఘ్నులుగానే ఉండే వాళ్ళు యెప్పుడూ ఉంటారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s