శర్మ కాలక్షేపంకబుర్లు-పన్నుపోటు.

పన్ను పోటు

చెప్పులోని రాయి చెవిలోనిజోరీగ
కంటిలోని నలుసు, కాలిముల్లు,
ఇంటిలోని పోరు ఇంతింతకాదయా
విశ్వదాభిరామ వినురవేమ.

వేమన తాత చెప్పులో రాయి పడితే నడక కష్టం అన్నాడు. ఇది సాధారణంగా ఇసుకలో నడిచేవాళ్ళకి అనుభవం. ఆ రాయి తీసి బయట పారేసేదాకా నరకమే. చెవిలోకి జోరీగ అక్కర లేదు, చీమ దూరినా కష్టమే, భరించలేము. దీనికి చిట్కా వైద్యం చెవిలో నీళ్ళు/నూని పోయడం. అది చస్తుంది, మనం బతుకుతాం. కంటిలోని నలుసు, అబ్బ! యిది చాలా బాధపెడుతుందండి బాబు.  ఇదివరలో చిట్కా వైద్యాలు చేసేవారు.  కళ్ళు శుభ్రమైన నీళ్ళలో తెరిచి ఆర్పితే నలక పోతుందనే వారు. ఒక్కొకప్పుడు పని జరిగేది. మరో వైద్యం కూడా చేసేవారు.  అది నాలికతో నలకని తీయడం.  కొంత మందికి దీనిలో ప్రావీణ్యం ఉండేది.  ఫలానా వారిదగ్గరకెళితే నలక జాగ్రత్తగా తీస్తారని.  భయం కూడా లేదు.  కన్ను లాటి సున్నితమైన చోటుని నాలుక లాటి సున్నితమైన కండరంతో తీయడం. ఇప్పుడు అంతా డాక్టర్ దగ్గరికి పరిగెట్టడమే.  కాలి ముల్లు, ఇది కూడా రాయి లాటిదే, తేడా ఆంతా అది వెంటనే తీయచ్చు, ఇదలా కుదరదు.  ముల్లు విరిగితే, సాధరణంగా గుచ్చుకున్న ముల్లు విరిగిపోతుంది.  తీరుబడిగా కూచుని పిన్నీసుతో తీసుకోవాలి లేదా మరొకరిని తీయమనాలి.  ఇవన్నీ కష్టాలే కాని, తాత చెప్పిన మరివొకటి మాత్రం నాకు అనుమానం ఉంది.  అది ఇంటిలోని పోరా, ఇంటిలేని పోరా, ఇంతిలేని పోరా,  ఇంతిలోని పోరా,అని.  ఇంటిలోని పోరు, నిజమే, అదే ఆలుమగల మధ్యనయితే చెప్పనలవి కాదు. ఇంటి లేని పోరు కాదు. ఎందుకంటే, ఊరు మూగ చింతపల్లె, వునికి పశ్చిమవీధి, మొదటి ఇల్లు అని చాలా స్పష్టంగా చెప్పేడు. ఆయనకి ఇల్లు లేదనుకోడానికి సావకాశం లేదు కనక యిది ఆయన స్వానుభవం కాదని పిస్తుంది. ఇంతిలేని పోరా, ఏమో కావచ్చు, పురుషుడికి స్త్రీలేని బాధ దుస్సహం.  ఇది కావచ్చేమో. ఇంతిలోని పోరా, అంటే లోని స్త్రీ లోలత్వమా, ఆపోరు మనసులో బయలుదేరితే చాలా ఇబ్బందే.మనవాళ్ళు ఇంటిలోని పోరు అని స్పష్టంగా చెప్పేరు కనక అదే అనుకుందాం, మరి.  వేమన తాత కాలినుంచి చెవికి, తరవాత కన్నుకి, మళ్ళీ కాలుకి వెళ్ళేడు, కాని మరొక ముఖ్యమైనది చెప్పడం మరిచాడో లేక ఆయనకి అనుభవంలోకి రాలేదో తెలీదు. అదే పన్ను పోటు, నోటిలోని పంటి పోటు.

నాలుగు రోజుల కితం పళ్ళ డాక్టరుగారి దగ్గరకెళ్ళాల్సి వచ్చింది. కిందపళ్ళలో, ముందులో ఒక పన్ను కదులుతోంది, వూడదు. ఏమైనా తింటే వొకటే సలుపు. పళ్ళు అని చెప్పుకోడానికి కిందవైపు, వెనక మూడు వొక పక్క, మూడొక పక్క వున్నయి. పైన ముందు వరసగా ఆరున్నాయ్! యాజమాన్య దంతాలు తప్పవు కదా! యాజమాన్య దంతాలంటే గుర్తుకొచ్చింది.  దక్ష యఙ్ఞ సమయంలో వీరభద్రుడి దెబ్బకి సూర్యుడికి పళ్ళూడి పోయాయి, అప్పుడు శంకరుడు యాజమాన్య దంతాలు ప్రసాదించాడు.  అంటే కట్టుడు పళ్ళు అప్పటినుంచీ వున్నాయన్నమాట.  చాలా రోజులునించి యిలా వుంది, యిక లాభం లేదని బయలు దేరాను.  మాకు, మా వూళ్ళో వొక మంచి సదుపాయం, కన్ను,పన్ను, సుగరు డాక్టర్ లంతా వొకచోటె దొరుకుతారు.  మా కంటి డాక్టరు గారయితే ఎక్కువలో ఎక్కువ రెండు గంటలలో అన్నీ పూర్తిచేసి బయటకి పంపేస్తారు, రోజూ వందలమంది వచ్చినా.  సాధారణంగా ఎక్కువ సమయంతీసుకోవలసినది అక్కడే.  పంటి డాక్టరు, సుగర్ డాక్టర్ గార్ల దగ్గర సమయం ఎక్కువ తీసుకుంటుంది, తప్పదు మరి. అక్కడికెళ్ళేటప్పటికి నా నెంబరు  13 దాకా వచ్చింది. అయ్యో! సమయం పడుతుందే అనుకుంటూ, పన్ను పోటు మరిచిపోడానికి వేరే వ్యాపకం చేస్తే కొంత మనసు మళ్ళుతుందని, మిగిలినవారెవరో చూదామనిపించి చూస్తే, అందరూ చిన్న వాళ్ళే కనపడ్డారు. ఇదేమిటీ! నాలా వయసు మళ్ళిన వాళ్ళు వూంటారనుకుంటె, చిన్న వాళ్ళున్నారని ఆశ్చర్యపోయి, సరే మనపని కానిద్దామని, పక్కనున్న వొక అమ్మాయిని పలకరించా. అదేనండీ, ఆవిడకి నలభై పైన వుంటాయిలెండి. నాకన్నా చిన్నదేగా, అందుకే అమ్మాయ్! నీకేమిటమ్మా బాధ అన్నా. బాబయ్యగారు నాకు బాధ లేదు, మా అమ్మాయి కంది.
చూస్తే ఆ అమ్మాయికి 20 దగ్గర వయసు. అయ్యో! ఇంత చిన్న వయసులో పళ్ళ ఇబ్బందేమిటి తల్లీ, అన్నా. పళ్ళ యిబ్బంది తో, పెళ్ళి ఇబ్బంది అంది. నాకు అర్ధంకాలా. వెర్రి మొహంతో చూస్తోంటె, మొన్న నొక పెళ్ళి సంబంధం వచ్చిందండి. అన్నీ నచ్చేయి, కాని పెళ్ళి కొడుకు, పిల్ల పళ్ళు కొద్దిగా ఎత్తుగా వున్నాయన్నాడు, అందుకు వాటిని సరిచి చేయిద్దామని, అంది. పరిశీలనగా చూస్తే ఆ అమ్మాయి నోరు మూస్తే పళ్ళు కనపడవు. మామూలుగ వుంటే కొద్దిగా ఎత్తుగా వున్నాయేమో!,అనుమానమే. అదేమిటమ్మా, అమ్మాయి చిలకలా వుంది, యీ అమ్మాయికి పేరెట్టారా, అని అశ్చర్యపోయా. ఆ మాటంటే, తల్లి, మనమ్మాయి మనకి చిలకలాగే కనపడుతుంది, పైవాళ్ళకి కనపడాలికదండి, అంది. ఈలోగా వాళ్ళకి పిలుపొచ్చింది. అమ్మయ్య తరవాత నాదే. డాక్టర్ గారిదగ్గరకెళ్ళి పన్ను పీకించుకుని నోరుమూసుకుని తిరిగొచ్చా.

ఇంటికొచ్చాక, నాఇల్లాలొక చల్లని వార్తచెప్పింది, పన్ను పీకించుకున్నారా! బాధపడకండి, 80 ఏళ్ళ్ తరవాత మళ్ళీ వస్తాయంది. మళ్ళీ పళ్ళు రావడమేంటీ అన్నా. మా పెద్దమ్మకి 80 ఏళ్ళు దాటకా, మళ్ళీ పళ్ళొచ్చాయ్! తెలుసా అంది చాలా సీరియస్ గా. నిజమే చెబుతోందో, నన్నేడిపిస్తూందో తెలియలేదు.


ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పన్నుపోటు.

 1. @
  వెంకట్.బి.రావుగారికి,
  ఇంటిపోరుతో నాకూ సందేహం లేదు. ఐతే నేననుకున్న అక్షరాలు కూడా గణాలు కి సరి పోతాయి కనక సరదాగా వొక ఆలోచన చేసాను.
  సూర్యుడికి యాజమాన్య దంతాలు శంకరుడు ప్రసాదించినట్లు దక్షయఙ్ఞంలో వుంది, వొక సారి చూడగలరు. అబ్బో ! ఈ వెన్నుపోటు రెండు రకాలా చాలా కష్టమే. నాకు మరొక పోస్టు రాసుకోడానికి సహాయపడుతున్నారనుకుంటా. ధన్యవాదాలు.

 2. @
  sunnAగారికి,
  నా బ్లాగుకి స్వాగతం. పల్లెలలో ఇప్పటికి చేస్తున్న వైద్యం అదే. మంచి మాట చెప్పేరు. ఇకనుంచి పాటిస్తాము. ధన్యవాదాలు.

 3. ‘ఇంటిపోరు’ లో confusion ఏమీ లేదనుకుంటాను, శర్మగారూ! అది ‘ఇంటిపోరే’ అనుకుంటాను!
  సూర్యుడి గురించిన సంగతులు నాకు తెలీనివి, నేనింతకు ముందు ఎక్కడా చదవనివీ!
  పోతే, పంటిపోటును వొప్పుకోవాలిసిందే గాని – పోటులకే పోటులాంటిది, పహిల్వాను లాంటివాళ్ళనే పడుకోబెట్టే సామర్ధ్యం గలిగినదీ ఇంకొకటుంది … అదే… వెన్నుపోటు!! దాని బారిన పడ్డవాళ్ళకుగాని తెలీదంటారు దాని బాధ ఎలాంటిదో!!

 4. @
  బులుసు సుబ్రహ్మణ్యం గారు,
  అయ్యయో! అన్నీ అయిపోయాయి సార్. లేకపోతే మీవెనకే వచ్చేవాడిని.
  ధన్యవాదాలు.

 5. @
  అమ్మాయ్! జ్యోతిర్మయి,
  అయ్య బాబోయ్! వెయ్యి డాలర్లా అంటే 50 వేల రూపాయలా! వామ్మో!.ఆ సొమ్ము ,మామూలుగా మాకు జీవితకాలపు సాధారణ మందుల ఖర్చు. మాకు మందుల ఖర్చు, డాక్టర్ ఫీజు అన్ని కలిపి 5 డాలర్లు అనగా 250 రూపయలు మాత్రమే. ధన్యవాదాలు.

 6. మా ముఖర్జీ వారు 80G ఇస్తానంటాడు గాని, పన్ను లు మాత్రం పీకనంటే పీకనంటాడే మరి !

  చీర్స్
  జిలేబి.

 7. బాబాయిగారూ అమెరికాలో పన్ను పోటు వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి అయ్యే ఖర్చు ఓ వెయ్యి డాలర్ల పైమాటే…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s