శర్మ కాలక్షేపంకబుర్లు-ఓ పనైపోయింది బాబు-గాంధిగిరి

ఓ పనైపోయింది బాబు-గాంధిగిరి

హోమ్ మినిస్త్రీ వారి దగ్గరనుంచి వొక తాఖిదొచ్చింది. డబ్బులు కావాలి. ఎంత? ఇరవై. ఏమిటి వొకట్లా, వందలా, వేలా, అని అడిగితే ఆఖరిదే ఖాయం చేసుకోమన్నారు. సరే దాఖలు చేసుకుంటామన్నాము. ఎప్పుడన్నారు. మీరిప్పుడు చెప్పేరు కనక ఎ.టి.యం కి వెళ్ళి వస్తామన్నాము. సరే అని సమయం మంజూరు చేసారు, దయతో. ఎందుకని అడగలేదేమి అన్నారు. మీరు చెప్పచ్చుగా అన్నాము. పండగొస్తోందిగా, అన్నారు. సరే అన్నాము. మరునాడు దాఖలు చేసుకున్నాము.

మూడవరోజు వుదయమే టిఫిన్ పెట్టేసి అత్త, కోడలు, మీరు ఇంట్లో వుంటారా, బయటికి వెళతారా, అని జమిలిగా అడిగేటప్పటికి, ఎందుకేనా మంచిదని ఇంట్లో వుంటున్నామన్నా. ఇక్కడొక ముఖ్య విషయం చెప్పాలి. సూదంటు రాయికి సూది అంటుకుపోతుంది. ఇక్కడ కోడలు, అత్తలలో సూదంటురాయి ఎవరో , సూది ఎవరో మాత్రం తెలియదు. ఇద్దరూ అన్ని విషయాలలో అలాగే వుంటారు. మరో మాట వినపడదు. ఇది చిత్రంగానే చూస్తారు మా వాళ్ళంతా. మేము షాపింగ్ కి వెళుతున్నాము, ఇల్లు జాగ్రత్త, మీరు జాగ్రత్త, అందులో ములిగిపోయి, అదే కంప్యూటర్లో, చుట్టుపక్కల ఏమి జరుగుతున్నది పట్టించుకోపోతే ప్రమాదమని హెచ్చరించి, బయటకు కదిలారు. అమ్మాయ్యా! మనకు తీరిక చిక్కిందనుకుని నిజంగానే బ్లాగ్ లోకం లో ములిగి పోయా. దగ్గరగా వొంటి గంట ప్రాంతంలో, ఆటోలో దిగేరు. నాలుగు బేగులు పట్టుకొచ్చారు. బోజనలయిన తరవాత కాస్త విశ్రాంతి తీసుకున్న తరవాత, టీ ఇస్తూ, వొక్కొక బేగ్ విప్పి ఆ సరుకు కొన్న ధర, ఎవరికి కొన్నది చెప్పేరు. బాగుంది, అందరికి పండగకి బట్టలు కొన్నరన్న మాట అన్నాను. అవునన్నారు. డబ్బులు సరిపోయినాయన్నారు. ఇది మరెందుకో అనుకుంటూ వుండగా, మరొక ఐదు కావాలన్నారు. సరే అన్నాం. వారు చెప్పలేదు. మనం అడగలేదు. మరునాడు డబ్బులిచ్చాము. అత్త, కోడలు, కూడబలుక్కుని, మళ్ళీ షాపింగ్ కి బయలు దేరారు.

ఈ సారి వొక కొత్త కుట్టు మిషను తెచ్చారు. కంపెనీ మంచిదే. ఇదివరకున్న మిషన్ ఇచ్చేసి మళ్ళీ కొంత సొమ్మిచ్చి ఇది తెచ్చేమన్నారు. ఇద్దరూ కుస్తీ పట్టి, దానిని పాత స్టాండుకు అమర్చడానికి ప్రయత్నం చేసారు. అది పట్టలేదు. షాపు వాడు పడుతుందన్నాడు, అన్నారు. షాప్ వాడికి ఫోన్ చేస్తే కుర్రాడొచ్చి చూసి పట్టదండని చెప్పి వెళ్ళిపోయాడు. వెనకాలే బయలు దేరి వెళ్ళి ఇది వరలో కొన్న కంపెనీమిషను తీసుకుని వచ్చేము. మరో నాలుగు వందలెక్కువంటె ఇచ్చి వచ్చాము. పట్టుకొచ్చి పెడితే సరిపోయింది. దీనికి మరొక రోగం వచ్చింది. మిషను తిప్పడం పాపం సూది విరక్కొట్టేస్తోంది. మిషను పట్టుకు పోయాం. అక్కడేదో చేసి కుట్టు పడుతోంది చూడమని చెప్పి పంపించాడు. తెచ్చుకొచ్చాము. మరునాడు కుడదామని మొదలెడితే షరా మామూలే. నాలుగు సూదులు విరిగాయి. షాపు చాడికి చెబితే, మనిషిని పంపుతున్నా, అని మూడు రోజులు గడిపేశాడు. నన్ను వెళ్ళి చెప్పమంటే వెళ్ళిచెబితే సాయంత్రం పంపుతానని చెప్పి పంపేశాడు. సాయంత్రం మెకానిక్ చూసినా మరి రెండు సూదులు విరగడం తప్పించి ఉపయోగం లేక పోయింది.ఆ మిషను పట్టుకుపోయి మరొకటి తెచ్చి పెట్టి కుట్టి చూపించి వెళ్ళేడు. మరునాడు కుట్టబోతే, మళ్ళీ మామూలు పాట షరా మామూలే. టెక్నీషియన్ కి ఫోన్ చేస్తే, రెండు రోజుల తరవాత వచ్చి చూసి, ఇదీ అలాగేవుందని చెప్పి వెళ్ళిపోయాడు. పని చెయ్యని మిషను ఇంట్లో వుండి ఉపయోగం లేక పోయిందని, షాపు వానికి ఫోన్ చేసి జరిగిన కధ చెప్పి, దీనికి పరిష్కారం అడిగితే చెప్పలేదు. కంపెనీ నుంచి వచ్చినవి అలాగే వున్నాయండి అన్నాడు. ఇంక ఇది పని కాదని బయలుదేరి, మిషను, దానితో పాటు ఇచ్చిన అన్ని సరుకులు ,బిల్లు, పట్టుకెళ్ళి,షాపతనికి అన్నీ అప్పచెప్పి, వొక మాట చెప్పి వచ్చెశాము. పని చేసే కొత్త మిషను, మేము తీసుకున్న కంపెనీది, ఇవ్వగలిగితే యీరోజు సాయంత్రంకి పంపండి, లేదా మా పాత మిషను, మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చెయ్యండి, వొక వేళ పాత మిషను, డబ్బులూ కూడా ఇవ్వడం కుదరదంటే, మీకో నమస్కారం, తీసుకోమని చెప్పి వచ్చేసాము. చూడాలి, ఏమి జరుగుతుందో.

ప్రకటనలు

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఓ పనైపోయింది బాబు-గాంధిగిరి

 1. @
  రసఙ్ఞా!
  మా ఇంటి ఇద్దరు కోడళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు, తల్లి తండ్రులను చూసుకున్నట్లు. మేము వాళ్ళని మా జీవికలుగా చూసుకుంటాము. వాళ్ళువేరు, మేము వేరు కాదు. అంతా మనం అది మా సిద్ధాంతం. కోపం వస్తుంది. మరు క్షణం పోతుంది. ధన్యవాదాలు.

 2. అత్తలేని కోడలుత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అని పాట ఉంది. కాని అత్తాకోడళ్ళు ఇలా కలిసుండటం నిజంగా అదృష్టమే! అత్తాకోడళ్ళు స్నేహితులయితే ఆ ఇల్లే కదా స్వర్గసీమ! ఎటువంటి గొడవలూ ఉండవు!

 3. జిలేబిగారు,
  కట్టుబాట్లు, కుట్టుపాట్లయినా కొద్దికాలమే ఆపగలవు, కడుపులో లేనిది కావలించుకుంటే రాదని సామెత. వాళ్ళకి అనగా మా ఇంటి అత్త ఇద్దరు కోడళ్ళకి ఆ అవగాహన కలిగింది, ఏవిషయమైనా చర్చ చేసుకుంటారు, వొక నిర్ణయానికొస్తారు, అంతే. ఎవరూ ఎక్కువా, ఎవరూ తక్కువా లేదు. అదీ సంగతి.

 4. అసావాదిత్యో బ్రహ్మా, ‘గాంధీగిరి’ వాహమస్మీ అంటారు మొత్తం మీద ! కట్టు బాట్ల తో అత్తా కోడళ్ళు సూదంటు ‘రాయ్’ లన్న మాట ! కుట్టు పాట్లు కొత్త విషయ్యాని తెలిపేయి- ‘అట్టా’ ఇంటి కోడళ్ళు, ‘అట్టా’ ఇంటి అత్తల్ ఉన్న శర్మ వారు ధన్యోస్ములు.

  చీర్స్
  జిలేబి.

 5. @
  అమ్మాయ్ సుభా!,తాడిగడప శ్యామల రావు గారు, మాలాకుమార్ గారు ధన్యవాదాలు.

  ఈ వేళ వెళ్ళేము. కొత్త మిషను తీసి దానిని అన్ని విధాలా సరి చూసి కుట్టి చూపించి జాగ్రత్తగా పేక్ చేసి ఇచ్చాడు. నిన్న గాంధి గిరి చేసిన సమయం చాలా ప్రధానమైనది, అప్పుడు అతని షాపు లో జనం చాలా మంది వున్నారు. ఇది పల్లెటూరు, వొక మాట కనక పడేస్తే వొక గంటలో మన దగ్గరకి మరొక రూపంలో తిరిగొస్తుంది. అందుకు అతను జంకేడు.అలా గాంధి గిరి పని చేసింది.ఈ రోజు తెచ్చేటపుడు మరల ఇలా కనక ఇబ్బంది జరిగితే మిమ్మలిని, కంపెనీ వాణ్ణి కూడా వదలిపెట్టనని చెప్పి వచ్చా.
  శ్యామల రావు గారు,
  నా పొస్ట్ మిమ్మలిని బాగా కదిలించింది. మీరు చెప్పినది అక్షరాలా నిజం. మనదేశం లో చట్టలికి లోటు లేదు. ఐతే అవి సామన్యుడికి మాత్రం చుట్టాలు కావు. కలిగిన వారి చుట్టాలు. ద్రవిడ సంధ్యావందనం లో అసావాదిత్యో బ్రహ్మ అని చెప్పి తల చుట్టూ తిప్పి ముక్కు పట్టుకుంటారు. మన చట్టాలు అలా వుంటాయి. ఈ రోజొకరి బ్లాగులో చూసాను, నెంబర్ పోర్టబిలిటీ గురించి వారు పడుతున్న ఇబ్బందులు. దానికి సలహా ఇచ్చాను, మరొకరు వారికి తగు సహాయం చేస్తానన్నారు. కొద్దిగా నయినా తెలిసిన మనమే ఇలా బాధలు పడుతోంటే మిగతా వళ్ళపని ఎలావుందో ఊహించలేము.ప్రభుత్వం వారికి వత్తసు పలుకుతోంది అదీ చిత్రం. ధన్యవాదాలు.

 6. @

  మిత్రులందరికి,
  ధన్యవాదాలు. మందు పని చేసింది. నిన్న సాయంత్రం ఫోన్ చేసి కొత్తవి తెప్పించాను, చూసుకుని పట్టుకెళ్ళమన్నాడు, ఈవేళ మధ్యాహ్నం వెళ్ళివస్తాం. వివరాలు మరలా.
  @
  అమ్మాయ్! జ్యోతిర్మయి, నిజం. మా ఇంటి కోడళ్ళు అత్త అలాగే వుంటారు. అది మా అదృష్టంగా భావిస్తాము.

 7. “60% శాతం వరకు గొప్ప తగ్గింపు ధరలు” అంటూ హడావుడిగా ప్రచారం చేస్తారు.
  కొట్టుకు వెళ్ళండి. 60%శాతం తగ్గింపులో ఒక్క వస్తువూ ఉండదు. మీరు పట్టుబట్టంటి యేవటవి అని.
  అయిపోయాయి అంటారు. లేదా యెందుకూ పనికిరానివి ఒకటో రెండో వస్తువులు చూపుతారు. అవి యెవరూ యెలాగూ కొనరు. మిగతావి అన్నీ మహాఅయితే 10% తగ్గింపు తో వస్తాయి. ముందే 40% అగ్గించి ధరలమీద 10% తగ్గింపు అన్న మాట. సరే దుకాణానికి వచ్చాం గదా అని, చాలా మందిమి compulsive shoppersము గదా, యేవో కొని జేబుకు పెద్ద చిల్లు పెట్టుకుని వస్తాము.

 8. ఈ మద్య ఇలాంటివి ఎక్కువైపోయాయి . పాత పట్టుచీరలిస్తే కొత్త పట్టు చీర లిస్తామని ఈ మద్య మొదలు పెట్టారు . ఒక పాత చీరకు ,ఒక కొత్తచీర ఇస్తారట . వాడు మనకు ఇస్తామని చూపించిన చీర బయట దొరికె ధరకు డబల్ వుంది . పైగా మనచీర కిచ్చే ధర చాలా కొద్ది . అంతా గందరగోళం అనిపించి మా ఫ్రెండ్ ను తీసుకోవద్దని చెప్పాను 🙂

 9. ఇది ఒకరకమైన అందమైన రాకెట్. వెయ్యి మందికి పనిచేయని మెషీన్లు అంటగడతారు. వారిలో అనేక మంది షాపు వాడి చుట్టూ ఆ తరువాత కంపెనీ వాడి చుట్టూ తిరిగి తిరిగి ఊరుకుంటారు. జరిగేదేమీ ఉండదు కొన్నవాళ్ళ సొమ్ము పోవటం తప్ప. రూ. 10,000/- పెట్టి 1000 మెషీన్లు ప్రజలు కొంటే ఆ పని చేయని వాటికి ప్రజల సొమ్ము అక్షరాలా కోటి రూపాయలు దండగై పోతుందన్న మాట. ఈ వేయి మందిలో ఒళ్ళు బాగా మండటమే కాదు ఓపిక దండిగా ఉన్నవాళ్ళు కొందరుంటారు గదా – ఒక 25 మంది. వాళ్ళు చివరికి కోర్టు కీడుస్తారు షాపువాడినీ కంపెనీవాడినీ కలేసి. అందులో 2మంది చులాగ్గా ఈ కోర్టుచుట్టూ 40 ప్రదక్షణాలయ్యేసరికి ఒక దండం పెట్టి వదిలింది చాల్లే అని ఊరుకుంటారు. మరో 30 ప్రదక్షణాలో 60 ప్రదక్షణాలో పూర్తయ్యాక, అదృష్టం బాగుంటే కేసులో షాపువాడికీ కంపెనీ వాడికీ వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఈ 5గురికి మూడు లేదా ఆరు నెలలగడువులో వస్తువు బాగుచేయించి యివ్వమనో, రూ. 10,000/- కూ 6% వడ్డీ చొప్పున కేసు నమోదు అయిన నాటి నుండీ వడ్డీతో సహా (ఈ రెండేళ్ళకూ) కలిపు ఇమ్మనో లేక రూ. 200/- అపరాధమూ మరో రూ 200/- కోర్టు ఖర్చులూ చెల్లించమనో శిక్షవేస్తారు. వాళ్ళు బాగుచేసి ఇస్తాం లెండి అంటారు. మళ్ళీ కథ మొదలు! ఈ 5గరు యేమి సాధించినట్లు కెసు గెలవటం అనే మురిపం మినహా. అప్పటికి వాళ్ళకు కోర్టుచుట్టూ తిరగటానికి అడ్డమైనా కాగితాలకూ ఫీజులకూ యెంత వదిలి ఉంటుంది.

  ఇంతా చేసి అక్షరాలా కోటి దండుకున్న వాళ్ళు యేమన్న నష్ట పోయారా?

  లేదూ, స్వస్తిశ్రీ కోర్టువారు రిపేరు మీ వల్లకాదు డబ్బులు వాపసివ్వండి కష్టమర్లకి అన్నా ఆ రూ 10,000 + 500 చోప్పున వసూలు చేసుకున్న వాళ్ళంతా యెంత ములిగారు యీ వ్యవహారంలో?

  ఇదంతా యెందుకు చెప్పినట్లు అంటే?

  పనికిరాని సరుకు అమ్మినవాళ్ళకు యేమీ చీమకుట్టినట్లుండదు అని చెప్పటానికే. పైగా ఇలా జనాన్ని ముంచటం భలే లాభసాటి వ్యాపారం. పనచేసేలా తయారయ్యే మెషీనుకన్నా పనికిరాని మెషీను చేయటం కంపెనీలకు చాలా ఖర్చు తక్కువ వ్యవహారం కూడానూ – బడాయిగా బోల్డు ధరకు అమ్ముకోవచ్చును. లాభం, లాభం, ఇంకా లాభం మీద లాభం.

  అలాకాక, ఆ షాపులు మూయించేసి, ఆ కంపెనీని అటువంటి రకాల మెషీన్లు అవెంత బాగా చేస్తామని మొత్తుకున్నా కూడా – ఠాఠ్ కుదరదని చెప్పి – చచ్చినా అటువంటి రకాల మెషీన్లు తయారీ చేయరాదు కనీసం 10 సంవత్సరాల పాటు అని శిక్ష వేస్తే మన కోర్టులు, పరిస్థితి యెలా ఉండేది?

  ఇలాంటి లోపాయికారీ నాటకాలతో జనద్రోహం చేయటం కంపెనీల వాళ్ళ వల్లనయేదా?

  మీరే చెప్పండి.

 10. మీరిలాగే గాంధీ గిరీ అంటూ కూర్చుంటే యెట్లా తాతగారూ? కాస్త కదుపుతూ ఉండాలి.. ఈ రోజు అంటే ఈ రోజే తెచ్చిచ్చేస్తాడా? ఏదో ఒకటి చేయాల్సిందే..తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s