శర్మ కాలక్షేపంకబుర్లు-వెన్నుపోటు

వెన్నుపోటు

మొన్న పన్ను పోటు గురించి రాస్తే మిత్రులు వెంకట్.బి.రావు గారు వ్యాఖ్య చేస్తూ, వేమన తాత మీరు చెప్పిన పన్ను పోటే కాక వెన్నుపోటు కూడా మరిచిపోయాడన్నారు. ఇకేముంది, కొస దొరికింది. అయ్యా! వెంకట్ గారు మీరు చెప్పింది నిజమే, నాకు వొక పోస్ట్ రాసుకోడానికి కొస అందించేరు ధన్యవాదాలు అన్నా. మరి యీ పోస్ట్ శ్రీ. వె0కట్.బి.రావుగారికి అంకితం చేస్తున్నా.

వెన్నుపోటు అంటే వొకటి శారీరకమైనది, రెండవది నమ్మకద్రోహం. మరి అలా ముందుకుపోదాం.

నా మిత్రుడు,నరసాపురం లో నేను ఉద్యోగం వెలగబెట్టే రోజులలో, సూదితో దారంలా, నాకూడా వుండి, నాకు అన్నివిధాలా సహకరించిన నా కొలీగ్ రెడ్డి, యీ వెన్నుపోటు మూలంగా చచ్చిబతికేనని అతని అనుభవం చెప్పేడు ఇలా. “వొక రోజు సైకిల్ మీద వస్తూ రోడ్ చివరికి వచ్చేయడంతో సైకిల్ పడిపోతే, నేనూ పడిపోయాను. లేవలేకపోయా. కష్టపడి లేచి ఎలాగో ఇంటికి చేరా. అది మొదలు లేస్తే నడుము విలవిలలాడి పోయి, కూచోడం, నుంచోడం కష్టమైపోయాయి. మందులు, గచ్చాకు, పుచ్చాకు వైద్యాలు, తోమడాలు, పట్లు ఎన్నో అయ్యాయి, వొక వారంలో. నెప్పి పెరిగిందేకాని తగ్గలేదు. దగ్గరలో ఆర్థోపెడిక్ దగ్గరకెళితే ఎక్స్-రే తీసి వెన్నుపూస తప్పుకుంది. ఆపరేషను చెయ్యాలి, అని చెప్పేరు. పడుకుని వుండాలి తప్పించి కూచోడం, నుంచోడం కుదరదన్నారు. ఎంతవుతుందంటే, అప్పటి రోజులను బట్టి ఆరంకెలు చెప్పేరు. బాబోయ్! ఎలా అనుకుంటూ, బతకడమో,చావడమో తెలియని పరిస్థితులలో, భగవంతునిపై  భారం వేసి వుండగా, వొకరోజు వొక మిత్రుడు వచ్చి బలవంతంగా, ఎక్కడికి తీసుకెళుతున్నది చెప్పకుండా, కారులో తీసుకుపోయాడు. పక్కనున్న పట్నంలో వొక డాక్టరుగారి దగ్గరకి, అక్కడికి, మరొక డాక్టర్ వచ్చి వున్నారట, స్పెషలిస్టు. వారి దగ్గరికి తీసుకుపోయి ఆయనకి వివరాలు చెబితే, చూసి వొక పని చేయండి, మీరు చెన్నై వచ్చెయ్యండి, నేను ఆపరేషన్ చేస్తా నన్నారు. బాబూ! బక్క వాళ్ళము, మీ ఫీజు వగైరా చెప్పక పోతే రాలేమంటే, ఆయన నాకు ఫీజు వద్దు. మీరు అక్కడ వుండే ఏర్పాట్లు, హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు చూసుకోండి, అన్నారు. పల్లెటూరి వాళ్ళం కదా. అవెంతవుతాయన్నాము. మొత్తం వొక పాతిక వేలు చూసుకుని రండి అని చెప్పేరు. మీరు ఎప్పుడేనా రావచ్చని చెప్పేరు. బతుకు జీవుడా! దేవుడా! నువ్వే దారి చూపించావని మొక్కి, మరువారం, వారికి ఫోన్లో చెప్పి, బయలుదేరి వెళ్ళేము. ఆయన చెప్పినట్లు, నన్నొక హాస్పిటల్ లో చేర్చి ఆయన ఆపరేషన్ చేసి, నన్ను మళ్ళీ, యీ రోజు మీతో బండి మీద తిరగగలిగినట్లు చేసిన దేవుడు. నిజంగా మాకు అంత ఖర్చు కూడా కాలేదు.” అని దణ్ణం పెట్టేడు. వెన్నుపూస తప్పుకున్న, వెన్నుపోటు ఎంత భయంకరమో తెలిసి భయపడ్డాను.

రెండవ వెన్ను పోటు చూస్తే, మొదటివాడు విభీషణుడేమో! రావణుడు నువ్వు వెన్నుపోటు దారుడివని, తమ్ముడిని నిందించాడు. కాని విభీషణుడు మాత్రం, నేను ధర్మానికి కట్టుపడ్డాను తప్పించి, వెన్నుపోటు కాదని చెప్పేడు. మరి తరవాతది భారతం కదండి! ఇందులో వొక వెన్నుపోటు దారుడు, మరొకరు తప్పించుకున్నవారు. కురు పాండవ సైన్యాలు సిద్ధంగా వున్న సమయంలో ధర్మరాజు రెండు సైన్యాల మధ్యకి వచ్చి, యిప్పుడు యుద్ధం ప్రారంభం కాబోతూ వుంది, ఎవరైనా యీ పక్షం నుంచి అటు, అటు పక్షం నుంచి ఇటు మారదలచుకుంటే మారచ్చు, అని చెప్పేడు. అప్పుడు, దుర్యోధనుని తమ్ముడు యుయుత్సుడు అనువాడు, తన సైన్యంతో, పాండవుల వైపు చేరాడు. పాండవుల వైపునుంచి ఎవరూ అటుపోలేదు.యుద్ధం తరవాత మిగిలిన వాళ్ళలో ఇతనూ వున్నాడు. ఇతనికి తరవాత ధర్మరాజు పదవి కూడా ఇచ్చాడు. మరొకరు, వెన్నుపోటుకు సావకాశాలుండి తప్పించుకున్న వారు. శ్రీ కృష్ణుడు దూతగా వచ్చి, దౌత్యం అయిపోయాకా వెళ్ళిపోతూ, దుర్యోధనుడు చూస్తుండగా, తనను కొద్ది దూరం దిగబెట్టివద్దువని, చెయిపట్టి కర్ణుడిని రధం ఎక్కించుకుని తీసుకెళుతూ, నువ్వు కుంతి కొడుకువి, నీకు రాజ్యం పట్టాభిషేకం చేయిస్తా, పాండవులంతా నీమాట వింటారు. ఆఖరుదేకాని, ముఖ్యమైన మాట ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందని చెప్పి వెన్ను పోటుకి ప్రయత్నం చేస్తాడు. కాని కర్ణుడు అందుకు అంగీకరించక, నువ్వు చెప్పినవన్నీ నాకు తెలుసు,యీ పక్షం జయించదనీ తెలుసు, అయినా నేనటు రానని నిష్కర్షగా చెప్పేడు. కర్ణుడి తల భారతంకదా! వొక వేళ అలాగే జరిగివుంటే భారతం లేదు.

మరి నేటి కాలానికొస్తే…. ఎందుకు నీళ్ళునములుతావు, చెప్పదలుచుకున్నది చెప్పు అంది మనసు. సరిగా చెప్పు అని బుద్ధి చెప్పింది. కనక…… ఇప్పుడు వెన్నుపోటు దారులకి లోటు లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు మామని వెన్నుపోటు పొడిచాడని కాంగ్రెస్ వారు, లక్ష్మి పార్వతి అంటారు. కాంగ్రెస్ వారి చరిత్ర చెప్పక్కరలేదు, ప్రకాశం పంతులికి సంజీవరెడ్డి వెన్ను పొడవలేదా, ఇంకా కావాలంటే నిత్యం మీరు వొకరిని మరొకరు వెన్నుపోటు పొడుచుకుంటూనే వుంటారు అని తెలుగుదేశంవారంటారు. మీకేమీ భయం లేదు సంతకాలు పెట్టండి, అన్నాయన చక్కగా పైకెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము కేసులో! అని కోర్టు చుట్టూ తిరుగుతున్నాము, ఇదేమి వెన్నుపోటో! అని వున్నవాళ్ళేడుస్తున్నారు. 70 సంవత్సరాల వయసులో వున్న ఆయనకి, నువ్వు కబుర్లుచెప్పి లోబరచుకుని, పెళ్ళి చేసుకుని, ఆయనకు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచావని తెలుగు దేశం వారంటారు, లక్ష్మీ పార్వతిని. నిజం పరమాత్మకి తెలియాలి. శశికళని జయ వెన్నుపోటు పొడిచిందా? అవసరమున్నంత కాలం వాడుకుని వదిలేసిందా, బహిష్కరణ పేరుతో?

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వెన్నుపోటు

 1. @
  వెంకట్.బి.రావు గారు,
  మీరు మాటాడే ప్రతి మాటకి పోస్ట్ రాసుకోవాలని పిస్తోంది సార్! ధన్యవాదాలు.

 2. @
  తాడిగడప శ్యామల రావు గారు.
  మీరు చెప్పినది నిజమే. ఎందుకో కైకని మరిచాను. బాగా గుర్తు చేశారు.
  ద్రౌపది విషయం లో నేను తిక్కన గారి పాఠం చెప్పేను. ఐతే మీరు చెప్పినది ఎక్కడొ విన్న గుర్తు ఇప్పుడొచ్చింది,ఙ్ఞాపకం. ఇది సమంజసంగా వుంది. ధన్యవాదాలు.

 3. > మొదటివాడు విభీషణుడేమో

  ఆ లెక్కన కైక అనుకోరాదా? ఆవిడ రాముణ్ణి ప్రాణప్రదంగా పెంచి, కౌసల్యకన్నా కైకయే హెచ్చు మాతృప్రేమ చూపిందనిపించుకొని, తీరా శ్రీరామపట్టాభిషేకం అనగానే అట్టు తిరగేసింది. దశరధుడు ముఖ్యంగా కైకకు యే అభ్యంతరం ఉండదని నమ్మి మెదలుపెట్టాడేమో శ్రీరామపట్టాభిషేకం ప్రయత్నం ఒకరకంగా!

  > ముఖ్యమైన మాట ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందని చెప్పి వెన్ను పోటుకి ప్రయత్నం చేస్తాడు శ్రీ కృష్ణుడు.

  ఇది ప్రచారంలోకి వచ్చిన అసహ్యకరమైన అబధ్ధం. సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీ కృష్ణుడు అలాంటి చెత్తమాట యెలా అంటాడండీ?

  అసలు విషయం యేమిటంటే, క్షత్రియుడికి పట్టాభిషేకం సూర్యాస్తమయసమయంలో జరుగుతుంది. ఉదయాహ్నంనుండి సాయాహ్నం వరకు 5కాలాలు. ఈ అయిదు గతించిన షష్ఠమైన కాలం సూర్యాస్తమయం. అందుచేత శ్రీ కృష్ణుడు ‘షష్ఠేకాలే’ (అంటే ఆరవకాలమందు) అని అన్నాడు. ఈ షష్ఠకాలంలో ద్రౌపదికూడా నిను (మహారాజుగా) సేవించగలదు అని శ్రీ కృష్ణుడి తాత్పర్యం. విచారించవలసింది యేమిటంటే తిక్కన కాలానికే మీరుదహరించిన దుష్పాఠం ప్రచారంలోకి వచ్చింది – దానని ఆయనకూడా తెనిగించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s