శర్మ కాలక్షేపంకబుర్లు-ఆకలి/హంగర్/భూక్

ఆకలి

ఆకలి, భూక్, హంగర్, నాకు తెలుగు తప్పించి మరొక భాష రాదు మొర్రో అని చెప్పుకుంటున్నాను, కనక మీరు విఙ్ఞులు, ఇవన్నీ సమానార్ధకాలే అని నమ్ముతున్నా.. శాస్త్ర కారుడు, ఆహార, నిద్ర, భయ, మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నాడు. అంటే సర్వజీవులకు వుంటాయన్నాడు తప్పించి అందరికి సమానంగా వుంటాయన లెదు. అంచేత ఇవన్నీ ఎవరికి, వారికి వేరు, వేరు స్థాయిలలో వుంటాయి.

ఇప్పుడు మనం ఆకలి గురించికదా అనుకుంటున్నాము. రామాయణం లో, వొక్క మధువనంలో మధువు, తాగి వనాన్ని పాడు చేసినది మాత్రం చెప్పేరు. మరొకటి భరద్వాజుడు విందు చేశాడన్నారు. అకలి కేకలేదు. మరి రెండవదాని దగ్గరకొస్తే, అదేనండీ భారతం, మనకి ముఖ్యంగా కనపడేవారు బకాసురుడు,కీచకుడు. బకాసురుడుది వొకరకం ఆకలైతే, కీచకునిది మరొకరకపు ఆకలి. పాపం ఇద్దరూ వొకరి చేతిలోనే చచ్చేరు. ఏక చక్రపురవాసులను వంతుల ప్రకారం తిన్నవాడు బకాసురుడు. వాణ్ణి చంపడానికి వెళ్ళేందుకు సిద్ధమైన భీముడు అడిగిన కోరిక యేంటంటే, తృప్తిగా భోజనం పెట్టమన్నాడు. పెట్టిన పదార్ధాలు తిని తేన్చి, బకాసురుడుకి పట్టుకెళ్ళే పదార్ధాలు కూడా బండిలో కూచుని శుభ్రంగా తినేశాడు. మరొకటి, భారతం నుంచే, గృద్ర, జంబుకో పాఖ్యానం. చని పోయిన వొక కుర్రవాని శవాన్ని తీసుకుని బంధువులు సాయంత్రపు వేళ శ్మశానం చేరతారు. ఇది చూసిన అక్కడ వున్న గద్ద, నక్కలలో గద్దవచ్చి కుర్రాడి శవం వదిలేసిపొమ్మని, లేకపోతే, పిశాచాలు వచ్చి బతికున్న వాళ్ళని చంపితింటాయని భయపెడుతుంది. నక్క వచ్చి అబ్బే! అలా వదిలేయద్దు, ఇంకా పొద్దుంది పూడ్చిపెట్టమంటుంది. వచ్చిన వాళ్ళేమి చెయ్యాలో తెలియని స్థితిలో పడిపోతారు. నక్క,గద్ద అలా చెప్పడానికి, వాటికి స్వార్ధం వుంది. శవాన్ని వదిలేసిపోతే, తను పీక్కుతినచ్చని గద్ద ఆశ. పూడ్చిపెడితే, దానిని బయటకు లాక్కుని రాత్రి తినచ్చు, గద్దకు రాత్రి కనపడదు కనక పోటీ లేదని నక్క ఆశ. ఇల్లా వుండగా, బంధువులేడుస్తుండగా, ఆకాశమార్గాన వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు, యీ రోదన విని చనిపోయిన పిల్ల వాణ్ణి బతికిస్తారు. మనకి నిజ జీవితం లో ఎటూ తేల్చుకోలేని సంఘటనలు ఎదురు పడుతుంటాయి. అందుకే “ఆత్మ బుద్ధి సుఖం చైవ” అన్నారు. ఇంకా తరవాత చెప్పేడు. శాస్త్రకారుడు. నేను రెండవది చెప్పడానికి భయమేస్తోంది, మూడవది చెబితే ప్రళయం వచ్చేస్తుంది. మరెవరో చెబుతున్నట్లుంది. కీచకుడు స్త్రీ వ్యామోహంతో నశించాడు. ఇలా నశించిన వారిలో ఇతను మొదటివాడు, ఆఖరివాడు కూడా కాదు.

నేటి రోజులకొస్తే, వామ్మో! సామాన్యులది కడుపాకలి. వీరు పాపం, చాలా అల్పసంతోషులు. రూపాయికి వొక కేజి బియ్యమిచ్చి, 120 కి చింతపండు, 100  రూపాయలకి కంది పప్పు, అమ్మినా మాటాడరు. ఇచ్చినదానికి సంతోషిస్తారు. అలాగే అసలు ధరకన్నా, మరింత ఎక్కువ ధరకి, మందు అమ్మినా నోరు మూసుకుని కొంటారు. అందులో కల్తీ వుంటే, తాగి చస్తారు. వున్నవాళ్ళు యీడ్చి పారేస్తారు. సంతాపసభ పెడతారు. తాగబోయిస్తారు. జై,జై,లు కొట్టించుకుంటారు, తమ సంచులు నింపుకుంటారు. కల్తీ సారా తాగిన వాళ్ళదే తప్పు!, చస్తే ఏంచేస్తామంటారు!. చావక వుండిపోతావా! అంటారు. వైరాగ్యం చెబుతారు. సొమ్ము దోచుకుంటారు,దాచుకుంటారు. మరొకరకం ఆకలివారు, భూమి మీద, లోపల ఎక్కడేమి కనపడినా దోచేసుకుని, దాచేసుకుంటారు.పాపం! ఎక్కడికి పట్టుకుపోదామనో. పోయిన వాళ్ళు ఏమి పట్టుకు పోయారో తెలియదు.ఇక్కడ బలి చక్రవర్తి చెప్పిన పద్యం గుర్తుకొస్తుంది.

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై
బేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

ఆకలి కేక వినపడకుండేందుకు, ఆహార భద్రతా చట్టం తెస్తామంటున్నారు, ఎవరి ఆకలి తీర్చడానికో. ఇప్పటికే వీధికి మూడు బెల్టు షాపులున్నాయి, మరి కాస్త పెంచి, ఇలా తాగబోయిస్తే ఆకలి కేకలే వినపడవు కదా! అప్పుడు యీ దేశమంతా మనదే! ఎవరూ పోటీరారు. ఇంకెందుకూ ఆలస్యం.

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆకలి/హంగర్/భూక్

 1. @
  అమ్మాయ్ సుభా.
  తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు శతక కారుడు. ఈ రోజుకి యీ రోజు సమస్య తీరక పోయినా ప్రజల గుర్తులో వుంటే మార్పురావచ్చేమో. ఆశాజీవులంకదా. ధన్యవాదాలు.

 2. @
  వనజా వనమాలి గారు,

  తాగుబోతులికి పెళ్ళాం పిల్లలు పట్టరు, కలి గీత గారి బ్లాగులొ కవిత చదివా అందులో తండ్రి కావాలి అని.వీలుంటే చదవండి.స్వార్ధం కోసం తాగుబోతుల్ని తయారు చేయద్దని గోల. ధన్యవాదాలు

 3. @
  అబ్బయ్! అమీర్
  మీ అమ్మమ్మే, మామ్మ కాదు. భోజనం పెడుతుంది. తెచ్చి పెట్టాలిగా నేను. ధన్యవాదాలు

 4. @
  జిలేబి గారు,
  నేను మొన్న రాసినది రాసినట్లుగా ప్రచురించి ఉంటే ….. చాలా తగ్గించేశా. 19 మంది కల్తీ సారా తాగి చచ్చిపోతే….కడుపు మండిపోయింది. ధన్యవాదాలు

 5. ఆకలితో.. కుటుంబం అల్లాడుతున్నా..మద్యం మత్తులో తేలేవాడికి లెక్కలు ఎక్కుతాయాయి అంటారా? ఆహార భద్రతా..చట్టమా? అమ్మో..అవినీతి భద్రతా లాగా అనిపిస్తున్దండీ నాకు.

 6. అయ్య బాబోయ్ , ఈ మారు మాష్టారు మరీ ‘షార్ప్’ గా వున్నారు ! సాధారణం గా చుట్టూ వున్న సమాజాన్ని దాటి దేశ పరిస్థితి మీద రాయడం ఇదే మొదటి సారనుకుంటాను నాకు తెలిసినంత వరకు !

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s