శర్మ కాలక్షేపంకబుర్లు-నిద్ర

నిద్ర

మన మామూలుగా రామాయణం దగ్గర్నుంచి మొదలెడదాం. రామాయణంలో నిద్ర కి పెద్ద పీటే వుంది. రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు నిద్రకి పడితే, ఆయన లేచినపుడు తప్పించి, ఎవరేనా లేపితే, నిద్ర మధ్యలో కష్టమట. రాముడు లంక మీదకి దండెత్తిన కాలానికి ఆయన నిద్రలో వున్నాడు. వొక్కొక్కరిని కోల్పోతున్న రావణుడు కుంభకర్ణుని నిద్ర లేపేందుకు సకల ప్రయత్నాలు చేసి, కష్టం మీద నిద్ర లేచిన వానికి విషయం వివరించి, యుద్ధానికి సిద్ధం కమ్మంటాడు. పాపం! కుంభకర్ణుడు కూడా అన్న గారికి మంచి చెప్పబోయి భంగపడతాడు. సరె యుద్ధంకి వెళ్ళి వీరమరణం పొందుతాడు. మరొకటి త్రిజట స్వప్న వృత్తాంతం. రాక్షస స్త్రీలు సీతను బాధలు పెడుతుండగా, నిద్రలేచిన త్రిజట సీత సాధ్వి అని, రాముడు అవతారపురుషుడని, రావణుడు మిగిలిన రాక్షసులతో మరణిస్తాడని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. రామాయణంలో లేకున్నా లక్ష్మణుని భార్య ఊర్మిళ వనవసాని కి వెళ్ళిన భర్త తిరిగొచ్చేదాకా నిద్రపోయిందట. దీనికి ఆధారం మాత్రం చెప్పలేను. ఎవరేనా చెబితే తెలుసుకుంటా.తరవాత అలాగే జరిగింది కూడా. ఇక భారతం దగ్గరకొస్తే నిద్రలో వున్న భీముని లతలతో చుట్టి నీటిలో తోయిస్తాడు, దుర్యోధనుడు. అలా తోయబడడం భీమునికే వుపయోగించి, వజ్ర శరీరుడవుతాడు. నిద్రలో వున్న పాండవులను, లక్క యింటిలో వుండగా తగులబెట్టి చంపేయాలని దుర్యోధనుడు చేసిన ప్రయత్నం వమ్మయైంది. మరొకటి భాగవతం నుంచి, కాల యవనుడు మధుర పై దండెత్తి వస్తాడు. కోట బయట వుంటాడు. శ్రీ కృష్ణుడు వొంటరిగా కోట విడిచి వస్తాడు, వొంటరిగా వస్తున్నది శ్రీ కృష్ణుడని తెలుసుకున్నాడు కాల యవనుడు. కాల యవనుడిని చూసి శ్రీ కృష్ణుడు పరిగెడతాడు. దొరికినట్లే, దొరకనట్లేగా పరుగుపెట్టించి, శ్రీ కృష్ణుడు వొక గుహలో దూరుతాడు. కాలయవనుడు వెనకనే వెళ్ళి అక్కడ పడుకుని వున్న ముచుకుందుని శ్రీ కృష్ణుడుగా తలచి కాలితో తన్నుతాడు. ముచుకుందుడు నిద్రలేచి కాల యవనుడుని తేరపారి చూడగా బూడిదయిపోతాడు, కాలయవనుడు. శ్రీ కృష్ణుడు తన కార్యం సాధించుకున్నాడు. నిద్రకి సంబంధించి పరమాత్మ లీలలున్నాయి, అవి మీరు గుర్తు చెయ్యాలని చెప్పడంలేదు.ధృవ ప్రాంతంలోని కొన్ని జీవులు సూర్యుడున్నంత కాలం ఆహారం తీసుకుని, సూర్యుడు లేని కాలంలో అనగా ఆరు నెలలు నిద్ర పోతాయట. ధృవాల వద్ద ఆరు నెలలు పగలు ఆరు నెలలు చీకటి తెలుసుకదా. దీనిని ఇంగ్లీషులో హైబర్నేషన్ అంటారట. ప్రేయసి, ప్రియుల అలకలలో దొంగ నిద్ర వొక ముచ్చటయిన ఘట్టం, తీయనయినది.

జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు అన్నారొక సినీకవి. చిన్నపిల్లలు ౧౨ గంటలు నిద్రపోతారట. పెద్దలు ౭ నుంచి ౮ గంటలు నిద్ర పోతారట. వయసు మళ్ళిన వారు ౫ నుంచి ౬ గంటలు నిద్ర చాలట. యీ సందర్భంగా వొక ముచ్చట. సంజయుడు ధర్మరాజు దగ్గరకు, దృతరాష్ట్రుడు పంపగా, దూతగా వెళ్ళి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన సంజయుడు, రాయబారానికి వెళ్ళివచ్చాను, వివరాలు రేపు సభలో చెబుతానని వెళ్ళిపోతే, నిద్ర పట్టని ధృతరాష్ట్రుడు, విదురుని కి కబురు పెట్టి, నిద్ర పట్టటంలేదు, ఏవైనా మంచి మాటలు చెప్పమంటాడు. అప్పుడు, విదురుడు, నిద్ర వీరికి పట్టదని చెబుతాడు. పద్యం చదవండి.

బలవంతుడు పైనెత్తిన బలహీనుడు,ధనము గోలుపడినయతడు,మ్రు
చ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదు రధిపా.
బలవంతుడన వాడు యుద్ధానికి వచ్చినపుడు, డబ్బు పోగొట్టుకున్న వాడు, దొంగతనానికి వెళ్ళేవాడు, కాముకుడు, వీళ్ళకి నిద్ర పట్టదయ్యా!

ఇక్కొఱగాములలోపల నీ చిత్త వృత్తినొందెనొ యొరు సొ
మ్మెక్కటి గుడువ దలంచితో,నిక్కము గతమేమి సెపుమ నిద్ర సెడుటకున్.

పైన చెప్పిన వాటిలో ఏది నీ మనస్థితి, ఇతరుల సొమ్ము తినదలుచుకున్నావా? ఎంత ధైర్యంగా అడిగేడో చూడండి. విదురుడు, ధృతరాష్ట్రుని మంత్రి. ఈ రోజు ఇటువంటి ధైర్యవంతులైన సచివులు, ఎగ్జిక్యూటివ్స్ కావాలి. సంజయుడు కూడా మంత్రే, రాయబారం వెళ్ళివచ్చాను, వివరాలు రేపు సభలో చెబుతానని ఎంత ధైర్యంగా చెప్పేడో చూడండి. అది కూడా ఎవరికి, మహరాజుకి. అది కావలసిన నిబద్ధత. అటువంటి వారే కరువైపోతున్నారు. వొక వేళ అటువంటి వారున్నా వారిని బతక నీయటంలేదు. సరేనని సంతకాలెడితే కోర్టు ప్రదక్షణాలు తప్పవు.
నేటి కాలానికొస్తే,అంతా నిద్రే. నిద్రపోయే వారిని లేపచ్చు తప్పించి, నిద్ర నటించే వారిని లేపలేముకదా.! మన దేశంలో అతి ముఖ్యమైన రెండు బిల్లులు, చట్టాలు కాకుండా దశాబ్దాల కాలంగా నిద్ర పొతున్నాయి. పాపమ్ మొన్ననొకటి నిద్ర లేచి మళ్ళీ దీర్ఘ నిద్ర లోకి జారిపోయింది. అదెనండీ లోకపాలకుల బిల్లు.ప్రభుత్వం అంటేనే నిద్ర. అక్కరలేని ఫైలు, అదే బరువులేని ఫైలు అయ్యగారి టేబుల్ మీద ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా, నిద్ర పోతూనే వుంటుంది.ఎవరేనా కావలసినవారు బరువు పెడితే నిద్ర లేస్తుంది, పరిగెడుతుంది. మామూలు వాళ్ళకి పది నెలలు నెమ్మదిగా పరిగెట్టే ఫైలు మాన్యులకి రెక్కలొచ్చినట్లు పరిగెట్టి, వొక్క రోజులో వాలుతుంది, నిద్ర ఎగిరిపోతుంది..చట్టాలు కలిగినవారి చుట్టాలయిపోతాయి.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నిద్ర

 1. జయగారు
  నా బ్లాగుకి సు స్వాగతం,
  పురాణకాలమంత కాక పోయినా, కొద్దిగానైనా అలా వుంటే అని ఆశ. ధన్యవాదాలు

 2. సచివులకి అవసరమైనప్పుడు అన్ని జోల పాటలే గుర్తొస్తాయండి. ఇప్పటి అధికారులు పురాణాల సచివులయే అవకాశం లేదు కదా!!! భలే నిద్ర పట్టించారండి.

 3. చదువుతూ అలానే నిద్ర పోయానండీ ! నిద్ర లేచి వాలి పోయానండీ !
  మీ ఈ టపా తో ఫ్లాటూ ఐపోయానండీ ! Hats off to you sir దీక్షితులు గారు !

  జిలేబి

వ్యాఖ్యలను మూసివేసారు.