శర్మ కాలక్షేపం కబుర్లు-ఏదీ నాటి సంక్రాంతి

ఏది నాటి సంక్రాంతి

నాలుగురోజుల కితం పెద్దబ్బాయి వచ్చాడు. నాన్నా, “మీరు అమ్మా వొక సారి కూడా మన వూరు రావడంలేదు. వొక సారి రండి, మీకోడలు కూడా చెప్పమంది” అని అంటూ వుంటే, పెద్ద కోడలు నా శ్రీ మతి తో ఫోన్లో మాట్లాడుతూ మా ఇద్దరిని వొక సారి రమ్మని కోరింది. కోడలితో మాట్లాడుతూ నాకేసి చూసింది. నేనావిడకేసి చూసా. కోడలికి రేపొస్తామని చెప్పింది. అటునుంచి ఏమందో కాని యీవిడ నవ్వింది. చిన్న కోడలు అత్తగారి చేతిలో ఫోన్ తీసుకుని అక్కగారితో మాట్లాడి ఎల్లుండి తప్పని సరిగా తిరిగిపంపించేస్తానని మాట తీసుకుని, మమ్మలిని వెళ్ళడానికి అనుమతించింది. మొత్తానికి కుటుంబ తీర్మానం, మెజరిటీ ప్రకారం వెళ్ళడానికి తీర్మానించారు, మేముకాక.

మొన్న సాయంత్రం బయలుదేరి ఆటోలో వెళ్ళిపోయాము, వూళ్ళోకి ఆటో చేరుతుండగానే మా దూరపు బంధువు “బాబయ్యా! పిన్నీ బాగున్నారా! యీమధ్య ఇటురాలేదు” అన్నాడు. నేను నా యిల్లాలితో “ఇక్కడ దిగి వెనక వస్తాను.” అని చెప్పి ఆటో ఆపించి, దిగిపోయాను. ఆవిడను తీసుకుని ఆటో ముందుకెళ్ళిపోయింది. అబ్బాయ్! ఎలా వున్నావు, పిల్లలెలా వున్నారని కుశల ప్రశలకి యిలా చెప్పేడు. “పెద్దబ్బాయి అమెరికాలో వున్నాడు, చిన్నబ్బాయి ఆస్ట్రేలియాలో వున్నాడు, పెద్దమ్మాయి డిల్లీలో వుంది. చిన్నమ్మాయి చదువుతోంది, బెంగుళూరులో వుంది.” అన్నాడు. “పండగకి ఎవరొస్తారన్నా”. “రావడానికి ఎవరికి తీరుబడి లేదు. చిన్న పిల్ల వీలు కుదిరితే వస్తానంది. ఏమో చెప్పలేము” అన్నాడు. “అయ్యో! ఐతే నువ్వు కోడలే ఇక్కడ వున్నారా” అన్నా. తరవాత నడుచుకుంటూ వెళుతోంటే దగ్గరలో కిల్లీ కొట్టు దగ్గర గొడవ జరుగుతోంది. “ఏమి అది” అంటే, “తాగుబోతుల గొడవ బాబయ్యా. పగలు రాత్రి లేదు, చిన్న, పెద్ద లేదు, ఎక్కడ పడితే అక్కడ, మందు బాగా దొరుకుతోంది, తాగేసి కొట్టుకుంటున్నారు.” అన్నాడు. అదేంటి “పల్లెలో కట్టుబాట్లున్నయి కదా” అన్నా. “అవెప్పుడో పోయాయి, ఎవరూ చెప్పేవారూ లేరు, చెప్పినా వినే వారూ లేరు.రైతుకి బతకు భారం అయిపోయింది.పల్లె బతుకు దీనం అయిపోయింది.” అన్నాడు. “సాయంత్రమవుతోందికదా ఎక్కడా సందె గొబ్బెమ్మలు కనపడవేమన్నా”. “బలేవాడవయ్యా! అసలు ఆడపిల్ల లేరీ? వున్నా లంగా, వోణీ వేసుకున్న ఆడపిల్లలెక్కడున్నారు? అందరూ, పెద్దా, చిన్నా అంతా పంజాబీలే” అన్నాడు. యీలోగా వొకమ్మాయి నైటీతో వెళుతూ కనపడింది. “చూసావా! నువ్వు చాదస్తుడివయ్యా! ఇప్పుడు పల్లెటూరిలో అందరూ పగలు, రాత్రీ నైటీలే వేస్తున్నారు, యీవిడ ఇంకా నయం”, అన్నాడు.” నైటీలు రాత్రిపూట భర్తతో వొంటరిగా వున్నపుడు వేసుకుంటారనుకుంటాకదా” అన్నా. “సందె గొబ్బెమ్మలన్నావు కదా! రైతు బతుకు అధ్వాన్నమైపోయింది, పల్లె బతుకు అధ్వాన్నమైపోయింది.
ఆవులేవీ? యెడ్లు లేవు, బళ్ళు లేవు, చేతి వృత్తులు లేవు, కమ్మరి లేడు, కుమ్మరి లేడు, వుదయమే వచ్చేహరిదాసు లేడు, ఆఖరికి కొమ్మ దాసరి, గంగిరెద్దు, ఏమీలేదు. అవన్నీ పాతకాలపు అలవాట్లు, అలోచనలకే పరిమితం. “మొగవాళ్ళంతా పేకాట, మందుకి జీ…హుజూర్. కర్ర సాము, గరిడీలు లేవు. ఆటలు లేవు. ఉప్పట్లు లేవు,పశుపోషణలేదు. గేదెలు పెంచుతున్నారు పాలకోసం, వొక్క పెద్ద పండగ రోజు అమ్మవారి జాతర మాత్రం చేస్తున్నారు. అందులో కూడా పెద్దవాళ్ళ తరఫున గుండాట, చీట్లాట, వగైరాలు, తీర్ధంలో పెడుతున్నారు. ఇప్పుడున్నవి చెబుతా విను. పగలు రాత్రి తేడా లేక మందు వుంది, రేపు పండగకి కోడిపందాలున్నాయి. వొక పెద్దాయన పెట్టిస్తున్నాడు. పేకాట నిత్య కృత్యం, మా వూళ్ళొ ,వొక పెద్దాయన నడిపే పేకాట క్లబ్బు మాత్రం వుంది.”అన్నాడు..వోరి నాయనోయ్! మన పల్లెటూళ్ళుకూడా యింత అభివృద్ధి చెందాయన్న మాట అనుకుని, మా దూరపు బంధువుతో అతని యింటికెళ్ళి కోడలిని పలకరించా,”మామయ్యగారు, పిల్ల పెళ్ళికుంది. సంబంధం” అంది. “పిల్ల ఏమంది” అన్నా. దానికి మాబంధువు “దానికేమి తెలుసు చిన్న పిల్ల” అన్నాడు. అబ్బాయ్! పొరపాటురా! పిల్ల మనకన్న చిన్నది కావచ్చు, దానికి ఆలోచన, యిష్టాయిష్టాలు వుంటాయి. పిల్లని కనుక్కుని అది చెప్పినట్లు చేద్దామన్నా, మంచి చెడ్డలు చూసి, దాని యిష్టప్రకారం పెళ్ళి చేద్దామన్నా. వాళ్లకేమీ తెలియదనడం పొరపాటు, వాళ్ళు పొరపాటు చేస్తూవుంటే సరిదిద్దుదాం, కాని వాళ్ళు సరియైన పద్ధతిలో వుంటే మనం కాదనడం తప్పు అన్నా. దానికి అతని భార్య “నిజం చెప్పేరు మామయ్య గారు, పిల్లని అడిగిన తరవాత చెబుతాము, సంబంధం చూసి పెట్టమంది”. దానికేం పెళ్ళి కూడా చేయించేస్తా అని భరోసా యిచ్చి, నెమ్మదిగా యిల్లు చేరాను.

నా కోడలు నన్ను పలకరించి,కాళ్ళకి నీళ్ళిచ్చి, కాఫీ పట్టుకొచ్చింది.”యిప్పుడెందుకమ్మా”, అంటే, కొద్దిగా యిచ్చాను. మీ అలవాటు ప్రకారం భోజనాలు చేద్దామని చెప్పింది”.భోజనాలు మా అలవాటు ప్రకారం కింద పెట్టింది. అబ్బాయీ! డైనింగు టేబుల్ పెట్టుకోలేదురా అన్నా!. “నాన్నా! డైనింగు టేబుల్ అక్కడ మీరు పెట్టుకోలేదు, నేనూ పెట్టుకోలేదు. కింద కూచునే భోజనం చేయడం అలవాటు, అలాగే చేస్తున్నా” అన్నాడు. పోనీలే నాయనా సంప్రదాయం పాటిస్తున్నారని సంతసించాను. పండగొస్తోంది కదా మనవడెప్పుడొస్తున్నాడురా అన్నా. “నిన్ననే మాటాడేడు. భోగినాటి వుదయానికి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వస్తానన్నాడు. మేమూ అక్కడికి భోగి నాడు వుండి పెద్ద పండగకి మనింటి కొస్తున్నామని నా కోడలు చెప్పింది”.నిజమే వాళ్ళని సంతోషపెట్టి రండి అని చెప్పేము. ఏమోయ్! వీళ్ళ సంగతి చెప్పేరు పండగకి, మరి చిన్న కోడలు సంగతేమి అన్నా. “నాకు ఇంకా చెప్పలేదు, ఏమో ఏమి చేస్తుందో తెలీదు అంది”. యీలోగా చిన్న కోడలు అక్కగారికి ఫోన్ చేసి మేము కులాసాగా చేరేమా, విశేషాలు అడుగుతూ వుంటే, “చెల్లాయ్! మా పండగ కార్యక్రమం చెప్పేము, నీసంగతి ఏమిటి” అంది. “నా సంగతి మామూలే. కొత్తేముందీ! పండగలు వెళ్ళిన తరవాత పుట్టింటికి వెళతాను, అప్పుడు మీమరిది శలవు పెట్టుకు వస్తారు, నాతో. యిప్పుడెళ్ళిపోతే అత్తయ్య, మామయ్యలు వొక్కళ్ళూ వుండిపోరా! పెద్ద వదినగారొచ్చి వెళ్ళిపోయారు, పండగకి రానని. చిన్న వదిన గారికి రావడానికి కుదరదట. .” అందిట. యిదివరలో కూడా మా చిన్న కోడలు అలాగే చేసింది. పాపం ఆ అమ్మాయి పుట్టింటి వారు, బహు యోగ్యులు కనక, మా అమ్మాయి, మీకోడలు మా యింటికి ఎప్పుడు వస్తే అప్పుడే మాకు పండగ అంటారు.

మరునాడు వుదయం పొలం వెళదామన్నాడు, అబ్బాయి. నెమ్మదిగా, వూరిలో తెలిసినవారు పలకరిస్తుండగా, కబుర్లు చెబుతూ పొలం చేరాము. యీలోపు యే గుమ్మంలో చూసినా రంగవల్లులు మాత్రం మనోహరంగా కనుపించాయి. అప్పుడనిపించింది. కొద్దిగా వెర్రి తల వేసినా, యింకా తెనుగు సంస్కృతి స్త్రీలదగ్గరే వుంది సుమా, అని. చేను తిరిగి, చాలా కాలంతరవాత, నేను పాతిన మామిడి మొక్కలు పెద్దవైన సంగతి చూసి, నెమ్మదిగా తిరిగొచ్చి, భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం బయలుదేరి యిల్లు చేరాము. ఇంటి కొచ్చాక టి.వి. లో చూస్తే, కాలేజి అమ్మాయిలకి, తెనుగమ్మాయిల పోటీ జరుగుతోందిట, లంగా వోణీ వేసుకున్న మనవరాళ్ళని టి.వి. లో చూసి ఆనందించవలసి వచ్చింది. హరిదాస సాంప్రదాయం వదలలేని వొక మాస్టారు పండగ మూడు రోజులూ స్వంత పల్లెలో హరిదాసుగా వెళ్ళబోతున్నారట, ఇది టి.వి.వార్త. ఏదీ……పల్లెలలో… నాటి సంక్రాంతి..?

12 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-ఏదీ నాటి సంక్రాంతి

 1. మరీ పాత పద్దతులను పాటించక పోయినా వున్నంతలో ఇక్కడ కూడా బాగానే చేస్తున్నారండి . మా ఇంటి దగ్గరకు ‘ హరిదాసు ‘ ,’ గంగిరెద్దుల వాళ్ళు ‘ వస్తారు . బోగి మంట , ముగ్గులు , గొబ్బెమ్మలు పెడుతారు . కొన్ని మార్పులు వుంటాయి తప్పదు కదా !
  ఈ మద్య అమ్మాయిలు కూడా పండగలకి ,పెళ్ళిళ్ళకి పరికిణీ వోణీలు వేసుకుంటూనే వున్నారండి 🙂

  • @
   మాలా.పి.కుమార్ గారు,
   మీరెక్కడున్నారో తెలియదుకాని, మా ప్రాంత పరిస్థితిని చెప్పేను. మీ దగ్గర యికా సమ్స్కృతి పట్ల నమ్మకం వున్నట్లు వుంది. మీరు విదేశాలలో వుండి వుంటే, నిజంగా సంస్కృతి మీదగ్గరే వుంది.
   ధన్యవాదాలు

 2. > హరిదాస సాంప్రదాయం వదలలేని వొక మాస్టారు పండగ మూడు రోజులూ స్వంత పల్లెలో హరిదాసుగా వెళ్ళబోతున్నారట, ఇది టి.వి.వార్త.

  మా మాతామహులు R&Bలో గుమాస్తాగా చేసేవారు. ఆయన కాలం నాటి ముచ్చట. ఆయన పై అధికారి ఒకాయన సాతాని కులస్థులు. ఆఫీసులో దొర వేషంలోనే ఉన్నా, ధనుర్మాసంలో ఉషోదయంతోనే నిష్ఠగా హరిదాసుగా మారి ఊరంతా హరిసంకీర్తనం చేస్తూ ఉంఛవృత్తి చేసేవారట. ఆఫీసరుగారు తమ ఇంటికి హరిదాసు వేషంలో వస్తే కొంచెం ఆశ్చర్యం గానూ కొంచెం మొగమాటం గానూ ఉండేదని మా తాతగారు చెబుతూ ఉండేవారు. ఇదంతా బహుశః 1930లో 40లోనే జరిగిన ముచ్చట అన్నమాట

 3. మీ పరహిత వైద్యం అనుభవాలు హారం పత్రిక కుసుమాంజలి లో చదవి ఇది రాస్తున్నా నండీ.

  చాలా మంచి విషయాన్ని తెలియ జేశారు. ఒక్కటే లోటు ఆ విద్య మీ ముందు తరం తోటే ఆగి పోవడం. మళ్ళీ ఎప్పుడో అట్లాంటి కాల గతి లో కలిసిన విద్యలు బహిర్గతం కావడం కాలమే చెప్పాలి.

  హారం పత్రికలో కామెంటు కాలం ఉంది కాని ఎందుకో అది ప్రుచరణ కావడం లేదు. అందుకే ఇక్కడ దాని గురించి కామెంటు.

  జిలేబి.

  • @
   జిలేబిగారు,
   నిజంగా. ఆవిద్య అక్కడితో ఆగిపోయింది. ప్రయత్నం చేశాను, కాని కుదరలేదు. మీకు వేరుగా మెయిల్ ఇచ్చా చూసివుంటారు.
   ధన్యవాదాలు

 4. ఆ మధ్య అండీ దేశానికి సోరాజ్జెం వోచ్చిందండి.
  ఆ పై అండి అదేదోట గ్లో బల్ల అనే ఒక పెద్ద బల్ల దేశం మీద పడిన్దంటండి
  దాన్తోటే అట అండి ఏదో ‘సమ్’ క్రాంతి దేశం లో వచ్చిన్డటండి!
  అది ఏమి ‘సమ్’ క్రాంతి యో తెలీదండి,
  దాన్తోటే చాలా హుష్ కాకీ అయి పోయే టండీ

  నో చీర్స్ అండీ
  జిలేబి.

 5. hahahah…alaa choostey canada lo pharvaaledandee….pillalandaruu pandugalaki pattu parikineello kanipistaaru andamgaa..panduga bhojanalu, aata paatalato chaalaa trupti gaa untundi ikkada panduga samayam..

  • @
   ఎన్నెలగారు,

   నిజంగానే మన సంస్కృతి ఎగిరి వెళ్ళి విదేశాలలో తలదాచుకుంటోంది.టీ.వీ.లో నేను చెప్పిన విషయాలు నిజం.
   ధన్యవాదాలు

 6. బాబాయిగారూ మార్పు సహజం కదండీ..మీరన్నట్లు మన సంస్కృతి ఇంకా కొంత మిగిలే ఉంది. మీ వయసు వచ్చేసరికి మేము ఏమేమి చూడాలో…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s