శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి.

పెళ్ళి

పెళ్ళిచూపులకి  వెళ్ళి వచ్చిన  తరవాత మా మామయ్య, అత్తయ్య వచ్చారు. ఫలానా రోజు వస్తున్నామని, ముందు చెప్పడంతో కన్న తల్లి తండ్రులొచ్చారు. అన్నా చెల్లిళ్ళు కలిశారు, కన్నీళ్ళూ పెట్టుకున్నారు…….యిలా కలిసినందుకు ఆనందించారు. ” పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి”, అన్నాడు మామయ్య. “నేను కొద్దిగా కట్నం యిస్తాను” అన్నాడు. మా మాస్టారు “మేము మిమ్మలిని పిల్లనడిగాము కాని కట్నం అడగలేదే! మాకు కట్నం అక్కరలేదు, మీరు మామిడాకు మడిచి పెళ్ళిచేయండి, మాకు యిష్టమే” అన్నారు. దానికి మా మామయ్య అయితే “నేనిద్దామనుకున్న సొమ్ము మీకిస్తాను, మీరు పెళ్ళికూతురికి నగలు చేయించండి” అన్నాడు. మా మాస్టారు “సరే” అన్నారు.  అప్పుడు  మా  మామయ్య  యిచ్చిన సొమ్ముతో నా యిల్లాలికి చంద్రహారాలు చేయించారు, మా మాస్టారు.  ఆ వస్తువు, నా యిల్లాలు భద్రంగా దాచుకుంది, నేటికీ. ముహూర్తం పెట్టేరు. అర్ధ రాత్రి పెళ్ళి.

నా/మా పెళ్ళి జరుగుతూ వుంది. పెళ్ళయిపోయింది. ప్రధానహోమం చేయించి బ్రహ్మ ముడి వేసి, మమ్మలినిద్దరిని హోమానికి, నా చిటికిన వేలు, ఆమె చిటికిన వేలు లంకె వేసి ప్రదక్షణం చేయమన్నారు. ఆమె చిటికిన వేలు నా చిటికిన వేలు లంకె వేసాము. అంతే నాలో యేదో జరిగి, నాలోంచి ఆమెలొ యేదో జేరిపోయింది.  అది నా బుర్ర సగం అని తరవాత తెలిసింది. బ్రహ్మ ముడి విప్పడానికి లేదు, కార్యక్రమం పూర్తి అయేదాకా. (ఇదంతా, అనగా ముద్దు దాకా, ఇదివరకు వొక సారి మరొక సందర్బంగా చెప్పేను) తరువాతి హోమ కార్యక్రమానికి సిద్ధంచేస్తూ మమ్మల్ని ఒక అరగంట వదిలేసారు. వీధిలో పెద్ద తాటాకు పందిరిలో పెళ్ళి అయింది. దొడ్డిలో పెద్ద పందిరిలోకి వెళ్ళేము. ఇద్దరం చేయి, చేయీ పుచ్చుకుని పందిరి చివరికి చేరేము. అంతా పెళ్ళి తరవాత నిద్రకి పడ్డారు. ఏకాంతం,రాత్రి రెండు గంటల సమయం, వెన్నెల, చల్లని పిల్లగాలి, పక్కన కొత్తభార్య, కొత్తపల్లి కొబ్బరి మామిడిపండులా వుంది కొత్త భార్య,( కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు సువాసన, తీపి రుచికి గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి) భావోద్వేగం, వయసు ఆకర్షణ,వురకలేస్తున్న వయసు,దూరంగా వుండలేని పరిస్థితి, ఆమెమీదుగా వచ్చే, మనసుకు మత్తు కలిగించే మల్లెల సువాసన. మదనుడు సందడి చేయడానికి తగు సమయం. ఆమె వెన్నెలలో నిలబడింది. నేను ఒక్క సారిగా ఆమెను నా కౌగిలిలో బంధించి గాఢంగా ముద్దుపెట్టుకున్నా. ఆశ్చర్యపోలేదుకాని, తనూ ఆ భావోద్వేగం లోనే వున్నది కనుక, అబ్బా! ఇదేంటి! అంది. ముద్దోయ్! మొద్దూ! అన్నా. నన్ను మొద్దంటావా అని మీద పడింది. మరొకసారి కౌగిలిలో బంధించా, మరో సారి ఇద్దరం ముద్దు పెట్టుకున్నాము. విడిపించుకోడానికిచేసే ప్రయత్నంలా నటించింది. ఆనందమే ఆనందం. వుదయమే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. మూడవ రోజు పగలు వుద్యోగం చేసి రాత్రికి పునః సంధానం కి వెళ్ళేను. మమ్మల్ని ఏకాంతం లోకి తోసేశారు. కాని మాట్లాడుకోడానికి దారిలేదు. గదికి నాలుగు పక్కలా పడుకున్నారు, కాపలా పడుకున్నట్లు. గుస గుసలు తప్పించి మాటలేదు. గుస గుసలతో కొంగున వుంగరంకట్టా. “పెళ్ళి చూపుల నాడు యేమి పారేసుకున్నారు” అంది. “మనసు” అన్నా. అది తెలుస్తూనే వుంది మరొకటి అంది “యేమో” అన్నా. “యిదుగో రూపాయి బిళ్ళ పారేసుకున్నారు, అని చూపించి, దాచేసుకుంది, తీయడానికి వీలులేని చోట”.. ఆ రూపాయి బిళ్ళని చాలా కాలం భద్రంగా దాచుకుంది. మరునాడు వుదయం లేచేటప్పటికి నా శరీరం, బుర్ర తేలిక పడినట్లున్నాయి. నాటి నుంచి వుదయం పళ్ళుతోముకోవడం దగ్గరనుంచి నా అన్ని కార్యక్రమాలు వారే నిర్ణయిస్తారు. యిప్పటికీ యిదే జరుగుతోంది. ఎన్నాళ్ళయిందంటే, “ఆగండి , కనుక్కు చెబుతా”, “యేమోయ్ యెన్నాళ్ళయింది?” “రేపు మే 25 కి ఏబది సంవత్సరాలు పూర్తి అవుతాయట.” యీ సందర్భంగా మా కోడళ్ళు వివాహ అర్ధ శతాబ్ది వేడుక చేస్తారట, చెప్పేరు.

పెళ్ళి అయిన కొద్ది రోజులకి మా పల్లెలో యింటికి వెళ్ళేము. వేసవి కాలం యెండ మండిపోతూ వుంది. మా వూరి పెద్ద కాపుగారు పొలంనుంచి యింటికెళుతూ, వీధిలో వున్న నన్ను పలకరించి, “పెళ్ళయిపోయిందట కదా” అన్నాడు. యీలోగా నా ఇల్లాలు బయటికోస్తే ఆమెను చూసి “యీవిడేనా నీ భార్య?” అన్నాడు అవునన్నా. సంభాషణలో కలగ చేసుకుంటూ నా భార్య ” బాబయ్య గారూ!, యెండలో వున్నారు, లోపలికి రండి” అని పిలిచింది. ఆయన లోపలికొచ్చి కుర్చీలో కూచున్నారు. యీలోగా నా ఇల్లాలు, మంచినీళ్ళు, మజ్జిగ తీసుకొచ్చి యిచ్చింది, ఆయనకి. తీసుకున్నాడు. అప్పుడన్నాడు “నీ భార్య, బంగారమ్మ, సత్తెమ్మ, మరొకరి అంత అందంగా లేక పోవచ్చు, అంత సొమ్మూ, నీకు తెచ్చీ వుండక పోవచ్చు. నువ్వు ఆ రోజు సంబంధం వద్దన్న రోజు చాలా కోపం వచ్చింది. కాని ఇప్పుడు తెలిసింది, నీ యెంపిక చాలా బాగుంది, మీరు సుఖపడతారు, యీ అమ్మాయి నిన్ను సుఖపెడుతుంది, నాకా భయం లేదు. యెందుకు చెప్పేనో తెలుసా. నీ భార్య యిప్పుడు చూపిన ఆప్యాయత, ఆదరణ, యీ సొమ్ము, అందం లో లేదు సుమా” అన్నాడు. “యిలా రామ్మా” అని జేబులోంచి వంద రూపాయలు తీసి ఆమె చేతిలో పెడుతూ” నీకు యేమిచ్చినా తక్కువే, హటాత్తుగా వచ్చాను కనక యీ డబ్బులిస్తున్నా, బాబయ్య యిచ్చిన పసుపు కుంకాలనుకో అమ్మా” అన్నాడు. ఆయనకు యిద్దరం నమస్కారం చేశాము.

నా మనస్సు పెళ్ళి చూపులనాడు పోయింది, పెళ్ళిలో చిటికిన వేలు పట్టుకున్నపుడు సగం బుర్ర పోయింది, మూడు నిద్రలలో మొదటి నిద్ర చేసిన మరుసటి వుదయానికి మిగిలిన సగం బుర్ర ఖాళీ అయిపోయింది. నేను చాలా సుఖంగా వున్నా. నా చర్య ప్రతిదానికి ఆమె ప్రతి చర్య వుంది, అది నాకు తెలుస్తూనే వుంది. నా బుర్ర, మనసు అమె వద్ద వున్నాయి, ఆమె మనసు, బుర్ర నావద్ద వున్నాయి. మాకు తేడా లెదు, మరిక రాదు, అర్ధ నారీశ్వరులం. యిదే అద్వైతం. వొకటిగా కనపడే రెండు. రెండుగా కనపడే వొకటి. వొకరు యెక్కువ వొకరు తక్కువ లేదు.వొక బండికి రెండు చక్రాలు…. పెళ్ళితో స్రీ, పురుషులిద్దరూ పరిపూర్ణులవుతారు. అనుభవమయితే కాని తత్వం వంటపట్టదు.

యిది నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన

జిలేబి గారు, రసఙ్ఞా యిప్పుడు అనుమానం తీరిందా, పెళ్ళికి ముందా తరవాతా బుర్ర పోయినది, అన్నది.

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి.

 1. శర్మ గారు,

  మీరు ఎందుకు మీ సీరీస్ ఆపేశారు ? దయచేసి పునః దర్శనమివ్వండి.

  నో చీర్స్
  జిలేబి.

 2. @శర్మ గారు నేను మిమల్ని తాత గారు అని పిలుచుకుంటాను 🙂

  తాత గారు పెళ్ళి కబురు చాలా బాగుంది . నాకు ఆ అనుభవం లేకపోయినా చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఒకరి కొకరు ఒక్కటిగా నడుస్తుంటే ఎటువంటి మార్గమైనా పూల బాట వేసినట్టు వుంటుంది.

  చూపు కలసిన వేల సగమై
  మనువాడిన వేల పూర్తిగా లీనమై
  మనసు బుద్ధి తనువు అన్ని ధారపోసి
  మోసుకొచ్చిన మీ పెళ్ళి కబురు
  అనుభవపూర్వంగాను అందంగాను ఉంది….

 3. పండుగ పనుల్లో పది కొంచెం ఆలస్యంగా చూశాను బాబాయి గారూ..జీవన మాధుర్యం అంతా చూపించేశారు..మనసులు కలిసిన మనువు కంటే స్వగ్రం వేరేదీ లేదని. మీకు పిన్నిగారికి సంక్రాంతి శుభాకాంక్షలు..

 4. ఈ అంగ్రేజీ Bhaskara Rami Reddy తెలుగు లో హృదయ స్పందనల చిరు సవ్వడి చేసే భాస్కర రామి రెడ్డీ ఒకరేనా లేక వేరు వేరా ?

  చీర్స్
  జిలేబి.

 5. శర్మ గారు,

  కవిం కవీనాం ఉపమస్రవస్తమమ్!

  ధన్యోస్మి!

  అర్ధ శతాబ్ధి వేదానినికి వేరే మాటలు లేవు.

  మీ మే ఇరవై ఐదు ‘అర్ధాంగీ’ అర్ధ శత మహోత్సవం ది గ్రేట్ జెమిని The Great GEM in ‘eye’ – కను రెప్పలకి కనుపాపకి ఉన్న అనుబంధం ఆ మహోత్సవం !. వేరే చెప్పా లంటారా !!

  ఇక అర్ధ నారీశ్వర తత్వానికి వేరే సరి జోడు ఏదీ లేదు. బుర్రలు ఖాళీ అయినా అవి empty కావు.
  మట్టి అయినా అవి వట్టి వి కావు.

  మీకున్ను ఇదే శుభాకాంక్షలు. జీవత పరమార్థం అయిన ఆ ‘అర్థాన్నీ’ మీరు అర్ధాంగీ సమేతంగా గాంచవలె

  స్వస్తినో బృహస్పతిర్ధదాతు !

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s