శర్మ కాలక్షేపంకబుర్లు-లో మాట

లో మాట

మిత్రులందరికి,అమ్మలు, అయ్యలు నమస్కారం!

ఇంత తొందరలోనే మరలా మీతో మాటాడవలసి వస్తుందని అనుకోలేదు. నేను బ్లాగు 23.09.2011 వ తేదీన మొదలుపెట్టినది లగాయతు మీరందరూ చూపించిన అదరాభిమానాలకి కృతఙ్ఞుడను. ఆ రోజునుంచి విడవ కుండా నా చేత ఇఛ్ఛాశక్తి,ఙ్ఞాన శక్తి, క్రియా శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి వ్రాయించింది. అందులో నా గొప్పతనం లేదు.  ప్రస్తుతం, నాలో వొక రకమైన సంఘర్షణ బయలుదేరివున్నది.

ప్రకృతిలో గుణాలు మూడు. సత్వ, రజస్, తమో గుణాలు.  ప్రతివారూ యీ మూడు గుణాలలోనే సంచరిస్తూవుంటారు. ఏగుణంలో ప్రధానంగా ప్రవర్తిస్తారో, అది వారి గుణంగా చెప్పబడుతుంది. సామాన్యంగా నేను సాత్విక గుణ ప్రధానంగా జీవనం గడుపుతున్నాను, గత పది సంవత్సరములుగా. సత్వగుణంలో మానావమానాలు సమాన దృష్టితో చూడబడతాయి. బ్లాగు వ్రాయడం మొదలుపెట్టేను. ఇక్కడ వొక చిక్కు వచ్చింది. నేను, అనే అహం రావడం రజో గుణ ప్రకోపం. యిది మరో రకంగా కూడా ప్రకోపిస్తూవుంది. నేను రాశాను అనేటప్పటికి, మరొకరు బాగుందన్నారా, బాగోలేదన్నారా అనే అలోచన బయలుదేరి, అది రజోగుణంగా పూర్తిగా భాసించి, సత్వ గుణం నుంచి రజో గుణం లోకి పూర్తిగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. రజో గుణం లో యెదుటివారు బాగుందన్నపుడు సంతోషం, కాదన్నపుడు విచారం కలుగుతున్నాయి. యెప్పుడయితే రజో గుణం ప్రధానంగా వుండటం జరుగుతుందో, అప్పుడు తమో గుణానికి దగ్గరవుతున్నామని గుర్తించవలసి వస్తుంది. అందుచేత యెవరితోనూ తగువు పెట్టుకోవాలనే అలోచన యీషణ్మాత్రం లేదు. నేనేమిరాసినా యెవరినీ కించపరచాలని కాని, యెద్దేవా చేయాలనిగాని, అన్యాపదేశంగా యెత్తిపొడవాలనిగాని అనుకోలేదు, అనుకోను, అనుకోబోను. యిక రాయడం అనే విషయానికొస్తే రజో గుణం నుంచి తమో గుణం లోకి జారి పోయే ప్రమాదం యెక్కువగా కనపడతున్నందువల్ల ఆపు చేశాను. నాకు యెవరి మీద కోపం, యీర్ష, ద్వేషం, అసూయ లేదు. యేమి జరిగింది అన్న దానికి కూడా నా వద్ద జవాబు లేదు, కాదు రాదు. వొకరి పరువు తీస్తే నా పరువుతీసుకున్నట్లుగా భావిస్తాను. పరాశక్తి నన్ను తమో గుణం లోకి జారిపోకుండా హెచ్చరించిందేమో, చెప్పలేను.

తప్పులెన్నువారు తండోపతండంబు,
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు,
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు,
విశ్వదాభిరామ వినుర వేమ.

వొక కధ చెబుతా వినండి.
వొక ముని వొక రోజు వుదయం నదికి, స్నానానికి వెళ్ళేరు. ప్రవహం లో వొక తేలు కొట్టుకు వస్తూ, ప్రాణభయంతో గిలగిల లాడుతూ కనపడింది. చూసిన ముని, ఆ తేలును రక్షించడం కొరకు దోసిలిలో నీళ్ళతో బయట గట్టున వేయడానికి ప్రయత్నం చేశారు. తేలు కుట్టింది. వదిలేశారు. మళ్ళీ తీశారు, మళ్ళీ కుట్టింది, యిలా నాలుగైదు పర్యాయములు జరిగిన తరవాత, యెలాగైతేనేమి ఆ తేలును గట్టుపై పడవేశాడు. ఇదంతా చూస్తున్న నాలాంటి బుద్ధిమంతుడు, “ఏమయ్యా! అది తేలు, కుడుతుందని నీకు తెలుసు, అయినా మరల, మరల ప్రయత్నం చేసి యెందుకు ఆ విష ప్రాణిని కాపాడేవు, పిచ్చి వాడవు కావా?”, అని అడిగేడు. అందుకు ముని, “నాయనా! అది తేలనీ తెలుసు, అది కుడుతుందనీ తెలుసు, కుట్టినదీ తెలుసు, అయినా వొక మాట చెబుతా విను. నా స్వభావం ప్రాణాన్ని రక్షించడం, దాని స్వభావం కుట్టడం. దాని పని అది చేసింది, నా పని నేను చేసాను, తేలు, తన స్వభావం అది యెలా వదులుకోలేదో నేనూ నా స్వభావం వదులుకోలేను” అని చెప్పేరు. నేను, నేడు ఆ స్థాయికి చేరలేక పోయినా, నాకు తగిన స్థాయిలోనైనా వుండి, సత్వగుణాన్ని పెంపొదించుకోవాలని నా ఆశ.

అసతోమా సద్గమయ,

తమసోమా జ్యోతిర్గమయ,

మృత్యోర్మా అమృతం గమయ.
ఓం.శాంతి. శాంతి.శాంతిః

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-లో మాట

  • @
   మిత్రులు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి,
   నమస్సులు,
   మీ ఆదరణకి, ఆప్యాయతకి పాత్రుడినైనందుకు ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.

 1. నాహం కర్తా హరిహి కర్తా !

  ధన్యోస్మి! మళ్ళీ మీరు పునర్దర్శనం ఇవ్వడం.

  ధన్యవాదాలు.

  ఇక మూసుకు పోయిన హృదయకవాటాల వెనుకనున్న మా మనవణ్ణి బయటకు లాగాలి. ఆ ప్రయత్నం లో పడతాను. ఎంత దాక ప్రయత్నం సఫలీకృతం అవుతుందో తెలియదు. భాస్కరో మార్గదర్శకః !
  జిలేబి.

వ్యాఖ్యలను మూసివేసారు.