శర్మ కాలక్షేపంకబుర్లు-డబ్బు

డబ్బు

అబ్బ! ప్రపంచం మొత్తం కాంతా కనకాల చుట్టూ తిరుగుతోందండీ!!! ఇది యెవరు వొప్పుకున్నా వొప్పుకోకపోయినా సత్యం.

డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడని సామెత. శ్రీనాధుడంతటివాడు “సిరిగలవానికిచెల్లును తరుణుల పదియారువేల తగపెండ్లాడన్, తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగ విడుము పార్వతి చాలున్” అన్నాడు. డబ్బున్న వాడు యెంతమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు, బిచ్చం యెత్తుకునే నీకిద్దరు పెళ్ళాలెందుకు, గంగమ్మని వదిలెయ్యి మాకు అన్నాడండి. పాపం శంకరుడు బోళా వాడు కదండీ, గంగని వదిలేశాడు, మన కోసం.

వేమన తాత పసిడికలవాని … పసిడి కలవాని బానిస కొడుకులు అని యీసడించాడు, చూడండి. భతృహరి తన సుభాషితాలలో విద్య నిఘూఢ విత్తమది… విద్యకు సాటి ధనంబు లేదిలన్ అన్నాడు, కాని నిజం కాదనుకుంటా. కారణం, చదువుతో లక్ష్మీ కటాక్షం కలగటంలేదుమరి. మరో మాట కూడా చెప్పేరు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఇది కూడా నిజం అనిపించటంలేదు. కృషణవేణమ్మ కొనిపోయెనింత ఫలము, బిలబిలాక్షులు తినిపోయె తిలలు, పెసలు, బొడ్డుపల్లెని గొడ్డేరి మోసపోతి, యెటుల చెల్లింతు టంకంబు లేడు నూర్లు, అని బాధ పడుతూ, దివిజ కవి వరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు, శ్రీ నాధుడమరపురికి. అంటూ తనువు చాలించారు కదా మరి. లేకపోతే నేటి కాలానికి,విద్వాసులనుకుంటున్న వాళ్ళు కాదా? యేమో యెక్కడో వుంది తిరకాసు. అర్ధం కావడం లేదు. కాని ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతూంది. దేశాలు దగ్గరనుంచి వ్యక్తులవరకూ ఇదే వరస. దేశాలు పక్కదేశపు భూభాగం ఆక్రమించుకుంటూన్నాయి. వ్యక్తులు సమాజానికి చెందిన వాటిని స్వంతం చేసుకుంటున్నారు, అంతే తేడా. యిలా సంపాదించిన వ్యక్తులకి దాని అనుభవం యెంత? కొంతమంది డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి, యెరిగి డబ్బును వదిలేసినవాళ్ళున్నారు, కోబాడ్ గాంధి లాగా. యీ వుండటం లేకపోవడం అన్నది వస్తురూణా కంటే, మానసికమే యెక్కువనుకుంటా. ఆలకున్ తిన్నది పుష్టి, మానవులకున్ వున్నది పుష్టి, సామెత. ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండి అయిన బారదు సుమతీ అన్నాడు శతక కారుడు. డబ్బులు లేకపోతే పని జరగదండి, అని, జరుగుతుందని చెప్పేడు. మన సినీకవి కాంత పైన ఆశ, కనకమ్ము పై ఆశ లేని వాడు ధరణి లేడురా మొదలు లేడురా అన్నారు. మరొకరు డబ్బే డబ్బు డబ్బురా అన్నారు. ఇది సహజ మేమో! ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు దగ్గర ఆగిపోతారు. చెయి చిక్కని తనం వచ్చేస్తుంది. ఇలా ఆగిపోడం లేని వాళ్ళు తక్కువ. మానవ సంబంధాలన్నీ అర్ధిక సంబంధాలే నన్నారు, మార్క్స్ మహాశయులు…..నిజమేకాని పూర్తిగా కాదనుకుంటా. తల్లి బిడ్డని యే అర్ధిక సంబంధంతో పెంచుతుంది. దీనికీ అర్ధిక సంబంధం చెప్పగలమా. మానవ సంబంధాలు మరి లేవా? ఎక్కువ మంది మానవ సంబంధాలు ఆర్ధిక మైనవే అనుకుంటున్నారు. కాని ఆ సూత్రాన్ని మాత్రం ఆచరణలోకి తేవడం లేదు. ఇది స్వార్ధం తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. నాకయితే సిద్ధాంత రాద్ధాంతాలు తెలియవు కాని, డబ్బులేనిదే యే పని జరగదని మాత్రం తెలుసును. డబ్బులేని వాణ్ణి పెళ్ళాం కూడా యీసడించుకుంటుంది. డబ్బుకు లోకం దాసోహమ్. డబ్బువుంటే లచ్చి, లచ్చిందేవి,లక్ష్మి, లక్ష్మిదేవి, చిన్న తల్లి, అమ్మగారు, పరదేవత అయికూచుంటుంది. లేక పోతే పైనుంచి క్రమం కిందికే.

మానవులు డబ్బు వెనక యెందుకు యింత వెర్రిగా వెనకపడుతున్నారు. అవసరాలు తీర్చుకోడానికి, సుఖాలకోసమా?భవిషత్తు, పిల్లలకోసమా? యేది సుఖం? నిత్యమైనది సుఖం.కాని యేదీ నిత్యం కాదే మరి అది సుఖం యెలా అయిందీ? నిధి చాల సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా అన్నారు త్యాగయ్య. బ్రీజర్, స్ప్లాష్,షాట్స్ యేదో వొకటి పోసెయ్యి డబ్బులు పోగేసుకో. ఎన్ని కబుర్లు చెప్పినా రూపాయి అవదు.

ప్రకటనలు

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-డబ్బు

 1. శర్మగారూ ధన్యవాదాలు. కవిత్వం వ్రాయటానికి నాకు చాలా బధ్దకం అన్నమాట నిజం. కాని కొంతమంది ప్రోద్బలంతో ఈమధ్య కొంచెం శ్రధ్ధగా వ్రాస్తున్నాను.

  నా బ్లాగ్ శ్యామలీయం (http://syamaliyam.blogspot.com/)లో నా కవిత్వ వ్యాసంగం చదవండి.
  అలాగే నా మరొక బ్లాగ్ నవకవనవనం (http://syamalatadigadapa.blogspot.com/)లో శ్రీమద్భాగవత మాహాత్మ్యం కావ్యరచన మొదలు పెట్టాను. ప్రథమాశ్వాసము సంపూర్ణం అయింది, ఇవాళో రేపో రెండవ ఆశ్వాసం వ్రాయటం మొదలు పెడతాను. మీ అమూల్యాభిప్రాయాలు తెలియజేయండి.

  • @

   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   నమస్కారం, మీరు దయతో చెప్పిన విషయాలకి ముగ్ధుడనయ్యా! మీరు దయతో యిచ్చిన లింక్ చూస్తా!! మీకు బ్లాగ్ వుంటుందని తలచా,కాని పట్టుకోలేకపోయా!!! మీ పరిచయ భాగ్యానికి ధన్యుడను. ధన్యవాదాలు.

 2. కం. సిరి నెన్నెడు మానవులను
  కరుణించడు విష్ణుమూర్తి కమలాలయయున్
  హరిభక్తు లైన వారల
  పరికింప దటండ్రు విబుధవరులు జిలేబీ

  కం. హరి బాయదు సిరియందురు
  హరియును సిరి నురము మీద నాభరణముగా
  ధరియించు నందు రిలపై
  నిరువురు నొకచోట నుండ రేల జిలేబీ!

  కం. సిరి తనవశమై యుండగ
  నరుడడుగుట తప్పుగాదె నారాయణునిన్
  మరచునదియు చెడునదియును
  ధరాజనులె హరిది లేదు తప్పు జిలేబీ

  కం. హరిభక్తుడైనవానికి
  హరిభక్తియె సిరియు గాన నతని కితరముల్
  సిరులేల గాన లోకము
  పరమదరిద్రునిగజూడ వచ్చు జిలేబీ

  కం. హరిసిరులిర్వురునొకచో
  ధరనుండమి వెఱ్ఱమాట తగ మోక్ష శ్రీ
  కరుణించదె హరిభక్తుని
  నరునకు నింకేమి వలయు నమ్మ జిలేబీ
  …………………………….(జిలేబీ శతకం)

  • @

   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   పంచరత్నాలు యిచ్చేరు మహద్భాగ్యం. జిలేబిగారు మీదే చలవ. శ్యామల రావు గారు మీలో కవితా శక్తి మేల్కొంది. కొన సాగించమని మనవి.
   ధన్యవాదాలు

 3. @

  అమీర్,
  నన్ను, తాతా అన్నావు, నిన్నెలా మరిచిపోతా, చెప్పు.నీవు క్షేమంగా తిరిగి రావడం కంటే గొప్ప గిఫ్ట్ నాకు మరొకటి వుంటుందా? నీ మనసు నడుగు. గిఫ్ట్ తెస్తానన్నది, కడుపు నిండే మాట, ధన్యవాదాలు.

 4. /మానవ సంబంధాలన్నీ అర్ధిక సంబంధాలే నన్నారు, మార్క్స్ మహాశయులు…..నిజమేకాని పూర్తిగా కాదనుకుంటా/

  మార్క్స్‌ని ఏమనకండి, ఎర్రచీమలు దాడి చేస్తాయి. 🙂 ఆయన చెప్పింది వేదవాక్కు, అంతే ప్రశ్నించకూడదు, గుడ్డిగా ఫాలో అయిపోవాలి. లేదంటే అతివాద అనాగరిక చాందస మతవాదవ్యతిరేక వర్గ శతృవులైపోతాము. 😛

  • @

   Snkrగారు,
   నేను ముందే మనవి చేశా. సిద్ధాంత రాద్ధాంతాలు నాకు తెలియవని.యెప్పటి చిల్లర టపా అండీ! బాగా గుర్తుపెట్టుకున్నారు. ధన్యవాదాలు

   ధన్యవాదాలు.

   • శంకర్ గారు,

    మార్క్స్ ప్రకారం సిరి కదులుతూ వుండాలి. అప్పుడే ఎకానమీ పెరుగుదల
    సిరి ఒక్క చోట ఉండదని వేద వాక్కు.

    సో, మార్క్స్ అండ్ మన శాస్త్రాలూ ఒక్క టే చెబుతున్నాయండీ ! ఖచ్చితం గా చెప్పాలంటే మార్క్స్ మన సంస్కృతి నించే ఈ ఐడియా ని కాపీ కొట్టాడు

    ఆయన చెప్పెందే వేదవాక్కు, కొద్దిగా , మార్చి చెబితే, ఆయన వేదవాక్కునే చెప్పాడు !

    చీర్స్
    జిలేబి. (నారదా, విష్ణువు కొలువులో వున్నారా ?)

 5. వాడే వీడు అన్నట్లుంది మీపేరు “చిర్రావూరిభాస్కరశర్మ అనే మాచనవఝులవేంకటదీక్షితులు”. ఇందులో అసలు మీ పేరు ఎమీటి?

 6. జిలేబి గారూ…
  >>> విష్ణు మాయ ! విష్ణువిని మనలో కొలువై వుండమని అడిగి చూద్దాం. ఆ పై లక్ష్మి దేవి రాక వుంటుందంటారా !!

  ఫలం, పత్రం, పుష్పం ఏదో ఒకటి ఇస్తే కానీ ఆ జగన్నాధుడే కరుణించడు. భక్తి గా పూజిస్తే తప్ప మోక్షం కూడా ఇవ్వడు. ఆయన అడుగు జాడల్లోనే కదా మనం నడవాల్సింది. ఆయన కూడా లక్ష్మి మనదగ్గర ఉంటే తప్ప రాడనుకుంటాను. ఇదే విష్ణు మాయ. …. దహా

  • @
   బులుసు సుబ్రహ్మణ్యంగారు,
   చిదంబర రహస్యం చెప్పేశారు. లక్ష్మి వుంటే కాని విష్ణువు కూడా కనికరించడు. ధన్యవాదాలు.

   • బులుసు వారు,

    నాడు గజేంద్ర మోక్షం లో సిరికిం జెప్పక శ్రీ వారు వచ్చేసారు !

    ఆపై లచ్చిమి, భువి కి పోతే, శ్రీ వారు కలత చెంది వెంట బడి మా జిల్లా వాసీ, అయిపోయారు !

    మొత్తం మీద వీరిద్దరిలో ఎవరో ఒకర్ని పట్టు కొంటే (ఈ పట్టు కోవడం వేరు!) మరొకరు ఫ్రీ!

    బై ఒన్ గెట్ టూ ఫ్రీ! లా అన్న మాట !!

    చీర్స్
    జిలేబి.

 7. తాతగారు, కొంచెం లేటా ?? పర్లేదులెండి…:)

  ప్రపంచం లో చాలా మంది ఇప్పుడు సంపాదిస్తున్నది కడుపు కోసం కాదు అని నొక్కి వక్కాణించి బల్ల గుద్దుతాను నేను…విలాసాల కోసం అని అరుస్తాను, జనాలకి తమ పరపతి చూపించుకోవడానికి అని కేకలేస్తాను, కుర్చుని తింటే కొండలు అరిగిపోతాయి అని ఎవరు చెప్పారో గాని ఇప్పుడు జనాభా కొంచెం మార్చు కుని కుర్చుని తింటే పర్వతాలు ఎగిరిపోతాయి అని ఓ తెగ సంపాదిస్తున్నారు…లేదు అంత అవసరం లేదు …రోజుకి వెయ్యరుపాయిలు సంపాదించడం కన్నా ఒక వంద రూపాయిలు ఖర్చు పెట్టి “నిజం”గా ఆకలితో అలమటించే వాడికి భోజనం పెట్టిస్తే….జబ్బు తో బాధ పడే వాడికి వైద్యం చేయిస్తే….ఆహాహః ఆ ఆనందం ఈ పిచి కాగితాలను పోగేసుకుంటే రాదండి…ఆ సుఖం అనుభవిస్తే గాని తెలీదు…పైన శ్రీ గారు “సుఖం” ఎందులో ఉంది అంటే నాకు అర్ధం కాని పెద్ద పదాలు చెప్పారు 🙂 కాని నాకు తెలిసి అన్నింటికంటే పెద్ద సుఖం కష్టాల్లో ఉన్నవాడి కళ్ళల్లో ఆనందం రప్పించడం…

  అందుకే …ఈ డబ్బు గురించి నన్ను కేలకొద్దు అంటాను…ఎంత పెద్ద కామేంటో..బాబోయ్….

  • @

   అమీర్!
   నీ గురించి నిజంగా బెంగపెట్టుకున్నా! ఒక టపా కూడా రాశా!! యెక్కడున్నావు? కుశలమా? డబ్బు వద్దనను, కావాలి తగుమాత్రంగా, జీవయాత్ర నడవాలి. చేతనయినంత యితరులకి సాయం చేయాలి. అప్పుడే నరజన్మ కి సార్ధకత. నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు.

   • హమ్మా..తాత…ఎంత మాట ఎంత మాటా…నేను మిమ్మలిని గుర్తుపెట్టుకోవడమా..!!! మీలాంటి పెద్దలు ఎప్పుడు గుండెల్లో ఉంటారు , మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటారు….మీరు నా లాంటి వాడిని గుర్తు పెట్టుకోవడమే మహద్భాగ్యం అండి!! మీరు రాసిన టపా చదివాను (వెతికి మరి పట్టుకున్నాను)..చాలా బాగా రాసారు, అనుబంధాలకు రక్తసంబంధమే పరమావధి అనుకోవడం మూర్ఖత్వం అని నేను అనుకుంటాను..అయిన ఎన్నిసార్లు వల్లే వెసామండి “భారతీయులందరూ నా సహోదరులు” అని కాని నిజానికి ఆచరించ లేకపోతున్నమేమో కదా..!!! ఇండియా వస్తున్నాను కదా ఉరిలో నాకు తెలిసిన ప్రతీ ఒక్కరికి గిఫ్టులు తీసుకున్నాను..అవి పాకింగ్ చేయడం లో పడి మన లోకం లోకి రాలేక పోయాను ..అంతే!!
    అవును ఇంతకీ మీకు ఏమి కావాలి??? 🙂 🙂

   • అప్పుడేపుడో పెట్రోల్ బంకు వారి చిల్లర చేతివాటం గురించి శర్మగారో టపా రాశారు. సౌదీ నుంచి వస్తున్నారు, శర్మ గారికి ఓ పీపాడు పెట్రోలు తేగలరు. 😀

 8. *డబ్బులేని వాణ్ణి పెళ్ళాం కూడా యీసడించుకుంటుంది.*
  పైకి ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పినా, స్రీల ప్రేమ ఎప్పుడు పురుషుడి వెనకాల ఉన్న డబ్బు పైనే.
  *మానవులు డబ్బు వెనక యెందుకు యింత వెర్రిగా వెనకడుతున్నారు. అవసరాలు తీర్చుకోడానికి, సుఖాలకోసమా?భవిషత్తు, పిల్లలకోసమా? యేది సుఖం?
  ఇంత పెద్దవారై ఉండి కూడా, ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదా? లేక తెలియదా? 🙂
  మానవులు కాదు మగ వాడు డబ్బు వెనుక పడటానికి కారణం శ్రంగారం కోసం. మన యోగులు అంతా దీనిని కామిని కాంచనాలు అని చెప్పేవారు.
  ఎదీ సుఖం అని అంటారేమిటి? మొదట్లో అందరు మగవారు సుఖం మనుకొని ఊహించు కొనేది శ్రంగారం కదా! మసాల వడ వాసన చూసి, తినటానికి పోయిన ఎలుక బోనులో (సంసారం లో )చిక్కి వగస్తున్నట్లు ఉంది మగ వారి పరిస్థితి .

 9. @

  జిలేబిగారు,
  కష్టపడివిష్ణువును తెచ్చుకున్నా లచ్చిందేవి కూడా వచ్చేలాలేదండీ!!!ధన్యవాదాలు.

 10. శర్మ గారూ,

  ప్చ్ టపాలు రాస్తూంటే ఏమీ ‘రాలటం’ లేదండీ !

  కబుర్లకి కాణీ కూడా గిట్టుబాటు కావటం లేదే ఎం చేద్దాం మరి !

  లచ్సిందేవి, అల వైకుంట పురి లో కొలువై పోయే !

  విష్ణు మాయ ! విష్ణువిని మనలో కొలువై వుండమని అడిగి చూద్దాం. ఆ పై లక్ష్మి దేవి రాక వుంటుందంటారా !!

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s