శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మ చెప్పాలి.

అమ్మ చెప్పాలి.

ఇదేంటి. సిగరెట్లు మానెయ్యడం యెలా, సినిమాలు చూడ్డం మానెయ్యడం యెలా? మందు మానెయ్యడం యెలా అని యిలాగ  చాలా వాటికి చిటకాలు చెప్పేరు, డబ్బు సంపాదించడం యెలా, పెళ్ళి చేసుకోడం యెలా, పిల్లల్ని కనడం యెలా, యిల్లు కట్టుకోడం యెలా అన్నవాటికి కూడా పరిష్కారాలు చెప్పేరు. చివరికి భగవంతుని చేరుకోడం యెలా అన్నదానికి కూడా, వున్న భవబంధాలు తెంచుకో భగవంతుని చేరడానికి మార్గం దొరుకుతుందని చెప్పేరు.  కాని బ్లాగ్ లో రాయడం మానెయ్యడం యెలా అన్నదానికి యెవరూ చెప్పినట్లు లేదు.  బ్లాగ్ మూసెయ్యి. ఆ పనీ చెయ్యలనుకున్నాంకదా. కుదరలేదు కదా.! అందుకని స్వయంగా వెతికేను, పరిష్కార మార్గాలు.

ఎలా అంటే. కరంటు లేకపోతే, మరో చోట రాస్తున్నావుగా. మిత్రులు, హితులు, స్నేహితులు తో దెబ్బలాట పెట్టుకో. అబ్బే మనకి దెబ్బలాట పడదుకదా. మాటకి మాట సమాధానం చెప్పగలిగితే దెబ్బలాట పెరుగుతుంది,రసవత్తరంగా వుంటుంది. మనకది చేతకాదుగా. కుదరదు. నెట్ కనక్షను తీయించెయ్యి. మన చేతిలోలేదే.  అబ్బాయి గోలెడతాడు. కుదరదు. పోనీ, వాడకం లిమిటు చేస్తే, అబ్బాయికి ఇబ్బంది కదా. కుదరదు. కంప్యూటర్ తీసేస్తే. ఇదీ కుదరదు, మనది కాదుగా, అబ్బాయిది. సొమ్మబ్బాయిది, సోకు మనది.  మనసు నిగ్రహించుకుని దాని దగ్గరకెళ్ళడం మానేస్తే, యెప్పుడో వొకప్పుడు మెయిల్ చూడాలికదా! చూస్తాంకదా!!. అప్పుడిక ఆగుతామా. బ్లాగులోకి వెళ్ళకుండా. వొకసారి బ్లాగులోకెళితే మరి యేమీ తెలియదు కదా!!!. రాసెయ్యలనిపిస్తుంది. చేతి దురద ఆగదు కదా. మిత్రులొకరు యిది వ్యసనం అని చెప్పేరు. అప్పుడింతగా బాధపెడుతుందనుకోలేదు. అమ్మాయిలు/అబ్బాయిలు/అమ్మలు/అయ్యలు అందరూ రాయవోయ్ చదువుతాం అంటున్నారు, రాయకుండా వుండలేని వ్యసనమైపోయింది. మెయిల్ అడ్రస్ మార్చేద్దాం. కుదరదు. ఈ మెయిల్ అడ్రస్ చాలావాటికిచ్చాము కదా! కుదరదే. మిత్రులతో మాటాడటం మానేద్దాం. మానెయ్య గలవా? అనుమానమే. కుదురుతుందా!!! ప్రయత్నం చేశావా? యెలా?

నెట్ లేని చోటికి వెళదాం. యెక్కడికెళ్ళాలి. పెద్దబ్బాయి దగ్గరకెళితే. నిజమే పొలం చూసుకోవచ్చు. కాలక్షేపం అవుతుంది. నెట్ వుండదు, కరంటు వుండదు పగలు. సమస్య లేదు. బాగానే వుంది కాని అక్కడ యెన్నాళ్ళుండగలం. పది రోజులు, లేదా పదిహేను రోజులు. కుదురుతుందా? మనవరాలో!. అక్కడకెళితే, ఇక్కడ మనవరాలికి జ్వరం వచ్చిందని, మరునాడే చెబితే మనసు ఆగుతుందా/రాకుండా వుండగలమా? మనం వదిలేసి వెళితే మరునాడు బెంగ కి, జ్వరం యెన్ని సార్లు తెచ్చుకోలేదు. అసలు పదిరోజులు వెళితే చిన్న కోడలూరుకుంటుందా? నేనేమి తక్కువ చేసేనని గొడవ చేసెయ్యదూ? ఇదేదో కుదిరేలా లేదు. పోని పెద్దమ్మాయి గారింటి కెళితే? వెళ్తాం.  యెంతకాలముంటాము. వొక రోజు లేదా రెండు రోజులు, మనకి కాలు నిలబడదే, అక్కడ.  పోనీ మనవారలింటికేళితే, అబ్బో అక్కడ పెద్ద ప్రమాదం. యిద్దరూ సాఫ్టు వాళ్ళే.  డెస్క్ టాపో,లేప్ టాపో మనదగ్గరపారేసి తాతా మేము ఆఫీసుకెళ్ళి వస్తామంటె, మనకి యెలా.  అంచేత యిదీ కుదరదు. చిన్నమ్మాయి యింటికేలితే. అబ్బో! అక్కడా యిదేయిబ్బంది. పెద్దమనవరాలు సాఫ్టు. చిన్న మనవరాలు డాక్టరు. టెస్టులని, ఆరోగ్యమని, చంపేస్తుందేమోనని భయం.  పోనీ మనవడు దగ్గరకెళదామనుకుంటే వాడూ సాఫ్టేగా. కూతురు కొడుకు దౌహిత్రుడు బెంగళూరులోవున్నాడు, వాడిని చూసినట్లు వుంటుందనుకుంటే, మరీ ప్రమాదం వాడు పక్కా సాఫ్టు.  పోనీ అమెరికా మనవరాలు దగ్గరకెళ్దాం!  మొన్ననో సారి అయ్యిందిగా ముచ్చట.  అక్కడికెళితే, ముల్లు తీసి కొఱ్ఱడచుకున్న చందమే!!! అందరూ అంతో యింతో సాఫ్టులే.  మరింక హార్డులేరండి.  మరో సంగతి, యీ మధ్య రసఙ్ఞ బ్లాగు రాజు గారిని పంపుతోందిట. రాయని వాళ్ళు యెందుకురాయటంలేదో, ఆయన కనుక్కుని వెంటనే రాయిస్తున్నారట. మొన్ననో సారి బాలు గారి దగ్గరకెళ్ళేరట, ఆయన. మరెలా?

ఎక్కడికిపోయి వుపయోగం లేదు. ఇక్కడే వుండి సాధించాలి. యెలా. యెలా!యెలా! యెలా! యెలా తెలుపను యెదలోని మాటను,మదిలోని ప్రేమను. ఇది, యీ పాట అసందర్భంకదా!!! మతి లేక, యేమి చేయాలో తోచక, ఫిబ్రవరి నుంచి కరంటు తీసెయ్యడం ఖాయం, అనుమానం లేదు. వొక కారణం. చాలా వీక్ గా వుంది కారణం. మనసు గతి ఇంతే…మనిషి బతుకింతే!………అనుకున్నది చేయలేని బతుకులు…….పద్మ వ్యూహం లోకి చొచ్చుకుపోవడమే తెలిసిన అభిమన్యునిలా వుంది మనపని. బయటపడే దారేలేదా? లేదా? మరి మానెయ్యలేమా? లేమా? మా? అవును!!! “మా” చెప్పాలి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఈ లోగా గింజుకున్నా పరిష్కారం దొరకదు.

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మ చెప్పాలి.

 1. శర్మగారు ‘వుపదేశం’ అన్నారు. నేను ఉపదేశాలిచ్చేంతవాడినా!
  అన్నట్లు ‘వుపదేశం’ సరిగాదు పదంగా – ఉపదేశమే..
  ‘య’, ‘వు’, ‘వూ’ ‘వొ’, ‘వో’ అనేవి తెలుగు మాటల ప్రధమాక్షరాలుగా ఉండవు అని వ్యాకరణం చెబుతోంది మరి.
  అట్లా ప్రచారంలో ఉన్న మాటలు అయితే సంస్కృతపదాలు లేదా తప్పుప్రయోగాలు.

  • @

   మిత్రులు శ్యామలరావు గారు,
   పొరపాటు సరి చేశారు. ధన్యుడను.ఙ్ఞాన వృద్ధులను అలా అనడం మంచి మాట చెప్పిన వారిని గౌరవించడం, అలవాటు కనక అలా అన్నా! ధన్యవాదాలు.

 2. శర్మగారూ,
  సంస్కృతంలో వ్యసనం అంటేనే దుఃఖం అన్న అర్ధం ఉంది కద. వ్యసనాలు మూడు రకాలు. ఒకటవరకం మంచివి (అంటే బ్లాగులోకంలో సత్కాలక్షేపాల వంటి వన్నమాట), రెండవరకం చెడ్డవి (ఇవి సవాలక్ష ఉన్నాయి, అందరికీ తెలిసిని వీటికి ఉదాహరణలు అనవసరం) మరియు మూడవరకం మిశ్రమం (అంటే ఫంక్షన్లకి తరచూ వెళ్ళటం, దానా లివ్వటం లాంటి వన్న మాట). మిశ్రమజాతి వ్యసనాలలో చిక్కులూ, చిరాకులు బాధిస్తాయి. అతిపరిచయాదవజ్ఞా సంతతగమనాదనాదరో భవతి అన్న న్యాయం లాగా ప్రతి ఫంక్షనుకూ వెళ్ళటం చేతిచమురు భాగవతమే గాక కాటరింగు బఫేలపుణ్యమా అని ఆరోగ్యహాని. అలవాటుగా వెళ్ళేవాళ్ళని బంధుగణం ఆదరంగా వచ్చారా అనరు గాని రాకే పోతే మా ఫంక్షను యెగ్గొట్టారేం మాయరోగం అంటారు. అందుచేత మీరు మంచి వ్యసనాలను మాత్రం కంటిన్యూ చేయాలి మరి.

  ఇకపోతే జిలేబీ శతక పద్యం.

  కం. గీతల మీదే పేరడి
  రాతలు మెరిపించు నేర్పు రాదు సులువుగా
  ఐతే రసవద్గీతల
  చేతులు కల మంచి రామ చిలక జిలేబీ!

  • @

   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   మీ మాట నాలో మళ్ళీ శక్తిని నింపింది. మీమాట ఉపదేశం .మరో పద్యం, కవితకి
   ధన్యవాదాలు

 3. తాత …

  ఇండియా వస్తున్నాను కదా…నా దగ్గరికి వచ్చేయండి…ఏవో చిన్న చితక వ్యాపారాలు ఉన్నాయి ..వాటికి ప్లాన్నింగులు…స్టాఫింగులు…ఇలా చాలా పనులు ఉన్నాయి వాటిని చక్కబెడుతుంటే …అసలు ప్రపంచమే గుర్తుకురాదు ..ఇంకా బ్లాగ్లోకం మర్చిపోతాం…ఏమంటారు?? అన్నట్టు ఆరోగ్యం ఎలా ఉంది??

  • @

   అబ్బాయ్ అమీర్,
   కులాసాగా వున్నా! ఆరోగ్యం బాగుంది.
   వచ్చెయ్యమన్నావు చూడు! అది కడుపు, మనసు నిండిన మాట. నీవు “కులాసాగా వున్నాను” అని చెప్పే వొక్క మాట యీ తాతకి మరింత శక్తి యిస్తుంది కదా! పది మందిని బతికించే పని యేదయినా చేయి, భగవంతుడు నిన్ను రక్షిస్తాడు.
   ధన్యవాదాలు

 4. సర్వ ధర్మాన్ పరిత్యజ్య
  మమ ఏక శరణం వ్రజ
  అహం త్వా సర్వ బ్లాగేభ్యో
  మోక్ష యిష్యామి ‘మా’ శర్మాణామ్!!

  కర్మ ఫలేషు ‘మా’ కదాచన !

  “దుర్గస్య దుర్గః జిలేబీ నామ్యా దుర్గః”
  జిలేబి.

  • @

   జిలేబి గారు,
   అమ్మకి నా వినతి చెప్పా! అమ్మకి తెలియదా, యెప్పుడు యేది యెలా జరపాలో? అమ్మ చెబుతుంది, నాకా నమ్మ్మకం వుంది.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s