శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపకారం

ఉపకారం

ఉపకారికినుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!.

పాపం శతకకారుడు పాతకాలం వాడు, ఉపకారికి ఉపకారం, అపకారికి కూడా ఉపకారం చేయాలన్నాడు. బహుశః ఇదే మన గాంధీగారు కూడా అమలు పరచేరనుకుంటా, అందుకే ఒక చెంపమీద కొడితే రెండవ చెంపా చూపించమన్నాడు. నేటి కాలానికి, “ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోతున్నారని” సామెత.” పుణ్యానికిపోతే పులెత్తుకుపోయిందని” మరొకటి.

మా కాలనీకి మొదటిగా కట్టుకున్న ఇల్లు మాదే. తరవాత ఇప్పటికి చాలా ఇళ్ళు వచ్చాయి. ఆ రోజుల్లో మేము ఇల్లు కట్టుకోడానికి చాలా అవస్థలు పడ్డాము, సిమెంటు వేసుకోడానికి, చేయించిన గుమ్మాలు కిటికీలు వగైరా సామాను పెట్టుకోడానికి. ఒకటి రెండు రోజులలో వచ్చిన అనుభవంతో, ఒక పాక వేయించేశా, అప్పుడు. తరవాత ఇళ్ళు కట్టుకునేవారు సామానులు, పనిముట్లు, మా దొడ్డిలో పెట్టుకు పోయేవారు. ఉదయం మళ్ళీ తీసుకుపోయేవారు. ఇలా చేస్తుండగా,ఒకసారి, వాళ్ళది ఒక పార కనపడలేదు. “పార కనపడటం లేదండి”, అని సణగడం మొదలెట్టేరు, “మీరుగానితీసుకున్నారా?” అని అడగలేక. తరవాత వెతుక్కుంటే దొరికింది, వాళ్ళదగ్గరే. చికాకువచ్చి, సామానులు ఇక్కడ పెట్టవద్దని చెప్పెయ్యవలసివచ్చింది. “ఊరికెళుతున్నామండి, తాళాలు ఇక్కడ పెడతాము, రాత్రికి మనిషివచ్చి పడుకుంటాడు,ఇంట్లో, తాళాలివ్వండి”, ఒకరి అభ్యర్ధన. సరే తాళాలు తీసుకున్నాం. మాకు రాత్రి తొమ్మిదికి పడుకునే అలవాటు. పక్కవాళ్ళింట్లో పడుకోడానికి వచ్చే మనిషి, రాత్రి పదకొండు గంటలకి వచ్చి నిద్ర లేపి, తాళాలు పట్టుకెళ్ళేవాడు, మళ్ళీ నిద్ర పట్టేదికాదు, తరవాత. ఒకరోజు రెండు రోజులా, నెల పడ్డాం అవస్థ, ఇలా. మరొకరున్నారు, పాలవాడొస్తాడు, పాలు పేకట్లు వేయించుకోండి, అని చెప్పి వెళ్ళిపోయారు. పాలవాడు,మూడు పేకట్లు వేసిపోయాడు. వీళ్ళొచ్చారు. వాళ్ళపేకట్లు వాళ్ళకి ఇచ్చాము. “అబ్బే మాకు రెండేనండి, మూడు కాదు, అది మీకేమో” అని వదిలేసిపోయిందావిడ. మర్నాడు పాలవాడిని పట్టుకుని అడిగితే, “వాళ్ళకి మూడేనండి మరి ఆవిడ ఎందుకందో” అలాగని మాకు రాసి పోయాడు. పాలపేకట్ వాడుకున్నామనుకోండి, అది వేరేసంగతి,అక్కరలేని వాడకం కదా! మరొకరున్నారు, వాళ్ళ పిల్లాడిని, ఇక్కడ వదిలేసి, షాపింగుకి వెళ్ళివస్తాము, కొద్దిగా చూడండి”, ఏం చూడం, వాళ్ళు లా వెళ్ళినది మొదలు వీడు, నాకది కావాలి, ఇది కావాలని మారాం చేస్తే వాణ్ణి సముదాయించేటప్పటికి, బ్రహ్మ ప్రళయమైపోయింది.

“మా ఫోన్ పోయిందండి! మీది బాగుందా”, వచ్చేరొకరు, మా వీధిలోవారే. “చూడలేదు, పొద్దుటినుంచి మాటాడలేదు “అంటే, వచ్చి చూసి బాగుందండీ, మాదిపోయిందని, ఒక అరగంట, కూతురుతో, కొడుకుతో యెస్.టి.డి. మాటాడుకుని, “ఏమిటోనండి, నాకు సెల్లులో వినపడి చావదు, లేండుఫోన్ పోయింది. వస్తానండి” అని వెళ్ళిపోయాడు. మరొకరు, “అరటాకులు కోసం ఊరంతా తిరిగేమండి, దొరకలేదు, నాలుగాకులు కావాలి”. సరేఉన్నవి కోసిద్దామంటే, “అగ్రమున్న ఆకులు కావలండి”, గాలికి ఆకులు చిరిగిపోయాయి, ఉన్నవి కొసిచ్చా, “బాగోలేవు”అని గునుపు.. మామిడాకుల సంగతి చెప్పక్కరలేదు. ఎవరింటిలో శుభకార్యం అయినా, మామిడాకులికి ఇక్కడికే వస్తారు. మరెవరూ, చెట్టు ఉన్నా ఇవ్వరు మరి. ఇక్కడనుంచి పట్టుకెళుతూ, ఇది బాగోలేదు, అది బాగోలేదంటేనే చికాకు వచ్చేది. మొన్ననొకాయన “మా ఇంటికి మెట్లు కట్టించేము, బండి మీదొడ్లో పెట్టుకుంటా, రాత్రికి” అన్నారు, సరే దానికేమి, పెట్టుకోమన్నాము. మరునాడు ఉదయం ఆయన “బండిలో పెట్రోల్ కారిపోయిందండీ” అన్నాడు, అక్కడికి మేము ఆయన బండిలో పెట్రోల్ తీసుకున్నట్లు, బంకుదాకా వెళ్ళాలని నా బండిలో పెట్రోల్ తీసుకుని వెళ్ళేడు. ఇదొక చేతి చమురు.

వీధిలో మరొకరు, కూతురుని పురుటికి తీసుకొచ్చారు.. ఆస్పత్రిలో పురుడుపోశారు. ఇంటికి తీసుకొచ్చారు.పిల్ల వాడికి, స్నానం చేయించిన తరవాత, సాంబ్రాణి పొగ వేయడం, పల్లెలలో అలవాటు. వారి ఇల్లంతా పాలరాయి పరచినది. ఇంట్లో కుంపటి లాటిది పెట్టే సావకాశంగాని, బొగ్గులు లాటివి ఉండే సావకాశంగాని లేదు. ఆవిడ ఉదయమే నిప్పులకి, కుంపటికి తయారయిపోయేది. అప్పుడు, వారికోసం కుంపటి అంటించి ఇవ్వాలి. బొగ్గులతో, కుంపటి ఇస్తే, కుంపటి అంటించుకోవడం కూడా చేతకాదట. పోనీ! ఒక రోజుదా! అలా మూడు నెలలు అవస్థ పడ్డాం. “వారి దగ్గర లేనిది, మనదగ్గరున్నది కనక ఇచ్చాము, తప్పులేదు, కాని ఇబ్బందిపేట్టేలా ఉండకూడదుకదా!”. నా ఇల్లాలు, ఇలా నా దగ్గర సణుగుతుంది. మళ్ళీ వాళ్ళొస్తే సరే అంటుంది, “వాళ్ళకి కుదిరితే మన దగ్గరకెందుకు వస్తారు, ఇరుగు పొరుగు అన్న తరవాత ఉపకారం లేకపోతే ఎలా” అంటుంది.. ఈ సంవత్సరం కూడా పనస చెట్టు కాసింది, మే నెలలో కాయ చెట్టునుంచి కోసి ఇస్తే, తను కోసి తొనలు కేరీ బేగుల్లో వేసిస్తే, నేను పట్టుకెళ్ళి అందరికి ఇచ్చిరావాలి,ప్రతి సంవత్సరం లాగా, మా పేటలో. ఇది నాడ్యూటీ. “కాయిచ్చేస్తే వాళ్ళే కోసుకుంటారు”అంటే “ఇంటికి ముగ్గురుంటే గొప్ప. ఇప్పటి వాళ్ళకి కాయ కోసుకోడం చేతకాదు. అరవై తొనలకాయ ఏం చేసుకుంటారు. నలుగురికి తొనలిస్తే తింటారు. మళ్ళీ ఇవ్వచ్చు.” అంటుంది. ఏం చేస్తాం, ఇరుగు పొరుగు అన్నారు కదా! తప్పదు!!, అనుభవించడమే!!!

ప్రకటనలు

30 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపకారం

 1. ఔరా,

  శర్మ గారి ఉపకారం శ్యామలీయం వారి చేత
  పంచ కళ్యాణీ రాగాలాపన చేయిన్చినట్టుంది ఇవ్వాళ
  నమో నమః శ్యామలీయం వారు !!

  అందుకొనుడీ జిలేబీ చిరు కానుక !

  మీ కందముల అందముల మెచ్చి
  ఈ పద బంధముల మీకై కూర్చితి
  ఇదియే జిలేబీ మీ కిచ్చు బిరుదు
  ‘వచో విభూషణా శ్యామలీయా’ !

  చీర్స్
  జిలేబి.

  • @
   జిలేబి గారు,
   శ్యామలరావుగారి కలం కదను తొక్కింది.ధన్యవాదాలు.

   మిత్రులు శ్యామలరావుగారు,
   “వచో విభూషణా” బిరుదిచ్చారు జిలేబిగారు, అందుకోండి.
   ధన్యవాదాలు.

   బుధజన విధేయుడు
   శర్మ

 2. అవునండోయ్ మామిడి ముచ్చట్లో –

  కం. ఆ యింటి మామిడాకులు
  వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
  కాయలు పచ్చళ్ళకు దయ
  చేయించు పరోపకార జీవి జిలేబీ

  • @
   మిత్రులు తాడిగడప శ్యామలరావు గారికి,
   ధనుడను! ధన్యుడను!! ధన్యుడను!!!
   మీ అవ్యాజమైన ప్రేమ వర్షంలో తడిసి ముద్దయిపోయాను.నమోవాకాలు.
   శర్మ

 3. @
  మిత్రులు కల్యాణ్ గారు,
  నా ఒక మాట మీలో కదలికకూర్చి మీతో కధ వ్రాయిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది.
  ధన్యవాదాలు.

 4. అవునండీ అంతామూసేసుకుని ఇరుకు ఇరుకు గా బ్రతుకుతున్నారు.

  కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
  పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
  బళ్ళిరుకు మనసులిరుకులు
  కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ

 5. నిజం చెప్పారండి . అందరికీ(ఉపకారం చేసేవారు ) ఎదో ఒక సందర్భంలో ఇలాంటి భావన ఎదో ఒకటి కలిగే ఉంటుంది . మా స్వస్థలం రాజమండ్రీ పక్కన కొవ్వూరు , మా ఇంట్లో ఇలా మా నాన్నగారు అనుకోవడం వినేవాడిని . ఇప్పుడు మరో రకం జాడ్యం వచ్చిందండోయ్ , ఉపకారానికి కాకపోయినా , పొరపాటున కూడా ఎవ్వరూ పలకరించటం లేదు . ఇది వరకు ‘ ఏమండీ బాగున్నారా ?’ అంటూ కనీసం గోడ మీదనుండి అయినా అడిగేవారు , ఇప్పుడు ఆ ఆస్కారం కూడా లేకుండా గోడలని కూడా పెద్దవి చేసేసుకుని ఇళ్ళనీ , మనసులనీ మూసేసుకుంటున్నారు

   • మీ కబుర్లలో ఈ కబురు నాకు బాగా నచ్చి , దీని స్ఫూర్తితో ఒక కధ నా బ్లాగులో రాసుకున్నానండి , దానికి ముందు మాటగా మీకు ధన్యవాదలు చెప్పుకున్నాను.

    ధన్యవాదాలు
    కళ్యాణ్

 6. సరేనండి మరోరెండు –

  కం. మొగమోటమి గలవారిని
  పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
  మొగ మైన జూప రావల
  తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేమి

  కం. ఊరికి బాసట యగుచో
  నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
  వారల యందే యొక్కరు
  రారుసుమా మనకు నక్కరైన జిలేబీ

 7. కం. ఉపకారవ్యసనులతో
  నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
  ఉపకారమడుగ బోయిన
  నపవాదులు వేయు వార లవని జిలేబీ

  కం. అపకారుల కుపకారము
  విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
  యుపకార బుధ్ధి విడచుట
  నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ

 8. మా చిన్నప్పుడు (రెండవ తరగతిలో ననుకుంటాను ఒక రైమ్ ఉండేది)

  కారాల్లో కెల్లా
  రెండే కారాలు
  ఉప్పూ కార మొకటి
  ఉపకార మొకటి

  శర్మగారూ మీ పోష్టులో కావలసినంత ఉప్పూ కారాలున్నాయి ఇప్పటికే.
  జిలేబిగారుకూడా చమక్కులు అంటించారు.

  కాని యేంచేస్తాం కొంచెం పనిలో బిజీగా ఉన్నాను.
  ఆన్నం సమయం కావస్తోంది.
  కొంచెం విరామం దొరకగానే కందాలతో ముందుకు వస్తాను.

  • @

   మిత్రులు తాడిగడప శ్యామలరావుగారు,
   మహద్భాగ్యం! అనుగ్రహించిన దానితో సంత్రుప్తి చెండాలి కదా!!
   ధన్యవాదాలు.

 9. వచ్చామండీ శ్యామలీయం మాష్టారు,

  అరవం లో ఒక పాట ఉంది, నీ మున్నాలే పోనా నా పినాలే వారే అని. కొంత ముందూ వెనుకల కామెంట్లు కొట్టి నట్టు ఉన్నాం, ఇక మీదే స్కందములే ఉపకారములు శర్మ గారికి !!

  నెనర్లు జిలిబిలి కంద హృద్య మునకు.

  చీర్స్
  జిలేబి.

 10. ఏమండోయ్ ‘చిర’ ఊరి బాసట శర్మగారు,

  మా కామెంటు ఇక్కడ కొట్టి వెడుతున్నాం , కాసేపు చూస్తూ ఉండండి మరేం మళ్ళీ రేపు వస్తాం !!

  చీర్స్
  జిలేబి.

 11. ఇంకా జిలేబీగారు రాలేదు. కందాలెట్లా?

  కం. రమ్మా చక్కని కామెం
  ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
  నమ్మా జిలిబిలి పలికుల
  కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ

 12. బాబాయిగారూ ఒక్కసారిగా మా హైదరాబాద్ తీసుకేల్లిపోయారుగా…ఆ రోజులు గుర్తుకొచ్చాయి.. దోశ పెనం, పిల్లాడ్ని స్కూల్ లో దింపడం, ఎండాకాలం ఉదయాన్నే, ఆరుగంటలకే మా కిటికీ పక్కన బట్టలారవేయడం…ఇలాంటివే ఈతిబాధలు..ఏమీ మారలేదన్నమాట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s