శర్మ కాలక్షేపంకబుర్లు-దిష్టి

దిష్టి.

దృష్టి ప్రకృతి దిష్టి వికృతి అనుకుంటున్నా!. కాదంటే సరి చేసుకుంటా!!

రామాయణం, భారతాల్లో దిష్టి గురించిన విషయాలు లేవనుకుంటా కాని, భాగవతంలో మాత్రం మంచి సంఘటనే వుంది, చూద్దాం.

నల్లనయ్యను మట్టు పెట్టడానికి, కంసుని పనుపున బయలుదేరినది, పూతన. చక్కటి వేషం వేసింది. నిద్రపోతున్నట్లు నటిస్తున్న నల్లనయ్యకు చన్ను కుడిపింది. నల్లనయ్య ఏమీ తెలియనివానిలా చన్నుకుడుస్తున్నట్లుగా, పూతన ప్రాణాలను రెండు గుక్కల్లో తాగేశారట, పోతన గారు చాలా హృద్యంగా చెప్పేరా ఘట్టాన్ని. పూతన చచ్చి పడిన తరవాత నల్లనయ్య పూతన శరీరం మీద ఆడుకుంటూ వుంటే యశోదాదేవి, కంగారుపడి, నల్లనయ్యనెత్తుకుని, దిష్టి తీసిందిట. ఎలా!

నేలం గూలిన మేటి పెన్నురముపై నిర్భీతి గ్రీడీంప నో
బాలా! రమ్మని మూపు జేర్చుకొని సమ్సర్పించి యూరార్చుచున్
గోలాంగూలము ద్రిప్పి గోవురజమున్ గోమూత్రమున్ జల్లి త
ద్బాలాంగంబుల గోమయంబలది రా పండ్రెండు నామంబులన్.

పూతన శరీరం మీద ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని ఎత్తుకుని, ఓదార్చుతూ, అనగా మనం ఇప్పుడు చెబుతున్నట్లు, “నాన్నా పప్పోయావా! దెబ్బ తగిలిందా!, పోతుందేం, బాగుంది కదా. భయం లేదేం., అమ్మ దగ్గరుందిగా భయం ఎందుకు నాన్నా,” అని ఓదారుస్తున్నాం కదా అలాగన్న మాట. గోవు తోక తలచుట్టూ తిప్పి, గోధూళి మీద చల్లి, గోమూత్రం జల్లి, గోమయం శరీరం మీద రాసి పన్నెండు పేర్లతో దిష్టి తీసిందిట యశోద. రక్షావచనం చెప్పేరు,పోతన గారు. టపా పెద్దదయిపోతుందని ఇక్కడ పెట్టలేదు.

రక్షా వచనం చెప్పినది మనలని ఆచరించమని తప్పించి, పరమాత్మకి రక్ష పెట్టగలవారెవరు? దిష్టి తీయడం, రక్షపెట్టడం అన్ని సంస్కృతులలోనూ ఉంది. దీన్ని హేతువాదులు మూఢ నమ్మకం అంటారు. నేడు రక్షలు, తాయత్తులపైన, దిష్టి తగలకుండ కట్టే వాటిపైన కోట్ల రూపాయల వర్తకం జరుగుతోంది. చిత్రం కదా!. అందమైన వారికి, అందంగా ఉన్న వాటికి దిష్టి తగులుతుందంటారు. మరి నాకెందుకు దిష్టి తగిలిందో తెలియలేదు, ఇప్పుడు.  చిన్నపుడు అమ్మ ఉప్పు దిష్టి తీసి పొయ్యిలో పడేసేది.  చిటపటలాడేది కాదు. దిష్టి తగిలి పోయిందనేవారు. మరొకటి గుడ్డ తడిపి నీరు కారుతుండగా మూడు సార్లు సవ్య అపసవ్యంగా బిడ్డ తల చుట్టూ తిప్పి దానిని బయట నీరు చుక్కలుగా కారిపోయేలా వేసి వుంచేవారు. యెర్ర నీళ్ళు, పసుపు నీళ్ళు ( యెర్ర నీళ్ళు= పారాణి నీళ్ళు. పారాణి= సున్నము+ పసుపు) ( పసుపునీళ్ళు= పసుపు వేసిన నీళ్ళు)అని తయారు చేసి, వీటిలో ఎండు మిరపకాయలేసి, వీటిని దిష్టి తీసి నాలుగు రోడ్ల మధ్య పోసేవారు. వీటి తో పాటుగా ఎండు మిరపకాయలు దిష్టి తీసి పొయ్యిలో పడేసేవారు. చిత్రం ఘాటు గొట్రు వచ్చేవి కాదు. కొన్ని చోట్ల పేడ దిష్టి తీయడం ఉంది.  చిన్న పిల్లలకి నల్ల గాజులు, దిష్టి చుక్క తప్పక పెట్టేవారు. పెళ్ళి కూతురిని, పెళ్ళికొడుకుని చేసిన తరవాత దిష్టి తీసే ఆచారం ఉంది. తోడపెళ్ళి కొడుకు, తోడపెళ్ళి కూతురుని చేయడం ఇందులో భాగం అనుకుంటా. ఇప్పటికి పల్లెలలో ఈ ఆచారం నడుస్తూనే ఉంది. మా తెలుగు మాస్టారికి కోపం వస్తే, “దిష్టి పిడత మొహం వెధవా” అని దీవించేవారు, అందరినీ.  బాగా కోపంవస్తే, “పిడత ముఖం వెధవా” అని షార్ట్ కట్ లో దీవించేవారు.  ఇప్పటికి పల్లెలలో దిష్టి పిడతని తయారు చేసి పాదుల పందిళ్ళకి పెట్టడం అచారం. దిష్టి పిడత అనగా కుండ పిడతకి చుట్టూ తెల్లగా బొట్లు పెట్టి దానిని బోర్లించడం. కుండమీద వికృతమైన బొమ్మ వేయడం కూడా ఉంది. కొత్తగా కట్టిన భవనాలకి, పాత భవనాలకి కూడా దిష్టి తగలకుండా దెయ్యపు బొమ్మలాటిది పెడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి దీనిలో కొన్ని తేడాలు కూడా ఉండవచ్చు. దిష్టిమంత్రం కూడా ఉంది.

పల్లెటూళ్ళలో ఇప్పటికి పశువులకు కూడా దిష్టి తాళ్ళు, అని వెంట్రుకలతో తయారయిన తాడు వేస్తారు. నేటికి లారీలకి, బస్సులకి, మోటార్ బైకులకి కూడా రక్షలు కడతారు. దిష్టి బొమ్మలు తగలెయ్యడం నేటి నాగరికతయిపోయింది. దిష్టి బొమ్మలు చేలలో పెడతారు. గడ్డితో బొమ్మలా తయారు చేసి చొక్కా లాగు తొడిగి కర్రకి కట్టి పెట్టడం అచారం. ఇప్పుడు ఇష్టం లేని వారిని, నిరసన తెలపడానికి దిష్టి బొమ్మలని తగలేస్తున్నారు. దిష్టి బొమ్మలు తయారు చేయడం కూడా నేడు కుటీర పరిశ్రమగా వర్ధిల్లే సావకాశాలు బాగా కనపడుతున్నాయి.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దిష్టి

  • @పగడాల సతీష్ కుమార్ గారు,
   ఎండలు మండిపోతున్నాయ్!
   అనారోగ్యం చేసింది.
   ఆలస్యంగా సమాధానం ఇచ్చినందుకు మన్నించాలి.
   మీరన్నమాట “సందె” అనుకుంటున్నాను. ఇది స్థానికంగా, ప్రాంతీయంగా వాడతారేమో తెలియదు. మీరుండే చోటు తెలియదు కనుక, ఇది దిష్టి అనుకుంటున్నా కనక, తడిగుడ్డ దిష్టి తీయండి. నీళ్ళు ఓడిపోయేలా ఎక్కడో ఒక చోట పెట్టండి. శారీరికమైన బాధలేమున్నాయో చూడండి.
   స్పందించినందుకు
   ధన్యవాదాలు.

 1. మా అమ్మమ్మ చెప్పింది, వాళ్ళ పొలంలో దిష్టిబొమ్మకు తొడిగిన చొక్కా ఎత్తుకెళ్ళారుట. మా అత్తగారు భలే రకరకాలుగా దిష్టి తీస్తారు. చాలానే నేర్చుకున్నాను. మా పిల్లగాడికి దిష్టి తీస్తునే ఉంటాను:) అందరి దిష్టి పోయేట్లు భలే టపా రాసారండి మొత్తానికి.

  • @
   మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   పోయిందే, చోళేగాచి,….its gone….
   మీరు చెప్పిన తరవాత దిష్టి పోయిందండి.
   ధన్యవాదాలు.

 2. @
  జిలేబిగారు,
  నిజమండి! దిష్టి తీశా!! ఎవర్ గ్రీన్ అంటున్నారు, మొన్న హిందూ పేపర్ తో పోల్చారు.
  ధన్యవాదాలు

 3. వెంటనే దీక్షితుల గారి ఈ టపాకి ఓ మారు దిష్టి తీయ్యండి !

  బ్లాగాంగూలము త్రిప్పి ప్రత్యుత్తరమున్ కామెంటున్ ఇచ్చి …

  చీర్స్
  జిలేబి.

   • శర్మ గారు,

    కొన్ని టపాల లో నా ప్రొఫైల్ దిష్టి బొమ్మ తో కామెంటులు పెట్టలేదండీ, ఉండండి పెట్టి వస్తాను !
    (మీ బ్లాగు కి దిష్టి ఉందంటారా ! నెవెర్ ఇట్స్ ఆల్వేస్ ఎవేర్ గ్రీన్!)

    చీర్స్
    జిలేబి.

 4. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి దిష్టి తియ్యడం, పిల్లలకి దిష్టి తియ్యడం చెప్పి చిన్న నాటి జ్ఞాపకాలు కదిలించారు. రెండూ మా అమ్మమ్మతో ముడి పడి ఉన్నవే. చిన్ని కృష్ణుడి కథలెన్ని చెప్పినా చివరకు యశోదమ్మ శ్రీకృష్ణుడికి దిష్టి తియ్యడంతో ముగిసేవి. వంట్లో బాలేనప్పుడల్లా రక రకాల దిష్టి తీసేది నాకు మా అమ్మమ్మ. నమ్మకాలు, మూఢ నమ్మకాలేమో కానీ అనుబంధం పెంచే అలవాట్లుగా గుర్తుండిపోయాయి నాకు. ఇప్పటి విజ్ఞత(?) తో మొహమాటపడ్డా, పెద్ద వాళ్ళెవరైనా చెప్తే అప్పుడప్పుడూ దిష్టి తీస్తుంటాను పిల్లలకి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s