శర్మ కాలక్షేపంకబుర్లు-వారే వీరు

వారే వీరు

నాలుగు రోజుల ముందు, ఉదయమే దొడ్డిలో ఉండగా ఒక మిత్రుడు వచ్చేరు. ఎలా ఉన్నారని పలకరిస్తూ, “రోజుకో కొత్తకారు కనపడుతోంది మీ గుమ్మంలో అన్నారు” నవ్వుతూ. “అవునండి, గుమ్మానికి అడ్డంగా బండి కూడా బయటికి తీయడానికి వీలు లేకుండా ఎవరో ఒకరు ఇలా పెట్టేసి పక్క అపార్టుమెంటులోకి వెళ్ళిపోతున్నారు. ఇవి బయట వాళ్ళవో, ఇక్కడి వాళ్ళవో తెలియటం లేదు. ఒక్కోకారు ఉదయం నుంచి మరునాటి దాకా గుమ్మం ముందే ఉండిపోతోంది” అన్నా. “చెప్పండి వాళ్ళకి” అన్నారు. “చెబుదామనే ఉంది, కాని వారు కనపడితేకదా” అన్నా. మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ఉదయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దొడ్డిలో ఉన్న మామిడి మొక్కకి పూత సరిగా రాలేదు, ఒక పక్క కొద్దిగా వచ్చి ఆగిపోయింది. ఈ సంవత్సరం పూత వస్తుందా ఇంక, రాదా అని చర్చించుకుంటూ, మొక్కకి ఎరువు వేసే ప్రయత్నం లో పడ్డారు అత్తా, కోడలూ. చెట్టు చుట్టూ తవ్వుతున్నారు. నేను ఊరుకోక తవ్వుతానన్నా. “మహానుభావా! జ్వరంగా ఉంది, చేతులు పుళ్ళుపడ్డాయి, మమ్మల్ని చంపక అక్కడకూచుని కబుర్లు చెప్పండి, చాలు”, అంది. కరంటు ఉంది, కంప్యూటర్ ఖాళీ గా ఉంది. జ్వరం ఉన్నా కంప్యూటర్ దగ్గర కూచో వచ్చు, కాని “నాతిగల బ్రహ్మచర్యం అయిపోయింది”, మరి, చేతులు కాలడం మూలంగా. చెయ్యగల పని లేనపుడు హరినామ స్మరణ చేయమన్నారు కదా అని గజేంద్ర మోక్షణ కధ చెప్పడం మొదలుపెట్టేను. కరి రాజు తన కరిణీ సంఘంతో బయలుదేరిన విధం, మడుగుచొచ్చిన గతి, మకరిచేపట్టుబడిన విధానం, మకరితో పోరు, తదుపరి ఉన్నాడా లేడా, ఉంటే నన్ను ఎందుకు రక్షించడని అనుకుని ఇక నా ప్రయత్నం అయిపోయింది లా వొక్కింతయులేదు చెప్పి, కలడు కలండనెడు వాడు కలడొ లేడో ! అనే సందేహం ఉన్నపుడు హరి కనపడడు. సందేహం నివృత్తి అయి ఉన్నాడని పూర్తిగా, పూనికగా నమ్మినపుడే కనపడతాడని చెప్పి, ..హరి వచ్చిన విధము, కూడా వచ్చిన వారి వివరం చెప్పి, కరిని కాచిన సంగతి చెప్పి పూర్తి చేశా. “అత్తయ్యా మామయ్యగారి చెయ్యి కాలితే కాలిందికాని మంచి భాగవత ఘట్టం, మనం మళ్ళీ రసవత్తరంగా వినే భాగ్యం కలిగింది. మామయ్యగారు చేసే ప్రతి పనిలో నాకు ఏదో పరమార్ధం కనపడుతుందండి” అంది. “మామయ్యగారూ! ఈ కధ ఇప్పుడు చెప్పేరు కదా, ప్రత్యేకత ఏమైనా ఉందా” అని అడిగింది. “అమ్మాయ్! భాగవతం లోని కొన్ని కొన్ని ఘట్టాలు కొన్ని కొన్ని పరిస్థితులలో పారాయణ చేయమన్నారు. ఈఘట్టం ఎందుకు చెప్పేనంటే అనారోగ్యంగా ఉన్నపుడు, కష్టం లో ఉన్నపుడు, గజేంద్ర మోక్షణ ఘట్టం పారాయణ చేయాలి, కష్టం పూర్తిగా తొలగిపోతుందనను, కాలు పోయేది వేలుతో, పీకలోతు కష్టం మోకాలు లోతులో గడచిపోతుంది.” అన్నా. “ఇంకా ఎప్పుడెపుడు ఏమేమి చదువుకోవాలి” అని అడిగింది. “తల్లీ! అన్నీ ఒక్క సారి చెప్పలేను. సమయానికి గుర్తు రావాలికాని. డభ్భై సంవత్సరాల జీవితం లో కిందా మీదా పడి”…. అంటూ ఉండగా ధబ్బు మన్న శబ్దం వినిపించింది.

నా ఇల్లాలు చేతిలో పని వదిలేసి పి.టి.ఉష లా పరిగెట్టింది, బయటికి. నాకేమీ అర్ధంకాలా. నా జీవితంలో ఆవిడ అంత వేగంగా పరిగెట్టడం చూడటం అదే మొదటి సారి. “తన వెంటన్ సిరి, లచ్చి వెంట అవరోధ వ్రాతమున్…….. అన్నట్లు ఆమె వెనక కోడలు, ఆ వెనక నేను పరిగెట్టేము, పక్క అపార్టుమెంటు కేసి. పక్క అపార్టుమెంటు ముందు ఒక తల్లీ ఆడపిల్లా స్కూటీ కింద ఉన్నారు. నా ఇల్లాలు గబగబా స్కూటీని ఎత్తి నిలబెట్టింది. నేను పట్టుకుని పక్కకి పెట్టా. నా ఇల్లాలు పెద్దామెను లేవదీసి కాళ్ళు,చేతులు చూసింది. కాలికి మోచేతికి దెబ్బలు తగిలాయి. నా కోడలు ఇంట్లోకి పరిగెట్టి ఫస్టు ఎయిడ్ కోసం డెట్టాల్, పైన రాయడానికి ఆయింటుమెంటు తెచ్చింది. ఏమయినా మాస్టారమ్మాయి కదా! తెలివైనది. గబగబా ఫస్టు ఎయిడ్ చేసేసింది. పడిపోయిన ఇద్దరూ సిగ్గు పడుతూ లోపలికి వెళ్ళిపోయారు. “ఏమిటి విషయం” అన్నా. “వాళ్ళు డాక్ట దగ్గరికి బయలు దేరేరట. ఉదయం నుంచి మూడు శకునాలు బాగోలేవని మానేశారుట, పిల్ల చెప్పింది…. నాలుగోసారి ఇలా జరిగింది” అని చెప్పింది. “సరేలే! పాపం దెబ్బతగిలింది, అసలే అనారోగ్యం మీద” అన్నా. ఏదో దాస్తున్నట్లుగా నా ఇల్లాలి ముఖం ఉంది. “ఏమిటి సంగతన్నా”! “ఏమీలేదు” అని చాచేసింది. “కాదు, నాకు చెప్పకు, నీ ముఖంలో భావం నేను చెప్పలేనా” అన్నా. అప్పుడు అడిగింది. ” పడిపోయినామెను గుర్తు పట్టారా” అంది. “లేదు”అన్నా. “ఆ రోజు పరిచయం కోసం మనం వెళితే ఆయనలేరు మళ్ళీరండని తలుపులేసుకుని వెళ్ళిపోయినావిడ, ఈవిడే” అంది. నేను ఆశ్చర్యపోయా. “అందుకా! ఆవిడ మాటకూడా మాటాడక సిగ్గుపడి వెళ్ళిపోయింది”అన్నా. “మరో సంగతి, మన ఇంటి ముందు కారు వారిదేట, ఇది నిన్ననే తెలిసింది.!!! పార్కింగ్ ప్లేస్ లేదట వారికి, లోపల. మన గుమ్మమే పాకింగ్ ప్లేస్. తెలిసిందా” అంది. ఈశ్వరా! నీ లీల తెలియదయ్యా!

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వారే వీరు

  • @మాలా.పి.కుమార్ గారు,
   పడిపోయిందెవరో వెళ్ళిచూసేదాకా తెలీదు. ఎవరైనా ఉపకారం చేయాలి కదా, అటువంటి సమయంలో , ఇది మంచితనం అని అనుకోలేదు, విధి అనుకున్నాం.
   మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 1. శర్మగారూ,
  కథ చెప్పటంలో లేదు ప్రత్యేకత. అన్వయంచేసి చెప్పటంలోనే ఉంటుంది అంతా. యథాతథంగా చెబితే వినీవినట్లు వినినా నిలుచునా మనసులో! నిలిచేటట్లు చెప్పటం అంటే దానిలో చెప్పేవారి భక్తీ, సమయస్ఫూర్తీ, అనుభవసారం అన్నీ రంగరించి చెప్పటమే.

   • కథను పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే మనసులకు పట్టటం తక్కువగానూ, మీబోటి పెద్దలు విడమరచి స్వానుభవాదులు జోడించి వివరంగా చెబితే మనసులకు పట్టటం యెక్కువగానూ ఉంటుందని నా భావం అండీ.

  • @జిలేబిగారు,
   చేతులు కాలి ఖాళీగా కూచున్నాకదా! చేసే పనిలేక కలడు! కలండనెడువాడు కలదో లేడో అన్న దానికి సంశయ నివృత్తి చేసుకున్నా!!!
   ధన్యవాదాలు

 2. ఆహా… ఓహొ…..
  మనిషికి మనిషి సాయం అని ఇప్పుడు తెలుస్తుంది లెండి…..
  పడ్డవారు ఒకప్పుడు చెడ్డవారైనా ఇక ముందు కాబోరు….

  మరీ మీ ఇంటివారికే చెప్పకపొతే మాకు కూడా అలాంటి ఘట్టాల గురించి చెప్పొచ్చు కదా మీకు పుణ్యం వస్తుంది…. మాకు కూసింత జ్ఞానమూనూ…

  • @మాధవి.కావూరి గారు,
   పడ్డవారెపుడూ చెడ్డవారు కాదండీ!
   భాగవత కధలు వాటిని యధాతధంగా చెబితే వినేవరుండరేమోనని ఇలా మద్య, మధ్య చెబుతుంటా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s