శర్మ కాలక్షేపంకబుర్లు-మాట

మాట

జీవులన్నిటిలోను, దేవుడు ఒక మానవులకే ప్రసాదించిన వరం మాట. ఇది తమ భావాన్ని వ్యక్త పరచేందుకు సాధనం.
మాటకు ప్రాణము సత్యము అన్నాడు శతక కారుడు. …సూనృతవాక్యము మేలు చూడగన్ ఆని చెప్పింది శకుంతల దుష్యంతుని రాజ సభలో……అబ్బే! ఎవరెన్ని చెప్పినా నేటి కాలానికి కలికానికి కూడా కనపడనిది అదొక్కటే. “అందరూ శ్రీ వైష్ణవులే బుట్టెడు రొయ్యలేమైనాయని” సామెత. ముఖం మీద బేలతనం, మనసులో జాణతనం, మాటలో లేకితనం కనపడుతున్నాయి. ఈ సంవత్సరం సంకురుమయ్య అధికారులమీద, అదీ ఐ.ఎ.యెస్ అధికారులమీద నడుస్తున్నాడు. అయ్యా! యెస్ లకి భయంకాని ఐ.ఎ.యెస్ లకెందుకూ భయం? ఎక్కడి నుంచో ఎక్కడికో పోతున్నాను కదా.

మాట ప్రాణం పోస్తుంది. ఎలా అంటే రామాయణం లో భయంతో పరిగెడుతున్న సుగ్రీవుని నిలువరించింది మాట. హనుమ ” రాజా ఎందుకు భయంతో పరిగెడతావు, వచ్చేవాళ్ళు మనకోసం వస్తున్నట్లులేదు” అని నిలువరించాడు. ఐతే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాటాడు, మాటాడెటపుడు నీ ముఖం నాకు కనపడాలని చెప్పి పంపేడు సుగ్రీవుడు. రామునితో మాటాడేటప్పుడు ముఖం సుగ్రీవుని వైపు ఉంచి మాటాడతాడు, హనుమ, భిక్షుని రూపంలో. హనుమను గొప్ప వాడిగా మొదటిసారి మాటాడినపుడే గుర్తించాడు, రాముడు. లక్ష్మణునితో, “తమ్ముడూ! ఇతను మాటాడే టపుడు, ఒక వ్యర్ధపదం వాడలేదు, ముఖంలో భావం కనపడలేదు, కనులు, కనుబొమలు, కదపలేదు,చెప్పవలసినది ఎక్కడ ఎంత చెప్పాలో, ఏ పదం మీద ఎంత వత్తి పలకాలో అంతే పలికేడు సుమా, వ్యాకరణ పండితుడు కానివాడిలా మాటాడలేడు” అంటాడు రాముడు. హనుమ చెప్పిన ప్రకారంగా రామునితో స్నేహం చేసుకున్నాడు,సుగ్రీవుడు..తరువాత హనుమ మాటాడిన సందర్భం లంకలో సీతమ్మతో. సీతమ్మకి హనుమ తెలియదు. హనుమకూ సీతమ్మ తెలియదు. కాని గుర్తు పట్టేడు. కాని తనను ఆమె గుర్తుపట్టడం ఎలా? ఆమె ఉరిపోసుకోబోతూ ఉంది. ఈ సమయం లో మాటాడాలి. పొరపాటు మాటాడితే ప్రాణం పోతుంది. ఏ భాషలో పలకాలి అన్నది కూడా తర్కించిన మహానుభావుడు. దీనికి ఆయన చేసిన పని, సీతమ్మ కి ఇష్టమైన రామ కధ గానం చేయడం , మొదలుపెట్టేడు. సీతమ్మ తన ప్రయత్నం వాయిదా వేసి, చూసింది. అంటే ఆమెను ఆత్మ హత్యనుంచి రక్షించేడు, మాట ద్వారా. సీతమ్మని చూసి వచ్చేటపుడు దూరం నుంచి సింహనాదం చేసి సందేశం వినిపించిన ప్రజ్ఞాశాలి. కిందికి దిగుతూనే దృష్ట్వా సీతా, అని క్రియాపపదంతో మాట మొదలుపెట్టిన హనుమ గొప్పవాడు. ఇప్పటికి రామాయణం తో సరిపెడదాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, మరి. భారతం అంతా మాటే. మాట ప్రాణం తీస్తుంది, అది మనం చెప్పుకోటంలేదు.

మాటలో, అన్యాపదేశం ఒక ప్రక్రియ. ఇందులో కవులు చాలానే చెప్పేరట. సాధారణంగా ఇది తిట్లకి ప్రసిద్ధి. అన్యాపదేశం అంటే, చెప్పేదానిని తిన్నగా చెప్పక,మరొక దానిని చెప్పి విషయాన్ని సూచించడం. పిల్లి మీద, యెలక మీద పెట్టి చెప్పడమంటాం,మన వాడుక భాషలో. ఇది పూర్వకాలంలో వుమ్మడి కుటుంబాలున్నపుడు, అత్త కోడలు మధ్య, తోడికోడళ్ళ మధ్య నడిచేది, యెక్కువగా. అత్తా కోడళ్ళకి ఇది గొప్ప వరం. తిన్నగా కోడలు అత్తని తిట్టలేదు కదా, అలా వొకవేళ తిడితే, అందరూ కోడలినే మళ్ళీ తిడతారు. అందుకు కోడలికి యిది ఆయుధమన్న మాట. సాధారణంగా తెనుగు కుటుంబాలలో, కోడలి పరంగా, మొదటి ఆడపిల్లకి అత్తగారిపేరు, కొడుకుకి మామగారిపెరు పెట్టడం ఆనవాయితీ. దీనిని అవకాశంగా తీసుకుని కొడుకుని, కూతురుని కోడలు తిట్టితే, అది అత్తగారికి మామగారికి తగలాలన్నామాట. “ఒసేయ్! సత్తి ముండా! చెప్పిన మాట వినకుండా ఎక్కడికే,ఎగరేసుకు పోతున్నావ్, నీకాళ్ళు విరిచి కూచో బెడితేకాని బుద్ధి రాదు, దొగముఖం దానా……..” ఇది కోడలి తిట్టు కూతురిని. దీనిమీద అత్తగారు “ఏంటే! ఎవరినీ తిడుతున్నావ్, నన్నేనా?” అత్తగారి ప్రశ్న. “అయ్యో రామా! అత్తయ్యా మీకలా అనిపించిందా?. నేనేం చేతునూ…. కళ్ళుపోతాయి. సత్తి ముండ! చెప్పిన మాట వినటం లేదు” తెలివైన కోడలి జవాబు, అన్యాపదేశంగా మళ్ళీ తిడుతూ….. “అదేంటే, దానికి శుభ్రమైన, నా పేరు సత్యవతి అని పెట్టి సత్తి ముండా అని తిడతావా?”అత్త ప్రశ్న. “అయ్యోరామా! అత్తయ్యా!! సత్తి ముండ అల్లరి భరించలేకా”………..గడుసు కోడలి జవాబు. ఇలా రసవత్తరంగా సాగిపోతూ వుంటుంది, వినాలిగాని. అత్త మీద కోపంతో, కూతురు ముడ్డి కుంపటిలో పెట్టిందని సామెత. మరొకటి కూడా వుంది, అత్త మీద కోపం దుత్త మీద చూపిందని. అనగా అత్త గారి మీద కోపం చేతిలోని కుండపై చూపిందని. ఇది స్త్రీల ఆయుధమనే చెప్పాలి. భర్త దగ్గర, అత్తగారి గురించి చెప్పడం కష్టం కదా! అన్యాపదేశంగా చెబితే, అర్ధం చేసుకోలేకపోతాడా, ఏనాటికైనా అని ఆశ. ఈ విషయం లో అత్తకూడా ఏమీ తక్కువ తిన్నదైవుండదు. ఆమె కోడలు పుట్టింటివారి గురించి అన్యాపదేశంగా యెత్తి పొడుస్తుంది, సమయం రావాలి.. అంతతో ఆ ఇంట్లో శీతల యుద్ధం నడుస్తూ వుంటుంది. ఇందులో మగవాళ్ళు సమిధలైపోతారు, ఒక్కొకప్పుడు. మగవారిలో కూడా యీ లక్షణాలున్న వారు లేకపోలేదు. ఆఫీస్ లో బాస్ ని తిట్టలేడు కదా! అందుకు ప్రత్యామ్నాయ మార్గం, అన్యాపదేశం. ఎవరినో తిడుతూ బాస్ దగ్గరకెళ్తాడు. “ఎవరినయ్యా! తిడుతున్నావు” అంటే, “ఉన్నాడు లెండి, వెధవ, రెండురోజుల్నుంచి చూస్తున్నా,ప్రాణం తీసేస్తున్నాడు”, అని కహానీ చెబుతాడు. బాస్ కీ తెలుసు, తననేతిడుతున్నాడని, ఊరుకుంటాడు. సమయంవచ్చినపుడు వడ్డీతో తీర్చేస్తాడు. మరొకటి ఉంది అశక్తదుర్జనత్వమని, దాని గురించి మరోసారి.

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మాట

 1. అత్త కోడళ్ళపై జానపద గీతం దంపుళ్ళ పాట :
  అత్త లేని కోడలుత్తమురాలు ఓయమ్మా
  కోడల్లేని అత్త గుణవంతురాలు
  కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓయమ్మా
  పచ్చిపాలమీద మీగడేదమ్మా
  వేడిపాలమీద వెన్న ఏదమ్మా
  అత్తమ్మ ఊరకే ఆరళ్ళు గానీ ఓయమ్మా
  పచ్చిపాలమీద మీగడుంటుందా
  వేడిపాలమీద వెన్న ఉంటుందా
  ఉట్టీ మీదున్న సున్నుండలేమాయె కోడలా
  ఇంటికి పెద్దయిన గండుపిల్లుండగా
  ఇంకెవరు వస్తారె అత్తమ్మా

  అత్త కోడళ్ళపై తెలుగు సామెతలు :
  • అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
  • అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
  • అత్త ఒకింటి కోడలే

  • @రహంతుల్లాగారు
   స్వాగతం.
   చాలా కాలం కిందటి టపా చదివి వ్యాఖ్య పెట్టినందుకు సంతసం. మంచి మాటలు చెప్పేరు. వ్యాఖలకి సమయం పెంచేను. ఎప్పుడయినా వ్యాఖ్య పెట్టచ్చు.

   ధన్యవాదాలు.

 2. శ్యామలీయం గారు,

  జిలేబీ శతక మాథ మేటిక్ !(జమా వివరాలు !)

  జిలేబి శతకం టపాలు – ఒకటి రెండు, మూడు మొత్తం అరవై.

  ఆ పై ఇప్పుడు జిలేబీ శతకం నాలుగు (పెండింగు) లో వుంది. ఇప్పటిదాకా పద్దెనిమిది వున్నాయి వాటిలో.. మధ్య లో గోలీ వారు ఒక జిలేబీయాన్ని ఇచ్చారు! అదీ కలుపుకుంటే పంతొమ్మిది.

  ఇంకో రెండు జిలేబీయ కందాలు వదిలితే జిలేబీ నాలుగు టపాకీకరణం ! ఆ పై ఇరవై (వంద కి ) మరో ఎనిమిది నూట ఎనిమది కి !!

  జాబితా
  జిలేబి.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   జిలేబి గారు శతకం లెక్కలు చెప్పేశారు. మిగిలిన కందాలు వీలువెంబడి…దయ చేయగలరని..విన్నపం..
   ధన్యవాదాలు

   జిలేబిగారు,
   మిత్రులు శ్యామలరావు గారికి విన్నపమ్ ఇచ్చాను..
   ధన్యవాదాలు

   • శర్మగారూ, జిలేబీగారూ,
    జిలేబీ శతకం లెక్కలు బాగున్నాయండి. నేనయితే లెక్కలు వేయలేదు యెప్పుడూ. జిలేబీగారే అవి చూసుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు.
    “జిలేబీ శతకం నాలుగు (పెండింగు) లో వుంది. ఇప్పటిదాకా పద్దెనిమిది వున్నాయి వాటిలో” అన్నారు జిలేబీ గారు. మరయితే ఆ లెక్కన 318 అన్న మాట ప్రస్తుతసంఖ్య! నాకయితే నమ్మశాక్యంగా లేదుస్మండీ.
    మీ‌ముచ్చటె నా ముచ్చటయని మనవి చేసుకుంటున్నాను.

    కం. జిలేబిగారి మక్కువ
    నేలా కాదనుట శతక మెంతటి పొడవో
    మేలంత గాన తప్పక
    నా లావొప్పంగ జేతు నమ్ము జిలేబీ

    ఈ నాటినుండి పునఃప్రారంభం జిలేబీ‌పద్యాలు!

   • @మిత్రులు శ్యామలరావుగారు,
    దేవుడు వరమిచ్చాడు. ఆనందం. పరమానందం. జిలేబమ్మగారి దర్శనాలే కరువైపోతున్నాయి సుమా.
    ధన్యవాదాలు.

 3. కం. కామెంట్లైతే శతకం
  మీ మాటల గారడీలు మెప్పించెను నే
  నేమో శతకానికి ఇం
  కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?

  కం. ఈ రసన యెంత చెడ్డది
  నోరదుపున నున్నవాడు నూటికొకండుం
  ధారుణి నుండునొ యుండడొ
  తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ

  కం. మాటాడుట చక్కని కళ
  మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
  కోటికి నొకనికి గల్గెడు
  ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ.

  • @మిత్రులు తాడిగడప శ్యామలరావు గారు,
   మీరు కొద్ది దూరంలో 38 తక్కువలో వున్నారు, శతకానికి, తరవాతవారు మీరే! ముచ్చటగా దయ చేసినవి చెరగుపట్టి అందుకున్నాం, ఇంకా ఆశగా ఎదురు చూస్తూ…….
   ధన్యవాదాలు.

 4. శర్మ గారు,

  మాట బంగరు మూట! చాలా బాగా సెల విచ్చేరు!

  ఆ దృష్ట్వా సీతా, ,ఇయం సీతా, మమ సుతా వీటిమీద మీరు టపాలు రాయ వలసినది గా మనవి!

  జిలేబి.

  • @మేడం జిలేబిగారు,
   ఈ వ్యాఖ్యతో నా బ్లాగులో మీ కామెంట్ల శతానికి ధన్యవాదాలు.
   మీ ఆశీర్వచనంతో ప్రయత్నం చేస్తా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s