శర్మ కాలక్షేపంకబుర్లు- “దృష్ట్వా సీతా”

దృష్ట్వా సీతా.

“దృష్ట్వా సీతా” …. అనేదానిని అస్వాదించాలంటే ముందు జరిగినది చూస్తేకాని దీనిలో అందం తెలియదు. చెప్పేందుకు ప్రయత్నం చేస్తా. ఇది హనుమ లంకకు వెళ్ళివచ్చిన సందర్భంగా ఆకాశం నుంచి కిందకు దిగిన వెంటనే అన్న మాట. “దృష్ట్వా సీతా” అనగా, “చూశాను సీతను” అని అర్ధం. ఐతే ఈ మాటకి ఇంత అవసరం, ప్రాముఖ్యత ఏమి అని చూస్తే…….

వానరరాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం గా భూమి నాలుగు చెరగులనుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇస్తాడు, కపిరాజు. చివరగా అంగదుని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు, అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు, అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష చెప్పబడింది. అందుకే దానిని సుగ్రీవ ఆజ్ఞ అన్నారు. అన్నీ వివరంగా అనుమానం లేకుండా చెప్పడం, దానిని తప్పిన వారికి శిక్ష కూడా అందులోనే చెప్పబడింది.( ఈ రోజుల్లో ఇచ్చే ఆజ్ఞలలో అన్నీ లొసుగులే! కావాలనే ఇస్తారుకాబోలు అలా.) అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికి ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం, దక్షణ దిక్కుకు వెళ్ళేవారి నాయకుడయిన అంగదునికి కూడా ఇవ్వబడలేదు, అంగుళీయం.

అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు, వెతకడానికి. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు, స్వయంప్రభ యొక్క అనుగ్రహం చేత. అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణ భయంతో ఉన్నారు, సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయం లో లంకకి వెళ్ళగలవారెవరని ప్రశ్న. చివరికి హనుమ శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంక కు చేరుకుని సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి వస్తున్న సమయం. ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు, ఏమయినది తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి లేకపోతే సుగ్రీవాజ్ఞ కి తీయబడతాయి. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున వున్న తనవారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియ చేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని , అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు. ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ అన్న మాట “దృష్ట్వా సీతా” అన్నది, ఈ సందర్భం లో. సాధారణంగా క్రియాపదం తో వాక్య నిర్మాణం ఉండదు, తెనుగులో. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం మూలంగాను, అక్కడ వున్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో దృష్ట్వా సీతా అన్నాడు. ఐతే మొదటి మాట విన్న వెంటనే కపి సమూహం యొక్క జయ జయ ధ్వానాలమధ్య తరవాత మాట వినపడకపోయినా ఇబ్బంది లేక పోయింది. ఇదీ క్లుప్తంగా దృష్ట్వా సీత వెనుక ఉన్న గాధ.

ఇయం సీతా మమ సుతా… దీనిని వ్యాఖ్యానించడానికి నాకు తాహతు సరిపోదు. కారణం దానిని నేనూ పూర్తిగా అర్ధం చేసుకో లేకపోవడం. ప్రయత్నం చేస్తున్నా పొరపాట్లు మన్నించగలరు. ఈమె సీత, నా కుమార్తె…. నీకు సహధర్మ చారిణిగా ఉండేందుకు సమర్పించబడుతోంది, ఈమె నీడలా నిన్ను అనుసరిస్తుంది, ధర్మాచరణలో, అని చెప్పి అప్పజెప్పేడు, జనకుడు….. ఇది స్థూలం..సూక్ష్మంలో ఈమె నీకు ధర్మాచరణలో నీడలా వెన్నంటి వుంటుంది, ధర్మాచరణ చేయమని జనకుని కోరిక. ఇద్దరూ ధర్మమైన అర్ధాని, ధర్మమైన కామాన్ని అనుభవించమని చెప్పి, జనకుని ఆకాంక్ష. ఐతే దీనికి వ్యతిరిక్తమయిన సంఘటన వనవాసానికి వెళ్ళేటపుడు సంభవిస్తుంది. రాముడు సీతను అడవికి రావద్దంటాడు. అప్పుడు సీత మాట్లాడిన మాటలు చూడండి. “నా తండ్రి , నన్ను నీకు అప్పజెప్పేటపుడు ధర్మాచరణలో నీడలా అనుసరిస్తుందనికదా చెప్పినది, ఇప్పుడు నేను నీతో రాకపోతే ఆ మాట బోటు పోయినట్లేకదా, నీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నీవు అడవికి వెళుతున్నావు, కాని నా తండ్రి ఇచ్చిన మాటను నన్ను నిలబెట్టవద్దంటున్నావు.” అని చెప్పడానికి చివరి అస్త్రంగా “మా తండ్రి పురుష రూపం లో ఉన్న స్త్రీకిచ్చి, నా వివాహం చేశాడు” అని అంటుంది. అప్పుడు రాముడంటాడు, “నీ మనసు తెలుసుకోవడం కోసం అన్నాను సుమా” అంటాడు. అది అసలు సంగతని నా ఉద్దేశం.

నా రామాయణ, భారత, భాగవాతాల చదువు, పరిశీలనకు మొదటి గురువు, భిక్ష పెట్టిన వారు,నా తల్లి. చిన్నప్పుడు నామరామాయణం పాడేది. అలా నాకు రామాయణం మీద అభిరుచి పెరిగిందనుకుంటా. తరవాత,   ఆకతాయి  గా తిరుగుతున్నపుడు విన్న కీ.శే. శ్రీ పురాణపండ శ్రీరామమూర్తి గారి ప్రవచనాలు నా ఇరవై వయసులో రెండవ భిక్ష, తరవాత శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు ( ఉషశ్రీ) గారు మూడవ కబళం ఆకాశవాణి ద్వారా వినిపించినది. తరవాత నేటి కాలానికి ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు నాల్గవ కబళం భిక్ష, తప్పించి నా గొప్పతనం ఏమీ లేదని మనవి. చదువుదామంటే రామాయణం సంస్కృత+ తెనుగు అనువాదం సరియైనది దొరకలేదు, నాకు, మిత్రులు, మంచి ప్రచురణ ఎక్కడ దొరికేది తెలియ చేస్తేతెప్పించుకుంటాను. వారి ఉపకారానికి ఋణపడి ఉంటాను. నేను ఇలా పలకడానికి ప్రేరణ ఇచ్చిన జిలేబీ గారికి ఈ టపా అంకితం.

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- “దృష్ట్వా సీతా”

 1. @గుత్తిన శ్రీనివాస్ గారు,
  మీరు దయతో ఇచ్చిన అడ్రసును కనుక్కుంటాను. పుస్తకాలు తెప్పించుకుంటా.
  మీరు అడిగిన దానికి;- నాకూ సంస్కృత భాష మీద పట్టులేదు.మీకు ఉపయోగపడగల పుస్తకం
  సుందరకాండ, శ్రీ. నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యులు గారు తాత్పర్యంతో ప్రచురించిన గ్రంధం మీకు పారాయణకి పనికి వస్తుంది. ఎక్కడెక్కడ ఆపాలో వివరంగా ఇవ్వబడినది. నా దగ్గరున్నది కనక చెప్పగలిగేను. పారాయణ క్రమం నుంచి చాలా విషయలున్నాయి.దొరికే స్థలం.
  శ్రీ జయలక్ష్మి పబ్లికేషన్స్
  ఫ్లాట్ నెం.97 సి, వెస్ట్రన్ హిల్స్,
  కె.పి.హెచ్.బి ఎదురుగా, కూకట్ పల్లి
  హైదరాబాద్.
  ఫోన్. 3050986

  http://www.srichaganti.net లో చూడండి.

 2. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడిగారి రామాయణం చదవమని మా తాతగారు, శ్రీమాన్ ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యులుగారు చెప్పేరు. అది వెతకగా వెతకగా అతి కష్టమ్మీద మొన్ననే హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో లభించింది. “అమ్మ నేనడిగితే కనబడుతుందా? తను కనబడాలనుకుంటే కనబడుతుంది” అని తెలుసుకున్నాను.

  అన్నట్లు ఆ కొట్టువాడి చిరునామా చీటీ కూడా ఇచ్చాడు. ఎక్కడో ఉండాలి, వెతికి వాడి దూరవాణి సంఖ్య, చిరునామా దొరికితే చెప్తాను. మనకి కావలసిన పుస్తకాలు వాడికి దూరవాణిలో చెప్తే ఇంటికి పంపుతానన్నట్లు గుర్తు. లేదంటే నేనే ఒకసారి దూరవాణిలో వాడిని కనుక్కుని కూడా చెప్పగలను. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాఖ్యానం తో శ్రీ వాల్మీకి రామాయణం మొత్తం పది భాగములు. వెల సుమారు 2000/- రూపాయలు.

  అన్నట్లు నేనే మీకు రామాయణం అందజేసే ప్రయత్నం చేద్దును కానీ, మొన్ననే స్వవివరాలగూర్చి మీ వ్యాఖ్య చదివాను. అందుచేత అన సాహసించట్లేదు. నా e-mail guttina(at)gmx(dot)com (నా దూరవాణి సంఖ్యను అవసరమైనచో తెలుపగలను).

  ఇక శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనములు (2009 లో జరిగినవి, 41 రోజులని గుర్తు) DVD (mp3 audio) లో నావద్ద కలవు. అంతకుముందు కూడా వారు 2005లో ప్రవచించినట్లు తెలుసుకున్నాను. కానీ నాదగ్గర 2005 ప్రవచనముల బాలకాండ మాత్రమే ఉంది. మిగిలినవి సేకరించటానికి ప్రయత్నిస్తాను.

  కొలువుకు ఆలస్యమైపోతోంది. తీరికగా మళ్ళీ.

  • @గుత్తిన శ్రీనివాస్ గారు,
   మీరు కార్యాలయానికి వెళ్ళే హడావుడిలో కూడా నాకు వ్యాఖ్య పెట్టి నాకు సహాయపడాలనుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు. నాకు ఆ కొట్టు వాని ఫోన్ నెంబర్ ఇస్తే మాటాడుకుని తెప్పించుకుంటాను. మీరు నా గురించి తీసుకున్న శ్రద్ధకి.గీతా ప్రెస్ వారి ప్రచురణ ప్రయత్నమ్ చేస్తున్నానని హైదరబాదులో మా అబ్బాయి చెప్పేడు.మీకు మెయిలిస్తున్నాను. అది కూడా తెప్పించుకుంటాను.
   ధన్యవాదాలు.

   • అయ్యో! నేను సహాయపడేదేముందండీ. అమ్మ నిర్ణయించింది – నన్నో పనిముట్టుగా వాడుకుంటోంది.

    “దృష్ట్వా సీతా” అంటే “సీతమ్మ కనబడింది – నేను చూడటంకాదు” అని మరొక భావం కూడా అని పెద్దలనగా విన్నాను.

    పుల్లెల శ్రీరామచంద్రుడుగారి శ్రీమద్రామాయణ ప్రతులకు:

    ఆర్ష విజ్ఞాన ట్రస్టు

    శ్రీ పమిడిఘంటం శ్రీరఘురాం
    శ్రీ రామ సదనం
    ప్లాట్ నంబర్: 1361, రోడ్ నంబర్: 45,
    జూబ్లీ హిల్స్, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ,
    హైదరాబాద్ – 500 033.
    ఫోన్ నంబర్: 2360 8237 / 2354 5145

    వాళ్ళ వద్ద భారత భాగవతాలు కూడా ఉన్నాయని చూశాను. ఫోను చేసి కనుక్కోవాలి.

    అన్నట్లు నాదో కోరిక. నేను కనీసం ఒక్కసారి వింటే కానీ సంస్కృతశ్లోకాలు సరిగా చదవలేను. ముఖ్యంగా, ఒక్కసారైనా తెలిసినవారు చదవినప్పుడు వినకపోతే – పదబంధాలదగ్గర భావాలు మారిపోయే అవకాశాలు ఎక్కువని చాలా తటపటాయింపు.

    ఎవరైనా మీవంటి ప్రాజ్ఞులు కొంచెం శ్రీమద్రామాయణ పఠనం చేసి రికార్డు చేసిస్తే బహుధా కృతజ్ఞుడను. కనీసంలో కనీసం సుందరాకాండము వీలైనంత తొందరగా కావాలి. ఇది నా స్వార్థం.

 3. అంతా బాగా చాలా చక్కగా చెప్పారు కానీ తాతగారూ ఆతతాయిగా తిరుగుతున్నపుడు అన్నారు, ఆతతాయి అంటే చంపడానికి ఉద్యుక్తుడు అయిన వాడు అని కదా అర్ధం????????

   • రసజ్ఞ గారు,

    తాత గారు అతతాయి గా తిరుగు తున్నప్పుడు అంటే, ‘యంగ్ అండ్ డైనమిక్ గా కిల్లింగ్ స్పిరిట్’ తో తిరుగు తున్నప్పుడు రోజులు అని చదువు కోవాలి !!!

    చీర్స్
    జిలేబి.

 4. “మీ బ్లాగుకొస్తే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. ‘సజ్జనసాంగత్యం’…”
  నాది కూడా “జ్యోతిర్మయి” గారి మాటేనండీ..

 5. శర్మ గారు,

  గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారు రామాయణం ను తెలుగు లో ప్రచూరించారు. ఈ మధ్యనే నేను సుందరాకాండ (తెలుగు+సంస్కృతం) చదవటం జరిగింది. చాలా బాగుంది.పుస్తకం వెల కూడా చాలా తక్కువ. మంచి బైండ్ చేసి అమ్ముతున్నారు. ఈ క్రింది వెబ్ సైట్లో వెతకండి దొర్కుతుంది. లేక పోతే రైల్వేస్టేషన్ లో పెద్ద బుక్ షాప్ పెట్టి అమ్ముతున్నారు.
  Ramayanam book:
  Code : 924
  Title : Valmiki Ramayanam-Sunderkandam Mulam
  http://www.gitapress.org/search_result.asp

  ప్రవచనం వెబ్ సైట్లో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. వాటిని కావాలంటే వినవచ్చు.

  http://pravachanam.com/

 6. శర్మ గారు,

  ధృష్ట్వాతు శ్రీ శర్మాణామ్ కథా ప్రసంగ పరిపూర్ణత్వం!

  కథని సొబగైన రీతిలో చెప్పటం లో మీకు మీరే సాటి.!

  నెనర్లు అడిగినదానికి మీరు వెంటనే టపా పెట్టడం ఈ శీర్షిక పై.

  ఈ ఒక్క ఇయం సీతా, మమ సుతా పై గంటలకొద్దీ హరి కథల లో చెప్పిన దానిని సారాంశం గా ఆ రెండు పదాల వైశిష్ట్యాన్ని మీరు పునః ప్రతిష్టించడం దానికి పురాణ పండ వారి జ్ఞాపకాల పరంపర తోడవటం, ఈ టపా ద్వారా ఈ విషయాలని తెలిసుకునే భాగ్యం మా అందరికీ కలగడం, ఓహ్ ఏమని చెప్పాలి మా భాగ్యం!

  నేను రామాయణాన్ని నేరుగా చదివినది లేదు. మా వూరిలో(జిల్లా లో) అప్పట్లో బొమ్మరాజు శేషగిరి రావు గారని వారు తెలుగు లో హరి కథ చెప్పే వారు. ఆ శ్రుతం మాత్రమే !

  ఆ పై తమిళం లో శ్రీ టీ ఎస్ బాలకృష్ణ శాస్త్రి గారి ప్రవచనం, ఈ మధ్య చాగంటి వారి రామాయణం ( కాకినాడ అయ్యప్ప కోవెల లో వారిచ్చిన ప్రసంగానికి ఆడియో రూపకం) సో, మొత్తం శ్రుత జ్ఞానం మాత్రమే.

  ధన్యోస్మి !
  జిలేబి.

  • జిలేబిగారు,

   కధను నడిపించడంలో నా ప్రమేయం లేదు, అంతా అమ్మ దయ. ఇంటింటికి ఒక పువ్వు ఈశ్వరునికి ఒక మాల సామెత. తల్లి నుంచి మిగతా గురువులనుంచి సంగ్రహించుకున్నదానిని కొద్దిగా చెప్పగలిగితే అది పెద్దల అనుగ్రహం, మీ లాటి పెద్దల అభిమానంగా తలుస్తాను.
   రామాయణం విన్నది ఎక్కువ చదివినది తక్కువ. పుస్తకం కోసం ప్రయత్నం చేస్తున్నా, దొరికితే మరికొన్ని ముఖ్య ఘట్టాలు చెప్పుకోవచ్చునని నా ఆస. భగవత్కృప ఎలా ఉందో తెలియదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.

 7. మాస్టారూ…

  “దృష్ట్వా సీతా” అన్న పేరు చూడగానే మా తాతగారు రామమూర్తిగారు, పెదనాన్న ఉషశ్రీ గారూ గుర్తొచ్చారు. వ్యాసం ఆఖరికి వచ్చేసరికి మీరు వారిద్దరినీ తలచుకోడం చాలా ఆనందం కలిగించింది.

  మా తాతగారి ఆధ్వర్యంలో మా తండ్రులందరి సంపాదకత్వంలో వచ్చిన మూల భారతానికి తెలుగు అనువాదంతో నాకు పుస్తకాలు చదివే అలవాటు ప్రారంభం అయింది.

  కొంచెం ఊహ తెలిశక, మాట పదును తెలుసుకుందుకు సుందరకాండ చదవమని మా పెదనాన్నగారి పుస్తకం చేతిలో పెట్టారు మా నాన్నగారు. దృష్ట్వా సీతా కథ ముందు ఆయన నోట విన్నాక, చదివాను.

  పెదనాన్న సైతం…. నా అల్పపు రచనకే మురిసిపోకండి, వాల్మీకి కృత మూలం చదవండి అని పాఠకులకు సూచించే వారు.

  నవ వ్యాకరణ పండితుడు హనుమ పాండితీ గరిమ గురించి ప్రత్యేకం “రామాయణంలో హనుమంతుడు” అనే పుస్తకం రాశారాయన.

  ధన్యోస్మి.

  ఫణీంద్ర పురాణపండ

  • శ్రీ పురాణపండ ఫణీంద్రగారు,
   నమస్కారం. గురువంశీయులు కనక చిన్నవారయినా నమస్కారానికి అర్హులే. నా దగ్గర మీ పెదనాన్నగారు రేడియోలో చెప్పిన రామాయణం మాత్రమే ఉన్నది. మిగిలినది మీ పెద్దల వల్ల విన్నదే. మిమ్మల్ని ఇలా కలియడం యాధృచ్చికమైనా సంతస దాయకం. పెద్దలని చూసినట్లే ఉంది.మీ తాతగారు శాలువా వల్లెవాటుగా వేసుకుని నడుస్తున్నట్లే నాకు కనపడుతోంది. పాత జ్ఞాపకాలకి చేయూతనిచ్చిన మీకు, వ్యాఖ్యకు నా ధన్యవాదాలు.

   • మాస్టారూ… మీరు కేవలం వయసులోనే కాదు, జ్ఞానం విషయంలోనూ నా కంటె వెయ్యి రెట్లు పెద్దవారు. కేవలం వారసత్వం తప్పితే నాకు జ్ఞానమూ లేదు, బుద్ధీ లేదు. దయచేసి నాకు నమస్కరించకండి. ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s