శర్మ కాలక్షేపంకబుర్లు-దీవెన/తధాస్తు.

దీవెన/తధాస్తు

తధాస్తు అంటే అటులనే జరుగు గాక అని అర్ధం. ఇది సాధారణంగా ఒకరు దీవెన ఇస్తూవుంటే మరొకరు, పెద్దలు తధాస్తు అంటారు. ఇది సాధారణంగా పెళ్ళి, వ్రతాలు, పూజలు,ఇవి జరిగేటపుడు, చివరగా ఆశీర్వచనం చెబుతారు, దీవెనలిస్తారు, ఆ వెనుక పెద్దలు తధాస్తు, అని అంటారు. ఇతరమైనవి అనగా అశుభం జరిగినపుడు అది పూర్తి చేసిన తరవాత ప్రత్యేకంగా ఆశీర్వచనానికి ఏర్పాటు చేస్తారు. సాధారణం గా మనం బట్టలు పెట్టె సమయం అంటాము. అప్పుడు దీవిస్తారు, ఇక ముందు శుభం జరగాలని. ప్రతి దీవెన వెనుక పెద్దలు, మరొకరు తధాస్తు అనాలి. ఈ అశీర్వచనం మూడు వేదాలలో వుంది. ఏ వేదానికి సంబంధించిన ఆశీర్వచనం ఆ వేదానికి వేరుగా వుంటుంది, అవి చెప్పగలను కాని ఇక్కడ టపా చాలా పెద్దదయిపోతుంది. “ఇన్ద్ర శ్రేష్ఠాని ద్రవిణాని ధేహి…”..ఇది ఋగ్వేదాశీర్వచనం. యజుర్వేదాశీర్వచనం “యో వైతాం బ్రహ్మణో వేద…..”. ఇక సామవేదాశీర్వచనం “ఇమంస్తోమాం……”. ఇవేకాక మరి కొన్ని కూడా ఉండవచ్చు. నాకు తెలిసినవి చెప్పేను. నమస్కారం చేసిన వారికి ఆశీర్వచనం చెప్పడం మన సంప్రదాయం. తధాస్తు దేవతలుంటారట. అందుకే మన పెద్దలు చెడుమాట, అనను కూడా వద్దంటారు.

రామాయణం, భాగవతాల్లో నమస్కారాలున్నాయి కాని దీవెనల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. మాటాడితే రామాయణం, భారతం, భాగవతం అంటారు, మరొకటి చెప్పలేరా అని ఒకరు ప్రశ్నించారు. నిజమే. నాకు వచ్చిన భాష తెనుగు. అందులోనే రామాయణ, భారత, భాగవతాలు చదువుకున్నా. మరే ఇతర భాషలు రావు గనక వాటి సాహిత్య పరిచయం లేదు. తెనుగు భాష లోనే సాహిత్య పరిచయం లేదు. సొల్లు కబుర్లు చెప్పడానికి సాహిత్య పరిచయం అక్కరలేదనుకుంటా.

రామాయణం లో ఒక గొప్ప ఘట్టం ఉంది. సీతా రాములు వనవాసానికి వెళుతున్నారు. లక్ష్మణుడు తానూ వస్తున్నానని, రామునికి చెప్పి, తల్లి సుమిత్ర తో, అడవికి అన్నతో వెళుతున్నానని చెప్పి, నమస్కరిస్తే, ఆమె దీవెన వినండి.” రామం దశరధం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అయోధ్యా మటవీం విద్ధి గఛ్ఛ తాత యధాసుఖం” రాముడు దశరధునితో సమానుడు, జానకి నాతో సమానం,అయోధ్య అడవీ రెండూ నీకు సమానమే అందుచేత సుఖంగా వెళ్ళిరమ్మన్నది. ఎంత గొప్ప మనసున్న తల్లి. కొడుకు రాజ్యాలేలడానికి, పదవులు సంపాదించడానికి, ఇహ భోగాలు అనుభవించడానికి వెళుతున్నాననలేదు. అడవికి పోతున్నా అదీ అన్నకు, వదినకు సేవకునిగా అని చెప్పి, నమస్కరించి, ఆశీర్వచనం కోరిన కొడుకును ఎంత గొప్పగా అశీర్వదించిందా తల్లి. ఇటువంటి తల్లులు కలిగిన నా సంస్కృతి ఎంత గొప్పదీ!

భారతం లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఒక ఘట్టం ఇదివరకొకసారి చెప్పుకున్నాము, కాని ఈ సందర్భం లో అవసరం కనక మళ్ళీ చెప్పుకుందాము. యుద్ధం ఖాయమైపోయింది. యుద్ధానికి వెళుతూ దుర్యోధనుడు గాంధారి వద్దకు వచ్చి నమస్కరిస్తే ఆమె “యతో ధర్మస్తతో జయః” అని దీవించింది. అంటే ధర్మం ఎటు ఉంటే అటే జయం కలుగుతుంది, అని దీవించింది. కాని, విజయోస్తు అనికాని, దిగ్విజయమస్తు అనికాని, దీర్ఘాయుషు మస్తు అని కాని దీవించలేదు, ఆసందర్భాన్ని బట్టి. గాంధారి తన దీవెనలో, కుమారుని యొక్క తప్పును పరోక్షంగా యెత్తి చూపింది, ఆ ఆఖరు క్షణంలో కూడా. ఈమె కూడా నా సంస్కృతిలోనిదే. కొడుకని, తప్పు చేస్తున్నవాడిని సమర్ధించని తల్లి. ధర్మం కోసం కడుపుతీపిని వదలుకున్న గొప్ప తల్లి, గాంధారి. ఈ పరంపర నేటికీ కొనసాగుతున్నందుకు గర్వపడుతున్నా. తల్లులందరికీ నమస్కారం, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మకి నమస్కారం.

నేటి కాలంలో కూడా పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు, కారణం ఎవరి దీవెన, నోటి వాక్కు ఫలిస్తుందో, తెలియదు కనక. పెద్దల మాట బోటు పోదంటారు. దానికి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మనకు జీవితాల్లో కనపడతాయి. సాధారణంగా స్త్రీలని దీర్ఘ సుమంగళీ భవ అని, పురుషులనైతే దీర్ఘాయుష్మాన్ భవ అని, పెళ్ళికాని పిల్లలని శీఘ్రమే వివాహ ప్రాప్తి రస్తు అని, పెళ్ళి అయిన వాళ్ళని సుపుత్రా ప్రాప్తి రస్తు అని దీవించడం అలవాటు. లేకపోతే వంశాభి వృద్ధిరస్తు అంటారు. చదువుకునే పిల్లలని విద్యాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. వీటికి పైనున్న తధాస్తు దేవతల సంకల్పం ఉంటుందంటారు.

సరదాగా ఒక మాట. నా టపాలని వెంకట్ గారు హిందూ పత్రిక తో పోల్చారు. ఆయనకి అలా అనిపించి ఆశీర్వదించారు. దాని మీద జిలేబీ గారు తధాస్తు అన్నట్లుగా టపాలు లేని రోజున తమ బ్లాగులో హిందూ పేపర్ రాలేదు అని పెట్టి నా టపాలను హిందూ పత్రిక తో పోలికను తధాస్తు అన్నారు. అదేకాక నిన్న మరొక సారి వారి బ్లాగ్ లో నా బ్లాగును ఆశీర్వదించిన తల్లికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఏంటీ! శంకరాభరణం డవిలాగు చెబుతున్నారనద్దు.

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దీవెన/తధాస్తు.

 1. ‘ఆశీర్వదించారు’ అనేది నా తాహతుకు చాలా చాలా మించిన మాట శర్మగారూ! మీ జీవితానుభవం ముందు, writing capabilities ముందు నేను నిస్సందేహంగా చాలా చిన్ననే! మీ modesty మీ చేత అలా అనిపించింది బహుశా!! మీ జీవితానుభవాల నుంచి ఎన్నుకోదగిన సందర్భాలు బోలెడుంటాయని, అవి మీరు ఒకింత సులభంగానే సాధించుకున్న, ఒకమోస్తరుగా మీదే అనిపించే easy flow of writing శైలిలో, మంచి బ్లాగ్ పోస్టులుగా రాగలిగే అవకాశాన్ని ముందుగానే గమనించడం ఒక్కటే నేను చేసినదీ, మీకు చెప్పినదీను!! నా guess, అంచనా తప్పవని విధంగా ఎప్పటికప్పుడు (ఒకానొక మీరు నిర్ణయించుకున్న frequency లోనే) ఈ క్వాలిటీ పోస్టులు పడుతూ వుండడం ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది!

  ధన్యవాదాలు!

  వెంకట్.బి.రావు

  • @వెంకట్ గారు,
   మీ వ్యాఖ్య చూశాను. గొంతు మూగపోయింది.ఏం చెప్పాలొ తెలియని స్థితిలో ఉన్నాను.మొదట గుర్తించిన వారికి ఆ ఖ్యాతి ఇవ్వడం తప్పు కాదను కుంటా.
   ధన్యవాదాలు.

 2. /ఇటువంటి తల్లులు కలిగిన నా సంస్కృతి ఎంత గొప్పదీ!/
  నిజమే. దశరథుడు మాత్రం ఆ తల్లులంతటి గుండెనిబ్బరాన్ని ప్రదర్శించలేక పోయాడేమో. ఐతే ఇటువంటి తల్లులు చాలా అరుదు కాబట్టే భారత, రామాయణాల కాలాల వరకూ వెళ్ళి స్మరించుకోవాల్సి వస్తోందేమో అనిపిస్తుంది.

  • @Snkr గారు,
   దశరధునికి మీరు చెప్పినట్లుగా గుండె దిటవు లేదు. ఇప్పటికీ ఇటువంటి తల్లులు ఉన్నారు. మనం గుర్తించలేకపోతున్నామేమో.
   ధన్యవాదాలు

  • @జ్యోతిర్మయి,
   సమాజ నిర్మాణం వ్యక్తుల మీద అధారపడి ఉంటుంది. అటువంటి సమాజాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానిది.
   ధన్యవాదాలు.

 3. ఎవరేమన్నా ఏముంది.. ఐనా రామాయణ,భారత,భాగవతాలు ఎంత చదివినా ఇంకా ఉంటూనే ఉంటాయి కదండీ..ఎన్ని సార్లు విన్నా,చదివినా ఇంకా వినాలనీ,చదవాలనీ అనిపించడం వాటి ప్రత్యేకత.మీ లాంటి పెద్దల దగ్గర వినడం మా అదృష్టమూనూ.

  • @సుభ,
   కులాసాగా ఉన్నావమ్మా.నువ్వు చెప్పినట్లు రామాయణ, భారత, భాగవతాలు నిత్య నూతనాలు. తవ్వుకున్న కొద్దీ రత్నాలు దొరుకుతాయి.
   ధన్యవాదాలు.

 4. సవరణ: భాగవతంబు అనికాక పద్యంలో భాగవతము అని ఉండాలి. ఈ పద్యం సవరించి యిలా చదువుకో వలసినది:
  కం. చాలవె యితిహాసంబులు
  చాలదె మరి భాగవతము జదువగ హితమై
  చాలదె పెద్దల దీవన
  మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

 5. శ్రీ దీక్షితులు గారు,

  లవణీ తీగలువారు ఫాయలేహకీకీ కబుర్ల తో మీ టపా శుభోదయపు “ఉషో వాజేన వాజిని ప్రచేతాహ”

  నెనర్లు
  చీర్స్
  జిలేబి.

  • కం. చాలవె యితిహాసంబులు
   చాలదె మరి భాగవతంబు జదువుట మనకున్
   చాలదె పెద్దల దీవన
   మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

   కం. నలభై పంక్తుల వ్యాసము
   సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
   తల కెక్కక పొగరణచెను
   కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.

  • జిలేబిగారు,
   రసజ్ఞ సంశయంతో ఉదయాన్నే గుర్రంలా పరుగెట్టి వచ్చిందంటారా టపా? అంతేనా!!!నాకూ అర్ధంకాలా.ధన్యవాదాలు

వ్యాఖ్యలను మూసివేసారు.