శర్మ కాలక్షేపంకబుర్లు-వినదగు నెవ్వరు చెప్పిన

వినదగునెవ్వరు చెప్పిన…                                         Part -1

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
విని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

ఈ పద్యం చిన్నప్పటి నుంచి చాలా సార్లు చదివి ఉంటాము, కాని జీవితానికి అన్వయించుకోడానికి ఇబ్బంది పడుతుంటాము. పద్యం అరువది ఐదు సంవత్సరముల ముందు నేర్చుకున్నా. జీవితానికి అన్వయం చేసుకోడానికి సమయం పట్టింది…….

నలుబది ఎనిమిది సంవత్సరముల ముందు నా ఇల్లాలికి మొదటిసారి ఆడబిడ్డ కలిగింది. ఏనుగెక్కినంత సంబరమైపోయింది. లక్ష్మీదేవి పుట్టిందనుకున్నాం. అమ్మ పేరు పెట్టుకున్నాం. ఇప్పటిలాగా ఆడపిల్ల పుట్టిందని ఏడవలా!. పాపకి మాటలు రాలా. ఆలస్యంగా వస్తాయన్నారు. రెండేళ్ళకి మరొక పాప పుట్టింది. ఆ పాప మాటాడటం చూసి పెద్దమ్మాయికి ఏదో తేడా ఉందనుకున్నాం. అప్పటి నుంచి మొక్కని దేవుడు లేడు, చూడని డాక్టరు లేడు. రెండేళ్ళు ఎవరేమి చెబితే అది చేశాము. విసిగిపోయాం. ఒక రోజు నా మిత్రుడు ఒకరు ” ఒరేయ్! పిల్లని చూస్తే బంగారపు బొమ్మ. చెబితే తప్పించి, ఈపిల్లకి మాటలు రావని ఎవరూ ఊహించరు. నువ్వు చాలా తిరిగి విసిగిపోయావు. ఒక్క పని చేద్దాం. మద్రాసులో ఒక డాక్టర్ ఉన్నాడు. తూర్పు ఆసియా దేశాలలో పెద్ద పేరున్న వాడు. మూడు నెలలు ముందు కాని అతని అప్పాయింటుమెంటు దొరకదు, అతన్ని చూసి విషయం అడుగుదాం. అతను చెప్పినదానిని పట్టి మీరు నిర్ణయం తిసుకుందురుగాని” అన్నాడు.నా కెందుకో ఇష్టం లేదు. నా ఇల్లాలు ” ఇన్ని చోట్లకి తిరిగాము,ఈ ఒక్క సారి అక్కడికి వెళ్ళి, వివరం తెలుసుకుని ఏమి చేయవలసినది అలోచిద్దాం” అంది. నేను ” ఒరేయ్! మూడు నెలలకి కాని మనకి దొరకని డాక్టర్ ని పట్టుకోడం ఎలా” అన్నా. అందుకు వాడు” నీకా గోలెందుకు. ఆ ఏర్పాటు నేను చూస్తాను కదా! మనం అక్కడికి వెళ్ళిన కొద్ది నిమిషాలలో మన కేస్ చూస్తాడు. సరేనా”అన్నాడు. సరే బయలుదేరి వెళ్ళేము. స్టేషన్ కి కారొచ్చింది. “ఎవరిదిరా” అన్నా, “మనదే నడు” అని కారెక్కించాడు మమ్మల్ని.. కారు ఒక ఇంటిలోకి వెళుతుండగా నేం బోర్డ్ చూశా, ఇన్ కం టాక్స్ కమిషనర్ అని ఉంది. ఇదేమిరా ఇక్కడకొచ్చామన్నా. “దిగండి” అని పెళ్ళాం పెరెట్టి పిలిచాడు. అమ్మాయి వచ్చి “రండి రండి” అంది. అప్పుడు చెప్పేడు ఇది “నా మామగారిల్లు” అని. అప్పటిదాకా ఉన్న డాక్టర్ ని చూడగలమా అన్న అనుమానం పోయింది. “ఎప్పుడెళ్దాం” అన్నా. “స్నానం చేసి వెళ్ళిపోదాం”అన్నాడు. సరే అని ఏర్పాట్లు చూసి భార్యకి ఏదో చెప్పేడు. స్నానాలు చేసి టిఫిన్ చేసి డాక్టర్ దగ్గరకెళ్ళేము. రిసెప్షన్ దగ్గరకెళ్ళి పేరు చెబితే “ఒక్క నిమిషం ఆగండి లోపల ఉన్న వారు బయటకు రాగానే మిమ్మల్ని పంపుతాను. మీరు రాగానే పంపమని డాక్టర్ చెప్పేరు” అంది. లోపలికెళ్ళేము. డాక్టర్ గారు పిల్లకి టెస్టులు చేసి ఒక ఇరువది నిమిషాలు పరీక్షలు చేసి మాకు చెప్పిన విషయం, ” ఈ అమ్మాయికి బ్రహ్మ చెముడు, అందుకు మాటలు రాలేదు. పిల్ల తెలివయినది. చదువు చెప్పించండి. ఇక్కడ కీల్పాక్ లో స్కూల్ ఉందని” చెప్పేరు. సరే “మీఫీజ్” అన్నాం. ఆయన వెంటనే “నేనీ అమ్మాయికి చేసినది లేదు. ఫీజ్ వద్దు” అన్నాడు. “అయ్యా, మీరు చూసి విషయం చెప్పేరు. ఈ సమయం లో మరొకరిని చూస్తే మీకు ఫీజ్ వచ్చేది కదా” అన్నా. “వద్దు” అన్నారు. మేమిద్దరం డీలా పడ్డాం. జీవితంలో ఊహించని, మార్పురాని, పెద్ద కష్టం. బయటికొచ్చిన తరవాత నా స్నేహితుడు” ఒరేయ్! ఇతనేమన్నా దేవుడా మరొకర్ని చూద్దాం లే, మీరు డీలా పడద్దు” అని ఉత్సాహం కబుర్లు చెప్పేడు. సరే సాయంత్రమే తిరిగొచ్చేశాము. ఇంటి కొచ్చిన తరవాత కొద్ది రోజుల తరవాత మా భార్యా భర్తలిద్దరం కూచుని చర్చ చేసుకున్నాం. ఒక నిర్ణయాని కొచ్చాం. “మరెక్కడికి తిప్పవద్దు. చదువు చెప్పిద్దాం. ఆ ప్రయత్నం చేద్దాం”. సరే బడి ఎక్కడ ఉంది కనుక్కుంటే కాకినాడలో ఒకటి హైదరాబాదులో ఒకటి ఉన్నాయని తెలిసింది. సరే అప్పుడున్న ఊరునుంచి బదిలీకి ప్రయత్నం ప్రారంభించా.

దరఖాస్తు పెట్టా. కదులు లేదు, మెదులు లేదు. ఎవరినడిగినా హైదరాబాదులోని వారు “ఈ బదిలీ ఇవ్వరు ఆయన బహు స్ట్రిక్ట్, ఎవరు చెప్పినా వినరు”. వెళ్ళికలుస్తానన్నా. వద్దన్న వాళ్ళే, అందరూ. ఒక రోజు ఎవరికి చెప్పకుండా బండెక్కేశా. అమ్మ మీద భారం, సత్యం మీద నమ్మకంతో. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎవరు పడితే వారిని కలిసే వీలు లేదు. ఇక్కడ కింద ఆఫీసర్ ఒప్పుకుంటే నే వెళ్ళి కలవాలి. ఎవరికీ చెప్పలేదు. వెళ్ళి చీటి పంపా, లోపలికి. రమ్మన్నారు, అరగంట తరవాత. లోపలికెళ్ళి చెప్పుకున్నా. ఆయన అంతా విని “నీవు చెప్పినది నిజమయితే నీకు బదిలీ ఖాయం, కాక పోతే నీకు ఛార్జ్ షీట్ ఖాయం” అన్నారు. నేను వెంటనే “అయ్యా! మీదగ్గర ఛార్జి షీట్ తీసుకోవాలనుకుంటున్నా” అన్నాను. “ఏంటీ” అన్నారు. వివరించా. “నేను చెప్పినది అబద్ధం అయితేకదా మీరు ఛార్జి షీట్ ఇస్తానన్నారు. నేను చెప్పినది అబద్ధంకావాలని కోరుకుంటున్నా, నా పిల్ల వినగలిగి మాటాడగలిగితే అంతకు మించి ఆనందం నాకు జీవితంలో మరొకటి ఉండదు. మీ ఛార్జి షీటుని ఆహ్వానిస్తా.” అన్నాను. “సరే చూస్తాలే” అన్నారు. నేను తిరిగొచ్చా. నాఇల్లాలు “మీ ఆఫీస్ వాళ్ళు మన వీధిలో మన అమ్మాయి గురించి విచారించారట ఏందుకో” అంది. ఏదో జరిగిందని అనుకున్నా.. మూడవ రోజు నా కో టెలిగ్రాం వచ్చింది. నిన్ను కాకినాడ బదిలీ చేశాము. వెంటనే వెళ్ళి జాయిన్ కమ్మని. కాపీ చాలా మందికిచ్చారు. ఆఫీస్ కెళ్ళా. అప్పటికే రిలీవింగ్ ఆర్డరర్ రాసేసి సిద్ధం చేసి కూచున్నారు. వెళ్ళగానే నా చేతికిచ్చి “సంతకం చెయ్యి నాయనా, నిన్ను రిలీవ్ చేసినట్లు టెలిగ్రామ్ ఇవ్వాలి, లేకపోతే నా చమ్డాలు ఎక్కతీస్తారు, ఎలా వచ్చింది నీకు బదిలీ? ఏంచేశావు, మొన్న నన్ను మీ అమ్మాయి గురించి వివరం చెప్పమన్నారు, చెప్పేను. ఆయన దగ్గర మొత్తానికి బదిలీ తెచ్చుకోగలిగావన్నారు” అని సంతకం పెట్టించుకుని టెలిగ్రాం ఇచ్చాడు, రిలీవ్ చేసినట్లు. కాకినాడలో జాయిన్ అయిన తరవాత వారికి నమస్కారాలతో, కృతజ్ఞత తెలుపుతూ ఉత్తరం రాశా. అమ్మాయి చదువు,పెళ్ళి వగైరా మరో టపాలో, మరో సారి…….. అందుకే…..వినదగునెవ్వరు చెప్పిన……..

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వినదగు నెవ్వరు చెప్పిన

 1. ఇది స్వీ.యానుభవమో కాదో తెలీదు, కానీ చాలా బాగా రాసేరు.మంచినెక్కడ చూసినా దాన్ని రిపోర్టు చేయాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది..మంచి ఇంకా బ్రతికే ఉందంటే నిస్సహాయులకి ఊరట కొండంత ధైర్యం కలుగుతాయి కదా?

 2. ‘మెతుకు పట్టుకుని చూస్తే చాల’ ని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట శర్మగారూ! మీ అనుభవంలో బోలెడంత content వుండడానికి అవకాశం వుందనేది మీ ‘సత్తిబాబు’, ‘సుబ్బయ్య’ పోస్టుల దగ్గరే నా గ్రహింపుకు వచ్చింది!

  మంచి feel and flow వున్న పోస్టు ఇది! మీ జీవితంలోని భాగమే కాబట్టి, ఇందులో life గురించి వేరే చెప్పాలిసింది లేదు! ప్రచురణ కాదగ్గ content! నా చేతిలో ఒక వార పత్రిక గానీ, పక్ష పత్రిక గానీ వుండి వుంటే, మీ చేత వారానికో/పక్షానికో ఒక పేజీ వ్రాయించుకుని, ‘he is my find!’ అని గర్వంగా చెప్పుకునే వాడిననుకుంటుంటాను, మీ ఇలాంటి పోస్టులు చదివినప్పుడల్లా!! కొంచెం హెచ్చులు పోతున్నట్లుగా అనిపించినా, నా మనసులో మాట ఇది! ప్రచురణార్హమైన content ఈ పోస్టులోనిది…నిస్సందేహంగా! చేయవలసిందల్లా, కొన్ని చిన్న చిన్న మార్పులతో, ఇంకొంత expand చేసి రాయడమే!

  ధన్యవాదాలు!

  వెంకట్.బి.రావు

 3. శర్మ గారు,

  యా దేవీ సర్వ భూతేషు.
  శతక శ్లోకాన్ని జీవిత కాల ఘట్టాలకు కు అన్వయించి చెప్పారు.
  అమ్మాయి చదువు ల సరస్వతి అయితే అదే దైవం ఇచ్చిన సంకల్ప బల సార్థకత్వం.

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s