శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి ముందా, ఉద్యోగం ముందా

ఉద్యోగం ముందా, పెళ్ళి ముందా                                              Last Part

పెద్దమ్మాయి కి( మూగ చెవిటి )పెళ్ళి కుదిరింది. మామూలుగానే అమ్మాయి చదువుకు వెళ్ళి వస్తూ ఉంది. అంతలో నేను ప్రమోషన్ కోసం ట్రయినింగుకు సెప్టెంబర్ నెలలో వెళ్ళిపోయా. నాది పదునాలుగునెలల ట్రయినింగు, జబల్పూర్ లో, ప్రయాణమే రెండు రోజులు పడుతోంది. మళ్ళీ వేసవి వచ్చేసింది. అమ్మాయికి పరీక్షలు అయిపోయాయ్. పాస్ అయినట్లు తెలిసినది. నాకు మధ్యలో ఒక వారం శలవులు దొరికితే వచ్చాను. వియ్యాల వారిని కలిశాను. నా పరిస్థితి వివరించాను. “కంగారు పడకండి, మీరు తిరిగి వచ్చిన తరవాత పెళ్ళి చేద్దాం” అన్నారు. నా శలవులలో అమ్మాయిని తీసుకు వెళ్ళి స్పెషల్ ఎంప్లాయిమెంట్ లో రిజిస్టర్ చేయించి వచ్చాము. నేను మరల జబల్పూర్ వెళ్ళిపోయా.

ఎంప్లాయిమెంటులో రిజిస్టర్ చేసిన రెండు నెలలకి ఒక ప్రభుత్వ రంగ బేంకు వారు అమ్మాయిని ఇంటర్వ్యూ కి పిలిచిచారు. విషయం నాకు చెప్పేరు. నేను అసహాయ స్థితిలో ఏమిచేయగలది లేకపోయింది. ఊరిలో ఉన్న మాతోడల్లుడు ఇంటర్వ్యూ కి తీసుకెళుతున్నట్లు చెప్పేడు. తిరిగి వచ్చిన తరవాత, అక్కడ ఇంటర్ వ్యూ బాగా చేసిందని అక్కడి ఆఫీసర్ గారు, “ఈ అమ్మాయికి మేము ఉద్యోగం ఇస్తున్నాము” అని అక్కడికక్కడే చెప్పి అభినందించారట. ఇంటికి వచ్చిన కొద్దిరోజులలో హైదరాబాదు సర్టిఫికట్లు తీసుకుని వచ్చి చూపి ఉద్యోగం లో చేరమని ఉత్తరం వచ్చిందట. ఈ విషయం వియ్యాలవారికి తెలియ చేసినాము, నా అశక్తత తెలియచేసేము. అప్పుడు మా అమ్మాయి కాబోయే మామగారు స్వయంగా వచ్చి అమ్మాయిని హైదరాబాదు తీసుకు వెళ్ళి సర్టిఫికట్లు వగైరా చూపి,” ఈ అమ్మాయికి ఎక్కడ పోస్టింగు కావాలి” అని అడిగితే “వియ్యంకుణ్ణి కనుక్కుని చెబుతాను” అని చెప్పివచ్చి, నన్ను ఫోన్ లో అడిగారు. అప్పుడు నేను ” బావగారూ! నా కూతురు, మీకోడలు. ఆ అమ్మాయి మంచి చెడ్డలు చూడవలసిన వాళ్ళం, మనమిద్దరమే కనక , అమ్మాయి ఎలాగూ మీ ఇంటికి వచ్చేది కనక, హైదరాబాదులో నే పోస్టింగ్ వేయించండి,” అన్నా.. “అమ్మాయి ఎక్కడ ఉంటుంది?” ప్రశ్న వచ్చింది. “మీ ఇంటిలో నే ఉంచండి” అని మేమిద్దరమూ చెప్పగా, “అలా కాదు, మా ఇంటి ఎదురుగా ఉంటున్న మా అమ్మాయిగారింటిలో ఉంచుతాము, పెళ్ళి అయేదాకా. తొందరగా ముహుర్తం పెట్టించి పెళ్ళి చేసేద్దాం.” అన్నారు. సరేనని హైదరబాదులో పోస్టింగ్ తీసుకుని అమ్మాయిని ఉద్యోగంలో చేర్చే అన్ని తిప్పలూ పాపం కాబోయే మామగారే పడ్డారు. పెళ్ళికిముందే అమ్మాయి అత్తారింటికెళ్ళిపోయింది. పెళ్ళి ముహూర్తం పెట్టించాము, రెండు నెలలకి కాని ముహూర్తం దొరకలేదు..తరవాత చేద్దామనుకున్న పెళ్ళి ముందుకొచ్చేసింది. పెళ్ళికి ఎక్కడా వసతి దొరకలేదు. నేను అక్కడ చిక్కుపడిపోయి ఉన్నాను. నా మిత్ర బృందానికి నా ఇల్లాలు విషయం తెలపగా, ఒకరు మెక్లారిన్ హైస్కూల్ వారిని ఒప్పించారు, వివాహం ఆదివారం కనక. ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి “మావా! నువ్వేమి కంగారు పడకు అన్నీ మేము చూస్తున్నాము. అత్త డబ్బులిస్తూవుంది. కావలసిన పని చెబుతూ ఉంది మేము చేస్తునాము. ఎందుకు కంగారు పడతావు. ఆదివారం పెళ్ళి శనివారం కి వచ్చేటట్లు చూసుకో చాలు,” అన్నాడు. నాకు కొంత నిబ్బరం వచ్చింది.

అన్ని ఏర్పాట్లు మిత్ర బృందం చేసేసింది. ఏదీ తక్కువ రానివ్వలేదు. నేను ఒక రోజు ముందు వచ్చాను, అతిధి వచ్చినట్లు, అన్ని విషయాలు నా ఇల్లాలే చూసుకుంది. నేను చేసిన పని బ్లాంకు చెక్కుల మీద సంతకం పెట్టి ఇవ్వడం వరకే పరిమితమయిపోయింది. శనివారం ఉదయం పెళ్ళివారితో కలిసి అమ్మాయి వచ్చింది, నేనూ శనివారం చేరుకున్నా. అప్పుడు పెళ్ళికూతురుని చేశారు. అబ్బాయిని కూడా అదే ముహుర్తానికి పెళ్ళికొడుకుని చేశారు. నాఅన్నయ్యకి ఆడపిల్లలు లేనందున, పీటలపై కూచుని కన్యధార పోయమన్నాము,నాకు మరో కూతురున్నందున. పెళ్ళి ముహూర్తం మధ్యాహ్నం పన్నెండులోపు సమయం.. ఆదివారం ఉదయం ఎస్.పి పోలీస్ వచ్చి చూచి వెళ్ళారట. ఎందుకో తెలియలేదు. మరి కాసేపటికి కలెక్టర్ వచ్చారు, ఇదేమిటో అసలు తెలియలేదు. అప్పటికి నేను అక్కడ ఉన్నందున అడిగితే “పెళ్ళికి ఛీఫ్ సెక్రటరీ వస్తున్నారు,” అందుకు ఏర్పాటు చూడటానికి వచ్చామన్నారు. ఇదేమిటో అసలు అర్ధంకాలెదు. కాసేపటికి మా వియ్యంకుడు చెప్పేరు, వారు మనకు దగ్గర బంధువులు, పెళ్ళికి వస్తున్నారని. పోలీసుల హడావుడితో సరిపోయింది. పెళ్ళి అయిపోయింది. మా అమ్మాయి పెళ్ళికి సహాయం చేసిన మిత్రులు ప్రసాద్,రామకృష్ణ, ఎస్.పి.ఎల్, వంటలు, వడ్డనలు అథిది మర్యాదలు అన్నీ మిగిలిన మిత్రుల సహకారం తో ఎవరికీ, ఏ లోటూ ,రాకుండా చేసి నన్ను కృతార్ధుడిని చేసేరు.

అప్పగింతలు పెట్టేము. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాము, ఆనందంతో, విచారంతో కూడా. చెవిటి, మూగ పిల్లకు బతుకెలాగో అని బాధ పడిన పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిస్థితికి చేరినందుకు అనందం, అమ్మాయి వెళ్ళిపోతోందనే విచారం. పెళ్ళి అయిన తరవాత రోజు నా భార్యను దగ్గర కూచో పెట్టుకుని నేను అమ్మాయి పెళ్ళికి అతిథినైపోయాను, నువ్వే కష్టమంతా పడ్డావన్నా. దానికి నా ఇల్లాలు ఒరగా చూసి, చిరు నవ్వుతో నా చేతిని తన చేతిలో తీసుకుని నెమ్మదిగా నొక్కి పట్టుకుని ఉండిపోయింది. సంవత్సరం గడిచింది. అమ్మాయి కడుపు పండింది. పురిటికి తీసుకు వచ్చాము. మా ఊరిలో హాస్పిటల్ లో చేర్చాము, నొప్పులొస్తుంటే. అబ్బాయి పుట్టేడు, అని నాకు ఫోన్లో చెప్పేరు. కంగారుగా హాస్పిటల్ కి పరుగెట్టా. వెళ్ళగానే మనవరాలు పుట్టిందన్నారు. “ఇందాకా అబ్బాయని చెప్పేరు. ఇప్పుడు అమ్మాయంటున్నారేంటి”అన్నా! “ఇద్దరూ పుట్టేరు” అన్నారు డాక్టర్ గారు బయటకు వస్తూ. అనందం..బ్రహ్మానందం…పరమానందం.. పిడుగులిద్దరూ పెరిగారు. ఆడపిల్ల ఐదవ సంవత్సరం వచ్చేదాకా నా దగ్గర పెరిగింది, ఇద్దరు పిల్లలని తల్లి చూసుకోలేని కారణంగా. వీళ్ళిద్దరూ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. నా కూతురు ఉద్యోగం చేస్తూ ఉంది, అమ్మమ్మ అయి, నేను ముత్తాత అయి, అప్పుడే రెండేళ్ళవుతోంది. నా ముని మనమరాలిని ఆశీర్వదించండి. ఇంతకి కారణం ఆ రోజు చదువు చెప్పించాలని తీసుకున్న నిర్ణయం.

పెంచుకున్న అమ్మ చెప్పేది, ” కలిమి నిలవదు, లేమీ నిలవదు, ఏదీ శాశ్వతంకాదు, కష్టంలో పరదేవతను తలుచుకో పీకలోతు కష్టం మోకాలి లోతులో గడిచిపోతుంది. సుఖంలో పరదేవతని తలుచుకో, నీ ఆనందం పెరుగుతుంది. ఇది నీదయతల్లీ! అనుకో ఎప్పుడూ, మరింత ఆనందం” “ఆహా! ఏమినా భాగ్యము పరదేవత గురించి అమ్మ చెప్పిన మాట జీవితంలో ఎలా అనుభవంలోకి వచ్చిందో”!!! అమ్మ దయ ఉంటే శంకరులు చెప్పినట్లు పంగుం “లంఘయతే గిరిం”…..కుంటివాడు పర్వతం దాటేస్తాడు… సినిమా కధలో కూడా ఇన్ని మలుపులుండవేమో!!!

29 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి ముందా, ఉద్యోగం ముందా

 1. @ శర్మ గారూ,
  మీ అమ్మాయి గురించి చెప్పిన పోస్టులన్నీ చదివొచ్చాను. చాలా స్ఫూర్తివంతంగా ఉన్నాయండీ మీ జీవితానుభవాలు. మీ బ్లాగు చదవడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరిన్ని కబుర్లు చెప్తూ ఉండండి మాకు..

  అలాగే ఒక చిన్న విన్నపం.. వీలైతే మీ పోస్టుల archive కనపడేలా చూడండి మీ బ్లాగులో. అప్పుడు మీరు రాసిన పోస్తులన్నీటి లిస్టు కనిపిస్తూ ఉంటుంది. పాతవి వెతుక్కుని చదువుకోవడం సులువుగా ఉంటుంది.

  • @మధురవాణిగారు,
   నా అనుభవం స్పూర్తి కలిగించినందుకు ఆనందిస్తున్నా.
   నా భండారాలు లేవండి. నేను బ్లాగులోక ప్రవేశమే సెప్టెంబర్ ౧౧ ఇరువది మూడవతేదీ.
   ధన్యవాదాలు.

 2. ‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని’ మీ పరోక్షంలో మీ మిత్రులు కుటుంబసభ్యుల ప్రవర్తించిన తీరు తెలియజేస్తుంది. ఏ కష్టమైనా కలకాలం నిలువదని మీ జీవితానుభవం జోడించి వివరించారు. మీ దగ్గరనుండి నేర్చుకోవలసినది చాల వుంది. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @అమ్మాయి జ్యోతిర్మయి,
   నా స్నేహితులెప్పుడూ నా కుటుంబ సభ్యులే. వారిని ఎప్పుడూ వేరుగా చూడం. ఆ అలవాటూ లేదు.మొత్తం బాధ్యత ఆమె పైన నామిత్రులపై మోపవల్సి వచ్చిందనే బాధ పడ్డా.మా అనుభవాలు ముందు తరాలకి ఉపయోగమైతే ఆనందం.
   ధన్యవాదాలు.

 3. ఎన్ని అనుభవాలు, ఎన్ని అనునయాలు –మా జ్యోతిర్మయి చెప్పింది మీ గురించి ..మీ రచనలన్నీ విజ్ఞానదాయకాలు
  నేటి తరానికి, కోల్పోయిన నాటి పెద్దరికపు మార్గ దర్శనాన్ని , మీరు గొప్పగా లిఖిస్తున్నారు
  జీవన రాగాన్ని , జీవిత సత్యాల్ని జీవితాలకు దూరంగా జరిగిపోతున్ననేటి యువ తరానికి అందిస్తున్నారు.
  ఏ రచనకైనా ఇంతకన్నా సార్ధకత ఏముంది మీ కష్టానికి ఫలితం తప్పక ఉంటుంది ఉన్నది
  మీ లేఖినికి అభినందనలు ..అభివందనాలు

  • @బాలకృష్ణారెడ్డిగారు,
   సుస్వాగతం. నా గురించి మా అమ్మాయి కనక మీతో గొప్పగా చెప్పి ఉంటుంది.మా అనుభవాలు, నమ్మకాలు, ఈ తరానికి ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదుకదా.అనుభూతుల్ని కోల్పోతే సర్వమూ కోల్పోయినట్లే కదా. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 4. Physically challenged బిడ్డ నుపెంచడ మేఒ కఎ,త్తయితే ఆ మెనుప్రయోజ కురాలిగాచేశారు. Great Job! అనుభవా న్ని షేర్ చేసుకున్నం దుకుధన్యవాదాలు.

  • @తేజస్వి గారు,
   అవకరం ఉన్నదని బిడ్డను దూరం చేయలేముగా. చేయకూడదు కూడా. వారికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. నా ప్రయత్నం నేను చేశా. అమ్మ కరుణించింది. నా ప్రయోజకత్వం లేదు.
   ధన్యవాదాలు.

 5. చాలా చాలా చాలా.. మంచి టపా వ్రాసేరు. ఇటువంటివి చదివితే బాధలతో నిస్పృహ చెందే వారికి కొండంత ధైర్యం వస్తుంది. కష్టాలు కలకాలం కాపురముండవు. ఇదే విషయాన్ని నేనిలా చెప్పేను.

  కష్టమొచ్చినపుడు కలగి పోకుండుడు
  కష్టసుఖములెపుడు కలిసె వచ్చు
  పగలు రాత్రి గడువ పగలు రాకుండునా
  నిత్యసత్యమిదియె నీరజాక్ష

  • @గోపాలకృష్ణారావు, పంతుల. గారు,
   నిరాశతో కూచుంటే కష్టం తొలిగిపోదు. పోరాడితే, అమ్మ దయ ఉంటే గట్టెక్కవచ్చు. నా అనుభవం పది మందికి ప్రోత్సాహం ఇస్తే సంతసం.
   ధన్యవాదాలు.

 6. Wooooow తాత గారూ..మనసెరిగిన స్నేహితులు, మనసైన ఇల్లాలు ఇంత మంది ఉండగా ఏం లోటండీ.. U are the real inspiration to all.. Thx for the sharing of wonderful experiences..

  • @సుభ,
   నిజమే. నేను వారి మనసు దోచుకున్నా. నా మనసు వారు దోచుకున్నారు. నేటి కాలానికి మనసెరిగిన మనుమలు,మనవరాళ్ళు దొరకడం అదృష్టమేగా.అమ్మ దయతో నాకెప్పుడూ లోటులేదు.
   ధన్యవాదాలు.

 7. కం. అమ్మాయి కథను చదివితి
  నమ్మ దయాగుణము దలచి యానందముచే
  చిమ్మెను కన్నుల నీరును
  నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.

  కం. ముత్తాతగారి ముచ్చట
  లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
  చిత్తంబున విభ్రమమగు
  నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.

  కం. ముని మనుమరాలి ముచ్చట
  మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
  డ్రిని తాతను ముత్త్తాతను చే
  సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.

  కం. సంతోషంబుల నెరుగుట
  సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
  వింతలె యీ జన్మంబున
  నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.

  కం. అందరు సంతోషంబున
  నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
  చిందులు వేయగ శ్రీలా
  నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.

   • కొంచెం సవరించిన పద్యం –
    కం. ముని మనుమరాలి ముచ్చట
    మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
    డ్రిని ముత్త్తాతగనే జే
    సిన ముచ్చట చిత్తమునకు జేరె జిలేబీ.

 8. ఈ సిరీస్ లో మీరు రాసిన టపాలన్నీ నకూ చాలా నచ్చాయండీ!
  మీవంటి అనుభవఙ్ఞులు, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి చెప్తుంటే మేమంతా నేర్చుకోవల్సింది ఎంతైనా వుందనిపిస్తుంది.
  మీకూ మీ కుటుంబానికీ అభినందనలు.
  You are indeed very inspiring, sir.

  శారద

  • @శారద గారు,
   నేను నా భార్య ఏ విషయంలోనైనా సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుని అమలుపరచాము. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఆలోచనే రాలేదు. వచ్చిన కష్టం ఎదుర్కోవాలి అంతే ఆలోచన. భారం అమ్మ మీద.
   జీవితం నుంచి చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే నా ప్రయత్నం సఫలమైనట్లే.
   ధన్యవాదాలు.

 9. శర్మ గారు,

  మనసు దిటవు పడ్డది. శుభం!

  మీ ముని మనవరాలికి మీరు ముచ్చటైన ‘ముని’ మాణిక్యం ముత్తాతయ్య గారన్న మాట!

  శుభాకాంక్షలు. యా దేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితాం !

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s