శర్మ కాలక్షేపంకబుర్లు-స్వాహా!

స్వాహా!

పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము. ఇవి పంచ భూతాలు. పంచ భూతాలలో ఎటునుంచి ఎటుగా చూసినా మధ్యది అగ్ని. అగ్ని కి మూడు గుణాలు. శబ్ద, స్పర్శ, రూపాలు. పంచేంద్రియాల్లో ఇంద్రియం కన్ను. ఇంతకుమించి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే దారి తప్పిపోతాం. అందుకు చెప్పటంలేదు. అగ్ని భార్య పేరు స్వాహా. దేవతలకి, పితరులకి మనం సమర్పించే హవ్య, కవ్యాలు అగ్ని స్వీకరించి వాటిని, మనం ఎవరికైతే సమర్పించేమో వారికి చేరవేస్తాడు. హవ్యం సమర్పించేటపుడు ప్రతి మంత్రం చివర స్వాహా అనేది వినపడుతుంది. హవ్యం దేవతలకిచ్చేది, కవ్యం పితృ దేవతలకిచ్చేది.

దీని గురించి మన మామూలుగా వెతికితే ఒక సంఘటన భారతం లో కనపడుతుంది. జనమేజయుడు సర్పయాగం మొదలుపెడతాడు, ఉదంకుని ప్రోద్బలంతో. యాగం జరుగుతోంది. ఒక్కొక్కరిని సర్పాలని పేరు పేరునా పిలిచి స్వాహా చెబుతోంటే సర్పాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇప్పుడు తక్షకుని వంతు వస్తూ ఉంది. తక్షకుడు ఇంద్రుని శరణు వేడుతాడు. ఇంద్రుడు భయం లేదని హామీ ఇస్తాడు. తక్షకాయస్వాహా అన్నా, తక్షకుడు రాకపోతే, ఇంద్రుని శరణులో ఉన్నది చూసి సహేంద్రతక్షకాయస్వాహా అనడం తో తక్షకునితో పాటు ఇంద్రుడు కూడా రావలసి వస్తూవుంది. అప్పుడు ఇంద్రుడు తక్షకుని వదిలేశాడు. తక్షకుడు గాలిలో గిరికీలు కొడుతూ వస్తున్నాడు, అగ్నిలోపడటానికి. ఈలోగా ఆస్థీకుడు జనమేజయుని మెప్పించి సర్పయాగం ఆపు చేయించుతాడు. తక్షకుని వెనుకకు పంపుతాడు. నిజంగా ఇదంతా జరగడానికి కారణం ఉదంకుడు. అది వేరు విషయం. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది. ఇక్కడికి ఆపుదాం.

అగ్నికి సంబంధించిన ఇంద్రియం కన్ను కదండీ! అందుకే పెద్దల దృష్టిలో, రాజ దృష్టిలో పడద్దనే వారు, పడితే కాలిపోతామని… రాజు నిరంకుశుడు కాకుండా ఉండేందుకే వంది మాగధులు ఉండే వారు. వారు అను నిత్యం నీ తాత ఇంత గొప్పవాడు, నీ తండ్రి ఇంత గొప్ప పనులు చేసేడు అని, నీవూ ఇంకా గొప్పవాడవు, అటువంటి పనులేచెయ్యాలని హెచ్చరిక కోసం అన్న మాట. నేడు పెద్దల దృష్టిలో ఏది పడితే అది నయాన్నో భయాన్నో వారి వశమైపోవాల్సిందే. నయాన్ని ఎక్కడా లేదు లెండి అంతా భయాన్నే. అంటే అగ్ని సంబంధమైన ఇంద్రియంలో పడకుండా బతకడమే మేలనిపిస్తూ ఉంది. నేటి కాలానికొస్తే స్వాహా అన్న మాటకి వ్యతిరేకార్ధమే కనపడుతోంది. ప్రయోగాన్ని పట్టి అర్ధం తెలుసుకోవలసి వస్తూ ఉంది. వారు వెయ్యికోట్లు స్వాహా చేశారంటే, పదివేల ఎకరాలు స్వాహా చేశారంటే, మరొకరు గడ్డి స్వహా చేశారంటే, మరొకరు తరంగాలనే స్వాహా చేశారంటే, అన్నిటిని బొక్కేశారన్నమాట, నొక్కేశారన్న మాట.అంటే తినేశారన్న మాట. మరి వీరికి ఎలా అరుగుతుందో తెలియదు. నేటి భారతం సర్వం, స్వాహా పర్వం.

అరగడమంటే గుర్తొచ్చింది చక్కటి కధ. వాతాపి, ఇల్వలుడు అనేవాళ్ళు ఇద్దరు రాక్షసులు, అన్నదమ్ములు. వాళ్ళలో ఇల్వలుడు, బ్రాహ్మణ రూపంలో, దారే పోయేవారిని అతిధిగా భోజనానికి పిలిచి మాంసాహారంతో భోజనం పెట్టేవాడు. సోదరుడు వాతాపిని చంపి అతని మాంసంతో భోజనం పెట్టేవాడు. అతిధి భోజనం పూర్తి అయిన తరవాత ఇల్వలుడు “వాతాపీ బయటకు రా” అని పిలిచేవాడు. వాతాపి అతిథి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. అప్పుడు అతిధి మరణించేవాడు. ఆ మరణించిన అతిధిని వీరిద్దరు భుజించేవారు. ఇది చాలా కాలం సాగింది. ఒక రోజు అగస్థ్యుడు ఆ దారిన పోతూ ఉండగా ఇల్వలుడు ఆయనను భోజనానికి అహ్వానిస్తాడు. సంగతి తెలిసిన అగస్థ్యుడు భోజనం పూర్తి అయిన తరవాత కడుపుపై చేతితో రాసుకుంటూ “జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం” అంటారు. ఇల్వలుడు ఎన్ని సార్లు పిలిచినా వాతాపి బయటికి రాడు. అప్పుడు అగస్థ్యుడు “ఇల్వలా! మీరిలా ప్రజలను మోసం చేసి వారిని భక్షిస్తున్నారు. వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడు, మరి బయటకు రాడు” అని చెప్పి, సాత్విక మార్గంలో బతకమని హెచ్చరించి వెళతారు. నేటి కాలానికి ఇటువంటి అగస్థ్యుడు దొరుకుతాడా మనలని రక్షించడానికి అనేదే ప్రశ్న.

స్వాహా అంటున్నారేమిటీ మా హోం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రశ్నించారు వెనకనుంచి టపా రాస్తూంటే.. ఏమీ లేదోయ్ మనవరాలు స్వాహా అంటే ఏమిటి తాతా అంటే చెబుతున్నా అన్నా…అంతేనా ఎవరేనా (గ) (ఘ)నులు మళ్ళీ స్వాహా చేశారేమోననుకున్నా… భోజనానికి రండి అనిపిలిచారు….స్వాహా చెయ్యాలి కదండీ వస్తా

ఇది 150  వ టపా. మనవరాలికి మరొక టపా బాకీ. శలవు.

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్వాహా!

 1. టపా ఎప్పటిలానే అదిరింది.. ఒకదాన్నుంచి ఒకటి భలే లింకులు పెట్టుకుంటూ వచ్చేస్తారు తాతగారూ మీరు. వాతాపి కథ చిన్నప్పుడు అమ్మమ్మ చెప్తే విన్నాను. కాని ఆ అగస్త్యుడి పేరు, ఇల్వలుడి పేరూ చెప్పలేదు. అది ఇప్పుడు పూర్తిగా తెలిసింది మీ దయ వల్ల..ఇన్ని మంచి విష్యాలు చెప్పినందుకు బోలెడు థాంకులు మీకు.

  • @సుభ,
   మనవరాలికి కధ చెప్పేటప్పుడు లింకులు వేసుకుంటూ వెళితే శ్రద్ధగా వింటుంది కదా! విన్నది వాతాపి జీర్ణం చేసుకుంటుందికదా! నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 2. శర్మ గారు,
  నమస్తే.
  చాలా చక్కగ ప్రస్తుతపరిస్థితులతో విశ్లేషించారు.
  మన పురాణ, ఇతిహాసములలో ఇలాంటివి చాలా చక్కగా సమాజం కోసం ప్రతి “నడక”లోనూ ఒక నీతిని తెలిపేవిగా ఉన్నాయి. “స్వాహా” లాంటి పదాలను మన దేశంలో “సాంస్కృతిక” దాడులుగా అపహాశ్యం చేసారు, చేస్తునే ఉన్నారు. ఎవరికయినా నష్ఠం జరిగితే “గుండు” గీకిచ్చుకున్నాడు లేదా ఇంతే సంగతులు “గోవిందా గోవింద”. చిదంబర రహస్యం, తూర్పు తిరిగి దణ్ణం పెట్టు, పంగ నామాలు పెడ్తాడు,
  ఇలాంటి సంధర్భములో మీలాంటి వారు ఇట్లాంటి చక్కని, సాంస్కృతిక విలువలతో కూడిన విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదము మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటివి ఇంకా కొనసాగించగలరని ఆసిస్తూ……

 3. శర్మ గారు,
  నమస్తే.
  చాలా చక్కగ ప్రస్తుతపరిస్థితులతో విశ్లేషించారు.
  మన పురాణ, ఇతిహాసములలో ఇలాంటివి చాలా చక్కగా సమాజం కోసం ప్రతి “నడక”లోనూ ఒక నీతిని తెలిపేవిగా ఉన్నాయి. “స్వాహా” లాంటి పదాలను మన దేశంలో “సాంస్కృతిక” దాడులుగా అపహాశ్యం చేసారు, చేస్తునే ఉన్నారు. ఎవరికయినా నష్ఠం జరిగితే “గుండు” గీకిచ్చుకున్నాడు లేదా ఇంతే సంగతులు “గోవిందా గోవింద”. చిదంబర రహస్యం, తూర్పు తిరిగి దణ్ణం పెట్టు, పంగ నామాలు పెడ్తాడు,
  ఇలాంటి సంధర్భములో మీలాంటి వారు ఇట్లాంటి చక్కని, సాంస్కృతిక విలువలతో కూడిన విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదము మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటివి ఇంకా కొనసాగించగలరని ఆసిస్తూ……

  • @మిత్రులు DSRMurthy గారు,
   మీ వ్యాఖ్యకి సంతసం.నా ప్రయత్నం సఫలమైనదనుకుంటా. మనవరాలు మాటాడలేదింతకీ!
   ధన్యవాదాలు.

 4. శర్మగారు,

  స్వాహాదేవి కథ మహాభారతంలోని ఆశ్వమేథపర్వంలో వస్తుంది.

  ఒకానొక రాజు (పేరు గుర్తుకు రావటం లేదు!) భటులు యజ్ఞాశ్వాన్ని బంధిస్తారు. విషయం తెలిసి ఆయన అశ్వాన్ని తిరిగి అప్పగించబోతే ఆయన భార్య జ్వాల అడ్డు పడుతుంది. యుధ్ధం జరుగుతుంది. సాక్షాత్తు అగ్నిదేవుడు వచ్చి అర్జునుని సైన్యాన్ని దహించబోతే అర్జునుడు శ్రీకృష్ణుని యేమిటీ వింత అని అడుగుతాడు. ఆయన చెప్పిన కథ:

  ఈ రాజు కూతురు స్వాహా. అగ్నిముఖాః వై దేవాః అని దేవతలలో ప్రథముడు శ్రేష్ఠుడు అయిన అగ్నిని వరించింది. అగ్ని స్వయంగా వచ్చి స్వాహాను పెండ్లిచేసుకోవటమే కాక అవసరమైనప్పుడు సాయపడతానని వరం యిచ్చాడు. అలాగు, రాణి కోరికపై నీతో యుధ్ధానికి దిగాడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు. అగ్నిదేవుడు మెచ్చి యిచ్చిన యింకొక వరం. తనకు యెవరు యేది అర్పించినా ఇకముందు ‘స్వాహా’ అని చెప్పి యిస్తేనే స్వీకరిస్తానని.

  ఇదీ స్వాహాదేవి కథ.

  అనంతర కథ:
  అర్జునుడు అగ్నిదేవుడిని ఓడించి పంపాడు. అగ్ని తిరిగివచ్చి అశ్వాన్ని తిరిగి యివ్వమని చెబితే జ్వాల అల్లుడినీ, భర్తనూ నిందించి అడ్డుపడింది. రాజు జ్వాలను వెళ్ళగొట్టాడు. ఆమె తన తమ్ముడు కాశీరాజు ఉల్ముఖుని వద్దకు పోతే అతడు కూడా నిందించి పంపాడు. ఆమె తిరిగి గంగానది ఒడ్డుకు వచ్చి పడవలో కూర్చుంటూ కాళ్ళకు నీళ్ళంటగానే గంగనే ‘పాపాత్మురాలా’ అని దూషించింది! గంగ ప్రత్యక్షమై యెందుకలా అన్నావంటే, నీ కొడుకు భీష్ముని ఒక నపుంసకుని అడ్డుపెట్టుకుని అర్జునుడు చంపేస్తే నీకు కోపం కూడా రాలేదు – పాపాత్మురాలవు కాదా అంటుది. గంగ ఉగ్రురాలై ఆ అర్జునుని తల ౩౦ రోజుల్లో తెగి పడుగాక అని శపించింది.

  అక్కడ అర్జునుడు స్త్రీరాజ్యం చేరి రాణీ ప్రమీలను ఓడించటానికి తిప్పలు పడ్డాడు. అక్కడి స్త్రీలను పెండ్లి ఆడిన వాడికి ఇక ౩౦రోజులే ఆయువు అని తెలిసీ వారికి అజేయులుగా శివుని వరం ఉంది కాబట్టి ప్రమీలను పెండ్లాడాడు ఆరోజే! తరువాత ౩౦వ నాడు తనకుమారుడే అయిన బభ్రువాహనుని చేతిలో తల తెగి పడ్డాడు అర్జునుడు. ఆయనను శ్రీకృష్ణుడు పునర్జీవితుని చేసినది వేరే కథ.

  ఇదంతా చాలా విపులంగా జైమిని మహర్షికృత అశ్వమేథపర్వ కథలో ఉంది. దానికి జైమినీ భారతం అని పేరు.
  ఈ జైమిని భారతం (వచన గ్రంధం) నాకు 6వ తరగతిలో ఉండగా బహుమతిగా వచ్చిన పుస్తకం. అది అందుకొని, ఆ రాత్రే వార్షికోత్సవం కార్యక్రమం ముగిసేసరికే చదివేసాను.

  • @మిత్రులు శ్యామలరావుగారు,
   అశ్వమేధపర్వం చదువుతా. మంచి విషయం చెప్పేరు. జైమిని భారతం నేను చదవలేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s