శర్మ కాలక్షేపంకబుర్లు-హస్త భూషణం.

హస్తభూషణం

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అనేవారు. అపుడు చదువుకున్న వారంటే గొప్ప. నేనెరిగి ఉండగా నాటి రొజుల్లో, పెద్దల దగ్గర ఎప్పుడూ చేతిలో ఒక పుస్తకం ఉండేది. కవులు,పండితులు, కళాకారులకు చేతికి సింహ తలాటాలు, కాలికి గండపెండేరాలు ఉండేవి. ఇప్పుడు అవధానం చేస్తున్నవారికి మాత్రం హస్తభూషణాలున్నాయి. నేడు చదువు’కొన్న’ వారు గొప్ప. పదిలక్షల డొనషన్ కట్టి సీటు తెచ్చుకున్నామంటే, ఇరవైలక్షలు కట్టి సీటు తెచ్చుకున్నామని చెప్పుకోడం గొప్పయి పోయింది. ఒకప్పుడు రిస్ట్ వాచీ హస్త భూషణం, సెల్ ఫోన్ వచ్చాకా వాచీలు మూలపడ్డాయి, పెట్టుకునేవారే కరవయ్యారు.రోజులు మారాయి. ఇప్పుడు హస్త భూషణాలు మారాయి. కాలంతో మారుతున్నాయి. నిన్నటి దాకా హస్త భూషణం సెల్ ఫోన్. నా మిత్రుడొకరికి నాలుగో ఐదో సెల్ ఫోన్ లు వున్నాయి. ఒక దాన్లో మాటాడుతూ ఉంటే మరొక దాన్లో రింగౌతూ ఉంటుంది. ఇది మాటాడటం ఆపు చేసి మూసి పట్టుకుని వారితో మాటాడి మళ్ళీ ఇది మూసి పట్టుకుని వీరితో సంభాషణ కొనసాగించడం బలే విచిత్రంగా ఉంటుంది, నాకు మాత్రం. ఇంతకీ ఏమయ్యా అంత అర్జంటు రాచకార్యం అంటే ఏమీ లేదు. కొంతకాలం కితం ఈ సెల్ ఫోన్ లు మెడలో కూడా అలంకారంగా ఉండేవి. వీటికి కలిగిన మహరాజులు బంగారపు చెయిన్లు కూడా చేయించుకున్నవారినెరుగుదును. ఇందులో రకాలు, అదేదో 2 జీ ట ఇప్పుడు 3 జీట మరోకకొత్తతరం 4 జీ కూడా వస్తూందిట. నా జేబులో ఒక పాతకాలపు సెల్ ఫోన్ పడేస్తారు. నేనెక్కడున్నానో ఎలా ఉన్నానో తెలుసుకోడానికి. సెల్ పోన్లు ఇంకా హస్త భూషణాలుగా కొన సాగుతున్నా మరొక కొత్తవస్తువిప్పుడు హస్త భూషణమయిపోయింది, అదే లేప్టాప్. పెద్ద బిజినెస్మన్లు, ఎగ్జికూటివ్ లకి ఇది అత్యవసరమెమో! కొంత మంది ఆ వృత్తిలో ఉన్న వారికి కూడా తప్పనిసరి హస్త భూషణం కావచ్చు. కాని హోదా చూపించుకోడానికి, చాలా బిజీగా ఉన్నట్లు, చూసేవారు అనుకోవాలని కొంతమంది లేప్టాప్ లు పుచ్చుకుని తిరుగుతున్నారు. మళ్ళీ ఏదయినా కావాలంటే మాత్రం మాలాంటి వాళ్ళు డెస్క్ టాప్ దగ్గరకూచుని అదేమిటో చూసి చెప్పాల్సిందే. మరి ఆ లేప్ టాప్ ఎందుకోతెలియదు. మెయిల్ చూడండి ఒకసారి అని కబురొస్తుంది, నా స్నేహితుని దగ్గరనుంచి. అతని దగ్గర లేప్టాప్ ఎప్పుడూ ఉంటుంది. ఇది కాక మగ వారి హస్త భూషణాలు నాలుగు వేళ్ళకీ ఉంగరాలు, పంపు రాళ్ళ సయిజులో, ఇవి కాక ఒక బ్రేస్లెట్, ఇవికూడా నేటి సమాజంలో హస్త భూషణాలుగ చెలామణీ అవుతున్నాయి. ఉద్యోగస్తులు ఈ పని చేయటం లేదుకాని రెండవ, మూడవతరం రాజకీయనాయకులు ఈ వైభోగం వెళ్ళబోస్తున్నారు. కార్ లో కూచుని లేప్టాప్ ఓపెన్ చేసి ఏమిచేస్తారో, ఏమి చూస్తారో మాత్రం తెలియదు.

ఇక ఆడవారి దగ్గరకొస్తే, అమ్మాయిలు/తల్లులందరూ నన్ను క్షమించాలి. వీరికి కూడా సెల్ ఫోన్ హస్తభూషణం గా చెలామణీలో ఉంది. వీరికి ఇప్పుడు మరొక కొత్త వస్తువు హస్త భూషణమయిపోయింది. అదే వేనిటీ బేగ్. ఉద్యోగం చేసే స్త్రీలకి అత్యవసరమన వస్తువులుంచుకునే బేగ్ ఇప్పుడు ఫేషన్ అయిపోయింది. అవసరం ఉన్న వారు లేని వారు తేడా లేకుండా ఈ వేనిటీ బేగ్ మాత్రం భుజానికి వేళ్ళాడుతూనే ఉంటోంది. ఇది లేని స్త్రీలని పల్లెలలో కూడా చూడటం లేదు. ఇక హస్త భూషణాలకి వస్తే చేతులకి గాజులు, పాత రోజులలో ఐతే అవి తప్పని సరిగా (గాజు )మట్టి గాజులయి ఉండేవి. అవి కదులుతూ ఉంటే చక్కటి చిరునాదం వచ్చేది, ఇప్పుడు బంగారపు గాజులు తప్పించి గాజు గాజులే కనపడటంలేదు. గాజు గాజులేసుకోవడం సుమంగళీ చిహ్నమనేవారు. ఉంగారాలు సరే సరి అనుకోండి. ఇది మా పల్లెలకే పరిమితమేమో మాత్రం చెప్పలేను.

పూర్వకాలంలో పురోహితునికి పంచాంగం హస్త భూషణంగాను, క్షవర కళ్యాణం జరిపించేవారికి “పొది” హస్త భూషణం గా ఉండేవి. రోజులు మారినందున ఎవరేమిటో తెలియడం కష్టంగానే ఉంది. పూర్వం వైద్యునికి స్తెత్ హస్తభూషణం, ఇప్పుడు జూ.డా ల చేతుల్లో మాత్రమే ఇది కనపడుతోంది. లాయర్ చేతిలో నల్లకోటు, హస్త భూషణం మాత్రం మారలేదు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-హస్త భూషణం.

 1. మొబైల్ ఫోన్ మాత్రం హస్త భూషణమేమిటండి, దేహభాగమయిపోయింది కదా. సెల్ ఫోన్ ను బట్టి హోదా, మర్యాదలు వస్తాయని భ్రమసే వారి సంఖ్య చాలా ఎక్కువ అని కూడా గమనించాలి. పురోహితులకు కూడా ఓ పంచాంగం ఆప్ త్వరలో వచ్చేయాలని ఆండ్రాయిడు(పెదరాయుడు, చిన రాయుడులాగా) గారిని కోరుకుందాం. :))

 2. లాప్‌టాప్‌ల కాలం కూడ అయిపోవచ్చిందండి.
  ఇప్పుడు హస్తభూషణం అంటే ఐ పాడ్ / టాబ్లెట్ పి సి.

  • @మిత్రులు బోనగిరి గారు,
   మా దగ్గర ఇంకా అవి విరివిగా రాలేదు, వాడుకలోకి, అందుకు నాకు తెలియలేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s