శర్మ కాలక్షేపంకబుర్లు-భారత స్త్రీ

భారత స్త్రీ

“ఏరా! పోలుపిల్లీ కూలి డబ్బులేయి!” పోలమ్మ ప్రశ్న. “ఇయిగోనే రెండొందలు” అన్నాడు. “అదేటీ ఇయ్యాల కూలీ నాలుగొందలు కదా. రెండొందలిచ్చినావే!” పోలమ్మ టొకాయింపు. “చుక్కతెచ్చుకున్నానే.” పోలుపిల్లి సమాధానం. “రోజూ చుక్కకి రెండొందలు కర్సు పెడితే ఎలాగేటి, ఇలాగయితే నీకు పక్కా, బువ్వా లేనట్టే,” పోలమ్మ బెదిరింపు. “సర్లేయే! రేపటేలనించి చుక్కెయ్యను గాని, దాపటి కుండలో ఉడుకునీల్లొయ్యి,” పోలుపిల్లి అర్ధింపు. “అది సరేగాని గుంటడెటు పోతన్నాడో సూసినావా?” పోలమ్మ ప్రశ్న. “నువ్వాడి కాసి చూడ్డం నేదు. ఆడే బొట్టినేనా తగులుకున్నాడేమో రాత్రి పొద్దోయిన తరవాతొస్తన్నాడు,కూలి డబ్బులివ్వటం నేదు, సూడు.” పోలమ్మ మందలింపు. ఇలా ఫైనాన్స్, హోమ్ పోర్టు ఫోలియోలు ఆ ఇంట్లో పోలమ్మవే.

ఇక, “అబ్బాయికి ఇంటరయిపోతూ ఉంది ఎంసెట్ కోచింగులో జేర్చాలి, పండగొస్తూ ఉంది, అమ్మాయికి పెళ్ళి సంబంధం చూడాలి. ఇదేం! ఈనెల మూడు వేలుతగ్గింది, జీతం” రాధమ్మ నిలదీత. “మరేంలేదోయ్ మా అమ్మ, నాన్నకి, పండగొస్తోందని బట్టలు తీసుకోమని పంపేను.” కృష్ణమూర్తి సంజాయిషీ. “మీ అన్నయ్య దగ్గరున్నారు కదా మీ అమ్మా, నాన్నాను, ఆయన పెట్టడా పండగకి బట్టలు.” “నేను పెట్టినట్లవదని,” కృష్ణమూర్తి సణుగుడు. “గొప్ప పని చేసేరు! మీకు ఇంటి ఖర్చులు, ప్రాధాన్యాలు తెలియటం లేదు. ఈ సంసారం నేనీదలేను, ఖర్చులు మీరే చూసుకుని చేయండి.” రాధమ్మ నిరసన, బెదిరింపు. “కాదోయ్! ఎలాగో సద్దుకో, ఈ నెలకి, మళ్ళీ నెలకి జి.పి.ఫ్ అడ్వాన్స్ పెడ్తాకదా!!”కృష్ణమూర్తి ఉవాచ. “చాలు నిరవాకం. అది అలా ఉంచండి అది పీకేసి, మీరు ఏం ఘనకార్యం చెయ్యద్దు. ఎంసెట్ కోచింగు అయిన తరవాత కాలేజిలో చేర్చాలికదా. డొనేషన్ కట్టక, సీటు రాదని, మీకు, నాకు, వాడికీ కూడా తెలుసుసు కదా!! మీ సామాచికం చాలా గొప్పది కదా. డొనేషన్ కట్టకుండా సీటు తెచ్చుకునే తెలివెక్కడచచ్చింది. ముందు చూపు కూడా లేదు.” కడిగేసింది రాధమ్మ. పాయింటే దొరకలేదు కృష్ణ మూర్తికి……మాటాడ్డానికి.

“బ్రీఫ్ కేసు పట్టుకోచ్చేసేరేం,” మాలతీ దేవి ప్రశ్న. “సంతకమెట్టి టెండరిస్తే, రేపు నేను కోర్టు చుట్టూ తిరగలేనని టెండరు మరొకరికి ఖాయం చేసేడా పిరికి సన్నాసి.” మాధవరావు జవాబు. “మీకంటే నేనా సావిత్రిని పంపితే పనయి ఉండేది. సరే లేండి. వీడు కాకపోతే మరొకడు, మనకు బ్రీఫ్ కేసుచ్చుకుని, పని ఇవ్వలేని వాడు లేడు కదా, ఈదేశం లో! ఇంతకి మీ నిరవాకం ఇలా చచ్చింది. ఏం చేయనూ!!” మానాన్న, ఎర్రగా బుర్రగా ఉన్నాడని, ఇలా బుర్రలేనివాడి పాల పడేశాడు, నన్ను.” మాలతీ దేవి దెప్పు.

“మన పాత కాపు గారి అబ్బాయొచ్చాడండి తమ దర్శనానికి.” “ఏమంట కత.” అమ్మ ప్రశ్న. “ఏంలేదమ్మా! బాబున్నప్పుడు, కొన్ని పనులు బాబుకి తెలిసి, కొన్ని చెప్పక చేసేడంట. కిట్టనోల్లు గొడవచేసేరంట. దాని మీద ఏదో విచారణ జరుగుతోందంట. తమ దర్శనం చేసుకుని చెప్పుకుందామని వచ్చేడంట”. “పాత కాపు మంచి వాడయ్యా, ఎప్పటికప్పుడు మన పని ఖచ్చితంగా చేసేవాడు.. మరిప్పుడు లేడుగా. కుర్రాడు ఎగిరిపడుతున్నాడట కదా! చూద్దాం,” “అమ్మ ఖాళీగా లేదు, తరవాత కలవమని చెప్పి పంపెయ్యి. ఉత్తి చేతుల్తో వచ్చేడా! గట్టి కబురేమైనా తెచ్చాడా?” “లేదమ్మా! చేతులూపుకుంటూ వచ్చేడు.” “సరేలే, ఇంతకీ గొడవ ఖరీదెంత?” “గిట్టనోళ్ళు లక్షల కోట్లంటన్నారు. మరి కొంత మంది వేల కోట్లంటన్నారు. మనోళ్ళు కూడా వేల కోట్లే అంటన్నారు.” “సరేలే ఏదయినా మన చెయ్యి దాటిపోకుండా వ్యవహారం నడిపించు.” అమ్మ గారి ఆజ్ఞ.

ఇలా ప్రతి విషయంలో కిందనుంచి పైదాకా అన్ని రంగాలలో స్త్రీలదే పై చెయ్యిగా ఉన్నట్లు కనపడుతోంది కదా, అన్ని రంగాలలో మహిళ దూసుకుపోతోంది కదా, మరి వీరికి స్వాతంత్రం లేదంటరేమిటి. సమాన హక్కులు లేవంటారేమిటి? మొత్తం హక్కు లన్నీ వారి దగ్గరే ఉన్నాయి కదా. ప్రతి ఇంటిలోనూ ఇల్లాలి మాటే చెల్లుతుంది. పైకి మాత్రం అబ్బే అలా కాదండీ అంటారు. మరి పార్టీల, ప్రభుత్వం లో వారిదే పైచేయి. మరి అసమానత ఎక్కడ?.నూటికి తొంభై ఇళ్ళలో పై విషయాలే జరుగుతూ ఉంటాయి. పదిశాతం ప్రతి విషయంలో తేడా ఉంటుంది కదా. మరి స్త్రీలకి చట్ట సభలలో సగం సీట్లు కేటాయించే బిల్లు ఎంతకాలం నుంచి ఎందుకు నిద్ర పోతోందీ? మన దేశాన్ని ఇప్పుడు ప్రభుత్వ, ప్రతి పక్షాలలో రాజకీయాన్ని దగ్గరగా పది మంది మహిళలు శాసిస్తున్నారు కదా. మరి ఈ తేడా ఎందుకువస్తూ ఉందీ? స్త్రీ శిశువులను కడుపులోనే చిదిమేస్తున్నవారు స్త్రీలు కాదా! ఈ అలోచనకి ఆద్యులు ఆచరణ్లో పెట్టేవారు, అత్త ఆడబిడ్డ, అమ్మ వీరంతా స్త్రీలు కాదా? మరి ఎక్కడుంది తిరకాసు, అర్ధం కావటం లేదు. ఒక వేళ మగవారందుకు సిద్ధ పడుతోంటే, వారిని ఎందుకు అడ్డుకోలేక పోతున్నారు. కొంత మంది నిర్భాగ్యులు ప్రతీ రంగంలోనూ ఉంటున్నారు కదా! సతీ సహగమనం లాటి దురాచారాలని అదిగమించాము, వరకట్నం కూడా చాలా వరకు తగ్గినట్లుగా ఉంది. జోగినీ వ్యవస్థ లాటి వాటిని రూపుమాపాలనే ప్రయత్నాలు బలంగానే సమాజంలో వేళ్ళూనుకున్నాయి.మొన్నీ మధ్య ఎవరో గుర్తులేదు, ఒక పేరుపొందిన ప్రముఖ స్త్రీ, ప్రస్తుత “పెళ్ళిళ్ళ మార్కెట్ లో అమ్మాయిల హవా నడుస్తోందని” అన్నారు… పశ్చిమ దేశాల్లో స్త్రీని విలాసంగా చూడటం అలవాటు, నిన్న మొన్నటి దాకా కొన్ని దేశాలలో ఓటు హక్కు కూడా లేదు. ఈ సంస్కృతి మనకు అంటడం మూలంగా ఇలా జరుగుతోందా?

స్త్రీ శక్తి స్వరూపిణి. శివుడు నిర్గుణుడు. నిర్గుణమైన శివుని రుద్రునిగాను, శంకరునిగాను చేయగలది శక్తి. శక్తి లేక శివుడులేడు. శివుడులేక శక్తి లేదు. ఒకరి కొకరు పరిపూరకాలు, సంపూరకాలు. అందు చేత ఒకరి ఎక్కువ ఒకరి తక్కువా లేదు కాని ఒక పిసరు అమ్మే అనగా శక్తిదే పై చేయి, కాదన లేం. ఇది సృష్టి రహస్యం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా,శుభాకాంక్షలు. ఇది ఎవరిని కించపరచడానికి, ఎద్దేవా చేయడానికి ఉద్దేశించినది కాదు. ఎవరికైనా బాధ కలైగితే క్షమార్హుడిని. శ్రీమాత రూపంలో స్త్రీలందరికి వందనం. అమ్మకు వందనం.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భారత స్త్రీ

 1. బాసట శర్మ గారు,

  చాలా బాగా సెలవిచ్చారు. సమాజం లో ని అన్ని దృక్కోణాలని కలుపుతూ.

  ఇది నాణానికి ఒక వైపు. మరో వైపు, పుట్టని ఆడ బిడ్డ , ఆడే అంతం, పుట్టిన బిడ్డ హుష్ కాకీ.., అక్కడి నించి మొదలయ్యి తల్లి ని గాలి కి ఒదిలేయడం దాకా.. ఈ రెండూ భారద్దేశం లో ఉండటానికి కారణం, నా వరకనిపించినది, అమ్మాయి చదువు. ఎక్కడైతే అమ్మాయి చదువు కి గుర్తింపు ఇచ్చారో అక్కడ నాణేనికి పాసిటివ్ సైడ్ ఉందని పిస్తోంది.

  బీహార్ లాంటి రాష్ట్రాలని చూస్తోంటే , నాణేనికి మరో వైపు మరీ ఎక్కువగా కనిపిస్తుంది దేశం లో.

  చాలా మంచి టపా పెట్టారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు.

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబి గారు,
   ఎప్పటికైనా/ఎవరికైనా విద్య కావసినదే. నాలుగు అక్షరాలురావడం విద్య అంటోంది ప్రభుత్వం. కాదు బతుకునేర్పేది విద్య అంటున్నారు ప్రజలు. ఇదీ తిరకాసు.ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్లే.
   ధన్యవాదాలు.

 2. తాత గారూ నాకెందుకో మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది.బహుశా ఆ మార్పు మాలో రావలిసిందేనేమో తప్ప ఎన్ని బిల్లులొచ్చినా ఇంతేనేమో అనిపిస్తోంది. ఏదేమైనా మీ మాటల్లో కూడా నిజాలు లేకపోలేదు. కానీ మీరన్నట్టు 90శాతం ఇలానే ఉంది అంటే మాత్రం అనుమానమే..అంత సమానత్వం ఐతే ఏమీ లేదు.

  • @బంధనాలు ఎవరికున్నాయో వారు వాటిని తెగ కొట్టుకోడానికి ప్రయత్నిస్తే మిగతావారు సహక రిస్తారు. వారి ప్రయత్నం లేక పోతే పైవారేమి చేస్తారు. ఈరోజు గాంధీ భవన్ హైదరాబాదులో జరిగిన సంఘటన స్త్రీలకి వన్నె తెచ్చేదా?
   ధన్యవాదాలు.

 3. మొత్తం మీద చాలా తక్కువే.ఇంకా కావాల్సినంత ఆధిక్యత ఆడవారిలో లేదండి. ఎంతైనా మగవారు, ఆడవారికంటే కొంచెం ఎక్కువ సమానమే:-)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s